ఎవరొచ్చినా.... ఓకేనా?

Update: 2017-11-25 15:30 GMT

డిమాండ్లు పెరుగుతున్నాయి. ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. భవిష్యత్తులో కచ్చితంగా గెలుపు సాధిస్తాయని తాము భావిస్తున్న పార్టీలవైపు నేతాగణం చూపు ప్రసరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ అనిశ్చిత చిత్రం అధినాయకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఒకవైపు వలసల బెడద, మరోవైపు గెలుపు గుర్రాల అన్వేషణ కొనసాగుతోంది. కనీసం సొంతంగా నాలుగైదు వేల ఓట్లు తెచ్చుకోగలిగిన పరపతి కలిగిన నేతలు అధిష్టానాలకే షరతులు విధిస్తున్నారు. 2019 ఎన్నికలు ముఖాముఖిగా జరిగే వాతావరణం ఉండటం , దానికి తోడు చాలా తక్కువ ఆధిక్యతలతోనే రాజకీయపార్టీలు గెలుపు సాధించే వాతావరణం ఉందని ఇప్పటికే అనేక సర్వేలు చాటి చెబుతున్నాయి. దీంతో గోడమీద పిల్లివాటంగా ప్రవర్తించే ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జులు, ద్వితీయశ్రేణి ముఖ్యనేతలు తమ అవకాశాలను వెదుక్కుంటున్నారు. నియోజకవర్గాల సంఖ్య పెంపుదల ఉంటుందంటూ ఇంతకాలం ఊరించినా దాదాపు అది సాధ్యం కాదనే అవగాహనకు వచ్చేశారు. ఈ పరిస్థితుల్లో గెలుపు గుర్రాలుగా భావించే నియోజకవర్గ నాయకులు తమను అందలం ఎక్కించే పార్టీల కోసం పరుగులు తీస్తున్నారు. ఇందులో కొందరు ఎమ్మెల్యేలు సైతం పార్టీలు మారడంపై దృష్టి సారిస్తున్నారు. దీని ప్రభావం ఆయా నియోజకవర్గాలపై ఏరకంగా ఉంటుంది? రాష్ట్రస్థాయిలో గెలుపు అవకాశాలపై ప్రభావం ఎలా ఉంటుందనే అంచనాల్లో పడుతున్నాయి తెలుగుదేశం, వై.సి.పి.

టీడీపీ డీల్ ..వైకాపా డీలా....

ఖచ్చితంగా గెలుస్తారని అంచనా వేస్తున్న విపక్ష ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలోకి తెచ్చుకునేందుకు తాజాగా మరోసారి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. పార్టీ పట్ల ప్రజల్లో 80 శాతం సంతృప్త స్థాయిని సాధించాలని చంద్రబాబు నాయుడు ఎంతగా చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అంత సానుకూలంగా లేవని పార్టీ అంతర్గత సమాచారం. ఇంటింటికీ తెలుగుదేశం అంటూ నిర్వహించిన ప్రచారయాత్రలో సైతం ప్రజలనుంచి పెద్దగా స్పందన కనిపించలేదంటున్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి వంటి అంశాలను చూపించడం ద్వారా రాష్ట్రవ్యాప్త సానుకూలతను క్రియేట్ చేసుకొని ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లాలని తెలుగుదేశం పార్టీ భావించింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇది అంత సులభసాధ్యంగా కనిపించడం లేదు. దీంతో బాగా పాపులర్ అయిన నాయకులను వై.సి.పి నుంచి కాంగ్రెసు నుంచి తెలుగుదేశంలోకి చేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో బాగా పనిచేయడం లేదని ప్రజల్లో పేరుపడిన ఎమ్మెల్యేలను మార్చే యోచన కూడా అధిష్ఠానం చేస్తోంది. కొత్త ముఖాల కారణంగా నెగిటివ్ ఫాక్టర్ ను సాధ్యమైనంతవరకూ నివారించి గెలుపు సాధించవచ్చని తెలుగుదేశం భావిస్తోంది. మరోవైపు మరో నలుగురైదుగురు ఎమ్మెల్యేలను ఆకర్షించగలిగితే వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి ఒక్క ఎంపీ స్థానం కూడా దక్కకుండా నివారించవచ్చనే వ్యూహం కూడా ఇందులో భాగంగా కనిపిస్తోంది. కేవలం తెలుగుదేశం పార్టీ సంస్థాగత బలంపైనే ఆధారపడకుండా స్థానిక నాయకత్వ బలాన్ని కూడా కలిపి ఎన్నికలను ఎదుర్కోవాలనే దిశలో పథక రచన సాగుతోంది. ఇక్కడ ఏ పార్టీ నుంచి వస్తున్నాడనే దానికంటే కూడా అతనికి ప్రజల్లో పలుకుబడి ఉందా? గెలుపు సాధించి పెట్టగలడా? ఈ రెండే క్రైటీరియాగా తీసుకోవాలనుకుంటున్నారు. ఈ పథకం అమలైతే మరింతగా వై.సి.పి. డీలాపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

