ఈ పార్టీకి ఓ కృష్ణుడు కావలెను...!

Update: 2017-12-10 15:30 GMT

ఈ రాజ్యము వద్దు. పదవులు వద్దు.ఈ చావులు వద్దు అంటూ అస్త్ర సన్యాసం చేసిన అర్జునుడిని యుద్దోన్ముఖుడిని చేసినవాడు శ్రీకృష్ణుడు. అప్పుడు పుట్టిందే భగవద్గీత. మరీ ప్రాక్టికల్ గా ఉండాలనో, ఆదర్శవాదం ప్రవచించాలనో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రకటనలు పార్టీలో ఉత్సాహం నింపక పోగా అయోమయానికి గురి చేస్తున్నాయి. ముఖ్యమంత్రి కావాలని నాకు లేదు. అధికార లాలసత అసలే లేదు. అంటూ పదేపదే ఇస్తున్న ఉపన్యాసాలు ఉసూరుమనిపిస్తున్నాయి. ఒకవైపు బీజేపీని, మరోవైపు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీని దుమ్మెత్తి పోస్తూ తెలుగుదేశం విషయంలో సంయమనం పాటించడంతోనే జనసేన శ్రేణులు నిర్వీర్యమైపోతున్నాయి. నిజానికి రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నది తెలుగుదేశం. బీజేపీ దూరపు చుట్టం. వై.సి.పి. ప్రేక్షక ప్రతిపక్షం. ఒకవేళ రాష్ట్రంలో రాజకీయ మార్పు సాధించడమే తన లక్ష్యమైతే గురిపెట్టాల్సింది తెలుగుదేశం పార్టీపైనే. లేకుంటే టీడీపీకి బీ టీం గా ఇప్పటికే ఎదుర్కొంటున్న విమర్శలు మరింత పదునెక్కే ప్రమాదం ఉంది.

ఆ రాజ్యం తప్పులే .. ఈ సేనలోనూ...

ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తొలినాళ్లలో పాలిటిక్స్ లో జెంటిల్ మేన్ అనిపించుకోవాలనే అతి లౌక్యంతో చిరంజీవి అనేక పొరపాట్లు చేశారు. చంద్రబాబు నాయుడు మంచి పాలకుడు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి కూడా చక్కగానే పరిపాలిస్తున్నారు అంటూ స్టేట్మెంట్లు ఇచ్చారాయన. దాంతో మీకెందుకు ఓటెయ్యాలన్నట్లుగా పీఆర్పీని మూడో స్థానానికి పరిమితం చేశారు ప్రజలు. తీరా ఓటమి చవిచూశాక తెలిసొచ్చింది రెండు మదగజాల మధ్య పీఆర్పీ గెలవలేకపోయిందని నిట్టూర్చారు. తాను మదగజంగా మారడమెలా అన్నది ఆలోచించకుండా మంచి తనం పేరుతో బలహీనతను ప్రదర్శించడమే చిరంజీవి చేసిన తప్పు. చంద్రబాబు పాలనలో సంస్కరణల రూపంలో తెచ్చిపెట్టిన సంక్షోభాలు, వై.ఎస్. జమానాలో సంక్షేమం పేరుతో వెల్లువెత్తిన అవినీతి పై తాట తీసి ఉండాల్సింది. అదంతా వదిలేయడంతో జావగారిపోయింది ప్రజారాజ్యం పార్టీ. తెలుగు దేశం పార్టీపై నమ్మకంతో, పవన్ కల్యాణ్ ఇచ్చిన భరోసాతో 2014లో టీడీపీకి ఓట్లేశారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత అధికారపక్షానిదే. ఒకవేళ ఫెయిలైతే ఆ వైఫల్యానికి బాధ్యత తీసుకోవాల్సింది కూడా టీడీపీనే. ఈ సంగతిని పక్కనపెట్టి జనసేన సమస్యలపై పోరాటం చేస్తాం. మార్పు కావాలి అని నినదిస్తే ప్రయోజనం శూన్యం. ప్రజల జీవనవిధానంలోనూ, అభివ్రుద్ది లోనూ మార్పు రావాలంటే అధికార సాధనతోనే సాధ్యమవుతుంది. తనకు అధికారం వద్దనడంతోనే పలాయనత్వం చిత్తగించినట్లవుతుంది. మొదటి శత్రువు ఎవరో గుర్తించి పోరాడితేనే పదవి దక్కుతుంది. పనిచేసేందుకు వీలవుతుంది. లాబీయింగు, అకామిడేటివ్ పాలిటిక్స్ తో పార్టీ బలపడుతుందనుకుంటే భ్రమే. ఈ విషయంలో పవన్ కల్యాణ్ కొంత గందరగోళానికి గురవుతున్నట్లే చెప్పుకోవాలి. ప్రస్తుతం తాను ఏదేని సమస్యను లేవనెత్తితే చంద్రబాబు నాయుడు కొంతమేరకు పరిష్కరిస్తున్నారు. అదే సరిపోతుందనుకుంటే పార్టీ పెట్టాల్సిన అవసరమే లేదు కదా అని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. పవన్ కున్న మాస్ ఫాలోయింగు, ప్రజాదరణ రీత్యా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ ప్రజల సమస్యలు లేవనెత్తితే సాధ్యమైనంతవరకూ పరిష్కరిస్తుంది. కానీ పార్టీ అంటే ప్రజాసమస్యలపై పోరాటం, అధికార సాధనతో తన విధానాలను అమలు చేయడం అనేది ప్రపంచ వ్యాప్తంగా పాలిటిక్స్ లో అమలవుతున్న సూత్రం. దానికి భిన్నంగా రాజకీయాలు నడపాలనుకుంటే ఎవరి చేతిలోనో పనిముట్టుగా జనసేన మిగిలిపోయే అవకాశం ఉంది.

