ఇరువర్..ఎవరు ..తలై‘వా..ర్‘

Update: 2017-12-27 15:30 GMT

ఇద్దరు మహానటులు. కెరియర్ చివరి దశలో సినీ జీవితం. ఎదురుగా కనిపిస్తున్న పొలిటికల్ స్పేస్. రా రమ్మంటున్న అభిమాన గణం. వెండి తెర వేల్పులను గుండెల్లో పెట్టుకుని గుడి కట్టే ప్రేక్షక జనం. అభిమానమే పెట్టుబడిగా అందలమెక్కే అవకాశం. ఆ ఇద్దర్నీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకరు బాహాటంగానే ప్రకటించేశారు. తాను వచ్చేశానంటూ రాజకీయ అరంగేట్రం షురు చేసేశారు. ఇంకొకరు కొద్దిగా భయపడుతున్నారు. అభిమానుల మీటింగులు, అందరూ కోరుతున్నారంటూ సన్నాయి నొక్కులతో సమయాన్ని సాగదీస్తున్నారు. కమలహాసన్, రజనీకాంత్ ల పొలిటికల్ ఎంట్రీ తమిళనాడులోనే కాదు, దక్షిణాదిలోనే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సౌత్ ఇండియాలోనే వీరిరువురూ పెద్ద స్టార్స్ కావడానికి తోడు ఉత్తరాదికి కూడా పరిచయమున్న ప్రముఖ నటులు కావడంతో దేశ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమవుతోంది. జయలలిత మరణం, కరుణానిధి దీర్ఘకాల అస్వస్థతతో సినీ, రాజకీయ శకంలో ఒక తరం ముగిసింది. సినిమాల చుట్టూనే రాజకీయాలు తిరిగే తమిళనాట మరో కొత్త తరం కోసం అభిమాన ప్రేక్షక రాజకీయ ఓటర్లు ఎదురు చూస్తున్నారు. అందుకొనే దెవరనేదే తేలాల్సి ఉంది.

ఏడీఎంకే కి ఎదురుగాలి..డీఎంకే డీలా

అయిదు దశాబ్దాలుగా తమిళనాట డీఎంకే, ఏఐడీఎంకేలదే హవా. ఏదో ఒక పార్టీ అధికారంలో ఉంటూ వస్తోంది. స్వాతంత్ర్యోద్యమకాలం నుంచీ ప్రత్యేక భావజాలం , హేతువాద పునాదులపై ద్రవిడ ఉద్యమానికి పునాదులు వేసింది ద్రవిడ కజగం. పెరియార్ రామస్వామి దీనికి కర్త,కర్త,క్రియగా వ్యవహరించారు. ఆ తర్వాత కాలంలో రాజకీయపార్టీ డీఎంకేగా రూపురేఖలు ఇచ్చిన వ్యక్తి అన్నాదురై. సినీరంగాన్ని ఏలుతున్న ఎంజీఆర్, సినీ రచయితగా రాణిస్తున్నకరుణానిధి వెన్నుదన్నుగా అన్నాదురై సారథ్యంలో 1967లో రాజకీయాధికారాన్ని చేజిక్కించుకుంది డీఎంకే. అప్పట్నుంచి కాంగ్రెసుకు తమిళనాట కాలం చెల్లిపోయింది. డీఎంకే నేత కరుణానిధి నుంచి బహిష్కరణ ఎదుర్కొని సొంత కుంపటి పెట్టుకుని ఏడీఎంకే స్థాపించి 1977లో అధికారం దక్కించుకున్నారు ఎంజీఆర్. 1988లో చనిపోయేవరకూ ఎంజీఆర్ నే ఆరాధించి అధికారం అప్పగించారు తమిళ ప్రజ. ఆ తర్వాత ఆల్ ఇండియా అన్న కొత్త పేరు చేర్పుతో ఏఐఏడీఎంకేకి సర్వంసహాధికారిగా ఆవిర్భవించారు జయలలిత. అప్పట్నుంచీ ప్రభుత్వాధికారం డీఎంకే, ఏడీఎంకే ల మధ్య దోబూచూలాడుతూ వస్తోంది. జయలలిత మరణం తర్వాత వ్యక్తికేంద్రంగా నడిచే ఏఐఏడీఎంకే నిలదొక్కుకుంటుందనే నమ్మకం దాదాపు అడుగంటింది. అలాగని శశికళ వర్గం పార్టీని బతికించగలిగే పరిస్థితులు కూడా లేవు. మరోవైపు కరుణానిధి శకం కూడా ముగిసిపోవచ్చింది. ఆ స్థాయిలో పార్టీకి దిశానిర్దేశం చేసి తమిళ రాజకీయాన్ని ఏకచ్ఛత్రం కిందకి తేగల సామర్థ్యం దళపతి స్టాలిన్ కు లేదు. ఉన్నంతలో డీఎంకే రాజకీయ మనుగడకు ఢోకా లేదు. కానీ ప్రత్యర్థి ప్లేస్ ఖాళీగానే ఉంటుంది. ఈ స్థానమే ప్రస్తుతం సినీ ప్రముఖులైన రజనీ, కమల్ లను ఊరిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్న డీఎంకేను వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా పక్కకు నెట్టేసి ప్రస్తుతం అధికారంలో ఉన్న ఏఐఏ డీఎంకే స్థానంలో అధికారంలోకి రావాలనేది ఈ ఇద్దరి కల. కానీ ఇంకా రజనీకాంత్ సందిగ్ధంలోనే ఉండగా, కమల్ మాత్రం దూకుడు కనబరుస్తున్నారు.

