ఎప్పుడూ గుంపుగానే...ఒంటరిగా కాకుండా

Update: 2018-03-23 16:30 GMT

తెలుగుదేశం...ఆవిర్భవించిన తొమ్మిది నెలల్లోనే అశేష ఆంధ్రుల అభిమానాన్ని చూరగొని, అధికారాన్ని అందుకుని దేశ రాజకీయాల్లో సంచనలం సృష్టించిన ప్రాంతీయ పార్టీ. ఏ రాజకీయ పార్టీకి ఇంతటి అవకాశం లభించలేదు. అదృష్టం కలగలేదు. అదే విధంగా మూడున్నర దశాబ్దాల పార్టీ ప్రస్థానంలో సుదీర్ఘకాలం దాదాపు పాతికేళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన ప్రాంతీయ పార్టీ కూడా ఇదే కావడం విశేషం. ఆవిర్భవించిన అనంతరం1984లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 30 స్థానాలు సాధించి లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన తొలి ప్రాంతీయ పార్టీ కూడా ఇదే కావడం గమనార్హం. నాటి ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి లోక్ సభకు ఎన్నికైన సి. మాధవరెడ్డి ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. పేరుకు ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన పార్టీ కూడా తెలుగుదేశమే. యునైటెడ్ ఫ్రంట్ హయాంలో, ఎన్డీఏ హయాంలో పదేళ్ల పాటు జాతీయ రాజకీయాల్లో తనదైన క్రియాశీల పాత్రను పోషించింది. 2014 ఎన్నికల అనంతరం నిన్న మొన్నటి వరకూ ఎన్డీఏలో భాగస్వామిగా కొనసాగింది. మారిన పరిస్థితుల్లో ఎన్డీఏ నుంచి వైదొలగినప్పటికీ 2019 లోక్ సభ ఎన్నికల అనంతరం ఢిల్లీ రాజకీయాల్లో తెలుగుదేశం కీకల

పాత్ర పోషించే అవకాశాన్నీ తోసిపుచ్చలేం.

మారిన పరిస్థితుల నేపథ్యంలో....

వీటితోపాటు తెలుగుదేశానికి మరో ప్రత్యేకత ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలతో పొత్తు పెట్టుకునే తెలుగుదేశం పార్టీ ఎన్నికలను ఎదుర్కొంటుంది. వామపక్షాలు, బీజేపీ తదితర పార్టీలతో ఏదో ఒక దానితోనే ముందుకు సాగుతోంది. అసలు పొత్తులు లేకుండా తెలుగుదేశం పార్టీ ఎన్నికలను ఎదుర్కొన్న సందర్భం ఏదీ లేదంటే ఆశ్చర్యం కలగక మానదు. కాని మారిన పరిస్థితుల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలను గతానికి భిన్నంగా ఒంటరిగా ఎదుర్కోక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడనుంది. ఎన్డీఏ ప్రభుత్వం నుంచి, ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం వైదొలిగాక, అది ఒంటరి అయింది. నిన్నా మొన్నటి వరకూ కలిసి మెలసి తిరిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఘాటైన విమర్శలు, ఆరోపణలతో ధ్వజమెత్తుతున్నారు. అందువల్ల ఆయనతో కలిసి ప్రయాణించే అవకాశం ఎంతమాత్రం లేదు. నాలుగేళ్ల అనుబంధం ముగిశాక బీజేపీ కూడా మాజీ మిత్రుడు అయిన తెలుగుదేశం పార్టీని ఆరోపణలు, విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పరస్పరం కత్తులు దూసుకుంటున్న ఈ రెండు పార్టీలు ఇప్పుడు ఎంత మాత్రం ఎన్నికల్లో కలిసి నడిచే ప్రసక్తి లేదు. ఇక సీపీఎం చంద్రబాబు పాలనపై తొలి నుంచి కత్తులు నూరుతోంది. సీపీఐది కూడా దాదాపు అదే పరిస్థితి. జీర్ణావస్థలో ఉన్న కాంగ్రెస్ తో కలిసి ప్రయాణించే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ రాజకీయంగా అది ఆత్మహత్యా ప్రయత్నమే అవుతుంది. అందువల్ల ఏతావాతా, అంతిమంగా అర్థం అయ్యేదేంటంటే... రేపటి ఎన్నికలను తెలుగుదేశం పార్టీ ఒంటరిగా ఎదుర్కొనడం అనివార్యం. రాజకీయంగా ఆ పార్టీకి కలసి వచ్చే మిత్రులెవరూ కనుచూపు మేరలో కనపడటం లేదు.

