ఎక్కడ చెడింది?

Update: 2018-04-01 15:30 GMT

ఆయనంటే ఈయనకు అభిమానం. అపారమేధాశక్తి అంటే గౌరవం. ఈయనంటే ఆయనకూ ఇష్టం. ప్రజాదరణతో మార్పు తెస్తారనే విశ్వాసం. కానీ ఇద్దరూ ఇప్పుడు కలిసి పనిచేయలేకపోతున్నారు. మార్గాలు వేరుగా మారాయి. ఇద్దరిదీ లక్ష్యం ఒకటే . రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి. ఆట నియమాలు మార్చాలి. అవినీతి రహితమైన వ్యవస్థను పునర్నిర్మించాలి. ఇంతటి సన్నిహిత భావ సామీప్యతలున్నప్పటికీ లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కలిసి నడవబోవడం లేదు. వీరి మధ్య విభేదాలు స్వల్పమైనవే అయినా విస్పష్టంగా ఉన్నాయి. జేపీ జనసేనను గైడ్ చేస్తారు. ఆయనను పవన్ రాజ్యసభకు పంపుతారంటూ వివిధ వర్గాల్లో సాగిన ప్రచారం వట్టిమాటగా మిగిలిపోనుంది.

పవన్ పక్కదారి పట్టారా?..

రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య నిధుల వివాదం ఏర్పడటంతో అసలు వాస్తవాలు తెలుసుకునేందుకు ఒక కమిటీ ఉండాలని జనసేనాని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో జయప్రకాశ్ నారాయణనే మొదటగా సంప్రతించారు. జేపీ సానుకూలత వ్యక్తం చేయడంతోపాటు ఎవరెవరైతే ఈ కమిటీకి సాధికారత, స్వచ్చత వస్తుందో కొందరి జాబితా కూడా అందచేశారు. దానికి అదనంగా తన ఆలోచనలో ఉన్న వ్యక్తుల పేర్లను కూడా పవన్ జోడించారు. జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ చేసిన కృషి కొంతమేరకు ఫలించింది. కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తోంది. 74 వేల కోట్ల రూపాయల మేరకు రావాల్సి ఉందని ఈ బృందం తేల్చి చెప్పింది. ఈ మొత్తం కార్యక్రమానికి పవన్ చోదకశక్తి అయినప్పటికీ వ్యవహారాన్నంతా నడిపింది జయప్రకాశ్ నారాయణే. తాను రాజకీయంగా పూర్తిస్థాయిలో క్రియాశీలకం కావడానికి జేఎఫ్సీ ఎక్సర్ సైజును పవన్ సద్వినియోగం చేసుకున్నారు. దీని తర్వాత జనసేన కార్యక్రమాలను వేగవంతం చేశారు. తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. రాజకీయ విమర్శలతో ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పార్టీగా నిలిచేందుకు కసరత్తు చేస్తున్నారు. జేఎఫ్ సీ తదుపరి కార్యాచరణను పక్కనపెట్టేశారు. దీంతో విసుగొచ్చిన జయప్రకాశ్ నారాయణ తానే సొంతంగా ఇజేఐ (ఇండిపెండెంటు గ్రూపు ఆఫ్ ఎక్సుపర్ట్స్ )ని ప్రకటించారు. కనీసం ఈ విషయంలో పవన్ ను సంప్రతించకుండా నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా జేఎఫ్ సీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే విషయంలో ఆయన కు శ్రద్ధ కనిపించలేదంటూ పరోక్షంగా విమర్శలూ గుప్పించారు. దీంతో వీరిద్దరి మధ్యతెగతెంపులు అయిపోయినట్లేనని చెప్పవచ్చు. ఏదో మర్యాదకు ఈ ఏర్పాటును ఆహ్వానిస్తున్నట్లు పవన్ చెప్పినా అది మొక్కుబడి మాత్రమే. జేపీ ఆలోచనలో పవన్ పక్కదారి పట్టారు. రాజకీయంగా తన పార్టీ గురించే ఆలోచిస్తున్నారు తప్పితే రాష్ట్రప్రయోజనాల విషయంలో ఆసక్తి తగ్గిపోయిందనేది పరోక్ష ఆరోపణ.

జేపీపై ఫిర్యాదులు...

