ఇద్దరు పీకేలతో ఇరకాటం

Update: 2018-03-11 14:30 GMT

తాజాగా మళ్లీ అదే సమస్య. ఇరువురు పీకేలతో ఎలా డీల్ చేయాలో తెలియక వైసీపీ అగ్రనేతలు తలలు పట్టుకుంటున్నారు. ఒకరు పార్టీ స్ట్రాటజిస్టు. మరొకరు పార్టీ ఫిలాసఫిస్టుగా మారిపోయారని చెవులు కొరుక్కుంటున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందం బాగా క్రియాశీలకంగా మారిపోయింది. పాదయాత్రను నేరుగా పర్యవేక్షించడంతోపాటు ఫీడ్ బ్యాక్ పై కూడా దృష్టి పెడుతోంది. అగ్రనాయకుల బలహీనతలు, వర్గ విభేదాలు, ప్రజాబలం వంటి అంశాలపైనా కసరత్తు సాగిస్తోంది. తమకే సీట్లు ఖాయమని భావిస్తున్న కొందరు అభ్యర్థులకు ఈ ఫీడ్ బ్యాక్ వ్యవహారం చికాకు కలిగిస్తోంది. పాదయాత్రలో ఉన్న జగన్ నేరుగా బలహీనతలకు సంబంధించి నియోజకవర్గ నేతలను ప్రశ్నిస్తుండటంతో ఇబ్బంది పడుతున్నారు. టిక్కెట్ల విషయంలోనూ అయోమయానికి గురవుతున్నారు. దీనంతటికీ కారణం పీకే టీమ్ ఇస్తున్న సమాచారమనే దుగ్ధ తో నాయకులు రగిలిపోతున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ వైసీపీనే లక్ష్యంగా చేసుకుంటూ విసురుతున్నసవాళ్లకు, డిమాండ్లకు పార్టీ స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఇది కూడా కొంత గందరగోళానికి దారితీస్తోందంటున్నారు.

అజెండా..సెట్ చేస్తున్నాడా?

ట్రెండ్ ను ఫాలో కాను. ట్రెండ్ సెట్ చేస్తానంటూ ఒకానొక సినిమాలో పవన్ కల్యాణ్ డైలాగ్ చెబుతారు. తాజాగా రాజకీయాల్లో సినిమానే తలపింపచేస్తున్నారు. అధికారపక్షాన్ని లక్ష్యంగా చేసుకోకుండా ప్రధాన ప్రతిపక్షాన్ని ఉద్దేశించి చేస్తున్న విమర్శలే పవన్ మాటల్లో ఎక్కువగా తొంగిచూస్తుంటాయి. టీడీపీపై విమర్శించాల్సిన, బదులు చెప్పాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి. వాటిపై వైసీపీకి కౌంటర్ గా జనసేన పనిచేస్తుందనే భావన ఏర్పడిపోయింది. ప్రత్యేక హోదా కోసం తమ ఎంపీలు రాజీనామా చేస్తారంటూ జగన్ ప్రకటన చేశారు. రాజీనామాకు ప్రత్యామ్నాయంగా కేంద్రప్రభుత్వంపై అవిశ్వాసం అనే కొత్త డిమాండ్ ను పవన్ కల్యాణ్ ముందుకు తెచ్చారు. దీనికి స్పందించకపోతే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా తాము బలహీన పడతామనే ఉద్దేశంతో జగన్ తనంత తాను ముందుకు వచ్చి అవిశ్వాసం పెడతామంటూ ప్రతిపాదించారు. దీనిని సంపూర్ణంగా స్వాగతించని పవన్ కల్యాణ్ వైసీపీ నిర్ణయించుకున్న తేదీ కాకుండా ఇమ్మీడియట్ గా అవిశ్వాసం పెట్టాలంటూ తన అజెండాలోనే సవరణలు చేసుకున్నారు. అజెండా ప్రతిపాదించిందీ దానికి సవరణలు చేసుకున్నదీ పవన్ కల్యాణ్ బృందమే కానీ తమ పార్టీ ముందుకు రావడం లేదనే ప్రచారాన్నే ప్రజల్లోకి తీసుకెళుతోందని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఒక రకంగా చూస్తే వైసీపీకి పవన్ కల్యాణ్ అజెండా సెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోందనే వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. అయితే జనసేన వర్గాలు కూడా దీనికి దీటుగానే బదులిస్తున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని టార్గెట్ చేయకుండా టీడీపీనే తప్పుపట్టడం వైసీపీ రాజకీయ ఎత్తుగడగా జనసేన పేర్కొంటోంది. తాము బీజేపీ, వైసీపీ, టీడీపీలు మూడింటికీ ప్రత్యామ్నాయ అజెండాను ముందుకు తెస్తామంటూ జనసేన నేతలు పేర్కొంటున్నారు.

