ఈ ఇద్దరికీ తలుపులు మూసినట్టేనా?

Update: 2017-11-27 15:30 GMT

ప్రధాన మంత్రి తెలుగు ముఖ్యమంత్రులను చిన్నచూపు చూస్తున్నారనే అభియోగాలు ఇటీవల బాగా పెరిగిపోయాయి. పీఎం అపాయింట్ మెంట్ కోసం నెలలతరబడి ప్రయత్నిస్తున్నా దూరం పెడుతున్నారని ప్రచారం సాగుతోంది. ప్రధాని స్థాయిలో పరిష్కరించాల్సిన అనేక అంశాలు పెండింగులో ఉన్నప్పటికీ ఇరువురు ముఖ్యమంత్రుల వైపు కన్నెత్తి చూసేందుకు ప్రధాని ఇష్టపడటం లేదు. సాధారణ పార్లమెంటు సభ్యులకు సైతం అపాయింట్ మెంట్లు దొరుకుతున్నా తెలుగు సీఎం లకు మాత్రం పీఎం ముఖాముఖి కరవు అవుతోంది. ఇందుకు అనేక రాజకీయ కారణాలు దోహదం చేస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వ్యూహనైపుణ్యం, ఆలోచన పంథా పట్ల నరేంద్రమోడీకి అభిమానం మెండు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి రాజకీయానుభవం, దూరదృష్టి అంటే కూడా పీఎంకి చాలా మక్కువ. అందుకే ప్రధానిగా పదవి చేపట్టిన తొలినాళ్లలో వీరికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. వారు చేసే సూచనలను సైతం పరిశీలనలోకి తీసుకునే వారు. తాజాగా దృశ్యం తిరగబడింది. పార్టీ వర్గాల నుంచి వస్తున్న భిన్న సమాచారం, బీజేపీ మూలసూత్రాలకు విరుద్ధంగా ముఖ్యమంత్రులు తనను ఒప్పించాలని చేస్తున్న ప్రయత్నాలపై ప్రధాని అవగాహనకు వచ్చారంటున్నారు. ఫలితంగానే వీరిని సాధ్యమైనంతవరకూ అవాయిడ్ చేసేందుకు , తప్పనిసరి పరిస్థితుల్లో కలిసినప్పటికీ టు ది పాయింట్ అన్నట్లుగా వ్యవహారానికే పరిమితం చేసేందుకు నరేంద్రమోడీ నిర్ణయించుకున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

కేసీఆర్ రెండంచెల కత్తి...

సందర్భాన్ని తనకు అనుగుణంగా మలచుకోవడంలో కేసీఆర్ రాజకీయ దిట్ట. రాష్ట్రసాధన మొదలు , టీఆర్ఎస్ ను ఎదురులేని శక్తిగా తెలంగాణలో మలచడం వరకూ ఆయన పన్నిన వ్యూహాలు, వేసిన ఎత్తుగడలు రాజకీయ పార్టీలకే పాఠాలు నేర్పాయి. నీతిఅయోగ్ సమావేశాల్లోనూ విలువైన సలహాలు, సూచనలతో ప్రధాని మెప్పు పొందారు. వ్యక్తిగతంగానూ పీఎం తో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోగలిగారు. దీనిని ఆసరాగా చేసుకుంటూ రాష్ట్రస్థాయిలో బీజేపీని నిర్వీర్యం చేసే దిశలో పావులు కదిపారు. అమిత్ షా వంటి అగ్రనేతను తూలనాడటం, అసలు బీజేపీ అస్తిత్వమే తెలంగాణలో లేదంటూ తేల్చివేస్తూ సైకలాజికల్ గేమ్ నడిపారు. ప్రధాని వివిధ సందర్భాల్లో తెలంగాణపై చేసిన వ్యాఖ్య ల ఆధారంగా కేంద్రమంత్రులు సైతం రాష్ట్రప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడం మొదలు పెట్టారు. దీంతో బీజేపీ రాష్ట్ర క్యాడర్ తీవ్రమైన నిరుత్సాహానికి గురైంది. ఏ సందర్భం వచ్చినా ప్రధానిని కోట్ చేస్తూ కేసీఆర్ స్థానిక బీజేపీ నాయకులు నోరు మెదపలేని పరిస్థితిని కల్పించారు. రాష్ట్రపతిగా దళితుడిని ఎంపిక చేయడం మొదలు అన్నిటా ప్రధాని తన సూచనలు పాటిస్తున్నారనే భావన బలంగా వ్యాపించేలా చూసుకున్నారు.

ఎస్సీ, ముస్లిం రిజర్వేషన్ల వల్లనేనా?

