ఈసారి డిపాజిట్లు గల్లంతే...!

Update: 2018-02-21 14:30 GMT

అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో ఒంటరిపోరుకు ఆప్షన్స్ వెదుక్కుంటున్న భారతీయ జనతాపార్టీకి శుభశకునాలు కనిపించడం లేదు. జాతీయ సంస్థల ద్వారా బీజేపీ అధిష్టానం చేయించిన అంతర్గత సర్వేల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ భారీగానే నష్టపోనున్నట్లు స్పష్టంగా తేలింది. తెలంగాణలో అయిదు అసెంబ్లీ స్థానాలకు, ఒక లోక్ సభ స్థానానికి బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్ల సంఖ్య రెండుకు పడిపోవచ్చనేది సర్వే సారాంశం. లోక్ సభ లో బీజేపీకి తెలంగాణ నుంచి ప్రతినిధి ఎన్నిక కావడం దాదాపు సాధ్యం కాదని సెఫాలజీ నిపుణులు పేర్కొంటున్నారు. మొత్తమ్మీద గుండు సున్న మిగిలితే పార్టీకి కొత్తగా జవసత్తువలు కల్పించాలనుకుంటున్న మోడీ,అమిత్ షాలకు తెలుగు రాష్ట్రాల్లో చుక్కెదురు తప్పదు. అయితే రాష్ట్రస్థాయి నాయకులు వాస్తవాలను గుర్తించక బీరాలు పలకడం అధిష్టానానికి కూడా చికాకుగానే మారిందంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అవకాశాలను చెడగొట్టే దిశలో స్థానిక నాయకులు ప్రవర్తిస్తున్నారనే భావన అగ్రనాయకత్వంలో వ్యక్తమవుతోంది. ఏపీ విషయంలో టీడీపీని దూరం పెట్టినా వైసీపీ పూర్తిగా కలిసి వస్తుందని విశ్వసించడం సమంజసం కాదంటున్నారు. షరతులతో , అనధికార ఒప్పందాలతో వైసీపీ ముందుకు వస్తే అది బీజేపీకే నష్టదాయకమనేది రాజ్ నాథ్, అరుణ్ జైట్లీ వంటి నాయకుల అభిప్రాయంగా చెబుతున్నారు. మోడీ , అమిత్ షాలు మాత్రం ఈవిషయంలో పెద్దగా స్పందించడం లేదు.

అడకత్తెరలో హరిబాబు ....

ముఖ్యంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హరిబాబు అటు అధిష్టానం, ఇటు స్థానిక నాయకులు, మధ్యలో తెలుగుదేశంతో ఇరకాట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. టీడీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న బీజేపీ రాష్ట్ర నాయకులను అదుపు చేయాలని అమిత్ షా స్పష్టంగా హరిబాబును ఆదేశించారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి అందచేసిన నిధుల వివరాలను క్లియర్ గా వెల్లడించాలి. కానీ దాడి చేసే రీతిలో ఉండకూడదనేది షా సూచన. కానీ క్యాడర్ ఆ మాట వినడం లేదు. ముఖ్యంగా ఎమ్మల్యే, ఎమ్మెల్సీ స్థాయి నాయకులు కూడా టీడీపీని టార్గెట్ చేసుకుంటూ రాజకీయ విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీతో సన్నిహిత సంబంధాల కారణంగానే హరిబాబు కఠినవైఖరి తీసుకోలేకపోతున్నారనే భావన పార్టీ లోకల్ నాయకుల్లో వ్యాపించింది. సామాజిక సమీకరణలు కూడా అందుకు దోహదం చేస్తున్నాయి. అయితే అమిత్ షా సూచన, సలహాలతోనే ఆయన ముందుకు వెళ్లలేకపోతున్నారనేది సమాచారం. ఏదేమైనప్పటికీ పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షునిగా అతనికి మరికొంతకాలం గడ్డు పరిస్థితి తప్పకపోవచ్చు. అధిష్ఠానం స్పష్టమైన నిర్ణయం తీసుకుని ప్రకటించేవరకూ నలిగిపోక తప్పదు.

వెనకబాటులో వెంకయ్య పాత్ర?

