ఒక్క సినిమా గంటా జీవితాన్ని మార్చేసిందా?

Update: 2017-06-30 14:30 GMT

ఒకే ఒక్క సినిమా ఈరోజు రిలీజయింది. ఆయన నటుడిగా ఇంకా ఎదగలేదు. కాని ఆయన పాలిటిక్స్ లోకి వచ్చేస్తానని ప్రకటించేశాడు. అలాగే సీటు కూడా చెప్పేశాడు. వచ్చే ఎన్నికల్లో అవకాశమిస్తే ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో టీడీపీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. అతడే ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ. గంటా రవితేజ నటించిన జయదేవ్ సినిమా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విడుదలయింది. గంటా రవితేజ చోడవరంలోని ఒక దేవాలయంలో సినిమా విజయవంతం చేయడానికి పూజలు చేయడానికి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో చోడవరం నుంచి పోటీ చేస్తానని చెప్పారు. తండ్రి బాటలోనే తాను కూడా పయనించాలని ఉందని తన మనసులో ఉన్న మాటను బయటకు కక్కేశారు. తన తండ్రిని ఒకప్పుడు ఆదరించిన చోడవరం ప్రజలు తనను కూడా ఆదరిస్తారని చెప్పడంతో అక్కడున్న టీడీపీ నేతలంతా అవాక్కయ్యారు. సినిమా రిలీజ్ కాకముందే గంటా రవితేజకు ఈ పాలిటిక్స్ పిచ్చేంటని చెవులు కొరుక్కున్నారు. గంటా శ్రీనివాసరావు గతంలో చోడవరం ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే తర్వాత అక్కడ నుంచి వేరే నియోజకవర్గానకి షిఫ్ట్ అయ్యారు.

భగ్గుమంటున్న టీడపీ నేతలు......

అయితే ప్రస్తుతం చోడవరం ఎమ్మెల్యేగా ఉన్న కెఎస్ఎన్ రాజు వర్గం ఇప్పటికే ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లింది. చోడవరం ఎమ్మెల్యేగా తాను ఉన్నప్పుడు వచ్చే ఎన్నికల గురించి ఇప్పుడీ ప్రస్తావన ఎందుకని రాజు వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని, ఇప్పటినుంచే సీట్ల గోలేంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు తండ్రీకొడుకులిద్దరికీ విశాఖ జిల్లాను అప్పగిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే గంటా జయదేవ్ మాత్రం తనకు పాలిటిక్స్ అంటే ఎంతో ఇష్టమని, తన తండ్రి బాటలోనే నడుస్తానని మరోసారి వ్యాఖ్యానించడంతో విశాఖ జిల్లాలోని టీడీపీలో కలకలం రేగింది. అయితే గంటా శ్రీనివాసరావు కూడా నియోజకవర్గం మారనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆయన ప్రస్తుతం ఉన్న భీమిలి నియోజకవర్గం కాకుండా వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. గంటా శ్రీనివాసరావుకు, ఆయన కొడుకు రవితేజ ఇద్దరూ టిక్కెట్లు ఆశిస్తున్నారు. గంటా రవితేజ అసందర్భ వ్యాఖ్యలు చేశారని టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. గంటా మీద, అతని కుమారుడిపైన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది.

Similar News