ఏపీ మంత్రులూ.... జీ హుజూర్ అనాల్సిందేనా..!

Update: 2017-10-19 15:30 GMT

మొత్తమ్మీద రాష్ట్ర పరిపాలన పగ్గాలు తాత్కాలికంగానైనా వారసుడు లోకేశ్ బాబుకు అప్పగించి విదేశీ పర్యటనకు వెళ్లారు ముఖ్యమంత్రి చంద్రబాబు. నేరుగా చినబాబే అన్ని వ్యవహారాలు చూసుకుంటారని చెబితే బాగుండదనుకున్నారో ఏమో అయిదుగురు మంత్రులతో కూడిన పరిపాలన కమిటీని వేసి బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమంత్రి పరోక్షంలో కీలక నిర్ణయాలు తీసుకొనే అధికారం ఈ కమిటీదే. పేరుకే కమిటీ తప్ప పెత్తనం మాత్రం చినబాబుదే అని కేబినెట్ సభ్యులే అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారు. 26 వ తేదీ వరకూ సీఎం స్వదేశానికి చేరుకోరు. తుపాను వంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినా, అనుకోని ఉపద్రవాలు సంభవించినా యంత్రాంగాన్ని కదిలిస్తూ పరిపాలన పరమైన నిర్ణయాలు వేగంగా తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రధాని, ముఖ్యమంత్రి విదేశాల్లో ఉన్న పరిస్థితుల్లో మోస్టు సీనియర్ మంత్రికి బాధ్యతలు అప్పగించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రధాని, ముఖ్యమంత్రుల పరోక్షంలో అవసరమైతే కేబినెట్ సమావేశాలను నిర్వహించే అధికారం కూడా ఆ సీనియర్ మంత్రికి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో నేరుగా చినబాబునే చూసుకోమనడం విమర్శలకు తావిస్తోంది. తెలంగాణలో మోనార్క్ గా వ్యవహరించే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చేయని సాహసమిది. తన కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావులకు కేబినెట్ కు సంబంధించిన ద్వితీయ స్థానం గతంలో ఎప్పుడూ వారెవరికీ అప్పగించలేదు.

సీనియర్లకు చెక్ ...

రాష్ట్రకేబినెట్ మంత్రిగా లోకేశ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గడచిన ఆరునెలల కాలంలో దాదాపు అన్ని శాఖలకు సంబంధించిన వ్యవహారాలపైనా అవగాహన పెంచుకుంటున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇదే సాకుతో ఆయా శాఖల్లో జోక్యం చేసుకుంటూ అధికారులకు నేరుగా ఆదేశాలు ఇస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు అనధికారికంగా అంగీకరిస్తున్నాయి. ఆయా శాఖలను పర్యవేక్షిస్తున్న మంత్రులకు సంబంధం లేకుండానే ఈ తంతు సాగిపోతోంది. కొంతమంది ఈవిషయమై నొచ్చుకుంటున్నా తమ అధినేత కుమారుడు కావడంతో ఎవరూ నోరు మెదపడం లేదు. కానీ కొందరు సీనియర్ల విషయంలో మాత్రం లోకేశ్ ఆటలు సాగడం లేదంటున్నారు. ప్రత్యేకించి డిప్యుటీ చీఫ్ మినిస్టర్ కేఈ కృష్ణమూర్తి, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, రోడ్లు భవనాల శాఖమంత్రి అయ్యన్నపాత్రుడు, వ్యవసాయ శాఖమంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి వంటి వారు లోకేశ్ సూచనలు, సలహాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆయా శాఖల అధికారులకు సైతం ఈ విషయం స్పష్టంగా తెలుసు. దాంతో లోకేశ్ చెప్పిన పనులు కూడా సీనియర్ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖల్లో అంత తొందరగా పూర్తికావడం లేదు. దీనిపై కొన్ని సందర్బాల్లో లోకేశ్ ముఖ్యమంత్రి ద్రుష్టికి కూడా తీసుకెళ్లినట్లు పార్టీలోని సీనియర్ నేతలు చెబుతున్నారు. పార్టీ ప్రధానకార్యదర్శి గా కొన్ని విషయాల్లో కార్యకర్తలకు ప్రయోజనం చేకూర్చే విధంగా తాను సిఫార్సులు చేయాల్సి ఉంటుంది. శాఖలతో సంబంధం లేకుండా అవి అమలు కావాల్సిందేనని లోకేశ్ పట్టుబడుతున్నారు. తాను చెప్పినా పనికాకపోతే క్యాడర్ లో నాయకత్వం పై విశ్వాసం పోతుందనేది ఆయన భావన. కానీ సీనియర్ మంత్రులు మాత్రం చినబాబు దారికి రావడం లేదు. చంద్రబాబు చెప్పిన సందర్భాల్లో మాత్రమే పాటిస్తున్నారు. అందుకే ఆర్థిక, రెవిన్యూ, వ్యవసాయ శాఖల్లో ఏదేని పని కావాలంటే లోకేశ్ కూడా చంద్రబాబు దృష్టిలో పెట్టిన తర్వాతనే ముందుకు వెళ్లాల్సి వస్తోంది.