జయప్రకాశ్ నారాయణ మేధాశక్తి, చిత్తశుద్ధి విషయంలో ఎవరికీ పెద్దగా అనుమానాలు లేవు. మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేసినప్పుడు పవన్ స్వయంగా ప్రచారం చేయాలనుకున్నారు. టీడీపీ,బీజేపీ కూటమిలో జనసేన భాగంగా ఉండటంతో చంద్రబాబు విన్నపం మేరకు ఆ నిర్ణయాన్ని అప్పట్లో విరమించుకున్నారు. కానీ జేపీ తెలివితేటలను, సేవలను రాజకీయంగా వినియోగించుకోవాలని భావిస్తూ వచ్చారు. ఈ దిశలో జేఎఫ్ సీ ఏర్పాటు తొలి అడుగు. నేరుగా పార్టీలోకి ఆహ్వానించకుండా మధ్యేమార్గంగా కలిసిపనిచేసే పద్ధతిని ఎంచుకున్నారు పవన్. జేఎఫ్ సీ సమావేశంలో జేపీ ధోరణి చూసిన తర్వాత జనసేనానికి తత్వం బోధ పడింది. జయప్రకాశ్ తాను చెప్పిందే అందరూ వినాలనే వైఖరితో ఉంటారు. ఇతరులెవరూ స్వతంత్రమైన అభిప్రాయాలు పూర్తిగా వ్యక్తం చేయకుండా తన అభిప్రాయానికి అనుగుణంగానే మాట్లాడాలన్నట్టుగా తెలివిగా నియంత్రిస్తుంటారు. ఇవన్నీ స్వయంగా చూసిన తర్వాతనే జేఎఫ్ సీ నే పక్కనపెట్టేశారు. జేపీ మార్గదర్శకత్వంలో జనసేన పనిచేస్తోందన్న భావన ప్రజల్లోకి వెళితే తనకు , పార్టీకి నష్టదాయకమని గుర్తించారు. తాను చెప్పినట్లుగా నడుస్తున్న పార్టీని మేధావుల చేతిలో పెడితే మాస్ కు దూరం కాకతప్పదు. అదే సమయంలో తాను వేరే వారి చేతిలో కీలుబొమ్మఅన్న ముద్ర వేయించుకోవడమూపవన్ కు సుతరామూ ఇష్టం లేదు.

‘పవర్’ పంచుకోలేరు...

జనసేన సమావేశాలన్నీ ఏకవ్యక్తి మీటింగులే. వేలాది ప్రజలనుద్దేశించి ఆయనొక్కరే మాట్లాడతారు. జేపీ వంటివారు ఆపార్టీలో చేరితే వేదికపై పవన్ ఒక్కరే మాట్టాడటాన్ని ఒప్పుకోరు. వేలాదిమందినుద్దేశించి తాను కూడా చెప్పాలనుకుంటారు. జనసేన పాలసీకే ఇది విరుద్ధం. సినీ ప్రపంచం నుంచి వచ్చినందువల్ల కోటరీ పరిధి తప్పదు. జనసేన పార్టీలో పవన్ మాత్రమే హీరో మిగిలిన వాళ్లంతా జీరోలే. జేపీ వంటి వారు ప్రవేశిస్తే ఈ ఈక్వేషన్ కుదరదు. పవన్ కూడా ఆయన మాట వినాల్సిందే. జేఎఫ్ సీ సాక్షిగా తేలిన సత్యమిదే. లోక్ సత్తా వంటి పార్టీని నడిపిన అనుభవానికి తోడు పరిపాలన పరంగానూ అపార అనుభవం ఉంది. జేపీకి ఇది ప్లస్ పాయింటు. అదే సమయంలో తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లనే చాదస్తమూ ఉంది. ఇది రాజకీయాల్లో వర్కవుట్ అయ్యే ఫార్ములా కాదు. పవన్ మంచితనాన్ని ఆసరాగా చేసుకుంటూ మొత్తం పార్టీని , క్యాడర్ ను జేపీ ప్రభావితం చేసేస్తారనే అనుమానాలూ ఉన్నాయి. అందుకే అంత్యనిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలనే పద్ధతిలో తాళి కట్టకముందే విడాకులైపోయాయి. వామపక్షాలతో కలిసి పనిచేయాలని పవన్ కల్యాణ్ బలంగా భావిస్తున్నారు. జేపీ వంటి వారి ఆలోచనలు వామపక్ష సిద్దాంతాలకు దూరం. ఇవన్నీ భవిష్యత్తులో ప్రతికూలంగా మారవచ్చు. క్షేత్రస్థాయిలో క్యాడర్, కమిట్మెంటుతో పనిచేసే సీపీఎం,సీపీఐ లతో కలిసి నడవడమే ప్రస్తుతానికి జనసేనకు మంచి చేస్తుందనే అభిప్రాయంలో ఉన్నారు. ఇంకోవైపు జేపీ టీడీపీ ఆలోచన విధానానికి దగ్గరగా ఉంటారనే విమర్శ కూడా వీరువురి బంధాన్ని తెగతెంపులు చేసింది.

 

- ఎడిటోరియల్ డెస్క్

Similar News