ఎవరిపై కోపం.. ఎవరికి నష్టం...జగన్?

Update: 2017-10-24 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తే ఎలా ఉంటుంది? ఇది వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో తలెత్తుతున్న అంతర్మథనం. ఒక పార్టీగా రాజకీయపరిణతిని సంతరించుకోలేదనడానికి ఇదే నిదర్శనం. పాదయాత్ర కాలంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు కాబట్టి దీనికి హాజరవ్వాల్సిన అవసరమే లేదని కొందరు సీనియర్ నాయకులు జగన్ కు సూచించారు. నవంబరు ఆరోతేదీనుంచి జగన్ ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం వరకూ మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ప్రజాసమస్యలను తెలుసుకోవడం, ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టడం దీని లక్ష్యాలు. ప్రతి రాజకీయ పార్టీకి ప్రజల్లో బలపడటానికి కార్యాచరణను నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంటుంది. అదే సమయంలో చట్టపరమైన ప్రక్రియకు దీనికి సంబంధం ఉండదు. కానీ ఈ రెంటికీ ముడిపెట్టి అసెంబ్లీని బహిష్కరించాలన్న వైసిపి ఆలోచన అర్థరహితం. జీఎస్టీకి సంబంధించిన బిల్లును ఆమోదించడానికి మేనెల 16 వ తేదీన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశమైంది. ఆ తర్వాత ఇప్పటి వరకూ ఎటువంటి సమావేశాలు లేవు. రాజ్యాంగం ప్రకారం సభా సమావేశాల విరామం ఆరునెలలు మించి ఉండకూడదు. అంటే కచ్చితంగా నవంబరు 16 వ తేదీలోపు విధిగా సమావేశం కావాల్సిందే. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో జరపాల్సిన వర్షాకాల సమావేశాలను కూడా వివిధ కారణాలతో ప్రభుత్వం జరపలేదు. ఇప్పుడు వర్షాకాల ,శీతాకాల సమావేశాలను కలిపి ఒకే విడతలో ముగించేయాలని చూస్తోంది. వర్షాకాల సమావేశాలను జరపకపోవడాన్ని తప్పుపట్టే అధికారం విపక్షంగా వై.సి.పికి ఉంటుంది. అదే సమయంలో నవంబరు పదో తేదీ నుంచి నిర్వహించబోయే సమావేశాలు కుదరదనడం వివేక శూన్యతగానే భావించాలి.

నాయకుడు లేకుంటే అంతేనా?

ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు తమ నాయకునికి వ్యతిరేకంగా సాగుతున్నాయనేది వై.సి.పి. ఆలోచన. నిజంగానే అధికార తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం పట్ల కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తూ ఉండవచ్చు. కానీ సమర్థమైన ప్రతిపక్షానికి అధికారపక్షాన్ని ఎండగట్టడానికి అసెంబ్లీని మించిన వేదిక ఉండదు. అందుకే సాధారణంగా ప్రభుత్వాలు శాసనసభ సమావేశాల నిర్వహణకు, కొనసాగింపునకు పెద్దగా ఆసక్తి చూపవు. రాజ్యాంగ బద్ధమైన బాధ్యత కాబట్టి సమావేశాలు పెడుతుంటాయి. బడ్జెట్ సమావేశాలను మినహాయిస్తే వర్షాకాల, శీతాకాల సమావేశాలను వారం , పదిరోజులకే పరిమితం చేస్తుంటాయి. ప్రతిపక్ష వాణికి బలమైన, రాజ్యాంగ బద్ధ వేదిక ఇవ్వకూడదనే ఇలా పరిమితులు, నియంత్రణలను అమలు చేస్తుంటాయి. అయినప్పటికీ ప్రతిపక్షానికి ప్రభుత్వ ఇష్టారాజ్య పాలనను నిలదీసేందుకు శాసనసభే సరైన ప్లాట్ ఫారం. ప్రజాసమస్యలను లేవనెత్తవచ్చు. అధికార పక్షం అక్రమాలను ఎత్తిచూపవచ్చు. ప్రజల్లో పలుకుబడిని పెంచుకోవచ్చు. రాష్ట్రస్థాయిలో వివిధ అంశాలపై ద్రుష్టి మళ్లించవచ్చు. నాయకత్వ పటిమను నిరూపించుకునేందుకు అసెంబ్లీని సమర్థంగా వాడుకొనే అవకాశం ఉంటుంది. వై.సి.పి. ధోరణి ఇందుకు భిన్నంగా ఉంది. పార్టీకి నాయకుడే సర్వం కాదు. కాకూడదు. వివిధ కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్న జగన్ కు న్యాయపరమైన, చట్టపరమైన ఇబ్బందులు ఎదురైతే పూర్తిగా చేతులెత్తేసే వైఖరి పార్టీలో కనిపిస్తోంది. ప్రజాక్షేత్రంలో నాయకుని పర్యటన మరోవైపు అసెంబ్లీ నిర్వహణ ఇంతకు మించిన బ్రహ్మాండమైన అవకాశం ఎవరికి దక్కుతుంది. పాదయాత్రలో తమ నాయకుని దృష్టి కి వచ్చిన అనేక అంశాలను సభలో లేవనెత్తేందుకు ప్రయత్నించవచ్చు. జీరో అవర్,క్వశ్చన్ అవర్, స్వల్పవ్యవధి చర్చ ఇలా వివిధ మార్గాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టవచ్చు. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలను, తమ నాయకుని పర్యటనను ముడిపెట్టి ప్రజానుసంధానం చేసుకోవచ్చు.

