ఎవరితోనైనా రెడీ అంటున్న జగన్

Update: 2017-10-26 15:30 GMT

యువజన, శ్రామిక, రైతు కాంగ్రెసు పార్టీ 2019 ఎన్నికల్లో భేషజాలకు పోకుండా ఇతర పక్షాలతో పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధమని సంకేతాలు ఇస్తోంది. సానుభూతి పవనాలతో 2014లో మంచి ఊపు మీదున్నప్పుడే చంద్రబాబు డెడ్లీ కాంబినేషన్ ముందు డీలా పడిపోయింది. టీడీపీ, బీజేపీ, జనసేనల రెయిన్ బో మైత్రి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీని చావు దెబ్బతీసింది. వై.సి.పి. కేవలం 1.5 శాతం ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయింది. అప్పట్లో పార్టీ అధినేత జగన్ బీజేపీని, జనసేనను పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. దాంతో ముంగిట్లో ముంత ఒలకబోసుకున్నట్లయింది. ఇప్పుడటువంటి పొరపాటు చేయదలచుకోలేదు . అందుకే తనతో కలిసి వస్తానంటే ఎవరితోనైనా సరే అంటున్నారు జగన్ . గతంలో ఆగర్భశత్రువులుగా భావించిన వారితో కూడా సంప్రతింపులకు , ఎన్నికల పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు.

మారిన మనిషినని....

మరి కొద్ది రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో వివిధ వర్గాలకు చెందిన నేతలు, మీడియా మేధావులతో తాజా వరస భేటీల సారాంశమిదే. పార్టీని విడిచి పెట్టి వెళ్లిన ప్రజాప్రతినిధులు , గతంలో తనతో కలిసిపనిచేసి, ఆతర్వాత వేరైన వారు తన వైఖరికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు తప్పని రుజువు చేయాలనే తపనలో ఉన్నారు జగన్. ‘జగన్ తన ఎదురుగా ఎవరైనా కూర్చుంటే సహించలేరు. ఎంత సీనియర్ నాయకులు అయినా దర్శనం కోసం గంటలతరబడి వేచి చూడాలి. సార్ అనే సంబోధించాలి.‘ ఇలా విభిన్నమైన ఆరోపణలు, విమర్శలు పార్టీ అధినేతపై వినవచ్చాయి. వాటిని దూరం చేసుకుంటూ తాను మారిన మనిషినని నిరూపించుకునే క్రమంలోనే సాధ్యమైనంత సౌమ్యంగా, విధేయంగా, రాజకీయ విద్యార్థి తరహాలో జగన్ సమాజంలోని ప్రాబల్య వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా తన మనసులోని భావాలను వెల్లడించి మంచిచెడులనూ బేరీజు వేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ భవిష్యత్ రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుందో సూచన ప్రాయంగా వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం సాగుతున్న మేధోమథనాలలో వచ్చిన ఫీడ్ బ్యాక్ ను, పాదయాత్రలో స్వీయానుభవాలను క్రోడీకరించి వై.సి.పి.రాజకీయ అజెండాను నిర్దేశించనున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికలకు అదే మేనిఫెస్టోగా రూపుదాల్చనుంది. వ్యూహకర్త ప్రశాంత కిశోర్ ను పార్టీకి పరిచయం చేసిన సందర్బంలో ప్రకటించిన నవరత్నాల పథకం ప్రజల్లోకి సరైన రీతిలో వెళ్లలేదనే భావన అధిష్టానంలో నెలకొంది. గడప గడపకూ వైఎస్పార్ పార్టీ పేరిట ప్రచార కార్యక్రమాలు చేపట్టినా పెద్దగా స్పందన కనిపించలేదు.

ఆప్షన్స్ ..ఓపెన్ ...షరతులు వర్తిస్తాయి...

ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా సంపాదకులతో జగన్ విడి విడి భేటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా 2019 నాటికి రాజకీయ పొత్తులు ఎలా ఉండాలనే అంశంపై అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. పార్టీల స్వభావంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రయోజనాలు, వై.సి.పి. రాజకీయ లక్ష్యాల సాధనలో భాగంగానే పొత్తులు ఉంటాయన్నారు. అన్ని ఆప్షన్స్ ఓపెన్ గానే ఉన్నాయని అధినేత స్పష్టీకరించారు. కొన్ని విషయాల్లో మాత్రం షరతులు వర్తిస్తాయన్నారు. ఉద్యమ స్వభావంతో పనిచేసే వామపక్షాలతో జట్టుకట్టేందుకు తమ పార్టీకి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. అదే సమయంలో జనసేనతో కూడా చేతులు కలిపేందుకు సిద్ధమేనన్నారు. దీనిని బట్టి చూస్తే 2014తో పోలిస్తే పార్టీ వైఖరిలోనే పూర్తిగా మార్పు వచ్చిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఒకటి రెండు శాతం ఓట్లు కూడా ఫలితాన్ని తారుమారు చేస్తున్న నేపథ్యంలో ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టకూడదని , రాజకీయంగా రాజీ పడేందుకు కూడా సిద్దంగా ఉండాలని జగన్ గ్రహించారనే చెప్పవచ్చు. అధికారం దక్కాలంటే నాలుగడుగులు వెనక్కి తగ్గాల్సిందే. అప్పుడే ఫలితం అనుకూలమవుతుంది. పైపెచ్చు 2019 లో ఎట్టి పరిస్థితుల్లోనూ వై.సి.పిని అధికారంలోకి తీసుకురావాలి. లేకపోతే పార్టీ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది.

బీజేపీ దూరం...కాంగ్రెసు భారం

జాతీయ అధికార పార్టీ బీజేపీకి జగన్ చేరువ అయిపోతున్నారంటూ కొంతకాలం క్రితం విస్త్రృతంగా ప్రచారం సాగింది. జగన్ ప్రధానిని కలిసి వచ్చిన సందర్బంలో ఈ రకమైన దుమారం చెలరేగింది. ఆ వార్తలు అర్ధ సత్యాలే అని జగన్ తేల్చేశారు. బీజేపీతో పొత్తుకు వై.సి.పి వ్యతిరేకం కాదు. కానీ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పిస్తామని ఆ పార్టీ తరఫున బాధ్యులెవరైనా లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఈరకమైన హామీ ఇచ్చే ప్రసక్తే తలెత్తదు కాబట్టి ఆ పార్టీతో ఎటువంటి పొత్తు ఉండే అవకాశం లేదు. అదే సమయంలో మరో జాతీయ పార్టీ కాంగ్రెసును తలకెత్తుకునే ప్రసక్తే లేదన్నారు. ఏపీ ప్రజలు ఏహ్యభావంతో చూస్తున్న కాంగ్రెసుతో జాతీయ అవసరాల దృష్ట్యా చేయి కలిపితే తమను కూడా రాష్ట్ర ప్రజలు తిరస్కరించే అవకాశం ఉందని జగన్ కుండబద్దలు కొట్టారు. కాంగ్రెసు లయబిలిటీ.. తమ పార్టీకి భారంగా మారుతుందన్నారు. ఒక శాతం లోపు ఓట్లకే పరిమితమైన వామపక్షాలు, ఇంతవరకూ ఎన్నికల్లో ఎటువంటి ట్రాక్ రికార్డు లేని జనసేనతో కలిసేందుకే వై.సి.పి ఉత్సాహ పడుతున్నట్లు అధినేత మాటలను బట్టి వెల్లడవుతోంది. జగన్ పై వచ్చిన అవినీతి ఆరోపణలను వ్యక్తిగతంగా ద్వేషించే టీడీపీ, బీజేపీలకు పవన్ కల్యాణ్ జై కొట్టారు. ఇప్పుడిప్పుడే తన సొంతకాళ్లపై నిలబడేందుకు జనసేనను నిర్మించుకుంటున్నారు. సమాంతర రేఖలు కలవవు. సిద్దాంత, రాజకీయ అవకాశాల రీత్యా అధికార లేదా ప్రధాన ప్రతిపక్షంగానైనా 2019 నాటికి జనసేన నిలదొక్కుకోవాలని పవన్ యోచన. ఈ నేపథ్యంలోంచి చూస్తే వై.సి.పి. జనసేనల కలయిక 2019లో సాకారం కాకపోవచ్చు. ఒక్క బీజేపీని మినహాయిస్తే ఏ పార్టీతోనైనా పొత్తు కోసం వెంపర్లాట కనబరుస్తున్న వామపక్షాలే చివరి ఆప్షన్ గా వై.సి.పికి మిగలవచ్చు. అది కూడా జనసేన చొరవ చూపకపోతేనే. ముందస్తుగా పవన్ కల్యాణ్ కనుక లెఫ్ట్ నాయకులతో సంప్రతింపులు జరిపితే వామపక్షాలు కూడా చేజారిపోయే అవకాశాలున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News