ఏపీకి డేంజర్ బెల్స్

Update: 2018-03-25 15:30 GMT

తొమ్మిది పేజీల ఉత్తరం. సుదీర్ఘ సమాధానం. స్వోత్కర్ష తప్ప జవాబులు లేని లేఖాస్త్రం. రాజకీయ చాణక్యమూ, పదాడంబరమూ, అతిశయోక్తుల అంకెలు కలగలిపి చేసిన వంటకం. ఇదీ చంద్రబాబుకు భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షా రాసిన లేఖ సారాంశం. మీరు విడిపోవడానికి మా తప్పేమీ లేదంటూనే డేంజర్ బెల్స్ మోగించారు షా. పరోక్షంగా హెచ్చరిక సంకేతాలను అందించారు. తెలుగుదేశం పార్టీ అధీనంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సర్కారుపై కేంద్రప్రభుత్వ వైఖరికి దర్పణం పట్టేలా అక్షరాయుధాలతో బదులిచ్చారు. ఇకపై పోలవరం నడక ఎలా సాగుతుందో తెలియదు. కడప ఉక్కు, రైల్వేజోన్, దుగరాజపట్నం పోర్టుల ప్రతిపాదనల పరిశీలన కొనసాగుతూనే ఉంటుంది. రెవిన్యూలోటు పూర్తిగా భర్తీ చేయడం, విదేశీ రుణ సాయ ప్రాజెక్టులకు బదులుగా ఇస్తామన్న 16 వేల కోట్ల రూపాయలు వస్తాయోలేదో తెలియదు. మొత్తానికి మొత్తంగా ఏపీ వినతులకు కేంద్రం చాప చుట్టేయనున్నట్లుగా షా లేఖతో స్పష్టమైపోయింది.

రాజకీయ కోణం....

ఏకపక్ష నిర్ణయంతో ఎన్డీఏ నుంచి మీరు తప్పుకున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఎత్తి చూపారు బీజేపీ అధ్యక్షుడు. రాజకీయపరమైన కోణంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారంటూ తప్పుపట్టారు. కేంద్రప్రభుత్వ సహకారాన్ని విస్మరించి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు దెబ్బతినేలా టీడీపీ వ్యవహరించిందనే భావం ధ్వనించేలా షా మాటల చాకచక్యం చూపించారు. చర్వితచరణంగా దాదాపు ఏడాది కాలంగా బీజేపీ వినిపిస్తున్న గణాంకాల జాబితా మరోసారి విప్పిచెప్పారు. రెండు లక్షల కోట్ల రూపాయల మేరకు ఏపీకి ప్రయోజనం సమకూరుస్తున్నామన్నారు. ఇందులో ఎక్కువ భాగం రోడ్లకు సంబంధించినవే. లక్షాయాభై వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ప్రతిపాదనలు అనుమతి మాత్రమే పొందాయి. గ్రౌండ్ కాలేదు. ఇంకా భూసేకరణ వంటి ప్రాథమిక కసరత్తు కూడా పూర్తి కాలేదు. కానీ ఆ నిధులన్నీ విడుదల చేసేశామన్న స్థాయిలో కౌంటర్ ఇచ్చారు అమిత్ షా. రాష్ట్రప్రభుత్వం భూసేకరణ చేసి ఇవ్వాల్సి ఉందన్నారు. నిజానికి ఇప్పుడు మౌలిక వసతుల ప్రాజెక్టుల వ్యయంలో అధికభాగం భూసేకరణకే వెచ్చించాల్సి వస్తోంది. కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టులకు భూసేకరణ రాష్ట్రమే చేయాల్సి వస్తే ఇంకో లక్షన్నరకోట్లు రాష్ట్రం భరించాల్సి వస్తుంది. అంతటి ఆర్థిక స్థితి ఏపీ కి లేదు. మీదే బాధ్యత అని తేల్చేయడంతో ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాలుస్తాయన్న నమ్మకానికి నీళ్లొదులుకోవాల్సిందే. రాష్ట్రవిభజన తర్వాత తొలి సంవత్సరం రెవిన్యూలోటు కింద ఏపీకి ఇచ్చిన నాలుగువేల కోట్ల రూపాయలు, మరో ఆరువేల కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు మినహా ఈ నాలుగేళ్లలో కేంద్రం ఒరగబెట్టిందేమీ లేదు. ఇకముందు వస్తాయన్న విశ్వాసమూ లేదు.

