ఇద్దరూ కాక పుట్టిస్తున్నారే...!

Update: 2017-12-04 15:30 GMT

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పీడు పెంచారు. ఎన్నికల దిశలో జోరుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆచరణ సాధ్యాసాధ్యాలు , సమాజంలో ఏర్పడే సంఘర్షణలతో సంబంధం లేకుండా రాజకీయ క్రీడకు తెర లేపారు. ఒకరు కాపు రిజర్వేషన్లంటుంటే మరొకరు చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ప్రతిపక్షాల ముందరి కాళ్లకు బంధం వేస్తూ రాజకీయంగా అన్ని అవకాశాలను తామే అందిపుచ్చుకునే దిశలో అడుగులు వేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలు సైతం విమర్శించలేని వ్యూహాలకు పదును పెడుతున్నారు. కాపులకు అయిదు శాతం రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి , కేంద్రానికి పంపించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొమ్మిదో షెడ్యూల్ లో పెట్టి పార్లమెంటు ఆమోదంతో వీటిని అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. బీసీల అభివృద్ధికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి అసెంబ్లీలో నిర్ణయాలు తీసుకుందామని కేసీఆర్ వివిధ రాజకీయ పక్షాలతో సమావేశం నిర్వహించారు. ఇంతవరకూ చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు లేవు. దీనిపై కూడా నిర్ణయం తీసుకుని తీర్మానం చేసే దిశలో ఆయన పావులు కదుపుతున్నారు. ఇదో చారిత్రాత్మక నిర్ణయం అవుతుంది. అయితే అమలు మాత్రం పార్లమెంటు ఆమోదంతో ముడిపడి ఉంటుంది.

‘కాపు‘ కాస్తారా?

రాష్ట్రవిభజన, పవన్ కల్యాణ్ కున్న సినిమా క్రేజు కారణంగా 2014 ఎన్నికల్లో కాపు వర్గానికి చెందిన అత్యధికులు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాలు , అనంతపురం, విశాఖ, గుంటూరు జిల్లాల్లో ఆపార్టీ సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనం. నిజానికి 1988లో రంగా హత్యానంతరం కాపు వర్గాలు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యాయి. 2004 ఎన్నికల్లో వై.ఎస్. నేతృత్వంలోని కాంగ్రెసు పార్టీకి అండగా నిలిచారు. 2009 లో చిరంజీవి ప్రజారాజ్యంతో రంగప్రవేశం చేయడంతో మెజార్టీ కాపు వర్గీయులు ఆ పార్టీకి జై కొట్టారు. అదే పీఆర్పీకి 18 సీట్లు తెచ్చిపెట్టింది. అనేక నియోజకవర్గాల్లో ప్రధానపార్టీల అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసింది. 2014 లో పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించినప్పటికీ కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అవసరాల దృష్ట్యా తెలుగుదేశానికి మద్దతు ప్రకటించారు. అంతకుముందుగానే కాపు వర్గాలను ఆకట్టుకోవడానికి రిజర్వేషన్లు ఇస్తామంటూ చంద్రబాబు ప్రకటించారు. ఈ రెండు నిర్ణయాల ఫలితంగా తొమ్మిదో దశకం తర్వాత తొలిసారిగా కాపులు టీడీపీ వెంట నడిచారు. గడచిన రెండేళ్లుగా ముద్రగడ రూపంలో ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా రిజర్వేషన్లకు పచ్చజెండా ఊపేశారు. ఇల్లు అలకగానే పండగ కాదు. రాజ్యాంగ ప్రతిబంధకాలతో అమలు పై సందిగ్ధత, అనిశ్చితి నెలకొంది. కేవలం అసెంబ్లీ తీర్మానం చేయడంతోనే రిజర్వేషన్లు రాకుండానే టీడీపీకి కాపులు మద్దతు పలుకుతారా? అంటే అనుమానమే. అయితే తాము చేయాల్సింది చేశామని చెప్పుకోవడానికి టీడీపీకి పనికొస్తుంది అంతే. తమిళనాడులో 69శాతం రిజర్వేషన్లు 1992 కి ముందుగానే చేశారు. 1992 లో సుప్రీం కోర్టు రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని స్పష్టం చేసేసింది. న్యాయసమీక్షకు అతీతంగా షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చమని చెబుతున్న వాదన కూడా అర్థరహితమే. 2007లోనే తొమ్మిదో షెడ్యూల్ ను కూడా సమీక్షిస్తామని సుప్రీం తేల్చి చెప్పింది. అందువల్ల రాజకీయ ఒత్తిడితో పార్లమెంటు ఆమోదించినా సుప్రీం అడ్డు కట్ట వేసే అవకాశాలున్నాయనేది న్యాయనిపుణుల వాదన. మొత్తమ్మీద ఎన్నికల లోపు రిజర్వేషన్ల అమలు అసాధ్యంగా కనిపిస్తోంది.

