ఇద్దరికీ కంటి మీద కునుకు లేదే...!

Update: 2017-12-06 16:30 GMT

ప్రతి ఎన్నికా ప్రతిష్ఠాత్మకమే. నైష్పత్తిక ప్రాతినిధ్యం కాకుండా ఒక్క ఓటు ఎక్కువ వస్తే చాలు గెలుపోటములను నిర్ణయించే ప్రజాస్వామ్య విధానంలో ఏ ఎన్నిక వచ్చినా చావో రేవో తేల్చుకోవాల్సిందే. కానీ ఈ సారి గుజరాత్ విసురుతున్న సవాల్ ప్రత్యేకమైనది. విధానపరమైన అంశాలపై ప్రధాన పక్షాలకు పరీక్ష పెడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ, కాంగ్రెసు లు కదనశంఖం పూరిస్తున్నాయి. దేశంలోనే తమ విధానాలకు ప్రయోగ వేదికగా గుజరాత్ ను బీజేపీ తీర్చిదిద్దుకుంది. ప్రతి గ్రామంలో పటిష్టమైన నిర్మాణంతో 22 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతోంది. ఎంత హింసాత్మకమైన సంఘటనలు చోటు చేసుకున్నా మతపరమైన సమీకరణతో , మెజార్టీ వాదంతో విజయం సాధిస్తూ వస్తోంది. జీఎస్టీ, నోట్ల రద్దు వంటి కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్రం కూడా గుజరాత్. అందువల్లనే తాజా ఎన్నికలను కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకతకు సంకేతంగా కాంగ్రెసు భావిస్తోంది. మోడీ, అమిత్ షాల సొంతరాష్ట్రం కావడం బీజేపీకి కునుకు లేకుండా చేస్తోంది. ఇక్కడ ఓటమి చవిచూస్తే తమ సంస్కరణలు విఫలమైనట్లుగా జాతీయ స్థాయిలో ప్రతిపక్షం ప్రచారం చేసేందుకు వీలవుతుందన్నది మోడీ, అమిత్ షాల ఆందోళన. మతపరమైన తమ తొలి ప్రయోగ వేదికపైనే పరాజయం పాలైతే దేశాన్ని హిందూ రాజ్యంగా చేయాలనుకుంటున్న తమ వాదన వీగిపోతుందన్నది సంఘ్ పరివార్ ఆవేదన. కాంగ్రెసు ది మరో రకం బాధ. రాహుల్ అధ్యక్షునిగా నేరుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వచ్చే తొలి ఫలితం ఇది. అంతేకాదు రాహుల్ గతంలో ఎన్నడూ, ఏ రాష్ట్రంలోనూ చేయనంత విస్తృత ప్రచారం చేసిన రాష్ట్రం కూడా ఇదే. గుజరాత్ లో కాంగ్రెసు పార్టీకి పేరుమోసిన ప్రఖ్యాత నేతలు ఎవరూ లేని పరిస్థితుల్లో పరాజయానికి నేరుగా ఏఐసీసీ అధ్యక్షుడే నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇలా రెండు ప్రధాన పక్షాలూ తమదైన కోణంలో ఎన్నికను నిర్వచించుకుంటూ ఉద్వేగానికి, ఉత్కంఠకు గురవుతున్నాయి.

ముక్త భారత్ కు ముగింపు...

కాంగ్రెసు ముక్త భారత్ అంటూ చెవినిల్లు కట్టుకుని దేశమంతా ప్రచారం చేశారు మోడీ. ఇప్పటికీ ఆయనది అదే వాదన. కానీ సొంత రాష్ట్రంలో, అందులోనూ రెండు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న రాష్ట్రంలో బీజేపీ ఓడిపోతే కేంద్రం తప్పిదాలకు ఫలితమని వ్యాఖ్యానించేందుకు అవకాశం ఉంటుంది. గుజరాత్ లో ముఖ్యమంత్రిగా ఎవరున్నప్పటికీ చక్రం తిప్పుతున్నది మాత్రం మోడీ, అమిత్ షా లే. ఏమాత్రం వ్యతిరేక ఫలితం వచ్చినా వీరిద్దరూ అందుకు సమాన బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. తాజాగా వెలువడుతున్న సర్వేల్లో బీజేపీ, కాంగ్రెసులో పోటాపోటీగా తలపడుతున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. 2012 లో 15 శాతం పైగా ఉన్నబీజేపీ, కాంగ్రెసు మధ్య ఓట్ల అంతరం తాజాగా జరిపిన సర్వేల్లో కేవలం రెండు శాతానికి పడిపోయిందని ఒక ప్రముఖ సంస్థ చాటిచెప్పింది. ఈ విషయమే కమలనాథుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. మరో మూడు రోజుల్లో తొలి విడత ఎన్నిక జరగనున్న నేపథ్యంలో పరిస్థితులు ఏ విధంగానైనా మారవచ్చని బెంగ పడుతున్నారు. అందులోనూ రోజురోజుకీ కాంగ్రెసు పుంజుకోవడమనేది బీజేపీ కి మింగుడు పడని అంశంగా మారుతోంది. ఒకవేళ గుజరాత్ లో ఓటమి చవిచూసినా, చావు తప్పి కన్నులొట్టబోయినట్లుగా బొటాబొటి మెజార్టీతో గట్టెక్కినా మోడీకి కొంత సంకట పరిస్థితే. సొంత రాష్ట్రంలోనే కాంగ్రెసు ముక్త భారత్ నినాదానికి స్వస్తి వాక్యం పలకాల్సిందే. అది జాతీయంగానూ ప్రతిధ్వనిస్తుంది.

