ఎవరి అవసరాలు వారివేనా?

Update: 2018-03-12 15:30 GMT

ఎన్నికల ఏడాది ఎన్నో లెక్కలతో రాజ్యసభ సమీకరణ జరుపుతారని ఆశించిన వారికి చంద్రబాబు ఆశాభంగమే మిగిల్చారు. ఒత్తిడులు, సిఫార్సులతో సామాజిక న్యాయానికి చాప చుట్టేశారు. విపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి సైతం తన అవసరాలనే ప్రాతిపదిక చేసుకున్నారు. జాతీయ పాత్ర కోసం తహతహలాడుతున్న కేసీఆర్ మాత్రం ఈక్వేషన్ సరిచూసుకున్నారు. పెద్దల సభ అభ్యర్థుల ఖరారును లోతుగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఒక రకమైన సమీకరణ సాగింది. తెలంగాణలో మరో రకమైన భావన చోటు చేసుకుంది. మొత్తమ్మీద 2019 ఎన్నికలకు సిద్ధమవుతూనే వ్యక్తిగత సంతృప్తికి పెద్ద పీట వేశారు. ఆర్థిక వనరుల విషయంలో అవసరాలు పెద్దగా లేని టీఆర్ఎస్ అధినేత స్వేచ్చగా నిర్ణయాలు తీసుకున్నారు. తనకు నచ్చిన పద్ధతినే పాటించారు. ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ నుంచి తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఎవరూ ఊహించని ఒక అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన దురవస్థను కొని తెచ్చుకున్నారు. పార్టీ పరంగా విమర్శల పాలయ్యారు. 2019 ఎన్నికలకు ఆర్థిక వనరుల సమీకరణే ప్రధాన ప్రాతిపదికగా జగన్ నిర్ణయం తీసుకున్నారు.

లెక్క తప్పింది...

ఆరునెలలు కర్ర సాము చేసి మూలనున్న ముసలమ్మ మీద యుద్ధం ప్రకటించారనేది ఒక ముతక సామెత. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో తెలుగుదేశం అధినేత అనుసరించిన పంథా ఇదే . ఏ విషయాన్ని చివరి వరకూ తేల్చకుండా సుదీర్ఘ కసరత్తు సాగించి చివరికి మనసులో మాటను ప్రకటిస్తుంటారు చంద్రబాబు. అందర్నీ తన ఆలోచనకు అనుగుణంగా మార్చేందుకే చర్చలు జరుపుతుంటారు. సమీకరణలు, రాజకీయ అవసరాలు, ఓట్ల ప్రాతిపదికలను అన్నిటినీ విశ్లేషిస్తున్నట్లుగా మాట్లాడుతూ ఎదుటివారిని తన దారిలోకి తెచ్చుకుంటుంటారు. పొలిట్ బ్యూరో సభ్యులు, మంత్రులు చాలావరకూ చంద్రబాబు వాదనతో కన్విన్స్ అవుతుంటారు. ఈ సారి రాజ్యసభ అభ్యర్థుల విషయంలో చంద్రబాబు ఏ ఒక్కర్నీ కన్విన్స్ చేయలేకపోయారు. ఒత్తిడికి లొంగి రాజకీయ విమర్శలను ఎదుర్కోవాల్సిన పరిస్థితిని కొని తెచ్చుకున్నారు.టీడీపీకి తొలినుంచి అండగా నిలుస్తున్న బీసీలకు, జనాభాలో 21 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్సీ,ఎస్టీ సామాజిక వర్గాలకు మొండి చేయి చూపుతూ అగ్రవర్ణ అభ్యర్థులకే రాజ్యసభ లోని రెండు సీట్లనూ కట్టబెట్టారు. పార్టీలో అంతర్గతంగా చర్చకు, విమర్శలకు దారితీసేలా వ్యవహరించారు. రాజకీయ సమర్థత కారణంగా కాకుండా కేవలం లాబీయింగ్ కారణంగానే సీఎం రమేశ్ కు రెండో సారి రాజ్యసభ సీటు ఇవ్వాల్సి వచ్చిందనేది పార్టీ వర్గాల సమాచారం. మరోఅభ్యర్థి కనకమేడల రవీంద్రకుమార్ చివరి వరకూ రేసులో లేరు. ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే ఒక ఉన్నత న్యాయమూర్తి సిఫార్సు చేయడంతో చివరిలో సమీకరణలన్నీ మారిపోయాయని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఉన్నత పదవుల్లో ఎస్సీ,బీసీలకు న్యాయం చేశామని సార్వత్రిక ఎన్నికల్లో చెప్పుకునే అవకాశాన్ని టీడీపీ చేజేతులారా పోగొట్టుకుంది. మూడో అభ్యర్థిని కూడా నిలబెట్టాలనుకున్నప్పటికీ బీజేపీతో సంబంధాలు చెడిపోయిన స్థితిలో రిస్కు చేయకూడదని ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి లాగగలిగితే టీడీపీకి మూడో స్థానం దక్కే అవకాశం ఉన్నప్పటికీ తాజా రాజకీయ పరిస్థితులే అందుకు ఆటంకంగా నిలిచాయి.

ఆర్థిక అవసరాలే...

