ఒక్క ఓడరేవు....దశ మర్చివేసిందే?

Update: 2017-10-31 17:30 GMT

భారత్ - ఆప్ఘాన్ మైత్రీ బంధంలో నూతన అథ్యాయం ప్రారంభమైంది. రెండు దేశాల మధ్య నౌకారవాణాకు శ్రీకారం చుట్టారు. గుజరాత్ లోని కాండ్లా ఓడరేవు నుంచి ఇరాన్ లోని ఛాబహార్ ఓడరేవుకు గోధుమలతో రెండు రోజుల క్రితం ఒక నౌక బయలుదేరింది. భారత్, ఆప్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రులు సుష్మాస్వరాజ్, సలాహుద్దీన్ రబ్బానీ ప్రత్యక్ష ప్రసార విధానంలో ఈ నౌకకు జెండా ఊపారు. ఛౌబహార్ రేవు నుంచి రహదారి మార్గంలో గోధుమలను రోడ్డు మార్గంలో ఆప్ఘనిస్తాన్ కు తరలిస్తారు. దీంతో ఇరుదేశాల మధ్య మైత్రీ బంధం మరింత బలపడనుంది. భవిష్యత్తులో రాకపోకలు మరింత పెరగడానికి ఈ మార్గం దోహదపడనుంది. అనాదిగా భాతర్-ఆఫ్ఘాన్ ల మధ్య అవినాభావ సంబంధం ఉంది. తీరప్రాంతం లేని, నాలుగు వైపులా భూభాగం గల ఆప్ఘాన్ కు ఎలాంటి సహాయం అందచేయాలన్నా పాకిస్థాన్ భూభాగం నుంచి వెళ్లాల్సి వచ్చేది. భారత్ అంటే విషం కక్కే దాయాది దేశం తరచూ ఇందుకు అభ్యంతరం చెబుతుండేది. ఏదో ఒక పేరుతో చికాకులు సృష్టించేది. ఆప్ఘాన్ -పాక్ మధ్య కూడా సరైన సంబంధాలు లేవు. ఆప్ఘాన్ లో చిచ్చుపెట్టడానికి పాక్ తెరవెనుక చేయాల్సిందంతా చేస్తోంది. అదే సమయంలో పైకి మాత్రం నంగనాచి కబుర్లు చెబుతోంది. ఆప్ఘాన్ లో అస్థిరత సృష్టించేందుకు తాలిబన్లకు పరోక్షంగా చేయూతను అందిస్తోంది. రెండు దేశాల మధ్య గల డ్యూరండ్ సరిహద్దును అతిక్రమించి ఆప్ఘాన్ లోకి ఉగ్రవాదులను పంపుతోంది. దీంతో పాక్ అంటేనే ఆప్ఘాన్ మండిపడుతోంది. ఈ నేపథ్యంలో భారత్-ఆప్ఘాన్ బంధం బలపడటం పాక్ కు ససేమిరా ఇష్టం లేదు. అందువల్ల తమ దేశం మీదుగా భారత్ నుంచి ఆప్ఘాన్ కు సరుకుల రవాణాకు అనేక అభ్యంతరాలు చెబుతోంది.

పాక్ పై ఆధారపడకూడదని.....

ఈ నేపథ్యంలో పాకిస్థాన్ పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు భారత్ -ఇరాన్ - ఆప్ఘనిస్తాన్ ల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. గత ఏడాది మే నెలలో ప్రధాని నరేంద్రమోడీ ఇరాన్ పర్యటన సందర్భంగా ఛాబహార్ ఓడరేవుపై ఒప్పందం కుదిరింది. వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ఓడరేవు వల్ల భారత్ కు ఎంతో ప్రయోజనం ఉంది. పాకిస్థాన్ లో సంబంధం లేకుండా భారత్ ను మధ్య ఆసియా, ఐరోపాలతో ఈ ఓడరేవు అనుసంధానిస్తోంది. పాక్ లోకి కాలు పెట్టకుండానే ఛాబహార్ నుంచి రోడ్డు మార్గంలో ఆప్ఘనిస్తాన్ కు చేరుకోవచ్చు. ఆప్ఘాన్ తో పాటు ఐరోపా దేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకునే సరకు రవాణా ఖర్చులు, సమయం ఆదా అవుతాయి. భారత్ కు భౌగోళికంగా ఛాబహార్ అత్యంత సమీపంలో ఉంది. గుజరాత్ లోని కాండ్లా ఓడరేవుకు సమీపంలోనే ఉంది. కాండ్లా నుంచి ముంబయి కన్నా కాండ్లా నుంచి ఛాబహార్ దగ్గర. ఛాబహార్ నుంచి ఆప్ఘాన్ లోని జరాంజ్ నగరం 833 కిలోమీటర్ల దూరంలో ఉంది. జరాంజ్ నుంచి కాబూల్ తో పాటు అఫ్ఫాన్ లోని ప్రధాన నగరాలైన కాంద్ హార్, హెరాత్, మజారే -ఇ-షరీఫ్ లకు తక్కువ సమయంలో వెళ్లవచ్చు. ఈ మూడు చోట్ల భారత్ కాన్సులేట్ కార్యాలయాలు ఉన్నాయి. భారత్ నిర్మించిన జరాంజ్ రహదారిని 2009లో అప్పటి విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు.