గడచిన మూడున్నర సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వంలో సంకీర్ణ భాగస్వామిగా ఉన్నప్పటికీ బీజేపీ రాష్ట్రంలో పెద్దగా లాభపడిందేమీ లేదని నాయకులు చెబుతున్నారు. ఎక్కడా పార్టీ పుంజుకోలేదు. కొత్తగా క్యాడర్ ను నిర్మించుకోలేదు. పరాన్నభక్షిగానే తప్ప సొంతంగా పోటీచేసి గెలవగల సామర్థ్యాన్ని సంతరించుకోలేదు. ఈ విషయంలో విమర్శకులు వెంకయ్య నాయుడిపై వేళ్లు చూపిస్తున్నారు. కేంద్రమంత్రిగా వ్యవహరించిన వెంకయ్యనాయుడు బీజేపీని తెలుగుదేశం బీ టీమ్ గా తయారు చేశారని ఆరోపిస్తున్నారు. రాష్ట్రపర్యటన చేసిన ప్రతిసందర్బంలోనూ టీడీపీకి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. కేంద్రం చేసిన పనులు చెప్పడం కంటే ఏపీకి జరిగిన అన్యాయంపైనే ఆయన దృష్టి సారించడంతో టీడీపీకి అడ్వాంటేజ్ గా మారేవారు. చంద్రబాబునాయుడు, వెంకయ్య నాయుడు పరస్పర ప్రశంసలతో సరిపోయేది. ఈ కారణంతోనే బీజేపీ తన శాఖలను, క్యాడర్ ను అగ్రెసివ్ గా విస్తరించుకోలేకపోయింది. కాంగ్రెసు నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకున్న నలుగురైదుగురు బలమైన నాయకులు కూడా వెంకయ్య వైఖరితో నీరుగారిపోయారు. చంద్రబాబు వ్యతిరేకులను పార్టీలో సైతం వెంకయ్యనాయుడు ఎదగనీయరనే అపప్రధను మూటగట్టుకున్నారు. ఇది ఇప్పుడు పార్టీకి శాపంగా మారింది. టీడీపీతో పొత్తు విచ్ఛిన్నమైతే ఏరకంగా ముందుకు వెళ్లాలనే విషయంలో స్పష్టత లోపించింది.

క్యాడర్ లో గందరగోళం ...

రాష్ట్రప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న బీజేపీ నేతలు మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ భిన్నమైన వైఖరిని కనబరుస్తున్నారు. కామినేని పూర్తిగా తెలుగుదేశం మనిషిగా ముద్రపడిపోయారు. ఒకవేళ బీజేపీ టీడీపీకి దూరమైతే ఆయన కమలదళంలో కొనసాగుతారో లేదో కూడా తెలియని సందిగ్ధ పరిస్థితి. మరోవైపు మాణిక్యాల రావు తన పరిధిని విస్తరించుకోలేదు. మంత్రిగా పార్టీలో రాష్ట్రవ్యాప్తంగా జోష్ నింపే అవకాశమున్నప్పటికీ ఆయన లోకల్ లీడర్ గానే మిగిలిపోయారు. ప్రధానంగా పశ్చిమగోదావరి, మరీ ముఖ్యంగా తాడేపల్లి గూడానికే ఆయన పరిమితం. అవసరమైతే మంత్రివర్గానికి అయిదు నిముషాల్లో రాజీనామా చేస్తానన్న ఆయన ప్రకటన కూడా పెద్దగా స్పందన రాబట్టలేకపోయింది.ఇంతకీ అధిష్టానం టీడీపీతో కలిసి వెళ్లమంటుందా?వంటరి పోరాటానికి రంగం సిద్దం చేసుకోవాలా? స్ట్రాటజీ ఏమిటి? మరీ ఆలస్యం చేస్తే నష్టమే. మరింత బద్నాం అయ్యాక పొత్తు చెడిపోయినా ప్రజల్లోకి వెళ్లడం కష్టమని క్యాడర్ పేర్కొంటోంది. మొత్తమ్మీద ప్రస్తుతమున్న ఫ్లూయిడ్ సిచ్యువేషన్ కమలదళంలో కంగారు పుట్టిస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News