డబ్బు మాది..సీటు మీది

తెలుగుదేశం పార్టీకి ఆర్థిక వనరులు ప్రధానంగా రాజకీయావకాశంగా కలిసి వస్తున్నాయి. ఈ విషయంలో వై.సి.పి. బలహీనతలు బయటపడుతున్నాయి. రాజకీయ, ప్రభుత్వ పదవులు ఎర చూపుతూ అగ్రవర్ణాలకు చెందిన ఎమ్మెల్యేలను ఆకర్షిస్తున్నారు. దళిత వర్గాల ఎమ్మెల్యేలకు సంబంధించి ఎన్నికల్లో టిక్కెట్టు, ప్రచారానికి అయ్యే ఖర్చుమొత్తం పార్టీ భరించేలా మధ్యవర్తుల సంప్రతింపులు సాగుతున్నాయి. గత ఎన్నికల్లో నెగ్గినప్పటికీ ఇంతవరకూ విపక్షంలో ఉండటం వల్ల పెద్దగా సంపాదించుకునే అవకాశం వై.సి.పి నాయకులకు లభించలేదు. మళ్లీ ఎన్నికల వ్యయాన్ని భరించే ఆర్థిక స్తోమత కూడా బలహీన వర్గ ఎమ్మెల్యేలకు లేదు. ఈ బలహీనతను ఆసరా చేసుకుంటూ తెలుగుదేశం ఆధిక్యాన్ని సాధించేందుకు పావులు కదుపుతోంది. మరోవైపు వై.ఎస్.ఆర్.కాంగ్రెసు పార్టీ మాత్రం ఎమ్మెల్యేల ప్రచార ఖర్చు విషయంలో ఎటువంటి హామీ ఇవ్వడం లేదు. పైపెచ్చు కొందరు ఎమ్మెల్యేలను పార్టీకి విరాళాలు ఇవ్వాలని కూడా కోరుతున్నట్లు సమాచారం. అవినీతి విషయంలో కట్టుతప్పకుండా గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కొంతవరకూ నియంత్రించేది. ఈ విడత అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గాల్లో అధికార పక్ష ఎమ్మెల్యేల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. ఇసుక మాఫియా, కాంట్రాక్టు పనుల్లో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పర్సంటేజీలు చర్చనీయంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఈవిషయంలో వారిని అదుపు చేసేందుకు ఎటువంటి ప్రయత్నం చేయడం లేదు. డబ్బులతోనే రాజకీయం నడుస్తున్న నేపథ్యంలో వారికీ గిట్టుబాటు కావాలి కదా ? అనే వ్యాపార ధోరణిలో తెలుగుదేశం నిర్ణయాలు తీసుకొంటోంది. ఇది కూడా ఎమ్మెల్యేలు తెలుగుదేశం వైపు ఆకర్షితులు కావడానికి మరొక కారణంగా నిలుస్తోంది.

భవిష్యత్తుపై భయం..భయం

గడచిన ఎన్నికల్లో సాధారణ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు సగటున 7 కోట్ల రూపాయల నుంచి పది కోట్ల రూపాయల వరకూ ఖర్చయినట్లు అంచనా. అదే రిజర్వుడు నియోజకవర్గాల్లో ఈ మొత్తం మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలకు పరిమితమైంది. 2019లో సాధారణ నియోజవర్గాల ఖర్చు 15 కోట్లకు పైగానే ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రిజర్వుడు నియోజకవర్గాల్లో కూడా కనీసం ఆరు కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా ఖర్చు చేయాల్సి ఉంటుందంటున్నారు. తెలుగుదేశం పార్టీ సాలిడ్ ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గాలుగా 70 నియోజకవర్గాలను ఇప్పటికే గుర్తించింది. వై.సి.పి.తో పోటాపోటీగా ఉన్న నియోజకవర్గాలు మరో 50 ఉన్నాయి. మిత్రపక్షమైన బీజేపీ కేటాయింపులను కూడా తీసేస్తే మరో 40 నియోజకవర్గాల్లో చాలా బలహీనంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ కొత్త అభ్యర్థులపై దృష్టి సారిస్తున్నారు. వై.సి.పి.లో ఉన్న నాయకులు, ఎమ్మెల్యేలను చేర్చుకుని ఇక్కడ బలం సాధించాలనే యోచన సాగుతోంది. ఎమ్మెల్యేలు పార్టీలను నమ్మలేకపోతున్నారు. పార్టీలు ఎమ్మెల్యేలను విశ్వసించలేని పరిస్థితి. ఎవరు ఏ పార్టీలో కొనసాగుతారు? ఎవరు జంప్ జిలానీలుగా మారతారు అనేది రోజురోజుకీ ఆసక్తి కరంగా దీంతో ఏపీలో ఇంకా ఎన్నికలకు ఏడాదిన్నర ముందే రాజకీయ అనిశ్చిత చిత్రం నెలకొంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News