ఈ మూడు టీంలు జగన్ కు ముప్పుతెస్తాయా?

Update: 2017-12-23 15:30 GMT

జగన్ నిర్వహిస్తున్న పాదయాత్రపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల్లో కదలిక తీసుకురావడం, కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడం, నియోజకవర్గ నాయకులను ఎన్నికలకు సిద్ధం చేయడమనే ప్రధాన లక్ష్యాలతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పాదయాత్రను అంటిపెట్టుకుని కదులుతున్న ప్రశాంత్ కిశోర్ బృందాలు రాజకీయవాతావరణాన్ని అంచనా వేసి, ప్రజల్లో స్పందనను నేరుగా జగన్ కు నివేదిస్తాయి. చిన్నాచితక మార్పులకు అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తాయి. పక్కా ప్రణాళికతోనే పాదయాత్రను చేపట్టినట్లు పైకి కనిపించినా ఆశించిన స్థాయిలో స్పందన కరవు అవుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో పార్టీకి గట్టి పట్టు ఉంది. అనంతపురం జిల్లాను మినహాయిస్తే మిగిలిన మూడు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరులోనూ పార్టీ కచ్చితంగా ఆధిక్యం సాధిస్తుందనే అంచనా అగ్రనాయకత్వంలో ఉంది. కానీ పాదయాత్ర మొదలైన తర్వాత పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించకపోవడం, ద్వితీయశ్రేణి నాయకత్వం బాధ్యత తీసుకోకపోవడంతో చాలాచోట్ల పాదయాత్ర వెలవెలబోతోంది. ఈ అంతర్గత సమాచారం జగన్ కోర్ టీమ్ ను ఆందోళనకు గురి చేస్తోంది. పాదయాత్ర పట్ల తొలి దశలో తీవ్రంగా ఆందోళన చెందిన తెలుగుదేశం ప్రస్తుతం రిలాక్స్ గా కనిపిస్తోంది.

ఈ బృందాలది...మూడు దారులు...

పాదయాత్రను సక్సెస్ చేయడానికి పార్టీతో నేరుగా సంబంధం లేకుండా మూడు బృందాలు పనిచేస్తున్నాయి. ఒకటి ప్రశాంత్ కిశోర్ టీమ్. ప్రజల్లో కలిసి పోయి వారి మనోగతాన్ని , అభిప్రాయాలను సేకరించి నేరుగా జగన్ కు చెప్పాలనేది ఈ టీమ్ కు అప్పగించిన పని. ఈ టీమ్ సభ్యులు నిజానికి ప్రజలతో కలవడం ద్వారా కచ్చితమైన సమాచారాన్ని రాబట్టాలి. కానీ వీరు ప్రత్యేక దుస్తులతో ఇట్టే గుర్తు పట్టేట్లుగా ప్రవర్తించడం, జగన్ తో తమకు సాన్నిహిత్యం ఉందన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడంపైనే దృష్టి పెడుతున్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారీ జగన్ను కలవడం, స్తానికంగా ఉన్న నాయకులకంటే తామే అధికులమన్న భావనను వ్యాపింప చేయడంతో ‘పీకే’ టీమ్ అసలు పని కంటే కొసరు ఫేమ్ కోసం ప్రయత్నిస్తోందని ముద్ర పడిపోయింది. అంతేకాకుండా వీరెవరో అందరికీ తెలిసి పోవడం వల్ల కొందరు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలనే ప్రజల రూపంలో పంపి పీకే టీమ్ వద్ద తమ గురించి నాలుగు మంచి మాటలు చెప్పించుకుంటున్నారు. అదంతా ప్రజాభిప్రాయం అన్నట్లుగా పిక్చర్ ఇస్తున్నారు. దీనివల్ల మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. ద్వితీయశ్రేణి నాయకులు పీకే టీమ్ ను తెలివిగా వాడేసుకుంటున్నారు. దీనివల్ల జగన్ కూడా బుట్టలో పడే అవకాశం ఉందని కొందరు నాయకులు చెబుతున్నారు. హైదరాబాదు నుంచి పంపిన మరో స్పెషలిస్టుల బృందం వివిధ వృత్తినిపుణుల సమ్మేళనంగా ఉంది. సాక్షిమీడియాకు చెందిన ఒకరిద్దరు, విజయసాయి ఎంపిక చేసిన కొందరు ప్రొఫెషనల్స్ ఇందులో ఉన్నారు. వీరు జగన్ పాదయాత్రకు ముందు రోజు ఆయా గ్రామాలను సందర్శించి సమస్యలను గుర్తించడంతోపాటు యాత్రకు అవసరమైన నాటకీయతకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. జిల్లాల్లోని సాక్షి టీవీ, పత్రికకు సంబంధించిన టీమ్ మూడోది. కనీసం పదిమందితో కూడిన బృందమిది. హైప్ క్రియేట్ చేయడం, అద్బుతమైన స్పందన కనిపించేలా చూడటం ఈ టీమ్ బాధ్యతలు. అయితే ఈ టీమ్ లు మూడూ నిజానికి చెయ్యాల్సిన పని ఒక్కటే. పాదయాత్రను సక్సెస్ చేయాలి. కానీ సమన్వయం పూర్తిగా లోపించింది. ఒక్కో టీమ్ మరో టీమ్ తో సంప్రతించుకోకపోవడం వల్ల భిన్నమైన రిపోర్టులు జగన్ కు చేరుతున్నాయి. పీకే టీమ్ పార్టీ నాయకులు, పార్టీ పరిస్థితులపై హైప్ లేకుండా సాధ్యమైనంతవరకూ బ్యాలెన్సు గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. విజయసాయి రెడ్డి టీమ్, స్థానికంగా జిల్లా సాక్షి టీమ్ లు మాత్రం వాస్తవాన్ని మించి అతిశయోక్తులతో పాదయాత్రను పక్కదారి పట్టిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో పీకే టీమ్ ను కూడా లోకల్ నాయకులు ప్రభావితం చేయడంపైన కూడా ఆందోళన వ్యక్తమవుతోంది.