తెలివి తెల్లారినట్టే...

చెరువు మీద అలిగితే ఎవరికి చేటు? శరీరమే కంపు కొడుతుంది. అధినేత మెప్పు పొందాలనో, ఆయన లేకుంటే తమకు మనుగడే లేదన్న భావనతోనో పార్టీ నాయకులు విపరీత విధేయత కనబరుస్తుంటారు. ఇది పార్టీ ప్రయోజనాలకు మేలు చేస్తుందా? లేదా ? అన్న అంశంతో వారికి సంబంధం ఉండదు. కేవలం నాయకుని గుర్తింపు పొందితే చాలు. పార్టీ కి నష్టం వాటిల్లినా ఫర్వాలేదు. ఈ వైఖరే జగన్ కు సరైన సలహాదారులు లేకుండా చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో వై.సి.పి. బలమైన ప్రతిపక్షమే కాదు, ఏమాత్రం అవకాశం వచ్చినా అధికారంలోకి రావడానికి అవసరమైన సామాజిక సమీకరణలున్న పార్టీ. వ్యూహం లోపించి చేజేతులారా దానిని పోగొట్టుకుంటున్నారు. జగన్ లేనంత మాత్రాన అసెంబ్లీ సమావేశాల్లో తాము సమర్థ విపక్షంగా వ్యవహరించలేమన్న భావన నుంచి ముందుగా ఆ పార్టీ బయటపడాలి. ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ రాజేంద్రనాథరెడ్డి, సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీకాంతరెడ్డి, రామకృష్ణారెడ్డి వంటి అధ్యయనశీలులు, వక్తలు అసెంబ్లీలో తమ వాణిని బలంగానే వినిపిస్తుంటారు. అయితే జగన్ ఉన్న సందర్బాల్లో ఏ విషయం చర్చకు వచ్చినా విపక్షం నుంచి ఆయనే వక్తగా ఏకపాత్రాభినయం ఎక్కువగా సాగుతుండేది. ఇప్పుడు బహునాయకత్వంతో సబ్జెక్టులవారీ బాధ్యతలను పంచుకోవాల్సి ఉంటుంది. ఇది దీర్ఘకాలంలో పార్టీకి ప్రయోజనదాయకం. వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయగల సమర్థులు తయారవుతారు. పైపెచ్చు జగన్ పాదయాత్రల్లో ఉన్నప్పటికీ పార్టీని చాకచక్యంగా గైడ్ చేయగల విజయసాయిరెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, భూమన కరుణాకర రెడ్డి వంటివారి సలహాలు, సూచనలు వెన్నంటే ఉంటాయి. అందువల్ల ఇప్పటికైనా తెలివిడితో నిర్ణయాలు తీసుకుంటే పార్టీకి, రాష్ట్రానికి మంచిది. నాయకుడు ప్రజల్లో, ప్రతినిధులు చట్టసభలో ప్రజావాణిని ప్రతిధ్వనింప చేయడం ప్రజాస్వామ్యానికి శ్రేయోదాయకం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News