ఈ యుద్ధం కొనసాగదంతే....!

Update: 2018-04-22 15:30 GMT

రెండు బలమైన విభాగాలు పరస్పరం తలపడితే ఏమవుతుంది? సంచలనంగా మారుతుంది. చర్చకు దారి తీస్తుంది. ప్రజల్లో ఉత్కంఠ నెలకొంటుంది. మరి ఈ రెండు విభాగాల్లో ఏదో ఒక విభాగం నష్టపోతుందా? చరిత్రలో అటువంటి ఉదంతాలు లేవు. పెద్దలు రంగప్రవేశం చేస్తారు. సర్దుబాటు చేస్తారు. రాజీ కుదురుస్తారు. ఏదో జరిగిపోనుందని భ్రమించి ఆవేశకావేశాలకు పోయిన ప్రజలే తెల్లమొహం వేయాల్సి వస్తుంది. కొంతకాలం వినోదం తప్ప ఒరిగేదేమీ ఉండదు. తాజాగా మీడియా, పవన్ కల్యాణ్ ల మధ్య వివాదమూ ఆ దిశలోనే సద్దుమణిగిపోనుంది. అటు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఇటు టీవీ9 శ్రీనిరాజు, మరోవైపు పవన్ కల్యాణ్ కేసులు పెట్టుకునే పనిలో బిజీ అయిపోయారు. మనదేశంలో న్యాయస్థానానికి వెళ్లిన కేసు ఎంత త్వరగా తేలిపోతుందో అందరికీ తెలిసిన విషయమే. ఈలోపు ప్రజలు మరిచిపోతారు. ఈ కథలోని పాత్రలు సర్దుకుంటాయి.

పవన్ ట్విస్టుకు పడని పరిశ్రమ...

తనపై ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి విషయంలో చిత్రపరిశ్రమ మౌనం వహించడాన్ని సహించలేక పవన్ కల్యాణ్ హల్చల్ చేశారు. చంద్రబాబు దీక్ష పుణ్యమా?అని ముందుగా కుదుర్చుకున్న ప్రసార ఒప్పందాల ఫలితంగా ఏ ఒక్క టీవీచానల్ పెద్దగా ప్రాధాన్యం కల్పించలేదు. సాక్షి మీడియానే కొంతలో కొంత ఆయనకు సాంత్వన చేకూర్చింది. జనసేనతో కలిసి నడవాలనుకుంటున్న వామపక్ష చానల్ కూడా పవన్ ను పట్టించుకోలేదు. చంద్రబాబు సేవలోనే తరించింది. అంతకుముందుగానే తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఏబీఎన్, టీవీ9, టీవీ5 లపై ట్వీట్లతో విరుచుకుపడ్డారు పవన్. వాటి ప్రసారాలను పట్టించుకోవద్దని పిలుపునిచ్చారు. ఫలితంగా ఆయా మీడియాసంస్థలు ఆయన వార్తలనే బ్యాన్ చేశాయి. ఈ ఉదంతంలో ఇరువర్గాలకు కొంత డ్యామేజీ జరిగింది. మీడియా క్రెడిబిలిటీ కోల్పోతే పవన్ తన పవర్ కోల్పోయారు. మీడియా నిజస్వరూపమూ అర్థమైంది. అత్యుత్సాహవంతులైన పవన్ అభిమానులు చెలరేగి పోవడంతో బ్రాడ్ కాస్టింగ్ వాహనాలకు నష్టం వాటిల్లింది. దీంతో మీడియా పెద్దలు పవన్ కల్యాణ్ నే నేరుగా టార్గెట్ చేశారు. బాధితునిగా తనకు సానుభూతి వస్తుందని భావిస్తే నిందితునిగా నిలవాల్సి వచ్చింది. అదీ మీడియా దెబ్బ అంటూ చేతలతో చూపించేశారు. చిత్ర పరిశ్రమ కూడా రెండుగా చీలిపోయిన వాతావరణం కనిపిస్తోంది. కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యంలో నడిచే పరిశ్రమలో పవన్ కు బలమైన మద్దతు కరవైంది. చంద్రబాబు నాయుడికి భయపడో , భవిష్యత్తులో తలపోటు తెచ్చుకోవడమెందుకనే అతిజాగ్రత్త వల్లనో పవర్ స్టార్ లేవనెత్తిన ప్రశ్నలకు ఎవరూ పెద్దగా సమాధానం ఇవ్వలేదు.

