ఒకరు ఆచి తూచి.. ఇంకొకరు ఆగమాగం

Update: 2017-10-12 12:30 GMT

రాజకీయ వ్యూహాలు పదునెక్కుతున్నాయి. లెక్క ప్రకారం చూస్తే ఇంకో ఏడాదిన్నరలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఒకవేళ ముందస్తుకు పోదామనుకుంటే వచ్చే ఏడాది సరిగ్గా ఈ సమయానికి ఎన్నికల ఘంటారావం మోగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులిద్దరూ పార్టీ పరంగా అప్పుడే సైరన్ మోగించేశారు. సమీక్షలు, సమావేశాలు, పర్యటనలు, శిక్షణలు, సర్వేలతో ప్రాథమిక కసరత్తు మొదలు పెట్టారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులది భిన్న శైలి. తెలంగాణలో మూడున్నర సంవత్సరాలుగా అధికారంలో కొనసాగుతున్నప్పటికీ టీఆర్ఎస్ పార్టీకి సంస్థాగత నిర్మాణం అంతంతమాత్రంగానే ఉంది. అటు ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీకి బలమైన విపక్షం వై.సి.పి ప్రత్యర్థిగా నిలుస్తోంది. ఈ రెండు బలహీనతలు అధిగమించి పునరధికారం చేపట్టాలనే దిశలో ముఖ్యమంత్రులు యోచన చేస్తున్నారు. ఒంటరిగా కేసీఆర్ ను ఎదుర్కోవడం దాదాపు అసాధ్యమనే అంచనాకు విపక్షాలు వచ్చేశాయి. అందుకే సాధ్యమైనన్ని పక్షాలు జట్టుకట్టి మహాకూటమిగా టీఆర్ఎస్ ను ఎదుర్కోవాలని భావిస్తున్నాయి. వీటిని కకావికలం చేయడమే లక్ష్యంగా కదులుతున్నారు కేసీఆర్. ప్రగతిశీల శక్తులు, పౌరసంఘాలు, ప్రజాసంఘాలు తెలంగాణలో బలమైన వాణిని వినిపిస్తూ ఉంటాయి. ఆయా సంఘాలకు ప్రజల్లో ఓట్ల పరంగా పెద్దగా మద్దతు లేకపోయినా విమర్శల దాడి చేస్తూ రాజకీయ వేడి పుట్టించడంలో ప్రధానపాత్ర పోషిస్తుంటాయి. అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ సంశయాత్మక ధోరణితో ప్రజలను చైతన్య పరచడంలో తెలంగాణలోని పౌరవేదికలు కీలకమైన భూమికను నిర్వహిస్తుంటాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ప్రజాసంఘాలు చేస్తున్న ప్రచారం ప్రతిపక్షాలకు మద్దతుగా నిలుస్తోంది. అధికార పక్షాన్ని చికాకు పరుస్తోంది.

కేసీఆర్ దూకుడుతోనే...

