ఎదురులేని నేతకు.... ఎన్నో సవాళ్లు...?

Update: 2017-09-26 18:29 GMT

ఏంజెలా మెర్కెల్.... ఇప్పుడు జర్మనీలో ఎదురు లేని నేత. ఐరోపా యూనియన్ లో అత్యంత కీలకమైన నాయకురాలు. పశ్చిమ దేశాల్లో ఇప్పుడు ఆమె పేరు మారుమోగిపోతోంది. నాలుగోసారి జర్మనీ ఛాన్సిలర్ గా ఎన్నికైన ఆమెకు ప్రజానీకం నీరాజనం పడుతోంది. జర్మనీ మాజీ ఛాన్సిలర్ హెల్మెట్ కోల్ ప్రధాన అనుచరురాలైన మెర్కెల్ 2005లో తొలిసారిగా జర్మనీ పీఠాన్ని అధిష్టించారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూసే పరిస్థితి ఎదురవ్వలేదు. జర్మనీ ఛాన్సిలర్ ను ఆ దేశ అధ్యక్షుడు ఎంపిక చేస్తారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడి అధికారం పరిమితం. అధికారమంతా మన ప్రధాని మాదిరిగానే.... ఛాన్సిలర్ చేతిలోనే కేంద్రీకృతమై ఉంటుంది. జర్మనీ పార్లమెంటును బుండే స్టాగ్ అని వ్యవహరిస్తారు. ఇండియాలో ఇందిరాగాంధీ మాదిరిగా, బ్రిటన్ లో మార్గరెట్ థాచర్ మాదిరిగా జర్మనీ, ఐరోపాలో మెర్కెల్ కు ఐరన్ లేడీ గా మంచి పేరుంది. ప్రజాహిత నిర్ణయాలు తీసుకోవడం, వాటి అమలులో అత్యంత శ్రద్ధ వహించడం, కీలక విషయాల్లో కఠినంగా వ్యవహరించడం ద్వారా ఆమె ప్రజలకు చేరువయ్యారు. ప్రత్యర్థుల సహేతుక విమర్శలను స్వాగతించడం, వారు చెప్పే సానుకూల అంశాలను అంగీకరించి అమలు చేయడం మెర్కెల్ ప్రత్యేకత. జర్మనీలో అందరూ మమ్మీగా ముద్దుగానే పిలుచుకునే మెర్కెల్ ఈసారి ఎన్నికల్లో గట్టెక్కడం గగనమని మొదట్లో అందరూ భావించారు. సిరియా నుంచి అదేపనిగా వలసలను అనుమతించడం మెర్కెల్ కు ఎన్నికల్లో ప్రతిబంధకంగా మారుతుందని అనుకున్నారు. కాని ఆమె ఈ అంచనాలను తలకిందులు చేసి అధికార తీరానికి చేరారు.

47 ఏళ్ల నుంచి అధికారంలో......