రాజకీయ శూన్యత ఉందా?

నిజానికిప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ శూన్యత ఉందా? అనేది ఒక ప్రశ్న. అటు తెలుగుదేశం, ఇటు వైఎస్పార్ కాంగ్రెసు పార్టీ బలమైన రాజకీయ శక్తులుగా ఉన్నాయి. జనసేన మూడో స్థానంలోనే నిలుస్తుంది తప్ప నంబర్ ఒన్ స్థానం దక్కదు. రెండింటిలో ఏ పార్టీతోనూ కలవకుండా విడిగా పోటీ చేస్తే ఒక డజను లోపు స్థానాల్లో విజయం సాధించినా ఆ తర్వాత కాలంలో ఎంతో ఓపికగా రాజకీయ ప్రస్థానం సాగించాల్సి ఉంటుంది. పార్టీ ఎమ్మెల్యేలు , నాయకులు చెదిరిపోకుండా కాపాడుకుంటూ మరో అవకాశం కోసం ఎదురుచూస్తూ పోరాటం చేయాల్సి ఉంటుంది. ఈలోపుగానే ఏదో ఒక ప్రధాన పార్టీ కబళించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ప్రజారాజ్యం విషయంలో జరిగింది అదే. పార్టీని నిర్వహించడం, ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కష్టమని గ్రహించే రాజకీయంగా లాభసాటిగా ఉండేలా నాయకత్వమే కాంగ్రెసులో విలీనం చేసేసింది. విడిగా వెళితే జనసేనకు అవే కష్టాలు తప్పక పోవచ్చు. అందరూ అనుకుంటున్నట్లుగా టీడీపీతో కలిసి వెళితే తోకపార్టీగా ముద్ర పడుతుంది. ఇప్పుడు అధికారపార్టీ చేసిన తప్పిదాలకూ జనసేన సమాధానం చెప్పుకోవాలి. ఏతావాతా ఎంతో వ్యూహనైపుణ్యంతో కదిలితేనే జనసేన తన సొంత అస్తిత్వాన్ని నిలుపుకోగలుగుతుంది. వై.సి.పి. అధినేత మీద ఉన్న కేసులు ఇతర కారణాలతో ఆ పార్టీ బాగా బలహీనపడితేనే జనసేనకు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశానికి దీటుగా భవిష్యత్తులో ఎదిగే అవకాశాలు ఏర్పడుతాయి. 2019 ఎన్నికల నాటికి ఈవాతావరణం ఉండదంటున్నారు రాజకీయ పరిశీలకులు. అంటే 2024 వరకూ కూడా వేచి ఉండాల్సి ఉంటుంది.

మార్గదర్శకత్వం కరవు...

పవన్ కల్యాణ్ కు ఏదో చేయాలనే తపన ఉంది. ఎలా చేయాలో మార్గం మాత్రం తెలియడం లేదు. పిలుపునిస్తే స్పందించే లక్షలాది అభిమాన సైన్యం సిద్ధంగా ఉంది. వారికి రూట్ మ్యాప్ కరవు అయ్యింది. తెర వెనుక ఉండి పార్టీని ముందుకు నడిపే వ్యూహకర్తలు ప్రతి పార్టీలోనూ వెన్నుదన్నుగా ఉంటుంటారు. వై.ఎస్.కాలంలో కేవీపీ వంటివారు ఇందుకు ప్రసిద్ధులు. జగన్ కు కూడా విజయసాయి, వై.వి.సుబ్బారెడ్డి వంటి వారు సలహాలు ఇస్తుంటారు. ప్రస్తుతమైతే రాజకీయ వ్యూహాల కోసం నేరుగా ప్రొఫెషనల్ ప్రశాంత్ కిశోర్ సేవలనే వినియోగించుకుంటున్నారు. తెలుగు దేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడే పెద్ద వ్యూహకర్త. టీడీపీ అధికారంలోకి వచ్చిన తొలిదశలో ఎన్టీరామారావు కి సలహాలు ఇవ్వడంతోనే బాబు చేరువ కాగలిగారు. ప్రజారాజ్యం పార్టీలో సైతం అల్లు అరవింద్, పుచ్చలపల్లి మిత్ర వంటి వారు తెర వెనుక వ్యూహాలు చూసేవారు. జనసేన విషయంలో ఈ రకమైన మార్గదర్శకత్వం లోపించిందంటున్నారు. సినిమా దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరికొందరు రచయితలపై పవన్ ఎక్కువగా ఆధారపడుతున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే వీరెవరికీ రాజకీయ వ్యూహరచన నైపుణ్యం లేకపోవడం పెద్ద కొరత. సో...పార్టీని , నాయకత్వాన్ని యుద్ధానికి సిద్ధం చేసే సారథి కావాలి. అధికారంలో భాగం కాకుండా ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా పార్టీ బాగు కోరుకునే వ్యక్తి రావాలి. అతను పవన్ ను సైతం అజమాయిషీ చేయగల పార్థుడై ఉండాలి.

-ఎడిటోరియల్ డెస్క్

Similar News