ఈవెంట్ పోయె...ఈసడింపులే మిగిలె..!

Update: 2017-11-21 15:30 GMT

సినీ తారల తళుకుబెళుకులతో భూనబోంతరాలు దద్దరిల్లేలా భారీ ఈవెంట్ నిర్వహిద్దామనుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రయత్నం వికటించింది. మొదటికే మోసం వచ్చింది. అప్పుల కుప్ప ఆంధ్రప్రదేశ్ తలపై మరో పదికోట్ల రూపాయల భారం పెట్టి బ్రహ్మండంగా చేద్దామనుకున్న నంది అవార్డుల ప్రదానోత్సవం పక్కదారి పట్టింది. ఎంపికే వెటకారాలకు దారితీసింది. పైకి చెప్పకపోయినా సినీపరిశ్రమలోని మెజార్టీ ప్రముఖులు, ప్రేక్షకులు సైతం అవార్డుల ఎంపిక ఏకపక్షంగా సాగిందంటూ ఎగతాళి చేయడం అవార్డుల గౌరవాన్ని మంటగలిపేసింది. రానివాళ్లు ఎలాగూ ఆవేదనలోనే ఉన్నారు. ఎంపికపై తలెత్తిన విమర్శలతో, విజేతల జాబితాలో తమ పేరు ఉన్నప్పటికీ చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితి తలెత్తింది. ఇదంతా ప్రభుత్వ తప్పిదమే అని చెప్పలేం. కానీ సర్కారీ వారు ఎంపిక చేసిన జ్యూరీ సభ్యుల నిర్వాకం ప్రభుత్వానికి తలవంపులు తెచ్చిపెట్టింది. అడ్డగోలుగా వారు సిఫార్సులు చేస్తే ముందు వెనకలు ఆలోచించకుండా అంతా తమవారికే అవార్డులు ఇచ్చేశారు కదా అని సంబరపడ్డారు సర్కారు పెద్దలు. కానీ రోజురోజుకీ రాజుకుంటున్న అసంతృప్తి, ప్రకటన జరిగి వారం గడిచినా సద్దుమణగని వివాదం ,సినీ పరిశ్రమలో రగిలిన కులకుంపటి ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయోజనాలనూ దెబ్బతీసే అవకాశం కనిపిస్తోంది.

స్వామిని మించిన భక్తి...

అధికారంలో ఉన్నవారిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా అనుచిత ప్రయోజనాలు పొందాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. సినిమా రంగంలో ఈ ధోరణి మరికొంచెం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ప్రభువును మించిన ప్రభుభక్తి ప్రదర్శించే వారికి ఈ రంగంలో కొరత లేదు. తాజాగా అవార్డుల ఎంపికలో ప్రభుత్వం సైతం అటువంటివారికే జ్యూరీలో అధిక ప్రాధాన్యం ఇచ్చింది. సినిమాల పట్ల సంతులనాత్మకంగా వ్యవహరించే సీనియర్లను విస్మరించి తెలుగుదేశం పార్టీ పట్ల సానుకూల వైఖరితో వ్యవహరించేవారికి పెద్ద పీట వేశారు. ప్రభువు మనసెరిగి ప్రవర్తించడంలో ఆరితేరిపోయిన వీరంతా కలిసి లెజెండ్ సృష్టించేశారు. తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి ఈవెంట్ మేనేజర్ గా మారిపోయిన బోయపాటి శ్రీనుకు , తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్న అనుబంధం జగమెరిగిన సత్యం. పుష్కరాల ఈవెంట్లు మొదలు, కృష్ణా సంగమ స్థలం వరకూ సినిమాటిక్ విభ్రమతో బోయపాటి చంద్రబాబు ఆదరణ చూరగొన్నారు. అదే సమయంలో బాలకృష్ణకూ అత్యంత ఆప్తుడిగా మారిపోయారు. దీంతో అసలు తెలుగు సినీ చరిత్రలో లెజెండ్ వంటి సినిమా రావడమే అరుదన్నట్లుగా బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ లోని సినిమాకు అవార్డుల పంట పండించేశారు. సాధారణంగా మూడు అంశాలను అవార్డుల ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు. ఒకటి సమాజానికి మంచి సందేశం అందించి ప్రజలకు మార్గనిర్దేశం చేయడం, రెండో అంశం బహుళ ప్రజాదరణతో మాస్ ఎంటర్ టైనర్ గా నిలవడం, మూడు జీవన తాత్వికతను ఆవిష్కరించడం.. వీటన్నిటిలోనూ కనిపించే సృజనాత్మకత. ఇలా ప్రాథమికమైన అంశాలను ఏ జ్యూరీ అయినా దృష్టిలో పెట్టుకుంటుంది.

ఎక్కడ తప్పు జరిగింది...?

