ఈ రాష్ట్రంలో మహిళలకు టిక్కెట్లు లేవ్....!

Update: 2018-02-19 17:30 GMT

అవనిలో సగం...అవకాశాల్లో సగం అందమైన నినాదంగానే మిగిలిపోయింది. ఏడు దశాబ్దాల స్వతంత్ర పాలనలో కూడా నేటికీ మహిళలు అవకాశాల కోసం అర్రులు చాచాల్సి వస్తోంది. అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి. రాజకీయ రంగం ఇందుకు మినహాయింపు కాదు. చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం నామమాత్రం. వారికి అవకాశం కల్పించాలన్న లక్ష్యంతో ప్రతిపాదించిన మహిళ రిజర్వేషన్ బల్లు మూలన పడింది.

12సార్లు ఎన్నికలు జరిగితే....

ఈశాన్య రాష్ట్రాల్లో మహిళల ప్రాతినిధ్యం మరీ నామమాత్రంగా ఉంది. ఈ నెల 27న ఎన్నికలకు వెళుతున్న నాగాలాండ్ లో ఇప్పటి వరకూ ఒక్క మహిళ కూడా చట్టసభకు ఎన్నికవ్వలేదన్నది చేదునిజం. ఈ విషయం వినడానికే ఆశ్చర్యం, ఒకింత ఆవేదన కలిగిస్తోంది. రాష్ట్రం ఆవిర్భవించి అయిదున్నర దశాబ్దాలయినా ఒక్క మహిళ అసెంబ్లీకి వెళ్లలేకపోయారు. ప్రాంతీయ పార్టీల నుంచి జాతీయ పార్టీల వరకూ ఈ విషయం అందరిదీ ఇదే పరిస్థితి. నాగాలాండ్ అసెంబ్లీకి 12 సార్లు ఇప్పటి వరకూ ఎన్నికలు జరిగాయి. అయినప్పటికీ ఏ ఒక్క మహిళా ఎన్నిక కాలేదు. రేపటి ఎన్నికల్లో అయినా ఈ పరిస్థితిలో మార్పు వస్తుందా? అన్న ప్రశ్నకు సరైన సమాధానం లభించడం కష్టమే.

ఐదుగురే బరిలో......

60 స్థానాలున్న నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్, కొత్తగా ఆవిర్భవించిన నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రొగ్రసివ్ పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీలతో పాటు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు బరిలోకి దిగాయి. మొత్తం 195మంది అభ్యర్థులు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిలో మహిళా అభ్యర్థులు కేవలం అయిదుగురే కావడం గమనార్హం. అధికారంలో ఉన్న నాగా పీపుల్స్ ఫ్రంట్ ఒక్క మహిళకూ టిక్కెట్ కేటాయించకపోవడం విశేషం. మహిళలు ఎవరూ ఆసక్తి చూపనందున టిక్కెట్ ఇవ్వలేదని పార్టీ అధ్యక్షుడు షుర్ హో జెలిలిజెట్సు వాదనను విశ్వసించడం కష్టమే. మహిళా జనాభా గల రాష్ట్రంలో, అధికార పార్టీ టిక్కెట్ ఇచ్చేందుకు ఒక్క మహిళ లేరని చెప్పడం హాస్యాస్పదం. నేషనల్ పీపుల్స్ పార్టీ ఇద్దరు మహిళలను బరిలోకి దింపి సాహసం చేసింది. రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య కేంద్రమైన దిమాపూర్ -3 నుంచి ఎన్పీఎఫ్ అభ్యర్థిగా వెడెయి క్రోను తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్ర రాజధాని కొహిమా అయినప్పటికీ దిమాపూర్ వాణిజ్య కేంద్రంగా దినదినాభివృద్ధి చెందుతుంది. నొక్సెస్ నియోజకవర్గం నుంచి మంగ్యాన్ పులను ఎన్పీఎఫ్ రంగంలోకి దించింది. వీరిద్దరి విజయావకాశాలు ప్రభావవంతంగా లేవు. నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ ప్రజాబలం అత్యంత పరిమితం. ట్యూమెన్ సదర్ -2 నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రభీలా బరిలో నిలిచారు. రభీలా రాజకీయాలకు కొత్తేమీ కాదు. ఆమె భర్త లికుమాంగ్ మాజీ మంత్రి. ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2006లో ఆయన మృతి చెందారు. 2013 ఎన్నికల్లో రభీలా 800 ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన రభీలా ఈసారి గట్టిగా పోరాడుతున్నారు. పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. బీజేపీ గాలి రాష్ట్రంలో ప్రస్తుతం వీస్తుందని, తన గెలుపు తథ్యమన్న ధీమాతో ఆమె ఉన్నారు. కొత్తగా ఆవిర్భవించిన నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రొగ్రసివ్ అభ్యర్థిగా అనాస్ కొన్యాక్ అబోయి నియోజకవర్గంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈమెకూ రాజకీయ నేపథ్యం ఉంది. కొన్యాక్ తండ్రి నెవాంగ్ కొన్యాక్ మాజీ ఎమ్మెల్యే. ఆయన నాలుగుసార్లు చట్టసభలకు ఎన్నికయ్యారు. ఇటీవల ఆయన కన్నుమూశారు. భిజామా నియోజకవర్గం నుంచి రేఖరోజ్ దుక్రూ స్వతంత్ర అభ్యర్థిగా పోరాడుతున్నారు. ఆమె ప్రముఖ పారిశ్రామిక వేత్త. రాజకీయాలు అంటే ఆమెకు అమితాసక్తి.

కాంగ్రెస్ ఒక్క సీటు కూడా.....

ఇందిరాగాంధీ, సోనియాగాంధీ వంటి దిగ్గజాల సారథ్యం పొందిన, వందేళ్లకు పైగా చరిత్ర కల్గిన కాంగ్రెస్ పార్టీ ఒక్కసీటు కూడా మహిళలకు కేటాయించలేదు. బీజేపీ ఒక్కటితోనే సరిపెట్టింది. సమర్థులైన మహిళలు లభించనందునే టిక్కెట్లు కేటాయించడం లేదన్న పార్టీల వాదనలో పసలేదు. ఇది కేవలం సాకే. అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అనేకమంది మహిళలు ముందుకొచ్చినా వారిని ప్రోత్సహించేందుకు పార్టీలు ముందుకు రావడం లేదు. ఏదో ఒకసాకు చెప్పి తప్పించుకుంటున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు కనీసం మహిళా విభాగాలు కూడా లేవు. దీంతో మహిళలు అనాసక్తి కనబరుస్తున్నారు. కొంతమంది మహిళలు ఎన్నికల బరిలోకి దిగుతున్నా వారి పాత్ర పరిమితంగానే ఉంటోంది. తెరవెనుక వారి భర్తలు, సోదరులుచక్రం తిప్పుతున్నారు. ఫలితంగా మహిళలు నిమిత్తమాత్రులవుతున్నారు. బరిలోకి దిగిన మహిళలు ప్రచారపర్వంలో దూసుకుపోతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఇంటింటికీ తిరిగి ఓటర్లను వ్యక్తిగతంగా కలుసుకుని ఓట్లను అర్థిస్తున్నారు. 13 వ రాష్ట్ర శాసనసభ మహిళల ప్రాతినిధ్యానికి శ్రీకారం చుట్టాలని అందరం ఆశిద్దాం. అయిదుగురు అభ్యర్థులూ గెలిచి తమ వాణిని బలంగా విన్పించాలని ఆకాంక్షిద్దాం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News