ఏపీ ఎంపీ పార్టీ జంప్‌... మోడీ ఇచ్చిన హామీ ఏంటో..!

Update: 2017-12-05 09:30 GMT

గ‌త ఎన్నిక‌ల్లో తొలిసారిగా ఎంపీగా గెలిచిన కొత్త‌ప‌ల్లి గీత ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నార‌ని ప్ర‌శ్నించుకుంటే ఎవ్వ‌రూ క‌రెక్ట్ ఆన్స‌ర్ చెప్పే ప‌రిస్థితి లేదు. 2014 ఎన్నిక‌ల‌కు ముందు ఆర్డీవోగా ఉన్న గీత వైసీపీలోకి జంప్ చేసి అర‌కు నుంచి పోటీ చేసి ల‌క్ష ఓట్ల భారీ తేడాతో విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత కొద్ది రోజుల‌కే ఆమె వైసీపీని, జ‌గ‌న్‌ను టార్గెట్‌గా చేసుకుని విమ‌ర్శ‌లు చేస్తూ పార్టీకి దూర‌మ‌య్యారు. ఆ త‌ర్వాత టీడీపీకి ద‌గ్గ‌ర‌య్యారు. చంద్ర‌బాబు త‌మ పార్టీ ఎంపీల‌తో నిర్వ‌హించిన స‌మీక్ష‌ల్లోను ఆమె పాల్గొన్నారు. దీంతో గీత టీడీపీలో చేరుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు.

తాను టీడీపీలో లేనంటున్న...

టీడీపీలో ఆమెకు ఎలాంటి ప్ర‌యారిటీ లేదు. ఆమెను అక్క‌డ ప‌ట్టించుకోవ‌డం మానేయ‌డంతో ఆ త‌ర్వాత టీడీపీ వైపు చూడ‌డం మానేశారు. ఆ త‌ర్వాత ఆమె టీడీపీకి షాక్ ఇచ్చారు. తాను టీడీపీలో చేర‌లేద‌ని, త‌న‌కు అర‌కు నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధే ముఖ్య‌మ‌న్నారు. తాజాగా ఆమె తాను టీడీపీలో లేన‌ని, భ‌విష్య‌త్తులో కూడా ఆ పార్టీలో చేర‌న‌ని చెప్పారు. ఇక టీడీపీకి దూర‌మ‌య్యాక ఆమె ఢిల్లీలో బీజేపీ పెద్ద‌ల‌కు త‌ర‌చూ ట‌చ్‌లో ఉంటూ వ‌చ్చారు. దీంతో గీత బీజేపీలోకి వెళుతుందా ? అన్న సందేహాలు కూడా క‌లిగాయి.

పవన్ ను కలిసేందుకు కూడా...

మ‌ధ్య‌లో ఆమె ప‌వ‌న్‌ను క‌లిసేందుకు కూడా ప్ర‌య‌త్నాలు చేయ‌డంతో గీత జ‌న‌సేనలోకి వెళుతుంద‌న్న ప్ర‌చార‌మూ జ‌రిగింది. మ‌ళ్లీ గీత మ‌న‌స్సు మారిపోయిన‌ట్లుంది...తాజాగా ఆమె మోడీ, బీజేపీ గీతం ఆల‌పిస్తోంది. తాజాగా ఓ తెలుగు ఛానెల్‌తో మాట్లాడిన ఆమె ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీని తెగ పొగిడేసింది. తాను ప్ర‌ధాని మోడీని క‌లిసి త‌న నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌లు చెప్పుకున్నాన‌ని గీత పేర్కొంది. అలాగే తాను మోడీ నిర్ణ‌యం మేర‌కు న‌డుచుకుంటాన‌ని కూడా చెప్పింది. ఆమె చేసిన వ్యాఖ్య‌ల‌ను బట్టి చూస్తుంటే గీత బీజేపీలో చేరేందుకు వెయిటింగ్ లిస్టులో ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి దీనిపై కొద్ది రోజులు ఆగితే గాని క్లారిటీ వ‌చ్చేలా లేదు. అలా అని గీత బీజేపీలో చేరుతుందా ? అంటే చేరే వ‌ర‌కు చెప్ప‌లేం. ఇప్ప‌టికే వైసీపీ టు టీడీపీ వ‌యా జ‌న‌సేన ఇప్పుడు బీజేపీ అంటోన్న గీత‌ను పార్టీలే కాదు.... నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు కూడా ప‌ట్టించుకోవ‌డం మానేశారు. మ‌రి ఈ ప‌రిస్థితుల్లో గీత ఎలాంటి ట‌ర్న్ తీసుకుంటుందో ? ఆమెకే తెలియ‌ని ప‌రిస్థితి.

Similar News