ఎవరికి వారే సీతయ్యలు...!

Update: 2018-02-14 15:30 GMT

కాంగ్రెసు పార్టీకి ప్రత్యర్థులు అవసరం లేదు. తమలో తామే పార్టీకొంప ముంచుకునే ప్రబుద్ధులకు కొదవ లేదు. తాము నెగ్గకపోయినా ఫర్వాలేదు. పార్టీలో తమ ప్రత్యర్థి ఓడిపోతే చాలని సంతోషించే భస్మాసురులు నిండా ఉన్న పార్టీ. ఇప్పుడిప్పుడే తెలంగాణలో పుంజుకొంటోందన్న రాజకీయ వాతావరణం నెలకొంటున్న పరిస్థితిలో మళ్లీ ముఠాల ముప్పు తొంగి చూస్తోంది. నాయకవిభేదాలు ముదురుపాకాన పడుతున్నాయి. అధిష్టానం వద్ద మార్కులు కొట్టేసి ఏ నాయకుడు ఎదిగిపోతాడోనన్న భయంతో ఉద్ధృతంగా సాగాల్సిన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలకే గండి కొడుతున్నారు. సమష్టిగా సమరసన్నాహాలు చేయాల్సిన తరుణంలో సందేహాలు ముసురుకుంటున్నాయి. అధిష్టానానికి శిరోభారంగా, ఏఐసీసీ ఇన్ ఛార్జులకు తలనొప్పిగా పరిణమిస్తున్నాయి. ఒకవైపు బలమైన కేసీఆర్ వంటి నాయకుడు. ముఖ్యమంత్రి సారథ్యంలో ఒకే మాటపై , బాటపై నడుస్తున్న అధికారపక్షం. సింగిల్ గా ఎన్నికలను దున్నేసేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు ప్రతిజిల్లాలోనూ, నియోజకవర్గంలోనూ కాంగ్రెసు గ్రూపులు అధిష్టానంలో గుబులు రేపుతున్నాయి.

బస్సు యాత్రకూ బ్రేకులు?...

తెలంగాణలోని ప్రతి గ్రామాన్ని చుట్టుముడుతూ ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి బస్సు యాత్ర నిర్వహించాలని కాంగ్రెసు నిర్ణయించింది. దీనికి ఎవరు నాయకత్వం వహించాలనే అంశంపై చాలాకాలంపాటు తర్జనభర్జనలు సాగాయి. పార్టీలో సీనియర్, కాంగ్రెసు శాసనసభాపక్షం నాయకుడు జానారెడ్డి అయితే బాగుంటుందని కొందరు పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసెంబ్లీలో పోరాటంలోనే విఫలమైన జానాకు ఈ బాధ్యత అప్పగిస్తే అంతేసంగతులని మెజార్టీ నాయకులు అభిప్రాయపడటంతో ఆ ఆలోచన అటకెక్కింది. పార్టీలో ప్రవేశించిన యువనాయకుడు రేవంత్ రెడ్డి కూడా సమర్థుడేనని మరికొందరు పేర్కొన్నారు. కాంగ్రెసులో సీనియర్లంతా చేతులెత్తేశారన్న చెడు సంకేతాలు ప్రజల్లోకి వెళతాయనే భయంతో ఆ ప్రతిపాదననూ విరమించుకున్నారు. మొత్తమ్మీద సమష్టి నాయకత్వమంటూ ఒక విచిత్ర వాదనను ముందుకు తెచ్చారు. దీని ప్రకారం విజయానికి అందరూ తండ్రులే . అపజయం అనాథ అన్నట్లుగా ఎవరికీ దీనిని సక్సెస్ చేయాలనే ఉత్సాహం ఉండని స్థితి ఏర్పడింది. కాంగ్రెసు పార్టీకి సంఖ్యాపరంగా నాయకుల బెడద ఎక్కువే. బస్సులో ఎంతమంది నాయకులుండాలి? మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల మాటేమిటి? జిల్లాల్లో నాయకులను ఎంతమందిని వెంట తీసుకెళ్లాలి? వంటి సమస్యలు మొదలయ్యాయి. ఈ నెలాఖరునాటికే కార్యరంగంలోకి దిగాలని భావించినప్పటికీ అందర్నీ కలుపుకుపోయేందుకుగాను మరికొంత కాలవ్యవధి తీసుకుని పక్కాగా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. దాంతోనే పుణ్యకాలం గడిచిపోతోంది. ఏప్రిల్, మే నెలల్లో పంట పెట్టుబడి సాయం పథకం కింద నిధులు పంపిణీ చేసిన తర్వాత ప్రజాక్షేత్రంలోనే ఉండాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా నియోజకవర్గాలు, గ్రామాల వారీగా రూట్ మ్యాప్ కూడా సిద్దం చేస్తోంది టీఆర్ఎస్. దానికి ఎంతో కొంత ముందుగా ప్రజల్లోకి వెళితే కాంగ్రెసు కు ఉపయోగం ఉంటుంది. ఒకసారి కేసీఆర్ రంగంలోకి దిగి మాటల గారడీ మొదలు పెడితే ప్రత్యర్థులు తట్టుకోవడం బహుకష్టం. ఆ సంగతి తెలిసి కూడా కాంగ్రెసు నాయకులకు ముందు చూపు కరవైంది. కలిసి నడిస్తే మాత్రమే ప్రజావిశ్వాసాన్ని చూరగొనగలుగుతారు. దీటుగా టీఆర్ఎస్ దాడిని ఎదుర్కోవడం సాధ్యమవుతుంది. ముఠాలు కడితే అందరూ మునిగిపోయే ప్రమాదం కనిపిస్తోంది.

