ఈ సీఎంకు చెమటలు పడుతున్నాయే...!

Update: 2017-12-04 16:30 GMT

గుజరాత్ లోని అత్యంత కీలక నియోజకవర్గాల్లో రాజ్ కోట్ (పశ్చిమ) ఒకటి. ఇది ఒక రకంగా ప్రముఖుల నియోజకవర్గం కూడా. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో అందరి దృష్టి దీనిపైనే కేంద్రీకృతమైంది. తొలి దశలో భాగంగా ఈనెల 9న ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ అభ్యర్ధిగా స్వయంగా ముఖ్యమంత్రి విజయ్ రూపానీ బరిలోకి దిగగా, కాంగ్రెస్ పార్టీ వ్యాపార దిగ్గజం ఇంద్రనిల్ రాజ్ గురు ఆయనను ఢీకొంటున్నారు. నిజానికి ఇద్దరునాయకులూ ఈ నియోజకవర్గానికి కొత్త. రాజ్ కోట్ (ఈస్ట్) ఎమ్మెల్యే అయిన రాజ్ గురును బలమైన అభ్యర్ధిగా భావించిన కాంగ్రెస్ పార్టీ ఆయననున ఇక్కడ బరిలోకి దింపింది. ఇక రూపానీ కూడా కొత్తే అని చెప్పవచ్చు. 2014 లో సిట్టింగ్ ఎమ్మెల్యే వాజూభాయ్ వాలా కర్ణాటక గవర్నర్ గా నియమితులు కావడంతో రూపానీ ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి ఆనందీ బెన్ పటేల్ మంత్రి వర్గంలో చేరారు. రవాణా, తాగునీటి సరఫరా శాఖలను నిర్వహించిన ఆయన హార్థిక్ పటేల్ రిజర్వేషన్ ఉద్యమంతో ఏకంగా సీఎం అయ్యారు.

కాషాయదళానికి కోట....

రాజ్ కోట్ (వెస్ట్) నియోజకవర్గం అత్యంత ప్రముఖుల నియోజకవర్గం. కాషాయదళానికి కోట వంటిది. గత మూడు దశాబ్దాలుగా కమలం ఇక్కడ విజయకేతనం ఎగురవేస్తుంది. ముగ్గురు బీజేపీ ముఖ్యమంత్రులను అందించింది ఈ నియోజకవర్గం. 1985లో ఇక్కడి నుంచి ఎన్నికైన కేశూభాయ్ పటేల్ అనంతర కాలంలో ముఖ్యమంత్రి అయ్యారు. 2002లో గుజరాత్ పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోడీ ఇక్కడి నుంచే ఉప ఎన్నికల బరిలోకి దిగి శాసనసభ్యుడయ్యారు. అప్పటి వరకూ ఆయన పార్టీ పదవుల్లోనే ఉన్నారు. అనంతర కాలంలో మోడీ తన స్వస్థలమైన మాణినగర్ నియోజకవర్గానికి మారారు. ఈ నియోజకవర్గానికి సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించిన వాజూ భాయ్ వాలా స్పీకర్ గా, రాష్ట్రమంత్రిగా పనిచేశారు. 18 బడ్జెట్ లను సమర్పించిన వ్యక్తిగా వాజూభాయ్ వాలా రికార్డు సృష్టించారు. రాజ్ కోట్ పూర్తిగా పట్టణ ప్రాంత నియోజకవర్గం. రాజ్ కోట్ సౌరాష్ట్రలోని ప్రధాన నగరం. 2009లో నియోజకవర్గాల పునర్వ్యస్థీకరణ అనంతరం ఇది ఏర్పడింది. వ్యాపారులు, ఉద్యోగులు, పారిశ్రామికవేత్తల ప్రభావం ఎక్కువ. ప్రధాన ఓటు బ్యాంకు వారిదే. సంప్రదాయంగా వీరు బీజేపీ మద్దతుదారులు. 2014 ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అయిన ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, కాంగ్రెస్ అభ్యర్ధి జయంతీ భాయ్ కలాథియాపై 23 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు.ఇది తక్కువ మెజారిటీ ఏమీ కాదు.

సౌకర్యాలు బాగానే ఉన్నా....

