ఈక్వేషన్స్ ఇబ్బందికరమే...!

Update: 2018-01-29 16:30 GMT

భారతీయ జనతాపార్టీకి రాజకీయ సమీకరణలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఏడునెలల క్రితం వరకూ పాజిటివ్ టాక్ తో, బలోపేతమైన శక్తిగా ఉన్న బీజేపీ బలహీనతలు క్రమేపీ బయటపడుతున్నాయి. కనుచూపుమేరలో కాంగ్రెసు పార్టీ బీజేపీని ఢీకొనే పరిస్థితులు కనిపించని స్థితి నుంచి ప్రధాన ప్రతిపక్షం అనూహ్యంగా పుంజుకుంటున్నవాతావరణం నెలకొంటోంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీ ఇమేజ్ ఆధారంగా బీజేపీ చాలా లాభపడింది. మోడీ ప్రాబల్యం కొంత తగ్గుముఖం పట్టడంతో దాని ప్రబావం బీజేపీపై పడుతోంది. నిన్నామొన్నటివరకూ రాహుల్ , ప్రదానిమోడీకి ఏరకంగానూ పోటీదారు కాదు, సమఉజ్జీ కాడు అని నెలకొన్న భావన క్షీణిస్తోంది. మోడీ ఇన్ ఫ్లూయన్స్ కొద్దికొద్దిగా తగ్గుతుంటే దాదాపు రెట్టింపు రేటింగుతో రాహుల్ పైకి ఎగబాకుతున్నాడు. వీరిరువురి మధ్య ప్రజాదరణలో అంతరం చాలా ఉన్నప్పటికీ మోడీతో ముఖాముఖిగా దేశ నాయకత్వానికి పోటీ పడే సామర్థ్యం రాహుల్ కు ఉందని విశ్వసించే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. లోక్ మత్ , సీఎస్డీఎస్, ఏబీపీ నిర్వహించిన సర్వేలో వెల్లడైన అంతర్గత అంచనా ఇది. 2017 మే నెలలో ఈ సంస్థలు నిర్వహించిన సర్వేలో ప్రధాని అభ్యర్థిగా మోడీకి 44 శాతం మంది మద్దతు తెలపగా రాహుల్ కు 9 శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. కానీ తాజాగా నిర్వహించిన సర్వేలో మోడీ రేటింగు 37 శాతానికి పడిపోయింది. రాహుల్ రేటింగు 20 శాతానికి పెరిగింది. మరో అయిదారు శాతం రాహుల్ ప్రాచుర్యం పెరిగి, మోడీ పాయింట్లు నాలుగైదు శాతం తగ్గితే ఇరువురికి ప్రజాదరణ సమానమే అన్న ప్రచారానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇంకా ఎన్నికలకు ఏడాది కాలవ్యవధి ఉండటంతో కాంగ్రెసు నాయకులు ఈ సర్వేను ప్రాతిపదికగా చూపిస్తూ తమ నేత మరింత పుంజుకొంటారనే ఆశాభావంతో ఉన్నారు.

ఉత్తరాన క్షీణించిన ఉత్సాహం...

2014 ఎన్నికల్లో ఉత్తరభారతదేశాన్ని బీజేపీ స్వీప్ చేసింది. ఈ పార్టీ ఖాతాలో జమ అయిన స్థానాల్లో దాదాపు సగం వరకూ సీట్లు ఉత్తరప్రదేశ, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచలప్రదేశ్, జేఅండ్ కే ల నుంచి లభించాయి. 2019 లో మాత్రం ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే 25 వరకూ సీట్లను బీజేపీ కోల్పోనున్నట్లు అంచనా. ఢిల్లీ, హర్యానా లలోనూ భారీగానే సీట్ల కోత తప్పదని అభిప్రాయం. ఈ రకమైన అంచనాలు బీజేపీకి ఆందోళన కలిగిస్తుంటే ప్రతిపక్ష కాంగ్రెసు శిబిరంలో ఉత్సాహం నింపుతున్నాయి. అయితే బీజేపీ సీట్లు కోల్పోతున్నప్పటికీ కాంగ్రెసు పార్టీ మాత్రం ఆమేరకు భారీగా లాభపడే సూచనలు లేకపోవడం ఈ సర్వేల విశేషం. ఉత్తరాదిన ఉన్న 151 సీట్లకు గాను ఈ సారి బీజేపీ సారథ్యం వహిస్తున్న ఎన్డీఏ బలం 106 కి పరిమితం కావచ్చనేది అంచనా. అయితే కాంగ్రెసు నేతృత్వం వహిస్తున్న యూపీఏ బలం ఇక్కడ గరిష్టంగా 16 మాత్రమే. అయితే యూపీలో ఎస్పీ, బీఎస్పీ వంటి పార్టీలతో జట్టు కడితే సీట్ల సంఖ్య రెండు రెట్లు పెరిగే సూచనలున్నాయంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో మోడీ పర్ఫార్మెన్స్ గ్రాఫ్ కూడా భారీగా పడిపోయింది. గతంలో 64 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా, తాజాగా వీరి సంఖ్య 51 శాతానికి పడిపోయింది. అయినప్పటికీ..స్టిల్.. మోడీనే మెజార్టీ అభిమానం చూరగొంటూ ఉండటం గమనార్హం.

తూర్పులో తగ్గుముఖం...