2003 నుంచే చర్యలు....

ఛాబహార్ కు గల వ్యూహాత్మక ప్రాధాన్యం దృష్ట్యా ఆ ఓడరేవు అభివృద్ధికి చొరవ చూపింది. 2003లో వాజపేయి, అనంతరం మన్మోహన్ సింగ్ హయాంలో చర్చలు జరిగినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. గత ఏడాది మేలో ఇరాన్ లో పర్యటించిన ప్రధాని మోడీ ఆదేశ అధినేత రొహానీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ రేవు అభివృద్థికి భారత్ సుమారు 3350 కోట్లను సమకూర్చింది. రెండు టెర్మినళ్లను, అయిదు బెర్తులను నిర్మించింది. నిర్మాణంలో జపాన్ సాయం కూడా తీసుకుంది. ఛాబహార్ కు పోటీగా పాకిస్థాన్ లోని గదర్ లో చైనా ఓడరేవు నిర్మించింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ లో అరేబియా సముద్ర తీరంలోగల గదర్ లో నిర్మించిన ఓడరేవును గత ఏడాది నవంబరులో అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్, ఆర్మీచీఫ్ రహీల్ షరాఫ్ లు ప్రారంభించారు. ఛా బహార్ - గదర్ మధ్య దూరం కేవలంల 72 కిలోమీటర్లు కావడం గమనార్హం.

పాక్ అంగీకరించకపోవడంతో....

తన భూభాగం మీదుగా ఆప్ఘాన్ కు భారత్ నుంచి సరకు రవాణాకు పాకిస్థాన్ అంగీకరించకపోవడంతో ఈ ఏడాది జూన్ నుంచి వాయు మార్గంలో సరుకు రవాణా చేస్తోంది. తాజాగా సముద్ర మార్గం అందుబాటులోకి రావడంతో ఇరు దేశాల మధ్య అనుసంధానం తేలికైంది. ఆప్ఘాన్ పునర్నిర్మాణం, సామాజిక, ఆర్థిక అభివృద్థిలో భారత్ తన వంతు పాత్ర పోషించడానికి ఈ మార్గం ఉపయోగపడుతుంది. ప్రత్యామ్నాయ, విశ్వసనీయ, భారీస్థాయి అనుసంధానతకు ఛాబహార్ రేవు చారిత్రక ఘటనగా నిలిచిపోతుంది. ప్రస్తుతం మానసికంగా దగ్గరైన భారత్-ఆప్ఘాన్ ఛాంబహార్ ఓడరేవు ద్వారా భౌగోళికంగా కూడా దగ్గరవుతున్నారు. సహజంగా ఆప్ఘానీలకు భారత్ అంటే ప్రేమాభిమానాలు ఎక్కువ. భారత్ కూ అంతే. అందుకే ఆప్ఘాన్ లో పార్లమెంటు భవనం నిర్మించింది. అక్కడి సైనికులు, పోలీసులకు ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో భారత్ సైనికులు శిక్షణ ఇచ్చారు. ఉదారంగా ఆర్థిక సాయం అందించేందుకు సుముఖంగా ఉంది భారత్. ఆప్ఘాన్ వ్యవహారాల్లో ప్రత్యక్ష జోక్యం బదులు నైతిక మద్దతు, ఆర్థిక సాయానికి భారత్ కట్టుబడి ఉంది. ప్రత్యక్ష్య జోక్యం వల్ల ఫలితం ఉండదనేది ప్రపంచ వ్యాప్తంగా అనుభవపూర్వకంగా రుజువైన సత్యం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News