మౌలిక సౌకర్యాల పరంగా చూస్తే నియోజకవర్గంలో పరిస్థితి బాగానే ఉంది. రవాణా, తాగునీటి పరంగా పెద్దగా ఇబ్బందులు లేవు. రాజధాని అహ్మదాబాద్ సహా నగరాలకు ఇక్కడి నుంచి చక్కటి రహదారి సౌకర్యం ఉంది. నర్మదా కెనాల్ ద్వారా నగరానికి తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. ఆకర్షణీయ నగరాల కింద రాజ్ కోట్ ను ఎంపిక చేయడంతో భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు సమకూరుతాయని భావిస్తున్నారు. సౌకర్యవంతమైన విమానాశ్రయం ఉంది. నగరానికి ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) తీసుకు వస్తానని ముఖ్యమంత్రి రూపానీ చెబుతున్నారు.

గెలుపు అంత ఈజీ కాదు...

రాజకీయంగా చూస్తే రూపానీకి, బీజేపీకి గతంలోలా ఇక్కడ గెలుపు అంత తేలిక కాదన్న అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అధికారం, హంగు, ఆర్భాటంతో పాటు, రాజకీయంగా పూర్తి స్థాయిలో 2014 ఉప ఎన్నికల సమయంలో దృష్టి కేంద్రీకరించినప్పుడే బీజేపీ అభ్యర్ధి విజయ్ రూపానీ 23 వేల మెజారిటీకి మించలేదు. బలమైన కాంగ్రెస్ అభ్యర్థి, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలో బీజేపీకి నల్లేరు మీద నడక కాదన్నది విశ్లేషకుల వాదన. అభ్యర్థుల పరంగా చూస్తే రూపానీ స్వభావరీత్యా సాత్వికుడు. వివాదాస్పదుడు కానే కాదు. అయితే బలహీనమైన నాయకుడన్న పేరుంది. పార్టీ సంస్థాగత పనుల్లో క్రియాశీలకమైనప్పటికీ, ప్రజాక్షేత్రంలో పలుకుబడి తక్కువే. ఒకప్పటి బర్మా... ప్రస్తుత మయన్మార్ లో జన్మించిన రూపానీ, ఆయన కుటుంబం అక్కడి నుంచి రాజీకీయ అస్థిరత కారణంగా 1960లో ఇక్కడకు వలస వచ్చింది. జైన్ కుటుంబంలో జన్మించిన రూపానీ న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. సంస్థాగత పదవులతో పాటు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2006-2012 మధ్య రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. నగరానికి అన్ని సౌకర్యాలున్నాయని హైకోర్టు బెంచ్, ఎయిమ్స్ సాధనే తన లక్ష్యమని చెబుతున్నారు. రూపానీ స్టాక్ బ్రోకర్ గాకూడా పనిచేశారు.

కాంగ్రెస్ గట్టి పోటీ....

ముఖ్యమంత్రిని ఓడించి బీజేపీ పునాదుల మూలాలను దెబ్బ తీయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ వ్యాపార దిగ్గజమైన ఇంద్రనిల్ రాజ్ గురును బరిలోకి దించింది. 2012 ఎన్నికల్లో ఆయన పక్కనే ఉన్న రాజ్ కోట్ (ఈస్ట్) నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రూ.141 కోట్ల ఆస్తులను ప్రకటించిన రాజ్ గురు రాష్ట్రంలోనే అత్యంత సంపన్నమైన అభ్యర్థి. గతంలో కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చారు. గుర్రపు స్వారీ, ట్రెక్కింగ్, కార్ల ర్యాలీలు నిర్వహించడం ఆయన హాబీలు. మోడీ గతంలో ప్రారంభించిన ‘చాయ్ పే చర్చా’ కార్యక్రమానికి పోటీగా ‘కాఫీ క్లబ్’ పేరుతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజలను కాఫీ క్లబ్ పేరుతో చర్చకు ఆహ్వానిస్తున్నారు. 55 సంవత్సరాల రాజ్ గురు పోటీని సవాల్ గా తీసుకుని పనిచేస్తున్నారు. సుమారు మూడు లక్షల ఓటర్లు గల నియోజకవర్గంలో పాటీదార్లు, బ్రహ్మణ ఓటర్లు లక్ష మంది వరకూ ఉండొచ్చని అంచనా. రిజర్వేషన్ల ఉద్యమం కారణంగా పాటీదార్లు బీజేపీకి దూరమయ్యారన్న ప్రచారం ఉంది. రాజ్ గురు బ్రాహ్మణ వర్గానికిచెందిన వారు కావడంతో ఈ నియోజకవర్గంలో పోటీ నువ్వా...నేనా అన్నట్లుంది.

 

-గుజరాత్ నుంచి ‘తెలుగుపోస్ట్’ ప్రత్యేక ప్రతినిధి

Similar News