చంద్రబాబుకూ ఇబ్బందే...

లోకేశ్ సూచనలను కచ్చితంగా పాటించాలని సీనియర్లకు నేరుగా చెప్పలేక చంద్రబాబు కొంత ఇబ్బంది పడుతున్నారు. రెవిన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి రాజకీయంగా చంద్రబాబుకు సమకాలికుడు. సీనియర్ మంత్రి, రాయలసీమ బీసీ నాయకుడు. ఆర్థికమంత్రి యనమల రామక్రుష్ణుడు సంగతైతే చెప్పనే అక్కర్లేదు. 1995లో శాసనసభ స్పీకర్ స్థానంలో ఉన్న యనమల ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు కు అసలు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా చంద్రబాబు సీఎం అవ్వడంలో కీలక భూమిక పోషించారు. ఎన్టీరామారావు పదవి దిగిపోవడం, బాబు బలనిరూపణ వంటివన్నీ యనమల చేతుల మీదుగానే సాగాయి. చంద్రబాబుకు సన్నిహిత సహచరునిగా, విశ్వాసపాత్రునిగా ముద్ర పడ్డారు. పాలనపై బలమైన పట్టు ఉంది. కొన్ని సందర్భాల్లో చంద్రబాబు సూచనలు సైతం తప్పని చెప్పగలరు. అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి కూడా తమ శాఖల్లో ఇతరుల జోక్యాన్ని ఎక్కడికక్కడ కట్ చేసేస్తుంటారు. వీరందరి దృష్టిలో చినబాబు ఇంకా కుర్రవాడికిందే లెక్క. అదే లోకేశ్ కు చిర్రెత్తిస్తోంది. చంద్రబాబు కూడా ఈవిషయంలో సహచర మంత్రులు, సొంత కొడుకు మధ్య సతమతమవుతున్నారు. లోకేశ్ చెప్పినా తాను చెప్పినట్లే పాటించాలన్న ఉద్దేశంతోనే మంత్రుల కమిటీ వ్యూహాన్ని అనుసరించారు. దీనిద్వారా అధికారులకు, మిగిలిన మంత్రులకు కూడా స్పష్టమైన సంకేతమిచ్చినట్లయింది.

చినబాబు తాన..కమిటీ తందానా...

ఇప్పుడు అత్యవసర కార్యనిర్వాహక అధికారాలు కలిగిన మంత్రుల కమిటీ పేరుకు మాత్రమే అని చెప్పవచ్చు. కిమిడి కళా వెంకట్రావు సీనియర్ మంత్రి అయినప్పటికీ లోకేశ్ మనసులో ఏముందో ఊహించి ఆచరణలో పెట్టాలని భావించేటంతటి విధేయత కనబరుస్తారు. తప్పైనా, ఒప్పైనా లోకేశ్ మాటతో విభేదించరు. చినరాజప్ప సొంత శాఖ, జిల్లా వ్యవహారాల్లో సైతం లోకేశ్ బాబు సూచనలు, సలహాలతోనే పాలన సాగిస్తుంటారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఆయనశాఖలో కనీసం ఎస్సైని బదిలీ చేయాలన్నా చినబాబు చెప్పాల్సిందేననేది పార్టీ వర్గాల నమ్మకం. దేవినేని ఉమా మహేశ్వరరావు చంద్రబాబుకు నమ్మిన బంటు. లోకేశ్ నిర్ణయాలకు మెజార్టీ కూడగట్టడానికే తన శక్తియుక్తులు వినియోగిస్తారని కేబినెట్ సమావేశాల్లో పాల్గొనే మంత్రులు చెబుతుంటారు. ఇక మంత్రి కాలవ శ్రీనివాసులు చినబాబుకు సలహాదారుగా పేరుపడ్డారు. మొత్తం ఈ కమిటీలో పేర్కొన్న పేర్లను పరిశీలిస్తే లోకేశ్ ఏమి ఆశిస్తే అది చేయడం తప్ప సొంతంగా ఆలోచించడం కానీ , భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం కానీ ఉండదని ప్రభుత్వం, పార్టీలోని సీనియర్ల నిశ్చితాభిప్రాయం. ఏదేమైనప్పటికీ అధికారికంగా చినబాబుకు రూట్ క్లియర్. ఇక సీఎం పరోక్షంలో ఆయన చెప్పిందే వేదం. చేసిందే శాసనం. చంద్రబాబు చెప్పేసినట్టే...సీనియర్లూ సంచులు సర్దేయండి..లేదా చినబాబుకు జీ హుజూర్ అనడం నేర్చుకోండి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News