ఏది సత్యం? ఏదసత్యం?

Update: 2018-02-17 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయం నిజనిర్ధారణ కు చేరింది. ఎన్నికల్లో ఎవరేమిటి? ఏ ప్రాతిపదికమీద పోరాటం సమీకృతమవుతుంది? రాష్ట్ర ప్రయోజనాల దిశలో తమ నిజాయతీ, చిత్తశుద్ధులను రాజకీయపార్టీలు ఎంతమేరకు నిరూపించుకుంటాయో ఒక కచ్చితమైన అవగాహనకు వచ్చేదిశలో ప్రస్థానం మొదలైంది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం వేసిన కుప్పిగంతులు రాజకీయ ఓనమాలు దిద్దుకుంటున్న పవన్ కల్యాణ్ కు బాగానే కలిసొచ్చాయి. పవర్ పాలిటిక్స్ ను రాష్ట్రప్రయోజనాలతో ముడిపెడుతూ జనసేన నిలదొక్కుకునేందుకు పక్కా వ్యూహం సిద్ధమవుతోంది. ఇంతవరకూ అభిమానసంద్రానికే పరిమితమైన జనసేన ఇక ప్రజాక్షేత్రంలోకి భావోద్వేగ పూరితంగా వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. కేవలం రాజకీయాల కోసం కాకుండా ప్రజలకోసమే తాను పాలిటిక్స్ లోకి వచ్చానని నిరూపించుకునే దిశలో మేధోపరమైన మద్దతు కూడగట్టుకొనే దిశలో పవన్ అడుగులు పడుతున్నాయి.

మబ్బుల్లో నీళ్లు...

కేంద్రం లక్షల కోట్ల రూపాయలు ఇచ్చానని నమ్మబలుకుతోంది. పైసా విదల్చడం లేదు. కేంద్రప్రభుత్వ వైఖరి భిక్షమేస్తున్నట్లుగా ఉందని రాష్ట్రప్రభుత్వం గగ్గోలు పెడుతోంది. తెలుగుదేశం ఎంపీలు పార్లమెంటులో గందరగోళం సృష్టిస్తున్నారు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు హరిబాబు, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సహకారంతో ప్రెస్ మీట్లు పెట్టి లెక్కల చిట్టాలు విప్పుతున్నారు. ప్రజలు కన్ఫ్యూజన్ లో పడిపోతున్నారు. దీనికి క్లారిటీ ఇవ్వాలనే తాము నిజనిర్దారణ కమిటీని వేస్తున్నామని జనసేన పవన్ కల్యాణ్ ప్రకటించారు. రెండు రోజులుగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. రాజకీయ, పాలన అనుభవం ఉన్న ప్రఖ్యాత వ్యక్తులను ఇందులో చేర్చడంతో కమిటీకి ఒక శాంక్టిటీ వచ్చింది. ఇది పవన్ కు బాగా కలిసొచ్చే అంశం. అయితే ఇప్పటికే కమిటీ ఒక విషయాన్ని తేల్చేసింది. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం చెప్పిన లెక్కలు రెండూ సరైనవే. అయితే నిర్వచనాలు మాత్రమే వేర్వేరు. వాటిని రాజకీయ కోణంలోనే రెండు ప్రభుత్వాలు చూస్తున్నాయన్నది మేధావుల అంచనా. రెవిన్యూలోటుతో మొదలైన ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం పాలన అప్పులతోనే మొదలైంది. మొత్తమ్మీద ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీకి అదనంగా వచ్చింది ఇంతవరకూ పదివేలకోట్ల రూపాయల లోపు మాత్రమే ఉందని రాష్ట్ర ప్రభుత్వం గణాంక సహితంగా తెలుపుతోంది. రెండు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేశామని కేంద్రం చెబుతోంది. చెన్నై విశాఖ కారిడార్ మొదలు రోడ్లు, విశ్వవిద్యాలయాలు, ప్రాజెక్టులు, రాజధాని ఇలా అనేక రూపాల్లో మంజూరు చేసిన ప్రాజెక్టుల విలువగా దీనిని చూడాల్సి ఉంటుంది. ఇవి విడుదలైన నిధులు కాదు. అవి ఎప్పుడు విడుదల చేస్తారో తెలియదు. ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు. అయినా కేంద్రం మాత్రం ఇచ్చేశామనే ధోరణిలో మాట్లాడుతోంది. నిజానికి పార్లమెంటు ఆమోదించిన చట్టాన్నే అమలు చేయని కేంద్రప్రభుత్వం ప్రాజెక్టుల మంజూరు పేరు చెప్పి నిధులు ఇచ్చేశామంటే సాధ్యమా? అంటే ప్రశ్నార్థకమే. ఒకవైపు రాష్ట్రప్రభుత్వం తన అవసరాలను పెంచి చూపుతోంది. మరోవైపు కేంద్రప్రభుత్వం మబ్బుల్లో నీళ్లు చూపి మభ్యపెట్టాలని చూస్తోంది.

భయమూ..భక్తి...