ఇంతవరకూ ఫర్వాలేదు. కేవలం ఏడాదిన్నర మాత్రమే ఎన్నికల గడువు ఉంది. క్రమేపీ తమ పార్టీకి అనుకూలించే రాజకీయ అజెండాను అమలు చేసేందుకు కేసీఆర్ ఎత్తుగడలు మొదలు పెట్టారు. ముస్లింలకు రిజర్వేషన్లను జాతీయ స్థాయిలో బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ముస్లిం రిజర్వేషన్లకు ప్రదాని సానుకూలంగా ఉన్నారని, తాను ఈవిషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లానని కేసీఆర్ ఇటీవల ప్రకటన చేశారు. పార్టీ మూల విధానానికి విరుద్ధమైన అంశంపై ప్రధానిని పావుగా వాడుకోవడాన్ని కమలనాథులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిని ప్రధాని దృష్టికి కూడా తీసుకెళ్లారు. రాష్ట్రంలో 12 శాతం వరకూ ఉన్న ముస్లిం మైనారిటీల ఓట్లను గంపగుత్తగా టీఆర్ఎస్ పొందాలంటే రిజర్వేషన్ల అమలు తప్పనిసరి అని కేసీఆర్ భావిస్తున్నారు. కనీసం ఇందుకు సంబంధించి గట్టి ప్రయత్నమైనా తాను చేసినట్లు కనిపించాలనుకుంటున్నారు. అలాగే ఎస్పీల వర్గీకరణ ద్వారా మాదిగలకు ప్రత్యేక రిజర్వేషన్లు కూడా కేసీఆర్ కు రాజకీయ అవసరం. అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ప్రధానిని ఒప్పిస్తామని హామీ ఇచ్చేశారు. అనేక వర్గాలకు రిజర్వేషన్లు పెంచడానికీ తనది పూచీకత్తు అని ప్రకటించేశారు. ఇవన్నీ రాజ్యాంగం ప్రకారం అమలయ్యే అవకాశం లేదు. అయినప్పటికీ ఇందులోకి ప్రధానిని కూడా లాగడం ద్వారా ఎంతో కొంత తన ప్రయత్నానికి రాజకీయ ప్రయోజనం పొందాలనేది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది. మొత్తం విషయాన్ని గ్రహించడంతోనే ముఖ్యమంత్రి కార్యాలయం విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ పీఎంఓ స్పందించడం లేదు. ఒకవేళ పీఎంఓ అపాయింట్ మెంట్ లభించకపోతే రిజర్వేషన్లు ఇచ్చుకునే అధికారాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలంటూ ఢిల్లీలో ధర్నా చేస్తామంటూ కూడా కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ రెండంచెల కత్తి . రాజకీయంగా తన పదును ఎటువైపునుంచైనా ప్రయోగించగలరు. అందుకే ఆయనతో ఆచితూచి వ్యవహరించాలి. సాధ్యమైనంతవరకూ ముఖాముఖి కలవకుండా ఉంటేనే మంచిదనే ఉద్దేశం బీజేపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అఖిలపక్షానికి, కేసీఆర్ కు వ్యక్తిగత అపాయింట్ మెంట్లు ఇవ్వకుండా ప్రధాని జాప్యం చేయడం, నిరాకరించడంలో వాస్తవమిదేనని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

‘బాబో‘య్ అదే కథ...

కేసీఆర్ తో పోలిస్తే చంద్రబాబు నాయుడి అజెండా వేరుగా కనిపిస్తోంది. నిబంధనలు, నియమాల వంటివాటిని పక్కనపెట్టి ఏపీకి కేంద్రం సహకరించాలంటూ చంద్రబాబు చేస్తున్న విజ్ణప్తులు ప్రధానికి తలబొప్పి కట్టిస్తున్నాయి. ద్రవ్యనిర్వహణ, బడ్జెట్ మేనేజ్ మెంట్ చట్టాన్ని పక్కనపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనంగా అప్పులు తెచ్చుకునేందుకు అనుమతించాలని తరచూ కోరుతూ ఉండటం, కేంద్ర లెక్కలను మించి ఏపీలో రెవిన్యూలోటు భర్తీ చేయాలని కోరడం వంటి వన్నీ ప్రధానికి రుచించడం లేదంటున్నారు. చంద్రబాబు నాయుడి అనుభవం పట్ల గతంలో నరేంద్రమోడీకి చాలా గౌరవమర్యాదలు ఉండేవి. కానీ ఓటుకు నోటు కేసులో కేవలం ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవడానికి తెలుగు దేశం పార్టీ నడిపిన హార్స్ ట్రేడింగు, అందులో నేరుగా చంద్రబాబునాయుడి మాటలే రికార్డు కావడం వంటివి కొంతమేరకు కేంద్రానికి కూడా చిక్కులు తెచ్చిపెట్టాయి. ఏపీ,తెలంగాణల మధ్య రాజీ కుదర్చడానికి కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆ తర్వాత నుంచి చంద్రబాబు నాయుడిని మోడీ చెక్ పెట్టారు. పైపెచ్చు ఒకే తరహా డిమాండ్లతో చంద్రబాబు నాయుడు చేసే విజ్ఞాపనలు ఆచరణ సాధ్యం కాదని గ్రహించడంతో చంద్రబాబునాయుడికి పీఎంఓ అపాయింట్ మెంట్లు లభించడం లేదు. అంతేకాకుండా కేంద్రపథకాల పేర్లు మార్చడం, కేంద్రం విడుదల చేసే నిధులను దారిమళ్లించడం వంటి అంశాలపైన కూడా మోడీ వద్ద పలు పిర్యాదులు నమోదయ్యాయి. చంద్రబాబు నాయుడు అవసరమైతే వచ్చే ఎన్నికలలో మైనారిటీ ఓట్ల కోసం బీజేపీని దూరం పెట్టి జనసేనను కలుపుకుని వెళ్లే అవకాశాలున్నాయనే సమాచారం కూడా కేంద్రం వద్ద ఉంది. దీంతో టీడీపీని, చంద్రబాబు నాయుడిని ఎక్కడ ఉంచాలో ఆ పరిధికే పరిమితం చేయాలని మోడీ భావిస్తున్నారంటున్నారు. ఈ పరిస్థితుల్లోనే మోడీ,బాబుల భేటీ బహుదూరం అన్నట్లుగా కనిపిస్తోంది. ఇంతవరకూ మోడీ కేంద్ర ప్రభుత్వాధినేతగా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఎలా వ్యవహరించినప్పటికీ అల్టిమేట్ గా పార్టీ ప్రయోజనాలే పరమావధిగా రానున్న ఎన్నికల వరకూ వ్యవహరిస్తారని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే తెలుగు ముఖ్యమంత్రులకు ప్రధాని కార్యాలయ ద్వారాలు మూతపడినట్టే అనుకోవచ్చు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News