ఈ సంకేతం...ఏ సందేశం...?

Update: 2017-11-07 16:30 GMT

తన చేతలు, చర్యలతో దేశాన్ని, ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసే ప్రధాని నరేంద్రమోడీ తాజా చెన్నై పర్యటన రాజకీయ సంచలనంగా మారింది. దక్షిణాది అధికార సమీకరణల్లో , ఎత్తుగడల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోబోతున్నాయన్న సంకేతాలు వెలువడ్డాయి. దేశంలోనే సీనియర్ రాజకీయవేత్త ద్రవిడమున్నేట్ర కజగం అధినేత కరుణానిధిని ఇంటికెళ్లి మరీ పరామర్శించారు ప్రధాని. ఢిల్లీలో మా ఇంటికొచ్చి విశ్రాంతి తీసుకోరాదూ అంటూ ఆత్మీయాప్యాయతల కలబోతగా చేతిలో చెయ్యి వేసి మరీ ఆహ్వానించారు. ఒకవైపు ఏఐఏడీఎంకే తో మైత్రి నెరపుతూనే ఇంకోవైపు డీఎంకేకి స్నేహహస్తం అందించేందుకు ప్రధాని చూపిన చొరవ యావత్ భారతదేశంలోనే కొత్త కలయికలకు నాంది కాబోతుందన్న ఊహాగానాలకు తెర లేపింది. అటు బీజేపీ, ఇటు డీఎంకే ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం లేదంటూ తోసిపుచ్చినప్పటికీ అంతుచిక్కని ఆంతర్యం దాగి ఉందని రాజకీయ వర్గాలు బావిస్తున్నాయి. నిజానికి తమిళనాడులో రెండు ప్రధాన పార్టీలు శత్రుశిబిరాల్లా వ్యవహరిస్తుంటాయి. ప్రత్యర్థి పార్టీల నేతల మధ్య బంధుత్వాలు కలుపుకోవడానికి ఇష్టపడరు. ప్రత్యర్థుల వివాహ వేడుకలకు కూడా హాజరుకారు. అంతటి రాజకీయవైరాన్ని ప్రదర్శిస్తారు. ఇదంతా పక్కనపెట్టి మోడీ డీఎంకే ఇంటిపెద్ద ఇంట అడుగుపెట్టారు. ఇదే జయలలిత బతికుంటే బీజేపీతో కటీఫ్ అయిపోయి ఉండేదే. అసలు ఆమే ఉంటే మోడీ ఇంతటి సాహసం చేసేవారు కాదు. ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితులు మోడీని ప్రత్యర్థి శిబిరం వైపు నడిచేలా చేస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.

ఎంత తోసినా కదలని ఏఐడీఎంకే రథం...

