ఈ ఇద్దరూ గెలుపు గుర్రాల కోసం....?

Update: 2018-01-08 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ లొ అసెంబ్లీ ఎన్నికలపై తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ కసరత్తు ప్రారంభించాయి. ఆటలో అరటిపండులా బీజేపీ, జనసేనలు కూడా తమ వంతు వాటా,కోటా కోసం బలాబలాల అంచనాలకు సిద్ధమవుతున్నాయి. 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాల్సి వస్తే అభ్యర్థులు ఎవరైతే బాగుంటుందనే కోణంలో టీడీపీ ఇప్పటికే మూడు సర్వేలు చేసింది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఈ సారి ఎన్నికల్లో పార్టీ వర్గాలను, నాయకులను నమ్ముకోకుండా ప్రశాంత కిశోర్ టీమ్ అందిస్తున్న జాబితాపైనే ఆధారపడనున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ జనసేన కూడా ఇప్పటికే అన్ని జిల్లాల్లో సమన్వయ కర్తల నియామకాలపై ప్రాథమిక కసరత్తు పూర్తి చేసింది. భారతీయ జనతాపార్టీ టీడీపీతో కలిసి నడిచే అవకాశాలే ఎక్కువగా ఉండటంతో ఆ పార్టీ నేతలు గతం కంటే ఎక్కువ సీట్లు డిమాండు చేయాలని భావిస్తున్నారు. తమ బలం పెరిగిందని చెబుతున్నారు. కాంగ్రెసు పోటీ 2019 లో కూడా నామమాత్రమేనని ఆ పార్టీ నేతలే అంతర్గత సమావేశాల్లో అంగీకరిస్తున్నారు. కనీసం అసెంబ్లీలో నాలుగైదు స్థానాలతో అయినా కాలు పెట్టగలిగితే చాలనే ఆశతో ఉన్నారు.

బలవంతులతోనే భయం...

అసలు ప్రతిపక్షమన్నదే లేకుండా చేయాలనే ఉద్దేశంతో, ఒకరకంగా చెప్పాలంటే కసితో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బలమైన నాయకులందర్నీ తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చేశారు చంద్రబాబు నాయుడు. ఆయా నియోజకవర్గాల్లో తమ పార్టీ శాసనసభ్యులే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, బలమైన నియోజకవర్గ ఇన్ చార్జులు ఉన్నప్పటికీ ప్రత్యర్థులను టీడీపీలోకి ఆహ్వానించడంలో వెనకడుగు వేయలేదు. వై.సి.పి.కి అభ్యర్థుల కొరత సృష్టించాలనేది ఇందుకు ఒక కారణం. బలమైన అభ్యర్థి ఎవరూ కూడా ప్రతిపక్షంలో మిగలకూడదనేది మరో కారణం. ఇందుకుగాను సామదానభేదోపాయాలన్నీ ప్రయోగించింది టీడీపీ. ప్రతిపక్షం నుంచి తమ పార్టీలోకి వచ్చే ఎమ్మెల్యేలకు, వారి ప్రధాన అనుచరులు కాంట్రాక్టులు, పర్సంటేజీలు మొదలు అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు కల్పించింది. అదే విధంగా ఆ నియోజకవర్గంలోనే పార్టీని నమ్ముకుని దీర్ఘకాలంగా పనిచేస్తున్న బలమైన నేతలు పార్టీని విడిచిపెట్టి వెళ్లకుండా వారికీ అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు, పదవులు ఇచ్చారు. దీంతో టీడీపీలో ఉన్న నాయకులు డబ్బుల విషయంలో బాగా స్థిరపడగలిగారు. అనుచరులనూ పెంచుకున్నారు. ఆర్థికంగా, అంగబలం రీత్యా పోటాపోటీగా తయారయ్యారు. తెలుగుదేశం పాత కాపులు, వై.సి.పి. నుంచి టీడీపీలోకి వచ్చిన కొత్త పెద్దలు సై అంటే సై , ఢీ అంటే ఢీ అనే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీకి సొంతబలం వందపైచిలుకు సీట్లతో పాటు వై.సి.పి. నుంచి వచ్చిన 20 పైచిలుకు సీట్లతో కలిపి అసెంబ్లీలో మూడింట రెండొంతుల మెజార్టీ ఉంది. సామాజిక, ఆర్థిక బలాల రీత్యా 60 నియోజకవర్గాల్లో పట్టువిడుపులకు తావివ్వని విధంగా టీడీపీ టిక్కెట్టును ఆశిస్తున్న ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు కనిపిస్తున్నారు. తాను ఎమ్మెల్యే కావాల్సిందే అన్నది వీరి పట్టుదల. అవసరమైతే ఒక్క స్థానంలోనే 50 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించేందుకు కూడా కొందరు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. వీరందరికీ టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరిని కాదన్నా రెబల్ గా కానీ, ప్రతిపక్షం శిబిరంలో కానీ చేరిపోయే ప్రమాదం ఉన్నట్లు టీడీపీ పార్టీ సీనియర్లు, ఇంటిలిజెన్సు వర్గాల సమాచారం. అదే జరిగితే అనేక స్థానాల్లో గెలుపు చేజారిపోయే అవకాశం ఉందని టీడీపీ అగ్రనాయకత్వంలో ఆందోళన నెలకొంది. దీంతో తెలుగుదేశం ప్రభుత్వం అందించిన సహకారంతో ఆర్థికంగానూ, అనుచరుల పరంగానూ బలం పుంజుకున్న నాయకులు 2019 ఎన్నికల్లో ప్రధాన తలనొప్పిగా పరిణమించనున్నారు. అసెంబ్లీ సీట్లు 225కి పెంచితే గరిష్టంగా పెద్ద నాయకులందరికీ అవకాశం కల్పించవచ్చని టీడీపీ భావించింది. ప్రతిపక్షం నుంచి చేరికలు జరిగినప్పుడు కూడా సొంతపార్టీలో అసమ్మతి నెలకొనకుండా ఇదే విషయాన్ని చెబుతూ వచ్చింది. కానీ ఇప్పుడు సీట్ల పెంపుదల అవకాశం కనిపించడం లేదు. దీంతో 55 నుంచి 70 నియోజకవర్గాల్లో తిరుగుబాటు బెడద తప్పకపోవచ్చని అగ్రనాయకత్వం ఆందోళన చెందుతోంది. చిట్టా సిద్దం చేసేందుకు ప్రయత్నించినప్పుడు జిల్లాలోని వివిధ వర్గాలు కూడా తమ నాయకుల పేర్లను ముందు పెడుతున్నాయి. అందరూ పోటీకి అన్నివిధాలా అర్హులే కావడంతో సర్దుబాటు చేయడమే సమస్యగా మారుతోంది.