తూర్పు రాష్ట్రాలైన బీహార్, ఝార్ఖండ్, పశ్చిమబంగ, ఒడిషా లలో కూడా 2014 ఫలితాల కంటే బీజేపీ, ఎన్డీఏ ప్రాధాన్యం తగ్గుతుందనేది అంచనా. ఆయా రాష్ట్రాల్లోని 142 లోక్ సభ స్థానాలకు గాను ఎన్డీఏ 70 వరకూ గెలుచుకోవచ్చని సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఇక్కడ యూపీఏ బలం 20 కి పరిమితం కావచ్చనేది సర్వేక్షకుల అభిప్రాయం. ఇక్కడ తృణమూల్, బిజూజనతాదళ్ వంటి బలమైన పార్టీలు బరిలో ఉండటం వల్ల ఎన్డీఏ,యూపీయేతర పక్షాల బలం 56 సీట్ల వరకూ ఉండవచ్చు. ఇక్కడ కూడా యూపీఏ, ఇతరపక్షాల బలం కంటే ఎన్డీఏ దే ఆధిక్యం అని చెప్పవచ్చు. అయితే 2014 ఎన్నికలతో పోలిస్తే మాత్రం సీట్ల సంఖ్యలో కోత పడుతోంది. నితీశ్ నేతృత్వంలోని జేడీయూ బీజేపీతో జట్టుకట్టడం వల్ల పూర్తిగా దెబ్బతినకుండా ఎన్డీఏ బ్యాలెన్సు చేసుకోగలుగుతున్నట్లు సర్వే పసిగట్టింది. ప్రధానిగా మోడీ పై ప్రజల్లో సంతృప్తి శాతం సగటున 55 శాతం వరకూ ఇక్కడ కనిపిస్తోంది. పశ్చిమబంగ, ఒడిషాలలో ఇది 40 శాతానికి పరిమితమైంది.

దక్షిణాన దయాదాక్షిణ్యాలే ...

తమిళనాడు, కేరళ, తెలంగాణ, , కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి వంటి దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రాబల్యం శూన్యం. యూపీఏ, ఎన్డీఏ కంటే ఆధిక్యం నిరూపించుకునే రాష్ట్రాలివే. ఇక్కడ ఉన్న 132 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి బలం 35 వరకూ ఉండవచ్చని అంచనా. మిత్రపక్షమైన తెలుగుదేశాన్ని ఇందులో కలిపి చూడాలి. యూపీఏ బలం ఈ రాష్ట్రాల్లో 65 వరకూ ఉండొచ్చని సర్వే నిర్ధారిస్తోంది. ఇందులో డీఎంకే బలాన్ని కూడా కలిపి చూడాలి. టీడీపీతో బీజేపీ పొత్తు చెడితే ఎన్డీఏ పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. కర్ణాటకను మినహాయిస్తే మిగిలిన రాష్ట్రాల్లో పొత్తులు, మిత్రపక్షాల బలం మీదనే బీజేపీ గెలుపు ఆధారపడి ఉంటుంది. 2014 నాటి పరిస్థితే 2019లో కూడా కొనసాగుతుందని అంచనా. మోడీ గ్రాఫ్ దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా పడిపోయింది. గతంలో ఈ రాష్ట్రాల్లో 46 శాతం మంది మోడీ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తే ఇప్పుడు వీరి శాతం 35 శాతానికి పడిపోయింది. బీజేపీ, మోడీ ఇక్కడి రాజకీయాలను శాసించగలస్థాయి ఇప్పట్లో సాధ్యం కాదని సర్వే ఫలితాలను బట్టి అర్థం చేసుకోవచ్చు.

పశ్చిమాన భంగపాటు?

గుజరాత్, మహారాష్ట్ర, గోవా వంటి పశ్చిమ భారత రాష్ట్రాల్లో 80 స్థానాల వరకూ ఎన్డీఏ కిట్టీలో పడతాయని అంచనా. ఇక్కడ యూపీఏ బలం 35 వరకూ మాత్రమే ఉంటుందని సర్వే పేర్కొంటోంది. శివసేనతో కలిపి ఎన్డీఏ లోక్ సభ స్థానాలను లెక్కగట్టారు. రాజకీయ వాతావరణం రోజురోజుకీ మారుతున్న పరిస్థితుల్లో శివసేన బీజేపీపై కక్ష గట్టినట్లు మాట్టాడుతోంది. తాను నష్టపోయినా ఫర్వాలేదు, బీజేపీని దెబ్బతీయాలన్నంత కసి శివసేన అగ్రనాయకత్వంలో కనిపిస్తోంది. అదే జరిగితే ఇప్పటి సర్వే ఫలితాలు పూర్తిగా రివర్స్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. గుజరాత్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఫలితాలతో మదింపు చేసుకుంటే కాంగ్రెసు, బీజేపీకి సమ ఉజ్జీగా నిలవనున్నట్లు స్పష్టమవుతోంది. 2014 లో ఈ రాష్ట్రంలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడా పరిస్థితి లేదు. మొత్తమ్మీద పశ్చిమాది రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏకి ఏమంత సానుకూల వాతావరణం కనిపించడం లేదు. ఏతావాతా 2019 లో మోడీ, అమిత్ షా ద్వయం ఎన్నికల పరీక్షలో ఎదరీదక తప్పదనేది పరిశీలకుల అభిప్రాయం.

 

- ఎడిటోరియల్ డెస్క్

Similar News