గుంటూరు బరిలో...

ప్రకాశం జిల్లాలో పాదయాత్రను ముగించుకుని జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో ప్రవేశించబోతున్నారు. ఈనెల పధ్నాలుగో తేదీన పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్భావ సభను ఇదే జిల్లాలో నిర్వహించబోతున్నారు. పవన్ ప్రభావం బలంగా ఉంటుందని భావిస్తున్న జిల్లాల్లో గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలున్నాయి. జగన్ పాదయాత్ర మధ్య కోస్తాలో మొదలుకాకముందే భారీ సభతో జనసేన బదులివ్వబోతోందని పవన్ అభిమానులు పేర్కొంటున్నారు. జనసేన రాజకీయ సిద్దాంతం, ఎన్నికల అజెండాను ఇక్కణ్నుంచే పవన్ ప్రకటించే అవకాశాలున్నాయి. వైసీపీ పేరు నేరుగా ప్రస్తావించకపోయినా ఆ పార్టీపై విమర్శలు గుప్పించే ఆస్కారం ఉంది. ఇదే జిల్లా నుంచే గతంలో జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల పేరిట ముందస్తు ఎన్నికల ప్రణాళికను వెల్లడించారు. రాష్ట్రంలోని పెద్ద జిల్లాల్లో ఒకటైన గుంటూరు రాజకీయ కేంద్రం కూడా. రాజధాని ప్రాంతం ఈ జిల్లాలో అంతర్బాగంగా ఉంది. అందువల్ల ప్రజల పొలిటికల్ మూడ్ ను పట్టి చూసేందుకు గుంటూరు దోహదం చేస్తుంది. ఈ ఇద్దరు నాయకులు ముఖాముఖి ఎదురుపడకపోయినా గుంటూరు బరిలో పరస్పర రాజకీయ విమర్శలతో వాతావరణాన్ని వేడెక్కించే పరిస్థితి కనిపిస్తోంది.

హామీల ఆందోళన...

తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికలో దాదాపు ఆరువందల హామీలు గుప్పించిందని అందులో అయిదువందల హామీల ఊసే మరిచిపోయిందని వైసీపీ పదే పదే ప్రస్తావిస్తోంది. రైతు రుణమాఫీ పూర్తి కాలేదు. నిరుద్యోగ భృతి, కాపు రిజర్వేషన్ల వంటి అంశాలూ పెండింగులోనే ఉన్నాయి. రిజర్వేషన్ల విషయంలో వ్యూహాత్మక విమర్శలే తప్ప తాము ఇప్పుడు కొత్తగా హామీ ఇస్తే భవిష్యత్తులో తమ తలకు చుట్టుకుంటుందనే భయం వైసీపిని కూడా వెన్నాడుతోంది. మిగిలిన విషయాల్లో టీడీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. టీడీపీ కూడా వైసీపీ నవరత్నాల పథకంపై విమర్శలు గుప్పిస్తోంది. ఆకాశంలో చందమామను తెచ్చి ఇస్తామన్నట్లుగా హమీలు ఇచ్చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి ఏ మాత్రం అవగాహన లేకుండా వైసీపీ ప్రణాళికను ప్రకటించిందని టీడీపీ ఆరోపిస్తోంది. నవరత్నాల్లో పేర్కొన్న పథకాల అమలుకు పన్నెండు లక్షల కోట్ల రూపాయల మేరకు వ్యయం చేయాల్సి ఉంటుందని లెక్కలు తీస్తోంది. ఏడాదికి లక్షాయాభై వేల కోట్ల రూపాయల బడ్జెట్టును మాత్రమే అమలు చేయగల ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఏపీలో ఉంది. రానున్న అయిదేళ్లలో ఇది రెట్టింపునకు చేరి మూడు లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. జీతభత్యాలు, సాధారణ నిర్వహణ ఖర్చులు, రుణ చెల్లింపులు తీసి వేస్తే ఏడాదికి 20 వేల కోట్ల రూపాయలు కూడా ప్రత్యేక కేటాయింపులు చేసే పరిస్థితి రాష్ట్రప్రభుత్వానికి లేదు. అందువల్ల అయిదేళ్లలో పన్నెండు లక్షల కోట్ల రూపాయల వ్యయమయ్యే హామీలను ఎలా అమలు చేస్తారని టీడీపీ సవాల్ విసురుతోంది. ఇప్పటికీ 2014 ఎన్నికల హామీలను అమలు చేయలేక ఆపసోపాలు పడుతున్న టీడీపీ దుస్థితి, ఆకాశంలో చందమామను తలపిస్తున్న వైసీపీ హామీలు దొందూ దొందే అన్నట్లుగా కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ విమర్శకులు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News