బీసీలకు గాలం ..?

తెలంగాణ జనాభాలో అధికసంఖ్యలో బీసీలున్నారు. వెనకబడిన తరగతుల శాతం ఆంధ్రప్రదేశ్ లో కంటే తెలంగాణలోనే ఎక్కువ. బలమైన ఆర్థిక, సామాజిక పునాది కలిగిన రెడ్లు, 15శాతం పైగా జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న దళిత వర్గాలు కాంగ్రెసు వైపు ఆకర్షితులవుతున్నారని గ్రహించిన కేసీఆర్ ప్రతివ్యూహంలో బాగంగానే బీసీలను ముందుకు తెస్తున్నారు. బీసీలకు ప్రత్యేక బడ్జెట్ తో పాటు అసెంబ్లీ, పార్లమెంటులో రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్ తో వెనుకబడిన వర్గాలను టీఆర్ఎస్ కు చేరువ చేయాలని ప్రయత్నాలు ప్రారంభించారు. బీసీలు వెన్నుదన్నుగా ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ప్రాభవాన్ని కోల్పోవడం కూడా కేసీఆర్ కు ఒక సదవకాశంగా కనిపిస్తోంది. ఇప్పటికీ టీఆర్ఎస్ ను ఒక బలహీనత వెన్నాడుతోంది. వెలమ సామాజిక వర్గాన్ని మినహాయిస్తే పెద్ద సంఖ్యలో జనాభాకు ప్రాతినిధ్యం వహించే కులం, వర్గం శాశ్వత మద్దతు ఆ పార్టీకి లోపించింది. కేవలం సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, పనితీరు ద్వారానే టీఆర్ఎస్ అధికారాన్ని నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. సంక్షేమ , ప్రగతి కార్యక్రమాల తోపాటు శాశ్వత ఓటు బ్యాంకు ను టీఆర్ఎస్ కు సంపాదించి పెట్టే పనిలో కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగమే ముస్లింలకు రిజర్వేషన్లు, బీసీలకు చట్టసభల్లో రాజకీయరిజర్వేషన్లు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలకు కులాల వారీ మద్దతు సర్వసాధారణంగా మారిన పరిస్థితుల్లో టీఆర్ఎస్ కు కూడా అటువంటి అండ కల్పించడమే కేసీఆర్ లక్ష్యం. ఏపీలో తెలుగుదేశానికి కమ్మ, బీసీ వర్గాలు, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి రెడ్డి, దళిత, ముస్లిం వర్గాలు మెజార్టీ సంఖ్యలో మద్దతు ఇస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెసు పార్టీకి రెడ్డి, దళిత వర్గాల మద్దతు కొనసాగుతోంది. గతంలో ముస్లింల మద్దతు కూడా కాంగ్రెసుకు లభిస్తూ ఉండేది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈవర్గాన్ని కాంగ్రెసు నుంచి వేరు చేసేందుకు టీఆర్ఎస్ బలమైన ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకుగాను ఎంఐఎం సపోర్టు కూడా తీసుకొంటోంది.

కేంద్రం...గుప్పెట్లోకి...

అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర చేసిన తీర్మానాలపై నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత, అధికారం కేంద్రానిదే. రాజకీయంగా తనకు ఎటువంటి ప్రయోజనం సమకూరదని బీజేపీ భావిస్తే అసెంబ్లీలు ఆమోదించిన తీర్మానాలను కోల్డ్ స్టోరేజీలో పెట్టడం ఖాయం. మహిళా రిజర్వేషన్ బిల్లు వంటివి దశాబ్దాల తరబడి ఇదే విధంగా మగ్గుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని అధికార పక్షాల డిమాండ్లకు అనుకూలత చూపితే దేశవ్యాప్త పర్యవసానాలు ఉంటాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఇదే తీరులో అనేక కొత్త డిమాండ్లు వస్తాయి. అందువల్ల సాధ్యమైనంతవరకూ ఏపీ,తెలంగాణల డిమాండ్లను కేంద్రం పట్టించుకోకపోవచ్చని పరిశీలకులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి లభించే రాజకీయ ప్రయోజనాలు అత్యల్పం. అందువల్ల తేనెతుట్ట వంటి రిజర్వేషన్ల అంశాన్ని కదిపేందుకు సాహసించదు. అయితే టీడీపీ, టీఆర్ఎస్ లు మాత్రం బీజేపీ లక్ష్యంగా బ్లేమ్ గేమ్ ఆడేందుకు వీలవుతుంది. అధికార పక్షాలు ఎన్నికల పబ్బం గడుపుకొనేందుకు ఒక అవకాశం లభిస్తుంది.

- ఎడిటోరియల్ డెస్క్

Similar News