ఆందోళనలు అసమంజసం...

మీడియాపై దాడి పెరిగిపోయిందంటూ ఒక వాహనం తగలబడినందుకు జర్నలిస్టులు రెండు రాష్ట్రాల్లో రోడ్డెక్కారు. ఇది యాజమాన్యాలకు అనుకూలమైన ఆందోళనే తప్ప జర్నలిస్టులకు సింపథీ తెచ్చిపెట్టేది కాదు. పవన్ కల్యాణ్ లేవనెత్తిన మూడు అంశాలు వృత్తిపరంగా జర్నలిస్టులపై దాడి చేసేవి కాదు. మధ్యవర్తులుగా మారిపోయిన యాజమాన్యాల ధోరణిని ఆయన ఎండగట్టారు. అది నిజమో, కాదో తేల్చాల్సిన బాధ్యత విచారణ సంస్థలది. ఇక్కడ పాత్రికేయులకు జరిగిన నష్టమేమీ లేదు. యాజమాన్యాలు తమ విధానాలను పునస్సమీక్షించుకుని నిష్పాక్షికంగా తమ పాత్రికేయ ప్రమాణాలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. దీనిని పక్కనపెట్టి పవన్ పై యాజమాన్యాలు జర్నలిస్టు సంఘాలను ఉసిగొల్పాయని భావించాల్సి ఉంటుంది. తాము వ్యక్తిగతంగా, వృత్తిపరంగా పోరాడాల్సిన అనేక సమస్యలు పెండింగులో ఉన్నాయి. మేనేజ్ మెంట్లు , పవర్ స్టార్ రెండూ చాలా శక్తిమంతమైన వ్యవస్థలే. గెలుపోటములు లేని వారి యుద్దం లో చివరికి జరిగేది రాజీ. అది తెలుసుకోకుండా మీడియా మిత్రులు గొంతు చించుకోవడం వృథా ప్రయాస.

చివరికి మిగిలేది...

ఇప్పటికే మధ్యవర్తుల ద్వారా సినీ, మీడియా రాజీ యత్నాలు ఊపందుకున్నట్లు సమాచారం. అయితే వెంటనే ఇది ఫలిస్తే వ్యవస్థల క్రెడిబిలిటీ దెబ్బతింటుందని ఇరుపక్షాలకూ తెలుసు. ఏదో కోర్టులో కేసు నానుతూ ఉంటుంది. అభిమానులు , ప్రజలు మరిచిపోతారు. ఈలోపు మీడియా సంస్థలు వార్తలను యథాతథంగా ప్రసారం చేయడం మొదలు పెట్టేస్తాయి. అంతా సాఫీగా సాగిపోతూంటుంది. కేసుల ఉపసంహరణ అంశం ఎవరి దృష్టికీ రాదు. అందువల్ల అభిమానులు, జర్నలిస్టులు సంయమనంతో వ్యవహరించి తమ వ్యక్తిగత ప్రమాణాలను కాపాడుకొంటే మేలు. తమ బాసు పట్ల, నాయకుని పట్ల అభిమానం నిరపేక్షంగా ఉండకూడదు. సాపేక్షంగానే ఉండాలి. ఎందుకంటే ఈ మధ్యన వృత్తిపరమైన సంబంధాలన్నీ కాలిక్యులేటెడ్ గానే ఉంటున్నాయి. లాయల్టీలు అవసరాన్ని బట్టి మారిపోతున్నాయి. పవనిజం పాటించే వాళ్లు ఈ నిజం గ్రహించడం చాలా అవసరం. జర్నలిజం తెలిసినవాళ్లు జనం నాడి పట్టుకోవడమే కాదు, తమ సంస్థల్లో అంతర్గతంగా చోటు చేసుకుంటున్న పరిణామాలనూ గ్రహించి మసలుకోవడం ఉత్తమం. లేకపోతే రోడ్డున పడేది మన పరువే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News