టీడీపీ ముందస్తు జాగ్రత్తలు...

జగన్ పాదయాత్ర రాజకీయంగా పెను ప్రభావం చూపుతుందని టీడీపీ ఒకానొక దశలో భావించింది. అనుమతి విషయంలో సైతం సాధ్యమైనంతవరకూ సాంకేతిక ఇబ్బందులు సృష్టించాలని ప్రయత్నించింది. అరాచక శక్తులు చొరబడతాయి. దౌర్జన్యం, హింస చోటు చేసుకుంటుందంటూ ముఖ్యమంత్రి స్థాయిలోనే విమర్శలు గుప్పించారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా న్యాయస్థానం నుంచి నేరుగా అనుమతి తెచ్చుకునే అవకాశం ఉండటంతో పోలీసులు తామేం చేయలేమంటూ ప్రభుత్వానికి నివేదించారు. ఆటంకపరిచేందుకు కారణాలు సహేతుకం గా లేకపోతే ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటుంది. పాదయాత్రను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తే జగన్ కు సానుభూతి లభిస్తుంది. దీంతో అన్యమనస్కంగానే రాష్ట్రప్రభుత్వం తల ఊపాల్సి వచ్చింది. ఇంటిలిజెన్సు వర్గాలను పెద్ద ఎత్తున రంగంలోకి దింపింది. ప్రతి కదలికను, ప్రతి ప్రాంతంలోనూ రికార్డు చేయాలని ఆదేశించింది. సొంతజిల్లా కడపలో సాగిన తొలి వారం రోజుల పాదయాత్ర అంతంతమాత్రం స్పందనతో సాగడంతో ప్రభుత్వానికి, టీడీపీకి గుండెలపై భారం దిగిపోయినట్లయింది. ఆ తర్వాత సాగిన కర్నూలు జిల్లా పర్యటనకు నాలుగైదు నియోజకవర్గాల్లో మంచి స్పందన లభించింది. మళ్లీ తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న అనంతపురంలో సో..సో.. గా పాదయాత్ర సాగింది. మొత్తమ్మీద రాజకీయంగా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదన్న ధీమా తెలుగుదేశం నాయకుల్లో ఏర్పడింది. కొందరు తెలుగుదేశం నాయకులు జగన్ మాట్టాడిన అంశాలపై విపరీతంగా స్పందించడం వల్ల , విమర్శలు గుప్పించడం వల్ల పాదయాత్రకు ప్రచారం పెరుగుతోందని టీడీపీ గ్రహించింది. నాయకులు జగన్ విషయం పూర్తిగా పక్కన పెట్టాలని అవసరమైతే అధికారప్రతినిధుల ద్వారా పార్టీ స్టాండ్ చెబుదామని ఇటీవల చంద్రబాబు నాయుడు పార్టీ అగ్రనాయకులకు సూచించారు.

మూసకు ముగింపు పలకాలి....

పాదయాత్ర మూస ధోరణిలో సాగుతోందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. జగన్ తో మాట్లాడే వివిధ వర్గాల బాధితులను ముందస్తుగానే సిద్దం చేయడంతో రొటీన్ గా ఒకే తరహా ప్రశ్నలు, సమాధానాలు, ఆవేదన, అసంతృప్తి వినిపిస్తున్నాయి. మీడియా ఆయా బాధితులను ఒకటి రెండు ఎక్స్ ట్రా ప్రశ్నలు వేస్తే నోళ్లు తెల్లబెడుతున్నారు. బాధితులను తయారు చేయడమనే ప్రక్రియ కారణంగా పలు సందర్బాల్లో దొరికిపోతుండటంతో ప్రత్యర్థి మీడియా పాదయాత్రనే పరిహాసం చేస్తోంది. రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయి. వ్యవసాయ, ఉపాధి, గ్రామీణ వైద్య రంగాలు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాయి. అయితే నేరుగా ఆ బాధితులు జగన్ ను కలిసే అవకాశం లభించడం లేదు. తాము ముందస్తుగా ప్రిపేర్ చేసి పంపిన వారితో మాత్రమే జగన్ ఎక్కువ సేపు సంభాషించేలా జగన్ టీమ్ లు శ్రద్ధ పెడుతున్నాయి. దీంతో పాదయాత్ర లక్ష్యం దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికైనా వై.సి.పి. అగ్రనాయకత్వం జాగ్రత్త పడకపోతే అధికారానికి బాటలు వేయాల్సిన పాదయాత్ర ఒక ఈవెంట్ గా మిగిలిపోతుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News