తమిళనాట ఏఐఏడీఎంకే ప్రబుత్వం కొనసాగుతున్నా అసలు రాష్ట్రంలో పరిపాలన ఉందని ఎవరూ అనుకోవడం లేదు. ఉందో లేదో తెలియని మెజార్టీని కాపాడుకోవడం, వర్గాల మధ్య సర్దుబాట్లు చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా పాలన సాగుతోంది. కేంద్రం అండగా నిలవకుంటే ఇప్పటికే ప్రభుత్వం కుప్పకూలిపోయేది. ప్రధానప్రతిపక్షమైన డీఎంకే కి సువర్ణావకాశం లభించేది. డీఎంకే తన ఆగర్భశత్రువు కాంగ్రెసు శిబిరంలో ఉండటంతో ఏఐఏడీఎంకే సర్కారును కాపాడుకోవడం తన కర్తవ్యంగా భావించారు మోడీ. అందుకే బలపరీక్షకు అవకాశం ఇవ్వకపోవడం, అవిశ్వాసం నోటీసులను తోసిపుచ్చడం, గవర్నరు రూపంలో ప్రభుత్వానికి బేషరతు మద్దతుగా నిలవడం సాగుతున్నాయి. కానీ ఎంతగా సహకరించినా రాష్ట్ర ప్రబుత్వం ముందుకు కదలడం లేదు. ప్రజల్లోకి వెళ్లడం లేదు. ఈ విషయం ఢిల్లీ పెద్దలకు స్పష్టమైపోయింది. రజనీకాంత్ వంటి సూపర్ స్టార్లను తెరపైకి తెద్దామన్న ప్రణాళిక కూడా పారలేదు. ఇంకో వైపు కమలహసన్ వంటి బీజేపీ వ్యతిరేకశక్తులు కొత్త పార్టీ సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తన రాజకీయాసక్తులు కాపాడుకోవాలంటే భవిష్యత్తున్న పార్టీతో కలిసి నడవడమే మేలన్న అంచనాకు కమలనాథులు వచ్చేశారు.ఇందులో బాగంగానే కరుణానిధికి మోడీ పలకరింపు, పరామర్శలను చూడాలి. ప్రభుత్వం కొనసాగుతున్నప్పటికీ ఎన్నికలొస్తే జనంలోకి వెళ్లి ఓట్లు తీసుకురాగల సామర్థ్యం ఏఐఏడీఎంకే లోని ఏ ఒక్క నాయకునికి లేదన్న విషయం మోడీ గ్రహించారు. ఇక మిగిలిన ప్రత్యామ్నాయం డీఎంకే మాత్రమే. అందువల్లనే అడుగులు అటువైపు పడుతున్నాయి. మోడీ కలిసిన తర్వాత డీఎంకే విధానపరమైన నిర్ణయాల్లోనూ మార్పులు వచ్చేస్తున్నాయి. ఎనిమిదో తారీఖున యాంటీ డీమోనిటైజేషన్ డే జరిపి భారీఎత్తున ఆందోళనలు, ధర్నాలు నిర్వహించాలనుకున్న డీఎంకే ఆ ఆలోచనను విరమించుకుంది. చెన్నైలో వరదలు, ఇతరత్రా సాకులు చెబుతున్నప్పటికీ అవేమీ సరైన కారణాలు కాదు. కేంద్రం స్నేహ హస్తం అందిస్తున్నప్పుడు విసిరికొట్టడం భావ్యం కాదనే భావనతోనే డీఎంకే కేంద్రప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాన్ని పక్కనపెట్టేసింది.

విశ్వాసపాత్రమైన పార్టీ....

కేంద్రంలో ఎవరితో చేతులు కలిపినప్పటికీ డీఎంకే విశ్వాసపాత్రంగానే ప్రవర్తిస్తుందనేది రుజువైన సత్యం. వాజపేయి పాలన కాలంలో ఏఐఏడీఎంకే ఒకసారి దెబ్బతీసింది. 1999లో వాజపేయి ప్రభుత్వం కుప్పకూలడానికి ఆ పార్టీయే కారణం. ఆ తర్వాత మిత్రపక్షంగా చేరిన డీఎంకే కేంద్రాన్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. చీటికీమాటికీ బెదిరింపులు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడపలేదు. తనపనులు, రాజకీయ అవసరాలు నెరవేర్చుకుంటూ కేంద్రానికి సహకరించింది. యూపీఏలో కాంగ్రెసుతో జత కూడినప్పుడూ బలమైన మిత్ర బంధాన్ని నిలబెట్టుకుంది డీఎంకే. ఎన్నెన్నో కేసుల్లో పార్టీ నేతలు కేంద్ర దర్యాప్తు బృందాల కేసులను ఎదుర్కొన్నారు. కరుణానిధి కుమార్తె కణిమొణి సహా జైళ్లపాలయ్యారు. అయినా కేంద్రప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోలేదు. జయలలిత మరణానంతరం ప్రజాక్షేత్రంలో బలమెంతో తెలియని ఏఐఏడీఎంకేను నమ్ముకోవడం కంటే నమ్మకమైన నేస్తంగా నిలిచే డీఎంకేకు చేరువ కావడమే మంచిదని మోడీ కూడా భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఉత్తరాదిన బీజేపీ బలం తగ్గుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2014 ఎన్నికల్లో ఉత్తరభారతంలో బీజేపీ గరిష్టంగా సీట్లు సాధించింది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. అందువల్ల కేంద్రంలో అధికారం దక్కాలంటే దక్షిణాదిన బలం పెంచుకోవాల్సిందే. కర్ణాటకలో బీజేపీ గరిష్టంగా సీట్లు సాధించవచ్చని అంచనా వేస్తోంది. ఆంధ్ర్రప్రదేశ్ లో సంకీర్ణప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్ పరోక్షంగా మద్దతు ఇస్తోంది. కేరళలో ఇప్పటికిప్పుడు రాజకీయంగా ప్రాబల్య శక్తిగా మారడం సాధ్యం కాదు. దక్షిణభారతంలో పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో 39లోక్ సభ స్థానాలున్నాయి. బలమైన పక్షంతో చేతులు కలిపితే బీజేపీకి భారీగానే లబ్ధి చేకూరుతుంది.మోడీ డీఎంకే తలుపు తట్టడం ఈదిశలో పడిన తొలి అడుగుగా చెప్పుకోవాలి.