కేంద్రం సంగతేమో కానీ రాష్ట్రప్రభుత్వం మాత్రం నిజనిర్ధారణ కమిటీ పేరిట పవన్ చేస్తున్న హడావిడిపై ఆందోళనకు గురవుతోంది. తొలిదశలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు పాజిటివ్ గా ఉపయోగపడుతుందని టీడీపీ నాయకత్వం భావించింది. అయితే నాలుగేళ్లపాటు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ సంకీర్ణ ప్రభుత్వాల్లో ఉన్న తమ పాత్ర కుదించుకుపోయి పవన్ పొలిటికల్ హీరోగా ఎదిగిపోతారన్న అంచనాకు వచ్చింది. ఈ అజెండాతో ప్రజల్లోకి వెళతారనే భయం కూడా నెలకొంది. పవన్ చుట్టూ చేరిన కోటరీ తెలుగుదేశం పార్టీని కూడా సమాన దోషి గా చూపించేందుకు ప్రయత్నిస్తోంది. ఈనేపథ్యంలో పవన్ సొంత శక్తినే నమ్ముకుంటూ ఎన్నికలకు ప్రాతిపదికను నిర్మించుకునే అవకాశం ఉంది. బీజేపీతోపాటు టీడీపీ కూడా పవన్ టార్గెట్ లో ఉంటాయి. అటువంటప్పుడు టీడీపీ ఎక్కువగా నష్టపోయే అవకాశాలున్నాయి. పవన్ కల్యాణ్ టీడీపీ వ్యతిరేక వైఖరి తీసుకుంటే చంద్రబాబుకు ఇబ్బందికరమే. ఆంధ్రప్రదేశ్ లోని పదమూడు జిల్లాలకు గాను నాలుగు జిల్లాల్లో పవన్ ప్రభావంతో టీడీపీ తీవ్రంగా దెబ్బతింటుందని ఇప్పటికే అంచనాలున్నాయి. మొత్తమ్మీద పవన్ కోరిన వివరాలను అందించేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్దమవుతోంది. 110 పేజీలతో ఒక నివేదికను తయారు చేసింది. విభజన హామీలు, వచ్చిన నిధులు, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల అంచనాల మధ్య వ్యత్యాసాలు, ఏపీకి చట్ట ప్రకారం రావాల్సిన కీలక ప్రాజెక్టుల వంటి వివరాలను అందులో పొందుపరిచారు. పవన్ రాష్ట్రప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించినప్పటికీ ఇప్పటికిప్పుడు స్పందించకూడదనేది చంద్రబాబు ఆదేశం. టెక్నికల్ గా మేధావులపైనే పవన్ ఆధారపడుతున్నారు. అదే విధంగా ఆర్థిక నిపుణుల రూపంలోనే రాష్ట్రప్రభుత్వం స్పందించాలని భావిస్తోంది.

కమిటీ కష్టమే...

పధ్నాలుగో ఆర్థిక సంఘం అద్యక్షునిగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల పంపిణీకి సంబంధించి కీలక పాత్ర పోషించిన వై.వి.రెడ్డి తో నిధుల నిర్ధారణ కమిటీ వేయాలని రాష్ట్రపభుత్వం డిమాండ్ చేస్తోంది. 2014-15 లో రాష్ట్రానికి ఎంత రెవిన్యూ లోటు ఉంది? ఆర్థికంగా ఎంతమేరకు కేంద్రం సహకరించింది? విదేశీ రుణ సాయంతో చేపట్టాల్సిన ప్రాజెక్టుల కు బదులుగా కేంద్రం ఏమేరకు నిధులివ్వాలి? వాటిని ఏ రూపంలో భర్తీ చేసేందుకు అవకాశాలున్నాయనే అంశాలపై కేంద్రానికి మార్గనిర్దేశం చేసేందుకు ఈ కమిటీ పనిచేయాలని రాష్ట్రం కోరుతోంది. దీనిని కేంద్రం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతోంది. కమిటీని నియమిస్తే కొరివితో తలగోక్కున్నట్లే అవుతుందనే భావన కేంద్రానికి ఉంది. 2014-15లో విభజిత ఆంధ్రప్రదేశ్ కు 16 వేల కోట్ల రూపాయల మేరకు రెవిన్యూ లోటు ఉంటుందని పధ్నాలుగో ఆర్థిక సంఘం అంచనా వేసింది. అదే విషయాన్ని కాగ్ కూడా నిర్దారించింది. దానిని నాలుగువేల కోట్ల రూపాయలకే కేంద్రం పరిమితం చేసేసింది. ఇప్పుడు వై.విరెడ్డి కమిటీని వేస్తే తిరిగి 15 వేల కోట్ల రూపాయలను చెల్లించాల్సి వస్తుందేమోనని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 14 వఆర్థిక సంఘం ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడినట్లుగా కేంద్రం ఇంతవరకూ దబాయిస్తూ వస్తోంది. నిజానికి రాజ్యాంగంలోని మూడో అధికరణ ప్రకారం విభజన జరిగినప్పుడు పర్యవసానంగా ఏర్పడే పరిణామాలను పరిష్కరించేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేసేందుకైనా కేంద్రప్రభుత్వానికి రాజ్యాంగంలోని నాలుగో అధికరణ అధికారం కల్పిస్తోంది. దీనిని ఉద్దేశపూర్వకంగానే పక్కనపెట్టి కేంద్రం తప్పుదారి పట్టించింది. మళ్లీ వైవిరెడ్డి కమిటీ వేస్తే మరోసారి తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక హోదా అంశాన్ని కూడా లేవనెత్తే అవకాశం ఉందని కూడా కే్ంద్రం అనుమానిస్తోంది. మొత్తమ్మీద కమిటీ వేసే సూచనలు అంతంతమాత్రమేనని తేలుతోంది. నిజనిర్ధారణ కమిటీ పవన్ కల్యాణ్ రూపంలో ఇదే డిమాండు వినిపిస్తే కేంద్రం పెద్దగా స్పందిస్తుందని ఆశించలేం. ఏదేమైనప్పటికీ బీజేపీ, టీడీపీ లను బజారున పెట్టి ప్రజల్లోకి వెళ్లేందుకు పవన్ కు మాత్రం ఒక మంచి రాజకీయ ఆయుధం దొరికింది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News