ఇవాంకా... కసితో కోట్లకు పడగలెత్తారు...!

Update: 2017-11-18 16:30 GMT

ఇవాంకా ట్రంప్.... ఇప్పుడు ఈ పేరు తెలియని వారు బహు అరుదు అంటే అతిశయోక్తి కాదు. ఆమె అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు కూతురు. ఆయన సలహాదారు కూడా. ప్రముఖ వ్యాపార వేత్త, మోడలింగ్, యాంకరింగ్... ఇలా ఆమె ప్రతిభ బహుముఖం. గత ఏడాది తండ్రి తరుపున ఎన్నికల ప్రచారం చేసి ఆయన గెలుపునకు దోహదపడ్డారు. ఇవాంకా అమెరికాలోని అతిపెద్ద వ్యాపార వేత్తల్లో ఒకరు. ఇప్పుడు ఆ హాదాలోనే హైదరాబాద్ లో జరగననున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరు కానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో ఆమె వేదిక పంచుకోనున్నారు. ఈ నెల 28నుంచి హైటెక్స్ లో మూడు రోజులపాటు సదస్సు జరగనుంది. మొత్తం 180 దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సులో ఇవాంక కీలకోపన్యాసం చేయనున్నారు. ఇవాంకా పర్యటనలో భాగంగా మూడు రోజుల పాటు భాగ్యనగరంలో బస చేయనున్నారు. ఆమె ప్రముఖ పర్యాటక కేంద్రమైన గోల్కొండ కోటను సందర్శించనున్నారు. ఇవాంకా పర్యటన నేపథ్యంలో అమెరికా భద్రతాధికారులు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ఇవాంకా కోసం ప్రత్యేకంగా 20 వాహనాలను రప్పించారు. మొత్తం భద్రతను అమెరికా అధికారులు తమ చేతుల్లోకి తీసుకున్నారు. భారతీయ భద్రతాధికారులును కేవంల రెండు ఫర్లాంగుల దూరంలో మాత్రమే అనుమతిస్తారు.

తల్లి.. తండ్రి బాటలోనే....

ఇవాంకా 1981 అక్టోబర్ లో న్యూయార్క్ లో జన్మించారు. ట్రంప్ మొదటి భార్య ఇవానా రెండో కుమార్తె ఇవాంకా. ఇవాంకా ఫ్యాషన్ డిజైనర్... రచయిత... స్థిరాస్థి వ్యాపారి... టీవీ యాంకర్... ప్రస్తుతం తన తండ్రి అయిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాదారుగా రాజకీయాల్లో, పరిపాలన రంగంలో చక్రం తిప్పుతున్నారు. ఇవాంకా తల్లి ఇవానా కూడా మోడలింగ్ రంగంలో పనిచేశారు. ఆమె మంచి మోడల్. తల్లి నుంచే ఈ రంగానికి సంబంధించిన మెలకువలు, లోతుపాతులను ఇవాంకా తెలుసుకున్నారు. తండ్రి వైపు కుటుంబం నుంచి వ్యాపారరంగ ఆసుపానులను గ్రహించారు. నాయనమ్మ ఎలిజిబెత్ క్రిస్ట్ ట్రంప్, తాత ఫ్రెడ్ ట్రంప్, తండ్రి డొనాల్డ్ ట్రంప్ల పర్యవేక్షణలో వ్యాపార రంగానికి సంబంధించి అధ్యయనం చేశారు. వారి శిష్యరికంలో మంచి వ్యాపారవేత్తగా ఎదిగారు. 2005లో కుటుంబం వ్యాపారంలోకి ప్రవేశించే ముందు ఫారెక్స్ సిటీ ఎంటర్ ప్రైజెస్ అనే సంస్థలో పనిచేశారు. 2007లో భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించారు. డైమండ్, జ్యుయలరీ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహించారు. అమెరికాతో పాటు కెనడా, బహ్రెయిన్, కువైట్, కతార్, సౌదిఅరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాల్లో ఆమె వ్యాపార కార్యకలాపాలు సాగుతున్నాయి. తండ్రి నుంచి జ్యుయలరీ వ్యాపారాన్ని స్వీకరించిన ఇవాంకా తర్వాత ఫ్యాషన్ డిజైన్ రంగంలోకి కూడా ప్రవేశించారు. అనతికాలంలోనే వ్యాపారాన్ని కొత్తపుంతలు తొక్కించిన ఇవాంకా ఆస్తుల విలువ 300 మిలియన్ డాలర్లు అని అంచనా. డోనాల్డ్ జూనియర్, ఎరిక్ సోదరులుగల ఇవాంకా పారిశ్రామిక దిగ్గజాన్ని 2009లో పెళ్లాడారు. జుడాయిజం మతానికి చెందిన భర్త జారెడ్ కుష్ నెర్ వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. మతపరమైన కారణాలతో విడిపోయారు. చివరకు ఇవాంకా మతం మార్చుకుని జుడాయిజం లోకి మారి, మళ్లీ ఆ మత సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. భర్త జారెడ్ కుష్ నెర్ తండ్రి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపార దిగ్గజం. జారెడ్ హార్వార్డ్ విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో డిగ్రీ చేశారు.

వ్యాపారంలోనూ, రాజకీయాల్లోనూ....

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మెలనియాను రెండో వివాహం చేసుకున్నప్పటికీ మొదటి భార్య కూతురు ఇవాంకా అంటే ఎంతో ఇష్టం. ఇవాంకా నేటికీ అతని గారాల పట్టీ. అందువల్లే 2016లో అధ్యక్ష ఎన్నికల్లో అన్ని వ్యవహారాలను ఆమెకు అప్పగించారు. మొత్తం ఎన్నికల ప్రచారాన్ని ఇవాంక తన భుజ స్కంధాలపై వేసుకుని సమర్థంగా నిర్వహించారు. ట్రంప్ గెలుపులో ఆమెది కీలకపాత్ర. ఆంగ్లంతో పాటు ఫ్రెంచ్ భాషను అనర్గళంగా మాట్లాగడల ఇవాంకా రాజకీయ రంగగం లోతుపాతులను, మెలకువలను అనతికాలంలోనే గ్రహించింది. ఇవాంకా తొమ్మిదేళ్ల వయస్సులో ఆమె తల్లి ఇవానా నుంచి ట్రంప్ విడాకులు తీసుకున్నప్పటికీ కూతురిపై ప్రేమ ఎంతమాత్రం తగ్గలేదు. అధికారిక హోదాలో ట్రంప్ సతీమణి మెలానియా ప్రధమ మహిళ అయినప్పటికీ అధికారం అంతా ఇవాంకా చేతిలోనే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. 2017 జనవరిలో ఇవాంక భర్త జారెడ్ కుష్ నెర్ ను ట్రంప్ తన సలహాదారుడిగా నియమించుకున్నారు. 2017 మార్చి నుంచి ట్రంప్ అధికార యత్రాంగంలో ఇవాంకా పనిచేస్తున్నారు. అధికారిక విషయాలతో పాటు, అనేక అంశాల్లో తండ్రికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. అటు రాజకీయంగా, ఇటు వ్యాపారరంగంలో తండ్రికి తగ్గ కూతురిగా నిలుస్తున్నారు ఇవాంక. మూడు పదుల వయస్సులో గల ఆమెకు మున్ముంద ఉజ్వల భవిష్యత్తు ఉందనడంలో సందేహం లేదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News