ఒక్క దెబ్బకు రెండు పిట్టలు: రేవంత్ స్ట్రాటజీ

Update: 2017-10-20 10:30 GMT

కాంగ్రెసులో ప్రవేశించకముందే తన పని మొదలు పెట్టేశాడు రేవంత్ రెడ్డి. టీడీపీ,టీఆర్ఎస్ లు ఎదురు తిరగలేని విధంగా సైకలాజికల్ స్ట్రోక్ ఇచ్చాడు. వెల్ కమ్ (వెలమ,కమ్మ) గ్రూపుగా 2019 ఎన్నికల్లో తెలంగాణను దున్నేసేందుకు సిద్ధమవుతున్న ఈ రెండు పార్టీలకు చెక్ చెప్పే వ్యూహంతో రాజకీయ చదరంగాన్ని రేవంత్ ప్రారంభించారు. తాను టీడీపీలోనే ఉన్నాను. కాంగ్రెసులో చేరలేదంటూనే హస్తం పార్టీకి చక్కగా ఉపయోగపడే పాచికను అందించారు. టీడీపీ, టీఆర్ ఎస్ అంటకాగడం వల్ల తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయనే కోణంలో రాజకీయాస్త్రాన్ని సంధించారు. బహిరంగంగా విమర్శలు గుప్పించుకుంటున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు లోలోపల కుమ్మక్కవుతున్నాయన్న భావన ధ్వనించేలా రేవంత్ మొదటి బాణం విడిచారు. దీంతో ఈనెల 26 న చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత టీటీడీపీ వర్కింగు ప్రెసిడెంటు పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజకీయ మర్యాద కోసం అధినేతతో వీడ్కోలు సమావేశం జరిపి, పార్టీ అనుబంధాన్ని ముగించవచ్చని రేవంత్ సన్నిహిత వర్గాల సమాచారం. ఈలోపుగానే అందుకు తగిన ప్రాతిపదికను సిద్ధం చేసుకుంటున్నారాయన. ఢిల్లీలో కాంగ్రెసు అధిష్టానాన్ని కలిసి వచ్చిన తర్వాత మీడియాను ఒక రోజుపాటు దూరంగా ఉంచిన రేవంత్ మరుసటి రోజే ఇందుకు సంబంధించి స్పష్టత నిచ్చారు. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు, ఉప ఎన్నికల్లో కాంగ్రెసుతో కలిసి పనిచేశాం. ఇప్పుడు ఆ పార్టీ నాయకత్వంతో కలిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. అన్యాపదేశంగా కాంగ్రెసు అగ్రనాయకత్వంతో భేటీని ధ్రువీకరించారు. మూడో వంతు సీట్లు ఇస్తే కాంగ్రెసుతో కలిసి పోటీ చేసేందుకు టీడీపీ సిద్దంగా ఉంది. ఇందుకు సంబంధించి కాంగ్రెసుతో మాట్లాడుతున్నామని కూడా ఆయనే ప్రకటించేశారు. ఇవన్నీ చంద్రబాబుకు తెలిసి జరుగుతున్నాయో, లేదో ఎవరూ చెప్పలేరు. రేవంత్ మాత్రం తెగేదాకా లాగాలని నిర్ణయించేసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తనంతతానుగా కాకుండా అధిష్టానమే తనను బహిష్కరించేలా పావులు కదుపుతున్నట్లుగా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

నాయకుల కుమ్మక్కు ..తెలంగాణకు చిక్కు...

తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఆయా రాష్ట్రాల ప్రయోజనాల కంటే తమ వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారన్న కోణంలో వివాదాన్ని రేకెత్తించడానికి రేవంత్ ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి , టీడీపీ అగ్రనాయకత్వంలో భాగమైన యనమల రామకృష్ణుని బంధువులు రెండువేల కోట్ల రూపాయల కాంట్రాక్టులను తెలంగాణలో పొందారని ఆరోపించడం ఇందులో భాగమే.. కేసీఆర్ చలవతోనే సాధ్యమైందన్నట్లు విమర్శలు గుప్పించడంలోనూ పొలిటికల్ పంచ్ ఉంది. కేసీఆర్ ప్రభుత్వానికి, యనమలకు మధ్య పార్టీలకు అతీతంగా కాంట్రాక్టు బంధం కొనసాగుతోందని నేరుగానే ధ్వజమెత్తారు. దీంతో రేవంత్ ఈ రెండు పార్టీలను దులిపి ఆరేసినట్లే. పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్, పయ్యావుల కేశవ్ మేనల్లుడు జోడీగా బీర్ ఫ్యాక్టరీ లైసెన్సును తెలంగాణలో తెచ్చుకోవడం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతోనే అని స్పష్టం చేశారు. ఈ రెండు ఉదంతాలకు విస్తృతమైన ప్రచారం కల్పించడం ద్వారా టీడీపీ, టీఅర్ఎస్ లను ఇరకాటంలో పెట్టగలిగారు. కేసీఆర్ను, ఆంధ్రప్రదేశ్ టీడీపీ నాయకులను వివాదంలోకి లాగిన రేవంత్ చంద్రబాబు నాయుడికి మాత్రం మినహాయింపు నిచ్చారు. భవిష్యత్తులో ఈరెండు పార్టీలు కలిసి నడిచినా రాష్ట్రప్రయోజనాలకంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యపాత్ర పోషిస్తాయని చెప్పకనే చెప్పేశారు. ఇటు టీఆర్ఎస్ కు అటు టీడీపీకి ఇది ఇబ్బందికరమైన పరిస్థితే. రేవంత్ భవిష్యత్ వ్యూహం ఏవిధంగా ఉండబోతుందో సూచనప్రాయంగా ఈ వ్యాఖ్యల ద్వారా వెల్లడయింది. అటు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెసు పార్టీకి ఎటూ స్టేక్ లేదు. ఇటు తెలంగాణలో అధికారంలోకి రావడమే ఆ పార్టీకి ప్రధానం. అందుకు రేవంత్ వంటి యువనాయకుల సేవలు ఉపయోగపడతాయని కాంగ్రెసు అగ్రనాయకత్వం భావిస్తోంది. అద్యయనం ద్వారానే విషయాలను వెల్లడిస్తారాయన. కానీ కొంత దురుసుతనం , మాట తూలడం కనిపిస్తుంది. ప్రస్తుతమున్న రాజకీయ వాతావరణంలో అదేమంత పెద్ద విషయం కాదంటున్నారు నాయకులు.

