కట్టు కథలు..కుట్ర కోణాలు

Update: 2018-03-23 15:30 GMT

తెలుగు రాజకీయం సినిమా కథలను మించిపోయింది. ఊహలు, కల్పనలు, జోస్యాలు, అంచనాలతో కూడిన సృజనాత్మకత రాజకీయ చిత్రాన్ని రక్తి కట్టిస్తోంది. కేంద్రం నుంచి బీజేపీ ఆంధ్రప్రదేశ్ పై పెద్ద కుట్ర చేస్తోందంటూ మొదలైన ప్రచారం పరిధులు దాటి పక్కదారి పడుతోంది. గాలికబుర్లను పోగేసి కట్టుకథలు చెప్పడం ద్వారా సాధించే ప్రయోజనాల కంటే ప్రజల్లో భావోద్వేగాలు రేకెత్తించే ఎత్తుగడే ప్రధానంగా కనిపిస్తోంది. ఇది విద్వేషపూరిత రాజకీయాలకు, దేశసమగ్రతకే భంగకరంగా పరిణమించే అవకాశం ఉంది. ఇప్పటికే దక్షిణాది, ఉత్తరాది భావజాలం పుంజుకుంటున్న నేపథ్యంలో ఒక జాతీయపార్టీ రాష్ట్రంపై కుట్ర చేస్తోందన్న ప్రచారం చెడు సంకేతాలను పంపుతుంది. తమ పార్టీ ఎదుగుదలకు ప్రతి పార్టీ కొన్ని వ్యూహాలను అమలు చేసుకుంటుంది. ఎత్తుగడలు వేస్తుంది. పొత్తులు కుదుర్చుకుంటుంది. ప్రజలకు చేరువ కావడానికి సకల ప్రయత్నాలు చేస్తుంది. అది తప్పుకాదు. కానీ కుట్రలు, కుహకాలతో పార్టీ ఎదుగుదల జరుగుతుందని భావిస్తే అంతకంటే మూర్ఖత్వం ఉండదు. అల్టిమేట్ గా తీర్పు చెప్పాల్సింది ప్రజలు. మంచి చెడులను బేరీజు వేసుకున్న తర్వాతనే ప్రజలు తీర్పు నిస్తారు. జాతీయంగా, ప్రాంతాల వారీగా జరిగిన అన్ని ఎన్నికలు చాటిచెబుతున్న సత్యమిదే. దీనికి వక్రకోణాలు అద్దడం ద్వారా సాధించే ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువ. తప్పు చేసిన ప్రతి సారీ అందుకు పార్టీలు ప్రజాక్షేత్రంలో భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉదాహరణలే ఇందుకు ప్రత్యక్షనిదర్శనలు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ప్రచారం ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆవిష్కరిస్తోంది.

ఆపరేషన్ కమలం...