2014లో 38 శాతం ఓట్లు, 63 సీట్లతో టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చింది. బొటాబొటి మెజార్టీతో పగ్గాలు చేపట్టిన కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ప్రతిపక్షాలను ప్రజాక్షేత్రంలో నిర్వీర్యం చేసేశారు. ఏ ఎన్నిక జరిగినా భారీ మెజార్టీతో ప్రతిపక్షాలను బెంబేలెత్తించారు. చివరికి రాజధాని నగరంలోనూ బల్దియా పై గులాబీ జెండా ఎగరేశారు. వామపక్ష భావజాలానికి, కార్మిక సంఘ కార్యకలాపాలకు పేరు పొందిన సింగరేణి ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఇటీవల తన హవా చాటిచెప్పింది. అయిదు జిల్లాల పరిధిలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, 5 పార్లమెంటు నియోజకవర్గాలలో ప్రభావం చూపే ఎన్నిక ఇది. గతంలో ఎన్నోసార్లు విజయం సాధించిన సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ, కాంగ్రెసు అనుబంధ ఐఎన్టీయూసీ చేతులు కలిపినా, తెలుగుదేశం మద్దతిచ్చినా ఈ ఎన్నికలో టీఆర్ఎస్ పైచేయి సాధించగలిగింది. ఈ పరిస్థితులను మొత్తంగా బేరీజు వేసుకుంటే టీఆర్ఎస్ బలం పెరిగిందన్న విషయం స్పష్టమవుతుంది. అయితే ప్రజాసంఘాలు, టీమాస్ ఫోరం, విప్లవ సంఘాలు , కవులు , కోదండరామ్ నేతృత్వంలోనీ పొలిటికల్ జేఏసీ చేస్తున్న హడావిడి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కలవరం కలిగిస్తోందనే చెప్పాలి. పదే పదే ప్రభుత్వంపై ఆయా సంఘాలు విరుచుకుపడుతుండటంతో అదే ధోరణిలో తిప్పికొట్టాలని కేసీఆర్ యోచిస్తున్నారు. సింగరేణి ఎన్నికల తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్బంలో విపక్షాలతో పాటు ప్రజాసంఘాలను, జేఏసీని టార్గెట్ చేస్తూ కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దాదాపు 200కి పైగా సంఘాలతో టీమాస్ జిల్లాల వారీ కార్యవర్గాలను ఏర్పాటు చేసుకుని ప్రజాసమస్యలపై సమావేశాలను నిర్వహిస్తోంది. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం వంటి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాని తీరుపైనే టీమాస్ దృష్టి పెడుతోంది. కోదండరామ్ పొలిటికల్ జేఎసీ జెండా పట్టుకుని కలలు కన్న తెలంగాణ రాలేదు. కేసీఆర్ కుటుంబ తెలంగాణగా మారిపోయిందని ప్రచారం చేస్తూ జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. వీటన్నిటినీ ఎదుర్కొనేందుకు కేసీఆర్ కూడా విపక్షాలు, జేఎసీ, ప్రజాసంఘాలను ఒకే గాటన కట్టి దుమ్మెత్తి పోస్తున్నారు. వ్యక్తిగతంగా కూడా ప్రతిపక్ష నాయకులను ఆయన దుయ్యబడుతున్నారు. విపక్షాలు ప్రచారానికే పరిమితమవుతుంటే కేసీఆర్ ఏకంగా ఎన్నికల వాతావరణాన్నే సృష్టిస్తున్నారు. ఉద్యమ సమయంలో ఏ రకమైన దూకుడుని ప్రదర్శించారో అదే ధోరణిని కనబరుస్తూ ప్రతిపక్షాలపై పైచేయి సాధించే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ స్టైల్ కి ఫిదా అయిపోయే మీడియా కూడా ఆయన సమావేశాలకు విస్త్రుత ప్రాధాన్యాన్ని కల్పిస్తోంది. జిల్లా యాత్రలకు కూడా కేసీఆర్ ముహూర్తం ఖరారు చేసుకుంటున్నారు. ఇక రానున్నది రాజకీయ సంగ్రామమే అని తేటతెల్లమయిపోతోంది. ఈ దాడిలో ఎవరడ్డొచ్చినా సహించేది లేదన్న వైఖరి కేసీఆర్ మాటల్లో వ్యక్తమవుతోంది. దూకుడే ఆయన రాజకీయ మంత్రం. తంత్రం. ఎదురుదెబ్బలు తగిలినా లెక్క చేయరు. 2019 కి ఇప్పట్నుంచే ఈ పంథా కొనసాగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

చంద్రబాబు చాణక్యం....