పీకు(కే)లాట...

అధికారపక్షానిది ఒక రకం సమస్య అయితే ప్రతిపక్షానిది మరోరకం బాధ. పొత్తుల సయ్యాటతో టీడీపీ మాదిరిగా బీజేపీ, జనసేనలకు టిక్కెట్లు పంచాల్సిన అవసరం లేదు. అంతవరకూ హ్యాపీ. 90 నుంచి 95 నియోజకవర్గాల్లో క్లియర్ పిక్చర్ కనిపిస్తోంది. అవకాశాలు చాలా బాగున్నాయని పార్టీ అంతర్గతంగా అంచనా వేసుకుంటోంది. అయితే ఆ నియోజకవర్గాల్లో ఇప్పటికే వై.సి.పి. సిద్దం చేసుకున్న జాబితాకు భిన్నంగా వ్యూహకర్త ప్రశాంతకిశోర్ బృందం నివేదిక అందించినట్లు తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో సర్వే చేసి వై.సి.పి. బలంగా ఉన్న 90 నియోజకవర్గాల్లో కనీసం 42 స్థానాలు కొత్త అభ్యర్థులకు కేటాయించాలని ప్రశాంత్ కిశోర్ సిఫార్సు చేసినట్లు తెలిసింది. ఇందులో 2014 ఎన్నికల తర్వాత నుంచి నియోజకవర్గాల్లో పనిచేసుకుంటున్న నాయకులు, పార్టీ కార్యక్రమాలకు భారీగా సొంత నిధులు వెచ్చిస్తున్న వారు కూడా ఉన్నారు. పీకే టీమ్ సిఫార్సులను తోసిపుచ్చలేక, అదే సమయంలో పార్టీనే నమ్ముకుని ఉన్నవారికి ద్రోహం చేయలేక వై.సి.పి సతమతమవుతోంది. అందుకే అభ్యర్థుల విషయంలో పార్టీ అధినేత జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోతున్నారంటున్నారు. ఈ విషయంలో పార్టీలోనూ భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అండగా నిలిచిన వారికి....

విజయసాయి రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి వంటి అగ్రశ్రేణి నాయకులు పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు చెబుతున్నారు. పార్టీతో కలిసి నడిచి, ఆర్థికంగా నష్టపోయినప్పటికీ పార్టీకి అండగా నిలిచిన వారికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వాల్సిందేనని వై.వి. సుబ్బారెడ్డి జగన్ కు స్పష్టం చేసినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాదిరిగానే ఎన్నికల్లో గెలుపోటములను మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలని, సెంటిమెంట్లకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వనవసరం లేదని విజయసాయి రెడ్డి అభిప్రాయపడుతున్నారంటున్నారు. పీకే టీమ్ సిఫార్సులకు విజయసాయిరెడ్డి మద్దతు పలుకుతున్నారు. జగన్ ఫైనల్ డెసిషన్ తీసుకోకపోయినప్పటికీ ఈ రెండు వాదనలపై మల్లగుల్లాలు పడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేకించి రాయలసీమలో వై.ఎస్. కాలం నుంచీ కూడా ఆయన వెంట నడిచి అనుచరులుగా గుర్తింపు తెచ్చుకున్నవారి విషయంలోనూ పీకే టీమ్ ఏమాత్రం కరుణ చూపలేదంటున్నారు. వారిని పక్కనపెట్టాలని సిఫార్సు చేయడంతో పార్టీలో అంతర్గతంగా కూడా ఆవేదన వ్యక్తమవుతోంది. జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారు? ఎప్పటిలోగా చిట్టా ప్రకటిస్తారన్నదానిపై వై.సి.పిలో ఉత్కంఠ రేకెత్తుతోంది. ఆసక్తి వ్యక్తమవుతోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News