సృజనాత్మకతతో ముడిపడిన ప్రాథమిక అంశాలను లెజెండ్ విషయంలో పక్కనపెట్టి నిర్ణయం తీసుకోవడం విమర్శలకు కారణమైంది. లెజెండ్ చిత్రం విజయవంతమైన సినిమా అనడంలో ఎవరికీ సందేహం లేదు. కానీ ఈ సినిమాలో సందేశం కంటే హింసకే ఎక్కువ చోటు దక్కింది. వసూళ్ల రికార్డు పరంగా ఆ ఏడాది మాస్ ఎంటర్ టైనర్ గా కూడా నిలవలేదు. జీవన తాత్వికతను బోధించిన సినిమాల వైపు కనీసం కన్నెత్తి చూడలేదు. మొత్తం అవార్డులన్నిటినీ లెజెండ్ కే కట్టబెట్టాలని ముందస్తుగానే ఒక అంచనాకు వచ్చారన్నట్లుగా తొమ్మిది అవార్డులను ఒక్క సినిమాకే కట్టబెట్టారు. జ్యురీ సభ్యులు తమ విచక్షణను మరిచి ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇటువంటి అహేతుకమైన నిర్ణయం తీసుకున్నట్లు సామాన్య సినీ ప్రేక్షకునికి కూడా అర్థమై పోతుంది. జరిగిన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఉంటే అందుకు చర్యలు తీసుకోవాలి. లేదంటే మౌనం వహించాలి. కానీ వస్తున్న విమర్శలపై తెలుగుదేశం పార్టీ వర్గాలు, ఒక సామాజిక వర్గపు చిత్ర ప్రముఖులు స్పందిస్తున్న తీరు అగ్నికి ఆజ్యం పోస్తోంది.

ప్రభుత్వాధినేత పశ్చాత్తాపం...చినబాబు ఆవేశం

అవార్డుల పరిస్థితి ఇలా ఎందుకయ్యిందంటూ ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడు పశ్చాత్తాప పడినట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో కులం రంగు పులిమారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు కూడా ప్రచారంలోకి వచ్చింది. నూటికి నూరుపాళ్లు నిజాయతీగా అవార్డులు ప్రకటించి ఉంటే ఒకే కులానికి వచ్చినా విమర్శకుల నోళ్లకు ప్రజాభిమానం తాళం వేసేది. కానీ వస్తున్న విమర్శల్లో వాస్తవం ఉండటంతో కులం రంగు పులిమినా కాదనలేని , కడుగుకోవడం సాధ్యం కాని మకిలం అంటుకుంది. కొత్తగా ఏర్పడిన ఆంధ్ర్రప్రదేశ్ లో అందరినీ కలుపుకుని పోవడమనేది ప్రాథమిక బాధ్యత. అందుకు ఎటువంటి అవకాశం వచ్చినా వినియోగించుకోవాల్సిన ప్రభుత్వం అయిన వాళ్లకే అన్నీ కట్టబెడితే మొదటికే మోసం రావడం ఖాయం. తాజా సినీ అవార్డుల సంచలనం ఇదే ఉదంతాన్ని స్సష్టం చేస్తోంది. నారా లోకేశ్ చేసిన విమర్శలు కూడా అపరిపక్వతను బయటపెడుతున్నాయి. నంది అవార్డులను నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ విమర్శిస్తున్నారంటూ ఆయన చేసిన విమర్శ బూమ్ రాంగ్ అయ్యింది. హైదరాబాదులోనే నివాసం ఉంటున్న లోకేశ్ నాన్ రెసిడెంటు కాదా? అనే విమర్శలు తలెత్తుతున్నాయి. పైపెచ్చు తెలుగు సినీ రంగానికి ఆంధ్రా, తెలంగాణ , హైదరాబాదు భేదాలు లేవు. ఆ మాత్రం ఆలోచన చేయకుండా విమర్శలు చేయడం వల్ల ప్రభుత్వమే ఈ అవార్డుల జాబితాను రూపొందించిందనే అపోహకు ఆస్కారం ఏర్పడుతుంది. చినబాబు మాటలతో వివాదం ప్రభుత్వం తలకు చుట్టుకున్నట్లయింది. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించి అవార్డులు ఇస్తే బాగుండును అన్న చంద్రబాబు వ్యాఖ్యలు కూడా సరైనవి కావు. సగటు ప్రేక్షకుడు మాస్ హిస్టీరియాతో ఊగిపోయే సినిమాలకు పట్టం గట్టడం కాదు అవార్డుల పరమార్థం. ఉత్తమాభిరుచితో కళాత్మక విలువలను జోడించే చిత్రాలకు గుర్తింపు నివ్వడం అవార్డులకు సార్థకత చేకూరుస్తుంది. దశాబ్దాలుగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నా ఆస్కార్ వంటి అవార్డులు ఎందుకు విమర్శల పాలవ్వడం లేదు? కేవలం నిష్పాక్షిక దృష్టితో ఎంపికలు చేసే జ్యురీ కారణంగానే. పాలకపార్టీల అనుయాయులతో నింపకుండా న్యాయనిర్ణేతలను ఎంపిక చేస్తే భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కావు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News