ఈ నెల 24న జరిగిన ఎన్నికల్లో మెర్కెల్ సారధ్యం వహిస్తున్న క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్ (సీడీయూ) సంపూర్ణంగా ప్రజాభిమానాన్ని చూరగొంది. క్రిస్టియన్ సో్షల్ యూనియన్ (సీఎస్ ‍యూ) పార్టీతో కలిసి సీడీయూ ఎన్నికలను ఎదుర్కొంది. పల్లెప్రాంతాల్లో, నగరాల్లో సాంప్రదాయ క్రిస్టియన్ ఓటర్లలో ఈ రెండు పార్టీలకూ మంచి పేరుంది. ముఖ్యంగా సీడీయూ మొదటి నుంచి ఎక్కువ కాలం అధికారంలో కొనసాగుతోంది. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం 1950లో ప్రారంభమైన సీడీయూ గత 67 సంవత్సరాల్లో 47 ఏళ్ల పాటు అధికారంలో ఉందంటే ఆ పార్టీకి గల ప్రజాదరణ ఏపాటిదో అర్ధమవుతోంది. నిజానికి మెర్కెల్ ఎన్నికలకు ఏడాది ముందు గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. అంతర్యుద్ధం కారణంగా సిరియా తదితర దేశాల నుంచి రమారమి పది లక్షల మంది వలసదారులను దేశంలోకి అనుమతించడంపై వ్యతిరేకత వ్యక్తమయింది. ఇటీవల కాలంలో ఉగ్రవాద దాడులు, పేద, ధనికుల మధ్య అంతరాలు పెరగడం, మహిళ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా మెర్కెల్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. కాని మెరుగైన అభివృద్ధిని సాధించడం, ఐరోపాలో దేశాన్ని బలమైన శక్తిగా నిలబెట్టడం, నిరుద్యోగాన్ని నియంత్రించడంతో ప్రజల మెప్పును పొందారు. సోషల్ డెమొక్రటిక్ పార్టీ, ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ, ద గ్రన్స్, ద లెఫ్ట్ పార్టీ, ఫ్రీ డెమొక్రటిక్ పార్టీలు ఎంతగా ప్రచారం చేసినా 6.15 కోట్ల మంది జర్మనీ ఓటర్లు మెర్కెల్ నాయకత్వాన్ని బలపర్చారు. కార్మికులు, కార్మికసంఘాలే ప్రధాన మద్దతుదారుగా మనుగడ సాగిస్తున్న అతి పురాతన పార్టీ సోషల్ డెమొక్రటిక్ పార్టీ. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పశ్చిమ జర్మనీలో ఈ పార్టీకి ప్రజాదరణ ఉంది. ఈ పార్టీ కృషి ఫలితంగానే దేశంలో జాతీయ కనీస వేతన చట్టం అమల్లోకి వచ్చింది. నిన్న మొన్నటి వరకూ ఐరోపా యూనియన్ పార్లమెంటుకు నేతృత్వం వహించిన మార్టిన్ ఘల్జ్ దానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ, ద గ్రన్స్, ద లెఫ్ట్ పార్టీ, ఫ్రీ డెమొక్రటిక్ వంటి పార్టీలు మెర్కెల్ పార్టీ విజయావకాశాలను ఎంతమాత్రం ప్రభావితం చేయలేకపోవడం గమనార్హం.

శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు.......

జర్మనీని, ఐరోపా యూనియన్ (ఈయూ) విడదీసి చూడలేం. రెండింటి మధ్య అవినాభావ సంబంధముంది. ఐరోపాలో ఇప్పుడు జర్మనీ బలమైన ఆర్థిక వ్యవస్థ. సుమారు 3 శాతం వార్షిక వృద్ధిరేటులో శక్తివంతమైన దేశంగా గుర్తింపు పొందింది. 26 దేశాలు సభ్యత్వంగల ఐరోపా యూనియన్ లో బ్రిటన్ నిష‌్క్రమణ అనంతరం జర్మనీ శక్తిమంతమైన దేశం. ఈయూ సభ్యత్వదేశాలకు అండగా నిలబడనుంది. ఈయూ దాదాపు జర్మనీ కనుసన్నల్లో నడుస్తోందన్నది వాస్తవం. ఈయూలోని 26 దేశాల ప్రజలు ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించడానికి, స్థిరపడటానికి కీలకమైన షెంజెన్ వీసా విధానం అనుమతిస్తోంది. ఐరోపా దేశాల మొత్తానికి ఒక సైన్యం ఉండాలని మెర్కెల్ అభిలషిస్తున్నారు. అంతేకాక ఉమ్మడి ఆర్థిక మంత్రి ఉండాలని, సభ్యదేశాల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఉమ్మడి యూరో బాండ్లు జారీ చేయాలని మెర్కెల్ భావిస్తున్నారు. క్రిమియా, ఉక్రెయిన్ వ్యవహారాల్లో దూకుడుగా వ్యవహరించిన రష్యా పట్ల కరకుగానే ఉండాలని అనుకుంటున్నారు. బ్రిటన్, అమెరికా వంటి సంప్రదాయ మిత్రదేశాలపై ఆధారపడటం తగ్గించుకోవాలని, తన వ్యవహారాన్ని తానే సంబాళించుకోవాలని మెర్కెల్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఐరోపా యూనియన్ ను ప్రపంచంలోనే అగ్రశక్తిగా తీర్చిదిద్దాలన్న పట్టుదల ఆమెలో బాగా కనపడుతోంది. నార్త్ అట్లాంటిక్ ట్రీటా ఆర్గనైజేషన్ (నాటో) పై అమెరికా అధ్యక్షుడు చేస్తున్న ప్రతికూల వ్యాఖ్యల నేపథ్యంలో రక్షణ వ్యయాన్ని పెంచాలన్నది మెర్కెల్ అభిప్రాయం. ప్రస్తుత పరిస్థితుల్లో మెర్కెల్ ఎన్నిక జర్మనీతో పాటు, ఈయూ బలోపేతానికి దోహద పడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News