ఇంతవరకూ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజ్యసభ కు తమ అభ్యర్థుల్ని పంపేందుకు రెండు సార్లు అవకాశం దక్కింది. మొదటి సారి అభ్యర్థిగా విజయసాయి రెడ్డిని ఎంపిక చేశారు. తనతోపాటు సాక్షి మీడియా గ్రూపు నిర్మాణంలోకీలకపాత్ర పోషించడంతోపాటు దాదాపు కేసులన్నిటిలోనూ ఆయన సహనిందితుడిగా ఉన్నారు. అత్యంత విశ్వాసపాత్రుడు , కలిసి నడవకతప్పని స్థితి ఇద్దరికీ ఉంది. ఈనేపథ్యంలోనే రాజకీయంగానూ చక్రం తిప్పడానికి, తనమాటను తు.చ తప్పకుండా పాటించడానికి ఆయనను మించిన వ్యక్తి లేరనే భావనతో జగన్ రాజ్యసభకు పంపారు. నూటికి నూరుపాళ్లు జగన్ నమ్మకాన్ని విజయసాయి నిలబెట్టుకున్నారు. కేంద్రంతో సత్సంబంధాలు ఏర్పాటు చేయగలిగారు. ప్రధాని,అమిత్ షాలను కలిసి తమ పార్టీ పరిస్థితి, భవిష్యత్ రాజకీయాల గురించి చర్చించి కక్ష సాధింపు లేని ఒక రాజీమార్గం నెలకొల్పగలిగారు. తాజాగా రాజ్యసభ కు అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని ఎంపిక చేశారు. వైసీపీకి బలమైన మద్దతునిస్తున్న దళిత, మైనారిటీ వర్గాల నుంచి ఈ సారి ఎంపిక చేసి ఉంటే బాగుండేదని పార్టీలోని అగ్రనాయకులు అభిప్రాయపడినప్పటికీ జగన్ వాటిని తోసిపుచ్చారు. చంద్రబాబు నాయుడు వివిధ రకాల ప్రలోభాలతో మూడో అభ్యర్థిని కూడా టీడీపీ ఖాతాలో వేస్తారనే భావనతో ఆర్థికంగా బలమైన వేమిరెడ్డి దీటుగా ఎదుర్కోగలరనే అంచనాతోనే ఆయనను నిలిపారు. వేమిరెడ్డికి ఇందుకు సంబంధించి కొంత చరిత్ర ఉంది. పారిశ్రామిక వేత్త అయిన వేమిరెడ్డి వైఎస్ కు సన్నిహితుడు. నెల్లూరు జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలకు విరాళిస్తుంటారు. వెంకయ్యనాయుడి నేతృత్వంలో నడిచిన స్వర్ణభారత్ ట్రస్టుకు సైతం గతంలో భారీ విరాళాలు అందచేశారు. 2009 ఎన్నికల్లో వైఎస్ ఆదేశాల మేరకు కాంగ్రెసు అభ్యర్థులకు నిధుల చేరవేతలో కీలకంగా వ్యవహరించారు. ఆయా అంశాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని 2019 కి పార్టీకి ప్రధాన ఆదాయవనరుగా తోడ్పడతారనే అంచనాతోనే సామాజిక సమీకరణలను పక్కనపెట్టేశారు.

మొండి... మోనార్క్ ...

ప్రజాబలం తనవెనకే ఉంటుందని భావించినప్పుడు నాయకులు ఎంత గట్టిగా ఉంటారనేందుకు కేసీఆర్ ను నిదర్శనగా చెప్పుకోవాలి. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో తాను అనుకున్నది సెంట్ పర్సంట్ చేసి చూపించారు. రాజకీయ సమీకరణ కూడా సమ్మిళితమై ఉన్నప్పటికీ తనను వ్యతిరేకించే సామాజిక వర్గాన్ని పూర్తిగా దూరంగా పెట్టారు. కుటుంబ సభ్యులకే రాజకీయంగా పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు ఇప్పటికే వెన్నాడుతున్నాయి. అయినా తన సీట్లు తన ఇష్టం అన్నట్లుగా కుటుంబానికే చెందిన సంతోష్ కు రాజ్యసభ సీటు ఖాయం చేశారు. మొదట్నుంచీ తనకు, పార్టీకి సంతోష్ అండగా ఉన్నారనే కారణంతో విమర్శలను కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదు. మిగిలిన రెండు సీట్లను వెనకబడిన తరగతులకు కేటాయించడం ద్వారా రాష్ట్రంలో 55 శాతం పైచిలుకు ఉన్న ఆయా వర్గాల ప్రజలను సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో వారి ఆర్థిక స్తోమతను పెద్దగా పట్టించుకోలేదు. లాయల్టీకి, అనుభవానికే పెద్ద పీట వేశారు. రెడ్డి సామాజిక వర్గం టీఆర్ఎస్ కు దూరమవుతోంది. ఆ వర్గం నాయకులను రాజ్యసభ స్థానం ద్వారా మచ్చిక చేసుకుంటారని కొందరు పరిశీలకులు భావించినా కేసీఆర్ తన రూటే సపరేటు అని నిరూపించారు. కేవలం ఒక రాజ్యసభ సీటు తో కాంగ్రెసు వైపు మొగ్గు చూపుతున్న రెడ్డి సామాజిక వర్గం తనకు చేరువ కావడం అసాధ్యమని తన లెక్క తాను వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తరహాలో పెద్దగా చర్చలు, తతంగం లేకుండానే తన నిర్ణయాన్ని ప్రకటించారు. తెలంగాణ సమాజంలో గణనీయంగా ఉన్న యాదవ, ముదిరాజ్ వర్గాలకు పెద్ద పీట వేయడం కొన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ ప్రచారానికి బాగా పనికొస్తుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News