ఆంద్రప్రదేశ్ లో రాజకీయాధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ రాజకీయ ఆపరేషన్లు నిర్వహిస్తోందంటూ దుమారం చెలరేగుతోంది. అదే సమయంలో దక్షిణాదిపై పట్టుకోసమూ ఇటువంటి వ్యూహాలే అమలవుతున్నాయంటున్నారు. ఆపరేషన్ గరుడ, ద్రవిడ, రావణ అంటూ రకరకాల పేర్లతో గాలి కబుర్లు షికార్లు చేస్తున్నాయి. అయితే వీటిలో విశ్వసనీయత ఎంతమేరకు ఉంది? ఎవరినుద్దేశించి వీటిని నిర్వహించతలపెట్టారనే విషయంలో భిన్నకథనాలు వినవస్తున్నాయి. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసి పవన్ కల్యాణ్, జగన్ ల ను ప్రోత్సహిస్తూ పరోక్షంగా అధికార పీఠాన్ని చేజిక్కించుకునేందుకు కమలం పార్టీ కసరత్తు చేస్తోందనేది ఈ ప్రచారాల సారాంశం. ఇప్పటికే బీజేపీ ఏపీలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. బీజేపీతో అంటకాగిన ఏ పార్టీకి కూడా పుట్టగతులుండవనే స్థాయిలో సెంటిమెంటును రెచ్చగొట్టారు. అందువల్ల పవన్, జగన్ లు ఆ పార్టీతో కలిసి నడుస్తున్నామన్న భావన కల్పించినా రాజకీయంగా ఆత్మహత్యాసదృశమే అవుతుంది. అందుకే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో బీజేపీ రాజకీయంగా ఏపీలో సాధించేదేమీ ఉండదు. జగన్, పవన్ లు బీజేపీని కావలించుకునేందుకు సిద్దంగా ఉన్నారన్న ప్రచారమూ సత్యదూరమే. కేంద్రం తో పోరాటము అంత ఈజీ కాదంటూ ఇటీవల మీడియా చిట్ చాట్ లోనే తేల్చేశారు పవన్. ఒక నటుడిగా తాను తీసుకుంటున్న రెమ్యునరేషన్ కు, చూపుతున్న లెక్కలకు ఎంతోకొంత వ్యత్యాసం ఉంటుంది. ఒక లక్ష రూపాయలు తేడా కనిపించినా వేధించడానికి సరిపోతుంది. ఇక జగన్ కేసుల సంగతి సరేసరి. దీంతో కొంత అగ్రెసివ్ ధోరణితో వెళ్లలేని అనివార్య పరిస్థితి వీరికి ఏర్పడుతోంది. నిన్నామొన్నటివరకూ తెలుగుదేశం పార్టీది కూడా అదే పరిస్థితి. కేంద్రంపై ఆధారపడాల్సి రావడంతో ఏమీ అనలేని నిస్సహాయత. తాజాగా ఎన్నికల సమయం ముంచుకురావడంతో రాజకీయ పోరాటం అనివార్యంగా మారిందంతే. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని టార్గెట్ చేయడం ద్వారానే గరిష్ట రాజకీయ ప్రయోజనం పొందగలమన్న వాస్తవ సత్యం అందరికీ అర్థమైపోయింది. అందుకే కమలం లక్ష్యంగా నే వ్యూహాలు నడుస్తున్నట్లు భావించాలి. అధికార తెలుగుదేశం ఈవిషయంలో ఒకడుగు ముందంజలోనే ఉంది.

తప్పు చేస్తే తిప్పలే...

రాజకీయంగా చేసే చిన్నచిన్న తప్పులు లేదా పొరపాట్లు, ముందస్తుగా పరిణామాలను అంచనా వేయలేకపోవడం వల్ల రాజకీయ పార్టీలు తీవ్రంగా దెబ్బతింటుంటాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిలు ఇందుకు ఉదాహరణలు. కేవలం ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు కోసం చేసిన తొందరపాటు చర్యల కారణంగా తెలంగాణలో టీడీపీ భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. పదేళ్ల పాటు కొనసాగాల్సిన రాజధానిని వదిలేసుకుని అమరావతికి అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది. తండ్రివారసత్వం కారణంగా అత్యంత ప్రజాదరణ కలిసి వచ్చినప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు, క్విడ్ ప్రోకో ఉదంతాలతో 2010_11 లలోనే ముఖ్యమంత్రి కావాల్సిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికీ రాజకీయంగా ఎదురీదాల్సి వస్తోంది. ఆరోపణలు వెల్లువెత్తకుండా ఉండి ఉంటే కాంగ్రెసు పార్టీ హయాంలోనే సీఎం సీటు దక్కి ఉండేది. 2014 ఎన్నికల్లో సైతం ఈ ఆరోపణలు వెన్నాడాయి. ఫలితంగా అతితక్కువ తేడాతోనే అధికారపీఠం దక్కకుండా పోయింది. రాజకీయాల్లో ప్రజాదరణను మించిన సంపద, అధికారాన్ని మించిన ఆనందం మరొకటి ఉండదు. కానీ వాటిని అందుకోలేకపోవడానికి కారణం స్వయంకృతాపరాధాలే. పొలిటికల్ మిస్టేక్స్ కలిగించే నష్టాలు ఈ స్థాయిలో ఉంటాయి. అందుకే రాజకీయ పార్టీలు ప్రజల్లో పలుకుబడి పెంచుకోవడానికి చూడాలే తప్ప కుట్రల ద్వారా ఏదో సాధించాలనుకోవడం వృథా ప్రయాసే.

