ఉండవల్లి తో పవన్ కి చిక్కేనా ...?

Update: 2018-02-11 15:30 GMT

ఉండవల్లి అరుణ కుమార్ రాజమండ్రి ఎంపీగా ఆయన ఢిల్లీ పార్లమెంట్ కి వెళ్ళకముందే రాజీవ్, సోనియా గాంధీల అనువాదకుడిగా తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితులు. దేశవ్యాప్తంగా అన్ని పార్టీల ముఖ్య నాయకులతో సన్నిహిత సంబంధాలు కలిగివున్న నాయకుడు. ఏపీ పునర్విభజన జరిగే సమయంలో పార్టీకి ఎదురు తిరగడంతో మూడున్నర దశాబ్దాల కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఒక్క సంఘటనతో దూరమై తల్లి లాంటి పార్టీ ఆయన్ను వెలి వేసింది. ఎంతో కాలం తనను ఆదరించిన పార్టీ సొంత రాష్ట్ర ప్రజలకు ద్రోహం తలపెట్టడాన్ని జీర్ణించుకోలేక తాను నమ్మిన సిద్ధాంతం కోసం కాంగ్రెస్ నుంచి బహిష్కరణ అనంతరం అశాస్త్రీయ విభజన పై సుప్రీం మెట్లు ఎక్కారు ఉండవల్లి. యధావిధిగా అన్ని కేసుల్లాగే ఈ కేసు నత్తనడకనే సాగుతుంది. విభజన జరిగి నాలుగేళ్ళు అవుతున్నా కాంగ్రెస్ కి తిరిగి రావాలని కొందరు పార్టీ ముఖ్యులు ఆహ్వానిస్తున్నా అరుణ కుమార్ తటస్థంగానే ఉండిపోయారు. ఏ పార్టీలో చేరేందుకు ఆయనకు మనసు అంగీకరించడం లేదు. చేసిన పదవులు చాలా సంతృప్తి ఇచ్చాయి ఇక కొత్తగా ఇంకా మరికొన్ని ఉన్నత పదవులకు చేరుకోవాలన్న ఆకాంక్ష ఆయనకు ప్రస్తుతం లేదు. 60 ఏళ్ళకు ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగరాదన్న స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్ణయానికి బీజం వేసిందీ... ఆ ప్రకటన రూపొందించింది ఉండవల్లి అరుణ కుమార్.... కనుక ఆయన అదే నిర్ణయాన్ని శిరసావహిస్తు ప్రత్యక్ష ఎన్నికలకు దూరమని స్పష్టం చేసేసారు.

రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షంగా...

ఏ పార్టీలో లేకపోయినా విభజన తరువాత ఆయన గొంతు మరింత పెరిగింది. టిడిపి, బిజెపిల కలయికతో నడుస్తున్న ఎన్డీయే ప్రభుత్వ తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ అమరావతి అవకతవకలపై ప్రజలను చైతన్య పరిచే ప్రక్రియ కొనసాగిస్తున్నారు ఉండవల్లి. చక్కటి వాగ్ధాటి పండితుడికి పామరుడికి అర్ధమయ్యే రీతిలో విశ్లేషించే శైలి లో సాగే ఆయన ప్రసంగాలను పార్టీలకు అతీతంగా అంతా ఇష్టపడతారు. తన అనుభవాన్ని రంగరించి ప్రస్తుతం ఏపీలో ఆయన ప్రతిపక్ష పాత్రను చక్కగా ప్రజల పక్షాన నిర్వహిస్తున్నారు. నిగ్గదీసి మరీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పులు కడిగేస్తున్నారు. ఒక్క గోదావరి జిల్లాలే కాదు ఇప్పుడు ఉండవల్లి సంధించే ప్రశ్నలకు ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు వారు ఫిదా అవుతున్నారు. మీలా ప్రశ్నించే నేత ఏపీకి కావాలంటున్నారు. కానీ ఆయన క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా ఉండేందుకే ఇష్టపడుతున్నారు. తరచూ ఢిల్లీ, హైదరాబాద్ వెళుతూ గతంలో తాను వేసిన కేసుల అంతు చూసే పనిలో వున్నారు. ప్రభుత్వాల పలుకుబడితో సాగదీయబడుతున్న ఈనాడు రామోజీ రావు మార్గదర్శి కేసు, ఏపీ పునర్విభజన రాజ్యాంగ విరుద్ధం అంటూ వేసిన కేసుల పరిశీలన ఒక పనిగా పెట్టుకున్నారు. ఇక భావితరాలకు అవసరమైన పుస్తకాలు, రాజకీయ నేతల వెనుక ఎవరికి తెలియని కోణాలను పుస్తకాల రూపంలో డాక్యుమెంట్స్ రూపంలో అందించే ప్రయత్నాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. నెలకోసారి తాజా రాజకీయ పరిస్థితులపై తన మనసుకు అనిపించినా సామాన్యుడి గుండెల్లో బాధను ప్రెస్ మీట్స్ రూపంలో వెల్లడిస్తూ ఉండవల్లి తన ప్రత్యేకతను చాటి చెబుతున్నారు.