ఉలుకూ లేదు..పలుకూ లేదు...

రేవంత్ చేసిన విమర్శలు చిన్నాచితక వ్యక్తుల మీద కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నెంబర్ టు హోదాలో ఉన్న యనమల రామకృష్ణుడు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో కుమ్మక్కయ్యారంటే తీవ్రాతి తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. రేవంత్ విషయంపై లోకేశ్ ను మీడియా ప్రశ్నించినా దాటవేశారే తప్ప సూటిగా బదులివ్వలేదు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంటు విమర్శలకు ఏరకంగా బదులివ్వాలో దిక్కుతోచని స్థితిలో ఉంది ఏపీ తెలుగుదేశం పార్టీ. వ్యక్తిగతంగా ఆయా నాయకులు కూడా స్పందించలేని నిస్సహాయతలో పడ్డారు. అంటే వారిపై వచ్చిన విమర్శల్లో నిజమున్నట్లే భావించాల్సి ఉంటుంది. ఇటు తెలంగాణ టీఆర్ఎస్ ప్రముఖులు కూడా మాట్లాడలేకపోతున్నారు. ఒకవేళ మాట్లాడవలసి వస్తే యనమల బంధువులకు రెండు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు దక్కాయో లేదో తేల్చి చెప్పాల్సి ఉంటుంది. రేవంత్ అంటే ఫైర్ బ్రాండ్. ఆయన మీద విమర్శలు గుప్పిస్తే తిరిగి ఏ రూపంలో బూమ్ రాంగ్ అవుతాయో చెప్పలేమనే ఆందోళనలో ఉన్నారు టీడీపీ నాయకులు. టీటీడీపీ లోని ప్రముఖులు కొందరు భేటీ అవుతున్నా అవేమంత పవర్ ఫుల్ మీటింగులు కాదు. చంద్ర బాబు ఆజ్ణ లేనిదే రేవంత్ మీద ఈగ కూడా వాలదు. అందుకే తెలంగాణలోని కొందరు నాయకులు స్పందిస్తున్నా చాలా పేలవంగా, బలహీనంగా మాత్రమే స్వరం వినవస్తోంది. అందులోనూ ఈ వ్యవహారాలతో సంబంధం లేని వారు స్పందించడం వల్ల వివరణ చాలా వీక్ గా కనిపిస్తోంది. మొత్తమ్మీద చంద్రబాబు నాయుడు , రేవంత్ రెడ్డిల భేటీ తర్వాతనే ఒక క్లారిటీ వస్తుంది.

సాధ్యం కాని షరతులే ..స్వస్తి వాక్యాలు...

తెలంగాణలో కాంగ్రెసుతో పొత్తు పెట్టుకునే అధికారాన్ని తమకే ఇవ్వాలని కోరడము ఒక రకంగా అధిష్టానాన్ని ధిక్కరించడం కిందే భావించాలి. టీటీడీపీకి నిర్ణయాల విషయంలో స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలన్న రేవంత్ డిమాండ్ అగ్రనాయకత్వంపై తిరుగుబావుటాకు సంకేతమే. కాంగ్రెసుతో కలిసి నడిచే విషయంలో టీడీపీకి సెంటిమెంటు పరమైన అభ్యంతరాలున్నాయి. ఆటంకాలున్నాయి. కాంగ్రెసు పార్టీ వ్యతిరేక భావజాలంతో పురుడు పోసుకున్నది తెలుగుదేశం పార్టీ. రాష్ట్రవిభజనలో కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిందని ఇప్పటికీ తెలుగుదేశం ప్రచారం చేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెసుతో కలిస్తే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి రాజకీయపరమైన ఆక్షేపణ ఎదురవుతుంది. పైపెచ్చు కాంగ్రెసు ముక్త భారత్ నినాదంతో ముందుకు సాగుతున్న మోడీ,అమిత్ షా లకు ఆగ్రహం తెప్పించినట్లవుతుంది. మరోవైపు ఏపీలో వైఎస్సార్ పార్టీ ఈ అవకాశాన్ని చక్కగా అందిపుచ్చుకుని రాజకీయాస్త్రంగా మలచుకుంటుంది. ఈ విషయాలన్నీ తెలిసీ రేవంత్ రెడ్డి, కాంగ్రెసుపార్టీతో టీడీపీ పొత్తు అంటూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. సాధ్యం కాని షరతులు, అభ్యర్థనలతో టీడీపీని ఒక మూలకు నెట్టేసి ఆ పార్టీతో తన రాజకీయ ప్రస్థానానికి స్వస్తి వాక్యం పలికేందుకు రేవంత్ సిద్ధమైపోయినట్టే ఈ పరిణామాలను అర్థం చేసుకోవాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News