న మిత్ర: న శత్రు:

రాజకీయాల్లో శత్రువులు, మిత్రులు శాశ్వతంగా ఉండరు. టీడీపీ,బీజేపీలు ఇప్పటికి రెండు సందర్భాల్లో కలిశాయి. రెండు సార్లూ విడిపోయాయి. టీఆర్ఎస్, కాంగ్రెసులు గతంలో చేతులు కలిపి పనిచేశాయి. తర్వాత విడిపోయాయి. టీడీపీ, టీఆర్ఎస్ మహాకూటమి కట్టాయి. వామపక్షాలు, తెలుగుదేశం కలిసి పనిచేసిన సందర్బాలు, పోటీ చేసిన సందర్బాలు కోకొల్లలు. కాంగ్రెసు, వామపక్షాలదీ అదే పరిస్థితి. అందువల్ల రేపు ఎవరు ఎవరితో కలుస్తారన్న అంశం ఇదమిత్థంగా తేల్చి చెప్పలేం. రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయాలు వికటించిన సంఘటనలూ చూశాం. కనీసం తెలంగాణలో అయినా అధికారం వస్తుందనుకుని ఏపీని పునర్విభజన చేస్తే కాంగ్రెసు పార్టీ ని ప్రజలు ఆదరించలేదు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ తన అస్తిత్వాన్నే ప్రశ్నార్థకం చేసుకుంటే తెలంగాణలో ప్రతిపక్షానికే పరిమితమైంది. నాలుగేళ్లు బీజేపీతో కలిసి నడిచి ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉధృతంగా ప్రచారం సాగించినంత మాత్రాన టీడీపీకి లాభిస్తుందన్న గ్యారంటీ లేదు. ఇంతకాలం నాన్చి ఆంధ్రాలో ఉద్యమాలు మొదలయ్యాక బీజేపీ ఏపీకి కొన్ని ప్రయోజనాలు సమకూర్చినా పెద్దగా ఆ పార్టీకి రాజకీయంగా ఒరుగుతుందని చెప్పలేం. టీడీపీ యో , మరో పార్టీయో లబ్ధి పొందుతాయంతే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చూస్తే ఆంధ్రాను సర్వనాశనం చేసేయడమో లేదంటే ఒక పార్టీకి కొరివి పెట్టే కుట్రకో జాతీయ పార్టీలు పాల్పడతాయనే ఆలోచనే వాస్తవ విరుద్ధం. జాతీయ నాయకులు తమ ప్రాంతాలకు మంచి చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు తప్పితే వేరే ప్రాంతంపై కక్ష కట్టడమనేది ఒక ఊహాజనితమైన భావన. ఉదాహరణకు నరేంద్రమోడీకి గుజరాత్ పట్ల మక్కువ ఉండటం సహజం. ఏదేని ప్రాజెక్టు మంజూరు చేయాల్సి వస్తే ముందుగా తన సొంత రాష్ట్రానికి ప్రయారిటీ ఇవ్వవచ్చు. ఇంకో రాష్ట్రం పై దెబ్బ కొట్టాలన్న ఆలోచన కంటే తన సొంత ప్రాంతానికి కొంత చేసుకోవాలన్న ధ్యేయమే కనిపిస్తుంది. దీనిని కూడా కుట్రగా చూపించాలనే ఉద్దేశం కొన్ని పార్టీలకు ఉండవచ్చు. కానీ అది తప్పుడు ప్రాపగాండా. మొత్తమ్మీద కుట్ర కథలన్నీ కల్పితాలుగానే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కథలు కాలక్షేపానికే తప్ప ఆంధ్రప్రదేశ్ సమస్యలకు రాజకీయ పరిష్కారం చూపలేవు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News