వాజపేయి బాటలో..

సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపటంలో వాజపేయిది ఒక అరుదైన ముద్ర. భిన్నమనస్తత్వాలు, విభిన్నమైన డిమాండ్లు, ప్రాంతీయపక్షపాతాలు, అహంకార దోరణులు, వారసత్వ ఒత్తిడుల వంటి సవాలక్ష అవలక్షణాలతో కూడిన రీజనల్ పార్టీలతో కలిసి కాపురం చేస్తూ అన్ని పక్షాలను సమన్వయం చేసుకున్నారాయన. అందుకే మితవాద, అతివాద తేడాలు లేకుండా ప్రధానిగా వాజపేయికి అందరూ మద్దతు ఇచ్చారు. ఏఐఏడీఎంకే తలబిరుసుతో 1999 లో మద్దతు ఉపసంహరించుకుని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కుప్పకూల్చినా ....ఆ స్థానాన్ని డీఎంకే భర్తీ చేసింది. ఈ మేరకు జాతీయ రాజకీయాల్లో తనపాత్రను ఏఐఏడీఎంకే కోల్పోయింది. తాజాగా డీఎంకేను మళ్లీ ఎన్డీఏ గూటిలోకి తేవడానికి మోడీ సంకేతాలిస్తున్నారు. నిజానికి జయలలితతో మోడీకి మంచి స్నేహపూర్వక సంబంధాలుండేవి. కానీ పార్టీగా ఏఐఏడీఎంకే భవిష్యత్తు ఎన్నికల్లో కీలకం కావడం కష్టమని గ్రహించారు. ప్రతిపక్షాన్ని దువ్వుతున్నారు. ప్రస్తుతం ఎన్డీఏ గూటిలో అనేక రాజకీయ పక్షాలున్నప్పటికీ నిర్ణయాల విషయంలో మోడీ ఏకపక్షంగా ప్రవర్తిస్తుంటారు. తాను అనుకున్నది చేస్తుంటారు. ఇప్పుడు డీఎంకేని చేరదీయడం ఈ ధోరణికి పూర్తిభిన్నంగా చూడాల్సి ఉంటుంది. దీర్ఘకాల రాజకీయాల్లో భారత్ వంటి పెద్ద దేశానికి నాయకత్వం వహించాలంటే పెత్తందారీ వైఖరి కంటే కలుపుకొని పోవడమే మేలు. ఈ దిశలోకి మళ్లినప్పుడే బీజేపీ నిజమైన జాతీయ పక్షంగా నిలుస్తుంది. వ్యక్తిగతంగా ప్రధానికి కూడా దేశరాజకీయాల లోతు అర్థమవుతుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News