దారులు వేరు...

రజనీకాంత్, కమల్ హాసన్ లిద్దరివీ వేర్వేరు దారులు. కమల్ హాసన్ కు కాసింత ప్రాక్టికాలిటీ తక్కువ. దూకుడు ఎక్కువ. రజనీకాంత్ తో పోలిస్తే అభిమానుల సంఖ్య కూడా తక్కువే. కమల్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసి అధికారంలోకి వచ్చేంత ప్రభావం చూపలేరనేది పరిశీలకుల అంచనా. గతంలో కూడా తమిళనాడులో శివాజీ గణేశన్, విజయకాంత్ వంటి ప్రముఖ నటులు ప్రయత్నించినా రాజకీయ రంగంలో ఆశించిన విజయాలు సాధించలేకపోయారు. వామపక్ష భావజాలానికి దగ్గర మనస్తత్వం కలిగిన కమల్ హాసన్ కు ప్రజాదరణ విషయంలో పరిమితులు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బలమైన ప్రత్యామ్నాయాన్ని ఆవిష్కరించడంలో కమల్ కు ఇది ప్రతిబంధకమే. 1996 నుంచీ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై చర్చ నడుస్తోంది. మహారాష్ట్ర, కన్నడ మూలాలు కలిగిన రజనీకాంత్ కు తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యే అర్హతే లేదంటూ ప్రత్యర్థులు అనేక సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఎంజీఆర్ శ్రీలంక మూలాలు కలిగి ఉన్నారు. కరుణానిధి పూర్వీకులు తెలుగువారని చెబుతారు. వైగో కూడా తెలుగు సంతతే. జయలలిత కన్నడ. అందువల్ల ప్రజల్లోకి వెళ్లి పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత ఇటువంటి అంశాలు పెద్దగా పనిచేయకపోవచ్చు.

ఈ సింహానికి స్పీడు తక్కువ...

అసలు సమస్య రజనీకాంత్ మనస్తత్వమే. సినిమాల్లో చూపించే డేరింగ్, డేషింగ్ ధోరణి రజనీ నిజజీవితంలో కనిపించదు. పోరాటతత్వం కూడా తక్కువే. ప్రత్యర్థులపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టేందుకు సాహసించరు. ఏడాదికాలంగా రాజకీయ అవకాశం ఎదురుచూస్తున్నా ఎటూ తేల్చకుండా నాన్చడం ఆయన దాటవేత వైఖరికి అద్దం పడుతోంది. మే నెలలో అభిమాన సంఘాలతో సమావేశమయ్యారు. మళ్లీ తాజాగా మరోసారి ఆయన అభిమానులను కలిశారు. అన్ని అభిమాన సంఘాలు రజనీ రాజకీయాల్లోకి రావాలనే కోరుతున్నాయి. ఏఐఏడీఎంకే , డీఎంకే బలమైన ప్రత్యర్థులుగా ఉన్న సమయంలో రంగప్రవేశం చేస్తే పార్టీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏఐఏడీఎంకే అస్తిత్వం ఏమిటో తెలియని పరిస్థితి, మరోవైపు డీఎంకే కూడా బలహీనంగా కనిపిస్తోంది. ఇలా రెండు ప్రధాన పక్షాలూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. రాజకీయంగా కొత్త పార్టీ ఆవిర్బవించేందుకు ఈ వాతావరణం తగినంత స్కోప్ కల్పిస్తోంది. అందువల్ల ఇదే తగిన సమయం, సందర్భము అని పరిశీలకుల భావన. రాజకీయంగా అంతటి సాహసం రజనీకాంత్ చేస్తాడా? చేసి నిలదొక్కుకుంటాడా? పార్టీ అంటే పవర్ లోకి రావడమే అన్న ఆయన భావన తప్పు. ప్రతిపక్షంగానూ సమర్థంగానే పనిచేయవచ్చు. ఆ స్థాయి పరిణతి రజనీలో ఉందా? లేక ఓడిపోతామనే భయంతోనే పార్టీ పెట్టాలన్న నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారా? వంటి అనేక సందేహాలు ప్రజల్లో కూడా ఉన్నాయి. వీటన్నిటినీ పట్టించుకోకుండా ముందడుగు వేస్తేనే పొలిటికల్ తలైవా..గా నిలదొక్కుకోగలడు.

- ఎడిటోరియల్ డెస్క్

Similar News