ఉండవల్లి కొట్టిన దెబ్బకు అటు నుంచి సౌండ్ లేదే?

Update: 2017-09-20 18:00 GMT

ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై సంచలన వ్యాఖ్యలతో హల్ చల్ చేసే రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ తాజాగా పేల్చిన బాంబులకు టిడిపి శిబిరం నుంచి సౌండ్ వినపడటం లేదు . నంద్యాల ఎన్నికల్లో గెలిచేందుకు అధికార టిడిపి డ్వాక్రా మహిళల ఎకౌంట్ లో ఒక్కొక్కరికి నాలుగు వేలరూపాయలు చొప్పున పోలింగ్ కి నాలుగు రోజుల ముందు వేయడం , వైసిపి ఎమ్యెల్యే లు వున్న నియోజక వర్గాల్లో రాజ్యాంగ విరుద్ధమైన జీవోలతో టిడిపి ఇన్ ఛార్జ్ లకు రెండేసి కోట్ల రూపాయల పనులు వారు చెప్పిన వారికి చేయాలని ఆదేశిస్తూ జీవోలు ఇవ్వడం, పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ తెరవెనుక లాలూచీలు ఆధారాలతో సహా ఉండవల్లి బయట పెట్టారు . ఈ అక్రమాలను వైసిపి చూస్తూ ఊరుకోరాదని ఆ పార్టీ పై కూడా మండి పడ్డారు అరుణ కుమార్ . ఇలాంటి వాటిపై పోరాటం చేయకపోతే ఎలా అని తక్షణం ఎన్నికల కమిషన్ దృష్టికి , న్యాయస్థానం దృష్టికి వెళ్లాలని సూచించారు . అయితే ఈ బాగోతంపై కౌంటర్లు టిడిపి నుంచి లేకపోవడం గమనార్హం .

ఆధారాలతో ఉతికే ఉండవల్లి అంటే భయమా ...?

ఏది బడితే అది ఉండవల్లి మాట్లడరు . ప్రతి దానికి ఒక ఆధారం... దానికి సంబంధించిన డాక్యుమెంట్ ప్రూఫ్ తో ఆయన విరుచుకుపడతారు. దాంతో ఆయన పై విమర్శలకు దిగేందుకు ప్రత్యర్ధులు వణుకుతారు. ఆమధ్య ఉండవల్లి పై మంత్రి నారాయణ విమర్శలకు దిగితే ఆయన వెనుక నడిచే చట్ట విరుద్ధ సొసైటీ ల అక్రమాలు బయటపెట్టి , ఆయన విద్యా సంస్థల బాగోతాలు కేసులు ,ఆయనకు ఎందరు భార్యలు, ఎందరు పిల్లలు అనేదాకా పోయారు ఉండవల్లి . ఆ తరువాత నారాయణ సైలెంట్ అయిపోయారు. ఈ మధ్య ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల అవినీతి ఎండగడుతున్న ఉండవల్లి పై ఆ శాఖ మంత్రి దేవినేని సైతం ఉండవల్లి ని ప్రత్యక్షంగా విమర్శించేందుకు జంకుతున్నారు. పరోక్షంగానే ఆయన విమర్శలు, ఆరోపణలపై ఉమ వ్యాఖ్యలు ఉంటాయి తప్ప నేరుగా వుండవు . వీరందరికన్నా కొద్దో గొప్పో టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కౌంటర్ లు ఎక్కువగా ఇస్తూ వుంటారు. ఆయనకు పార్టీలో సరైన ఆదరణ లేకపోతు ఉండటంతో నాకెందుకని వదిలేస్తున్నారు .

ఉండవల్లికి నాలుకే కత్తి .....

ఉండవల్లి అరుణ కుమార్ నాలుక ఒక కత్తి లాంటిది . అది ప్రత్యర్థులను చీల్చి చెండాడేస్తూ ఉంటుంది . ఏ అంశం పై అయినా అప్రతిహతంగా మాట్లాడుతూ సాగిపోయే ఉండవల్లి ప్రసంగానికి అందరు మంత్రముగ్దులవుతారు . పార్టీలకు అతీతంగా ఆయన ప్రసంగాలను అంతా ఇష్టపడతారు . ఉండవల్లి చెప్పిన అంశాలపై ఆయన్ను వ్యతిరేకించే వారు విభేదించవచ్చేమో గాని, వినేందుకు మాత్రం ఇష్ట పడతారు. అరటిపండు వలిచి నోట్లో పెట్టేలా వుండే అరుణ కుమార్ మాటలు సామాన్యుడుకి బాగా కనెక్ట్ అవుతాయి.

జై ఆంధ్ర ఉద్యమం నుంచి ...

జై ఆంధ్ర ఉద్యమ సమయంలో యువకుడిగా రాజకీయాల్లోకి వచ్చి జైలు జీవితం గడిపారు ఉండవల్లి . ఆ రోజుల్లో రిక్షా పై మైక్ పట్టుకుని అరుణ కుమార్ వీధి ప్రసంగాలు నుంచి బహిరంగ సభల వరకు మాట్లాడుతూ అందరిని ఉర్రుతలూగించే వారు . బిజెపి నేత సోము వీర్రాజు లాంటి వారు రాజకీయాల్లోకి రావడానికి ఉండవల్లే స్ఫూర్తి గా నిలిచారు . తరువాత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి, సోనియా , రాహుల్ గాంధీలకు అనువాదకుడు గా ఆయన రాణించిన తీరు తెలిసిందే . ఇక మార్గదర్శి చిట్ ఫండ్ వివాదంలో దేశవ్యాప్త ఖ్యాతిని సాధించారు ఆయన . 2004 నుంచి 2014 వరకు రెండు సార్లు పార్లమెంటు సభ్యుడిగా పదేళ్లు వున్న ఉండవల్లి వన్ మ్యాన్ షో పేరిట ప్రతి ఏడాది ప్రజల ముందు వార్షిక నివేదికను ఇస్తూ ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు .

స్టేట్స్ మెన్ గా రాణిస్తున్న ఉండవల్లి .....

విభజన తరువాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వుండాలని కాంగ్రెస్ నుంచి బహిష్కృతుడైన ఉండవల్లి నిర్ణయం తీసుకున్నారు. రాజకీయంగా తన ఉన్నతికి దోహదం చేసిన వై ఎస్ ఆర్ అంటే ఆయనకు ప్రాణం . ఆయన కుమారుడు జగన్ పార్టీలో చేరేందుకు సైతం ఆయన ఇష్ట పడలేదు. భవిష్యత్తులో సైతం ఏ పార్టీలోకి వెళ్లనని 60 ఏళ్ళ తరువాత ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగరాదని వైఎస్ కు తానే లేఖ రాసిన సంగతి ఆయన అదే విషయం చెప్పినది గుర్తు చేస్తూ వుంటారు ఉండవల్లి . రాజకీయాలపై ఆసక్తితో భూత, భవిష్యత్తు, వర్తమాన పరిస్థితులపై ఆయన తన స్పందనలు ఎప్పటికప్పుడు మీడియా తో పంచుకుంటూ హాట్ టాపిక్ లో వుంటారు .

Similar News