పవన్ పిలుపుతో ....

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీకి జరుగుతున్న అన్యాయాలపై ఒక జేఏసీ ని జయప్రకాష్ నారాయణ ఉండవల్లి అరుణ కుమార్ తో రూపొందించాలని తలచారు. వెంటనే పవన్ స్వయంగా ఫోన్ చేసి ఉండవల్లిని ఆహ్వానించారు. ఆయన అనిగీకరించారు తానే కలుస్తా అని చెప్పారు. జనసేన అధినేత తో చర్చించాకా తనకో క్లారిటీ వస్తుందని అప్పుడు వివరాలు వెల్లడిస్తా అన్నారు అరుణ కుమార్. అన్ని పార్టీలతో జనసేన జేఏసీ ఏర్పాటు చేస్తుందా ? ఎన్నికల ముందు ఏర్పాటు అవుతున్న ఈ జెఎసిలో చేరేందుకు టిడిపి, వైసిపి అంగీకరిస్తాయా ? అన్ని అంగీకరిస్తే ఉండవల్లి దూకుడు తో టిడిపి విభేదించి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా ? అనే ప్రశ్నలు మొదలౌతున్నాయి.

తొలినుంచి టిడిపి వ్యతిరేకతే ....

తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటినుంచి నేటి వరకు ఆ పార్టీ చేసే తప్పులను ప్రజల ముందు పెట్టడమే ఉండవల్లి అరుణ కుమార్ ప్రధాన ఎజెండా గా నడిచారు. స్వర్గీయ ఎన్టీఆర్ ను సైతం ఆ రోజుల్లో ఎదిరించిన మొనగాడుగా కాంగ్రెస్ రాజకీయాల్లో ఉండవల్లికి ఒక ప్రత్యేక గుర్తింపు చరిత్ర వున్నాయి. ఆ తరువాత చంద్రబాబు పై ఉండవల్లి మాటలతో జరిపే దాడి ఇప్పటికొచ్చి ఎవరూ చేసి వుండరు. పరిశోధన, పరిశీలన లేకుండా ఏ విషయం ఉండవల్లి మాట్లాడారు. ఇలా బాబు పై ముప్పేట దాడి చేస్తున్నా ఆయనకు రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పని చేసే నేతగా బాగా గుర్తింపు ప్రజలనుంచి లభించింది. ఈ నేపథ్యంలో జెఎసిలో టిడిపి వుండే పక్షంలో ఉండవల్లి తనపంథా మార్చుకునే అవకాశాలు ఏ మాత్రం లేవు. రాష్ట్ర ప్రభుత్వం, టిడిపి పార్టీ చేసిన తప్పులను నిర్మొహమాటంగా చీల్చి చెండాడేస్తారు అరుణ కుమార్.

జనసేనాని కి తలనొప్పేనా ...?

తమపై విమర్శలు ఆరోపణలు చేసే ఉండవల్లి జెఎసిలో ఉంటే తాము చేరమని కానీ చేరినా ఆయన తప్పుకోవాలనే రీతిలో అరుణ కుమార్ లక్ష్యంగా పసుపు పార్టీ వివాదం రేపే ఛాన్స్ వుంది. ఎన్నికల ముందు ఏర్పడే ఇలాంటి జెఎసిలను జనం కూడా నమ్మరు. ఏ జయ ప్రకాష్ నారాయణో ఏర్పాటు చేసి ఉంటే మీడియా రేటింగ్ లు ఉండవని పెద్దగా స్పందన చూపేది కాదు. సినీ స్టార్, రాజకీయ నేతగా పవన్ కళ్యాణ్ దీనికి రూపకల్పన చేయడం తో అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ జేఏసీ ఏర్పాటు వెనుక రాజకీయ ఉద్దేశ్యం ఖచ్చితంగా వుండే అవకాశాలే ఉన్నాయన్నది తేటతెల్లం. జనసేనాని గా కాకుండా సినీస్టార్ గానే వుండి... పవన్ జేఏసీ నిర్మించి ఉంటే రాజకీయాలు ఎవరు ఆపాదించే వారు కాదు. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు జనసేనకు మాత్రమేనా మాకు లేవా అన్నది టిడిపి, వైసిపి అలకబూనుతాయి. మరోవైపు ఉండవల్లి జెఎసిలో ఎలాంటి ప్రకంపనలు సృస్ట్టించే వ్యాఖ్యలు జనసేనకు కొత్త తలనొప్పి తెచ్చి పెట్టె అవకాశాలే ఎక్కువ. వీటిని ప్రస్తావించి ఉండవల్లి జేఏసీకి దూరంగా వుండే ఛాన్స్ వుంది.

-ఎడిటోరియల్ డెస్క్

 

Similar News