ఆవిర్భావం నుంచి అంతే....

ఈ పరిస్థితి పార్టీకి ఎంతవరకూ లాభదాయకం? మేలు చేస్తుందన్న ప్రశ్నలు తాజా పరిస్థితుల నేపథ్యంలో ఉత్పన్నమవ్వక మానవు. పార్టీ ఆవిర్భావం నుంచి పొత్తులతోనే ఎన్నికల బరిలోకి టీడీపీ దిగుతూ వస్తోంది. ఒక్కసారి ఈ సంప్రదాయానికి గండిపడితే పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయన్న అనుమానాలు, భయాలు, ఆందోళనలు పార్టీ శ్రేయోభిలాషుల్లోనూ, అభిమానుల్లోనూ వ్యక్తమవుతున్నాయి. అంతర్గతంగా దీనిపై పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. ఒక్కసారి మూడున్నర దశాబ్దాల తెలుగుదేశం ప్రస్థానాన్ని పరిశీలిస్తే అది పొత్తులతో ఎంత మమేకం అయిందో అర్ధమవుతుంది. పార్టీ ఆవిర్భావం అనంతరం 1983లో జరిగిన తొలి ఎన్నికల్లోనే టీడీపీ సంజయ్ విచార్ మంచ్ అనే పార్టీతో రంగంలోకి దిగింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ చిన్న కోడలు మేనకాగాంధీ నాయకత్వంలోనిది ఈపార్టీ. భర్త సంజయ్ గాంధీ మరణానంతరం ఆమె ఇందిరతో విభేదించి సొంతపార్టీని ప్రారంభించారు. అప్పటికి ఈ పార్టీకి అసలు ఉనికి కూడా లేదు. ఇప్పటికీ నామమాత్రమే. నాటి ఎన్నికల్లో టీడీపీ అధినేత ఎన్టీఆర్ సంజయ్ విచార్ మంచ్ పార్టీకి తెలంగాణలో అయిదు స్థానాలను కేటాయించారు. కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి స్థానాల నుంచి సంజయ్ విచార్ మంచ్ పోటీ చేసింది. అయిదింటిలో నాలుగుచోట్ల సంజయ్ విచార్ మంచ్ గెలిచింది. తెలంగాణకు చెందిన నాయకుడు గోనె ప్రకాశరావు పూర్వాశ్రమంలో ఈ పార్టీ ఎమ్మెల్యేనే. 1984లో ఎన్టీఆర్ ను పదవి నుంచి కాంగ్రెస్ దించడంతో ప్రజల్లో సానుభూతి ఏర్పడింది.

నాటి నుంచి నేటి వరకూ....

ఈ నేపథ్యంలో 1985లో బీజేపీ, సీపీఐ, సీపీఎంలతో పొత్తు పెట్టుకుని పార్టీ మళ్లీ ఘన విజయం సాధించింది. 1989లో కూడా ఇదే మిత్రులతో కలిసి పోటీ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. మళ్లీ 1994లో జరిగిన ఎన్నికల్లో పాత మిత్రులతో ఎన్నికలకు వెళ్లిన ఎన్టీఆర్ ఘనవిజయం సాధించారు. 200కు పైగా సీట్లను సాధించి రికార్డును సృష్టించారు. అనంతరం చంద్రబాబు నాయకత్వంలో 1999లో బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారాన్ని అందుకున్నారు. 2004 ఎన్నికల్లో మళ్లీ దే పార్టీలో కలసి వెళ్లినప్పటీకీ ఫలితం లేకుండా పోయింది. అనంతరం చంద్రబాబు బీజేపీని వదిలి పెట్టేశారు. 2009 ఎన్నికల్లో మహాకూటమి పేరుతో ముందుకు వెళ్లినప్పటికీ ప్రజలు తిరస్కరించారు. టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, బీజేపీతో కలసి విస్తృత కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ తెలుగుదేశం లబ్డి పొందలేక పోయింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం అధికారాన్ని సాధించింది. తెలుగుదేశం ప్రస్థానం అంతా పొత్తులతోనే సాగింది. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా వెళ్లాల్సిన పరిస్థితి. ఇది ఎంతవరకూ పార్టీకి మేలు చేస్తుందన్నది ప్రశ్నార్థకమే. ఈ పరిస్థితి ఎంతవరకూ అధికగమించగలదు అన్నది ఆసక్తికరమే....!

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News