పోలవరానికి పొగ...

అమిత్ షా లేఖాస్త్రం ప్రధానంగా పోలవరానికి పెద్ద గండం పొంచి ఉన్న సూచనలను తేటతెల్లం చేసింది. 2010-11 అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం 16 వేల కోట్ల రూపాయలు. ఈ మొత్తాన్ని కేంద్రం భరిస్తుందంటూ అమిత్ షా చాలా తెలివిగా ప్రకటించారు. అంటే 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు వ్యయం 58 వేల కోట్ల రూపాయలకు పెరిగిన విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే పక్కనపెడుతున్నారు. తాజా అంచనాల ప్రకారం చూస్తే మూడోవంతు కంటే తక్కువ మొత్తం మేమిస్తాం. మిగిలినది మీ ఇష్టం అన్నట్టుగా నిర్మొహమాటంగా చెప్పేశారు. అందులోనూ మేము పూర్తి చేస్తామంటూ రాష్ట్రప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను తలకెత్తుకుంది. జాతీయప్రాజెక్టుగా అన్నీచూసుకోవాల్సిన కేంద్రం ఒక పరిధికే తాము పరిమితమవుతామని కుండబద్దలు కొట్టింది. భూసేకరణ, ఖాళీ చేసిన గ్రామాల పునరావాసం, సహాయకార్యక్రమాల నిమిత్తం 33 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయనేది రాష్ట్రప్రభుత్వ అంచనా. 25 వేల కోట్ల రూపాయలు నిర్మాణ వ్యయంగా తేల్చారు. ఇప్పుడిదంతా కేంద్రానికి పట్టదు. 16 వేల కోట్లు విదిల్చి దులిపేసుకోవాలనుకుంటున్నారు. రాష్ట్రం 42 వేల కోట్ల రూపాయల మొత్తాన్ని తన సొంత వనరులనుంచి సమకూర్చుకోవడం దాదాపు అసాధ్యం. అంటే పోలవరం గతి ఇంతే సంగతి అన్నట్లుగా ఉంది కేంద్ర వైఖరి.

నాన్చివేత..నయవంచన..నగుబాటు

కేంద్రమంత్రులు రాజీనామా చేశారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి వచ్చేసింది. కేంద్రప్రభుత్వంపైనే అవిశ్వాసం ప్రతిపాదించింది. ఇలా మూడువైపుల నుంచి ఒత్తిడి పెంచుతున్నప్పటికీ కేంద్రప్రభుత్వం తన ధోరణిని ఏమాత్రం సడలించుకోలేదు. రైల్వే జోన్ ఇంకా పరిశీలనలోనే ఉందని అమిత్ షా చెప్పేశారు. ప్రత్యేక హోదా మీ సెంటిమెంటు మాత్రమే. అవసరం కాదన్నట్లుగా చాలా తేలిక భావం ప్రదర్శించారు. దుగిరాజపట్నం పోర్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీని సానుకూలంగా చూస్తున్నామంటూ పాత పాటే పాడేశారు. పదకొండు జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు 2022 కల్లా పూర్తి చేస్తామని నందో రాజా భవిష్యతి అన్నట్లుగా 2019 ఎన్నికల తర్వాతి సంగతి గానే చెప్పేశారు. ఇవన్నీ చూస్తే కచ్చితంగా ఏపీ విషయంలో కఠినంగానే ముందుకు పోతున్నట్లు కనిపిస్తోంది. ఒత్తిడి తమపై ఏ మాత్రం పని చేయదన్న విషయాన్నీ తేల్చేశారు. ఆరోపణలు చేసుకోవడం తప్ప అక్కడ్నుంచి వచ్చేదేమీ లేదు. బీజేపీకి వ్యతిరేకంగా అన్నిపక్షాలనూ కూడగడుతున్న చంద్రబాబు నాయుడిపై కక్ష సాధింపా? లేక ఏపీ కి చేస్తే తమకేమొస్తుందన్న రాజకీయ లెక్కా? పార్లమెంటు ఆమోదించిన చట్టాన్నే లెక్క చేయని ధిక్కార, అహంకార ధోరణా ? బీజేపీ అగ్రనాయకులే సమాధానం చెప్పాలి.2019 ఎన్నికల వరకూ నాన్చివేత, నయవంచన, నగుబాటు ఇక ఆంధ్రప్రదేశ్ కు తప్పకపోవచ్చు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News