మూడేసి కుంపట్లు....

కాంగ్రెసు పార్టీకి ప్రతినియోజకవర్గంలోనూ రాజకీయ కుంపట్లు, సిగపట్లు సాధారణమైన విషయమే. ప్రతి సీనియర్ నేతకూ అధిష్ఠానంతో, లేదా కోటరీతో ఏదో ఒక లింకు ఉండటంతో పైరవీలు చేసుకుంటుంటారు. తమదే సీటని ప్రచారం సాగిస్తుంటారు. పీసీసీ అధ్యక్షుడు కూడా మందలించే సాహసం చేయరు. తమకే ఫిట్టింగు పెడతారేమోననే భయంతో గ్రూపు నాయకులను చూసి చూడనట్లు పోతుంటారు. ఈనేపథ్యంలో ఎన్నికల వాతావరణం సమీపిస్తున్న కొద్దీ గ్రూపు నాయకులు మరింతగా విజృంభిస్తున్నారు. సాధారణ వర్గాల సంగతి పక్కనపెట్టినా జిల్లాల్లోని పెద్ద నాయకుల ముఠాలు పార్టీకి భారీగానే నష్టం చేకూర్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందులో నల్గొండ జిల్లా అగ్రభాగంలో ఉంది. అగ్రనేతలూ అక్కడే ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి , సీఎల్ పీ నాయకుడు జానారెడ్డి, కోమటిరెడ్డి సోదరులు మూడు గ్రూపులుగా నల్గొండ(పూర్వ) జిల్లా కాంగ్రెసును బెంబేలెత్తిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ కంటే ఇక్కడ కాంగ్రెసు పార్టీ బలంగా ఉంది. అయితే గ్రూపుల గొడవలో తమ సొంతపార్టీ ప్రత్యర్థిని దెబ్బతీస్తున్నామనే యావలో మొత్తం పార్టీనే ముంచేసే దిశలో కదులుతున్నారు నేతలు. ఇటీవలికాలంలో కాంగ్రెసు పార్టీ అధిష్ఠానం హెచ్చరికలు జారీ చేసిందని చెబుతున్నప్పటికీ కుంతియా వంటి జూనియర్ ఇన్ ఛార్జులు టీ కాంగ్రెసు నేతలను భయభక్తుల్లో ఉంచలేకపోతున్నారు.

సీనియర్లుఉన్న చోట కూడా....

పార్టీ బలంగా ఉన్న మరొక జిల్లా మహబూబ్ నగర్ ఇక్కడ కూడా జాతీయ స్థాయి ప్రాముఖ్యం ఉన్న సీనియర్ నేత జైపాల్ రెడ్డి, నాలుగు నియోజకవర్గాల్లో పట్టున్న మాజీ మంత్రి డీకే అరుణ, కొత్తగా బరిలోకి దిగిన రేవంత్ వర్గాలు మెయింటెయిన్ చేస్తున్నారు. జైపాల్ రెడ్డి తన పూర్వ అనుచరుల కోసం పంతం పట్టి మరీ పార్టీ పదవులు ఇప్పిస్తున్నారు. సీట్లు కూడా వారికే నని చెబుతున్నారు. ఇది అరుణ వర్గం సహించలేకపోతోంది. యువతను, తనతోపాటు తెలుగుదేశం నుంచి కాంగ్రెసులోకి వచ్చిన నాయకులను రేవంత్ ప్రోత్సహిస్తున్నారు. జైపాల్ రెడ్డికి సమీపబంధువే అయినప్పటికీ రాజకీయంగా రేవంత్ కు, జైపాల్ కు అంత సన్నిహిత సంబంధాలేమీ లేవనేది పార్టీ వర్గాల సమాచారం. ఇక డీకే అరుణ వీరెవ్వరీని లెక్క చేసే స్థితిలో లేరు. కొంచెం కష్టపడితే కాంగ్రెసు పార్టీకి అవకాశం ఉన్న జిల్లాల్లో ఖమ్మం కూడా ఒకటి. ఇక్కడ మూడు ప్రధాన సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు అగ్రనేతలు సై అంటూ సమరం సాగిస్తున్నారు. ఎంపీ రేణుకా చౌదరి తన రూటే సెపరేటు అని , ఢిల్లీ కేరాఫ్ అడ్రస్ గా చెబుతూ సొంత వర్గాన్ని చక్కబెట్టుకుంటున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన పీసీసీ వర్కింగు ప్రెసిడెంటు మల్లు భట్టివిక్రమార్క తన మార్కు రాజకీయాలతో గ్రూపు ను మెయింటెయిన్ చేస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ పొంగులేటిసుధాకరరెడ్డి ఈ రెండు గ్రూపులపై గుర్రుగా ఉన్నారు. అధిష్టానంతో అంతో ఇంతో సంబంధాలున్న ఈయన కూడా కొందరు సన్నిహితులకు ఎమ్మెల్యే టిక్కెట్ల హామీలు గుప్పిస్తూ గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తమ్మీద ఖమ్మంలోనూ కయ్యాలు తప్పడం లేదు. ఈ ముఠాల ముచ్చట ఇలా ఉంటే.. ప్రత్యర్థి పార్టీల్లోని బలమైన నాయకులందర్నీ ఆకర్షించే విధంగా టీఆర్ఎస్ ఎన్నికల స్ట్రాటజీని సిద్దం చేసుకుంటోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News