ఈ ముగ్గురూ మోడీకి చుక్కలు చూపుతారా?

Update: 2017-11-28 17:30 GMT

గత రెండేళ్లుగా గుజరాత్ రాజకీయ యవనికపై యువ నాయకత్వం ప్రత్యక్షమయింది. అల్ఫేశ్ ఠాకూర్, హార్థిక్ పటేల్, జిగ్నేశ్ మెవానీల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరు ముగ్గురూ వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు. అదే సమయంలో బీజేపీని ఎలాగైనా గద్దె దించాలన్న పట్టుదలతో ఉన్న నేతలు. దీంతో సహజంగానే విపక్ష కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. కాంగ్రెస్ వీరిని చేరదీయడానికి బలమైన కారణాలే ఉన్నాయి. బీజేపీని వ్యతిరేకించే ప్రతి ఒక్కరినీ కలుపుకుని వెళ్లాలన్న లక్ష్యంతో అందరికీ కాంగ్రెస్ ఆహ్వానం పలుకుతోంది. ఏదో ఒక రూపంలో, ఎంతో కొంత పార్టీకి ఉపయోగపడగలరన్నది దాని ఆశ. వీరిలో ఒకరిని పార్టీలోకి చేర్చుకుంది. మరొకరికి పరోక్షంగా మద్దతు పలుకుతోంది. ఇంకొకరిని ప్రచారానికి వాడుకుంటోంది.

వేర్వేరు సామాజిక వర్గాలు...

హార్థిక్ పటేల్, అల్ఫేశ్ ఠాకూర్, జిగ్నేశ్ మేవాని ...ముగ్గురూ మూడు సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముగ్గురు నాయకుల మధ్య ఎలాంటి సమన్వయం, సహకారం, సారూప్యత లేదు. బీజేపీని గద్దె దించాలన్నదే ఉమ్మడి లక్ష్యం. ఈ లక్ష్యంతోనే కాంగ్రెస్ తో కలిసి నడుస్తున్నారు. ఈ ముగ్గురి సామాజిక వర్గాలకు ఉమ్మడిగా 65 శాతం ఓటు బ్యాంకు ఉండటంతో వీరిపై కాంగ్రెస్ కన్నేసింది. అధికారంలోకి వస్తే ఆయా సామాజిక వర్గాలకు రిజర్వేషన్లను కల్పిస్తామని హస్తం పార్టీ హామీ ఇచ్చింది. ముగ్గురు యువ నాయకుల్లో అల్ఫేశ్ ఠాకూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, జిగ్నేశ్ కాంగ్రెస్ పరోక్ష మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగారు. హార్థిక్ పటేల్ పోటీకి దూరంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ తరుపున ప్రచారం చేస్తున్నారు.

కాంగ్రెస్ అభ్యర్థిగా....

ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న లక్ష్యంతో తెరపైకి వచ్చిన అల్ఫేశ్ ఠాకూర్ గత కొంతకాలంగా ప్రజల్లోకి వెళుతున్నారు. వెనుకబడిన తమ సామాజిక వర్గానికి విద్య, ఉద్యోగాల్లో జనాభాస్థాయిని బట్టి రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ ను నెరవేర్చే పార్టీకి మద్దతిస్తామని బహిరంగంగా ప్రకటించారు. కాంగ్రెస్ ఇందుకు సరే అనడంతో రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరిపోయారు. 50 శాతం రిజర్వేషన్లు మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించకుండానే ఠాకూర్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తామన్నది కాంగ్రెస్ వాగ్దానం. ఇది ఆచరణ సాధ్యం కాదనిబీజేపీ బహిరంగంగా చెబుతోంది. ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ ఇస్తున్న మోసపూరిత హామీల వలలో అల్ఫేశ్ ఠాకూర్ పడిపోయారని అది ప్రచారం చేస్తోంది. అయినా అల్ఫేశ్ కు కాంగ్రెస్ పై నమ్మకం సన్నగిల్లలేదు. ఆ పార్టీ అభ్యర్థిగా ఆయన రాధన్ పూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. ఇది ఠాకూర్ సామాజిక వర్గానికి పట్టున్న నియోజకవర్గం. పఠన్ జిల్లాలోని ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

స్వతంత్ర అభ్యర్థిగా....

రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై సంచలనం సృష్టిస్తున్న మరో నేత జిగ్నేశ్ మెవాని. దళిత సామాజిక వర్గానికి చెందిన మెవానీ ప్రముఖ న్యాయవాది. పాత్రికేయుడు. 2016లో ఉనా దళిత ఊచకోత సంఘటనతో ఆయన వెలుగులోకి వచ్చారు. 1980లో జన్మించిన జిగ్నేశ్ అహ్మదాబాద్ లోని దళిత ప్రాంతంలో నివసిస్తూ వారి హక్కులు, అభ్యున్నతి కోసం పోరాడుతున్నారు. ప్రతి దళితుడికి ఐదెకరాల భూమిని ఇవ్వాలన్నది ఆయన డిమాండ్. ఎంఎ (ఆంగ్లం), న్యాయవిద్యను అభ్యసించిన మెవానీ నాలుగేళ్ల పాటు పాత్రికేయుడిగా పనిచేశారు. దళితుల కోసం పనిచేయాలన్న ఉద్దేశంతో అనంతరం న్యాయవాది వృత్తిని చేపట్టారు. దళితుల హక్కులు, వారికి సంబంధించిన భూముల కేసులను వాదించారు. తాజాగా ‘వడ్గం’ నియోజకవర్గం నుంచి స్వతంత్రఅభ్యర్థిగా బరిలోకి దిగారు. బనస్కాంత్ జిల్లాలోని ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మెవానీకి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఇక్కడ అభ్యర్థులను ప్రకటించలేదు.

పోటీలో లేకుండానే...

2014 నుంచి గుజరాత్ రాజకీయ రంగంలో సంచలనం సృష్టిస్తున్న యువనేత హార్థిక్ పటేల్. 24 సంవత్సరాల పటేల్ పాటీదార్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. పాటీదార్లకు రాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో మంచి పట్టుంది. పటేల్ ఆందోళన కారణంగానే బీజేపీ ముఖ్యమంత్రిని మార్చాల్సి వచ్చింది. 1993 జులై లో జన్మించిన పటేల్ చదువులో సగటు విద్యార్థి. క్రికెట్ అంటే ఎనలేని మక్కువ. అప్పట్లోనే విద్యార్థి సంఘం నాయకుడిగా సంచలనం సృష్టించారు. తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. తొలిసారి 2015 జులై 6న విస్ నగర్ లో బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం ఆగస్టు 25న అహ్మదాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ రాజకీయ పార్టీల్లో ప్రకంపనలను సృష్టించారు. అనంతరం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో పర్యటించి గుజ్జర్లు, కుర్మిల సభలో పాల్గొన్నారు. రాజస్థాన్ లో గుజ్జర్ల రిజర్వేషన్ల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. పాటీదార్ అనామత్ ఆందోళన సమితి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ కాంగ్రెస్ కు బహిరంగ మద్దతు ప్రకటించారు. హార్థిక్, అల్ఫేశ్, జిగ్నేశ్ ల ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలియాలంటే డిసెంబర్ 18 వరకూ ఆగక తప్పదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News