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయాల్లో దుందుడుకు స్వభావం కనబరచరు. పక్కా లెక్కలతోనే బరిలోకి దిగుతారు. ప్రతికూల పరిస్థితులను కూడా వ్యూహ నైపుణ్యంతో సమయానుకూల పొత్తులతో సానుకూలంగా మలచుకుంటారు. గడచిన రెండు దశాబ్దాలుగా చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం విజయాలను పరికిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. కార్గిల్ యుద్ధం తర్వాత బీజేపీ పుంజుకున్న పరిస్థితులను గమనించి 1999లో బీజేపీతో జట్టుకట్టి ఘనవిజయం సాధించారు. 2004లో వైఫల్యం తర్వాత బీజేపీని దూరంగా పెట్టి 2009లో వామపక్షాలు, టీఆర్ఎస్ తో మహాకూటమి కట్టారు. వై.ఎస్. సారథ్యంలోని కాంగ్రెసు బలంగా ఉండటంతో విజయం సాధించలేకపోయారు. అయినప్పటికీ తెలుగుదేశం బలమైన ప్రతిపక్షంగా నిలవడానికి మహాకూటమి దోహదం చేసింది. 2014 నాటికి వచ్చేసరికి విభజిత ఆంధ్రప్రదేశ్ లో సెంటిమెంటు జోడీగా వై.సి.పి బలమైన పక్షంగా ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా యువతలో నరేంద్రమోడీకి, సినీ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న ఆదరణను అంచనా వేసి బీజేపీ, జనసేనలతో జట్టుకట్టి తెలుగుదేశం అధికారం సాధించడానికి చంద్రబాబు వేసిన వ్యూహమే ప్రధాన కారణం. 2019 నాటికి జనసేన ఒంటరిగా బరిలో దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ వర్గాలు, రెడ్డి కమ్యూనిటీలో టీడీపీ కంటే వై.సి.పి.కే ఎక్కువ ఆదరణ ఉంది. ఒకవైపు గతంలో అండగా నిలిచిన కాపు కమ్యూనిటీ ఈసారి తెలుగుదేశానికి అండగా నిలుస్తుందని భరోసా లేదు. కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ ఉద్యమం కూడా సాగుతుండటంతో కీలకమైన ఉభయగోదావరి జిల్లాల్లో ప్రతికూల పవనాలు వీస్తున్న భావన ఏర్పడింది. ఆరునెలల క్రితమే తెలుగుదేశం పరిస్థితి ఏమంత బాగోలేదని రాజకీయ వర్గాలు ఒక అంచనాకు వచ్చేశాయి. అయితే ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ మునిసిపల్ ఎన్నికల్లో విజయాలు టీడీపీకి కొత్త ఊపిరి పోశాయని చెప్పవచ్చు. అన్ని శక్తులను కేంద్రీకరించి ఈ విజయాలు రాబట్టడంలోనూ చంద్రబాబు చాణక్యం కనిపిస్తుంది. మైనారిటీలు ఎక్కువగా ఉన్న నంద్యాలలో బీజేపీని దూరంగా ఉంచడం తెలివైన ఎత్తుగడ. కాకినాడ ఎన్నికను పూర్తిగా లోకలైజ్ చేసి స్థానిక నేతలకు ప్రతిష్ఠాత్మకంగా మలచడంతో గెలుపు సాధ్యమైంది. తాజాగా ఇంటింటికీ తెలుగుదేశం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే యత్నాలు ప్రారంభించారు. మరోవైపు జనసేనపై విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ నాయకులను మందలించడం ద్వారా భవిష్యత్తులో పొత్తు అవకాశాలను పదిలంగా ఉంచుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ప్రజల్లో బలమున్నప్పటికీ తన ధోరణితో జిల్లాల్లోని అగ్రనాయకులను, ప్రభావం చూపగల నియోజకవర్గ నాయకులను జగన్ దూరం చేసుకుంటున్నారు. అదే సమయంలో అధికారంలో ఉన్నప్పటికీ ఏ ఒక్క అవకాశం విడిచిపెట్టకుండా చంద్రబాబు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాయలసీమ జిల్లాల్లో నియోజకవర్గ స్థాయిలో ప్రభావం చూపగల మాజీ కాంగ్రెసు నాయకులను కూడా టీడీపీ గూటికి చేర్చుకునే ప్రయత్నాల్లో బాబు బిజీబిజీగా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నికల వాతావరణం సంక్షేమ పథకాలనూ పరుగులు పెట్టిస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News