అవుట్ సోర్సింగ్ అపవాదు...

కాంగ్రెసు పార్టీ కూడా ఈ ఎన్నికల్లో తీవ్ర విమర్శలనే చవిచూస్తోంది. సెక్యులర్ పార్టీగా ఇంతకాలం కాపాడుకుంటూ వచ్చిన క్రెడిట్ కు నీళ్లొదిలేసింది. మతం రంగు పులుముకొంది. రాహుల్ గుడులు, గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. తాను శివభక్తుడినని ప్రకటించుకున్నారు. ఇదంతా రాజకీయ ప్రయోజనం కోసమేనని విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇంత చేసినా ఫలితం కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా వస్తుందా? అంటే చెప్పలేని పరిస్థితి. వ్రతం చెడ్డా ఫలం దక్కకపోతే పార్టీకి దేశవ్యాప్తంగా కష్టాలు తప్పకపోవచ్చు. అర్బన్, సెమీ అర్బన్ నియోజకవర్గాల్లో పూర్తిగా పట్టుకోల్పోయిన కాంగ్రెసు పార్టీ గ్రామీణ నియోజకవర్గాలనే నమ్ముకుంటూ కొన్ని చోట్ల గెలుపు సాధిస్తూ తన అస్తిత్వాన్ని నిలుపుకొంటోంది. గతంలో పార్టీ చేసిన తప్పిదాలు కూడా వెంటాడుతున్నాయి. క్షత్రియ , హరిజన , ఆదివాసీ, ముస్లిం ఫార్ములా(ఖామ్) తో ఎనభైలలో పార్టీ ఘనవిజయం సాధించింది. కానీ మిగిలిన వర్గాలకు బాగా దూరమైంది. కాంగ్రెసు చేసిన ఈ సమీకరణను గుజరాత్ సమాజం ఇంకా పూర్తిగా మరిచిపోలేదు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలలో సైతం సొంత బలం కంటే కూడా పటేదార్ల రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్, దళిత నాయకుడు జిగ్నేష్ మేవాని, ఓబీసీ నాయకుడు అల్పేష్ ఠాకూర్ల పై పార్టీ పెద్దగా ఆశలు పెట్టుకుంది. ఈ కాంబినేషన్ కాంగ్రెసుకు విజయం సాధించిపెడుతుందని మెజార్టీ నాయకులు విశ్వసిస్తున్నారు. గెలుపు కోసం కాంగ్రెసు పార్టీని ఈ ముగ్గురికీ అవుట్ సోర్సింగుకు ఇచ్చేశారని బీజేపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. దీనిని కాంగ్రెసు పార్టీ బలంగా తిప్పికొట్టలేకపోతోంది.

తటస్థుల తరలింపే ముఖ్యం...

రెండు ప్రధాన పార్టీలకు గట్టి మద్దతుగా నిలిచే ఓటర్ల విషయంలో ఇప్పటికే ఇరుపక్షాలు ఒక అంచనాకు వచ్చేశాయి. తొలి విడత ఎన్నికకు ప్రచార గడువు ముగియనున్న నేపథ్యంలో తటస్థ ఓటర్లపై దృష్టి పెడుతున్నారు. వారిని పోలింగు బూతుకు తీసుకొచ్చి తమ పార్టీలకు అనుకూలంగా ఓటు వేయించుకునే అంశంపై వ్యూహరచన సాగుతోంది. పోలింగు బూతుల వారీ పటిష్ఠమైన క్యాడర్ ఉన్న బీజేపీ , సంఘ్ పరివార్ శక్తులు ప్రతి 25 కుటుంబాలకు ఒక కార్యకర్తకు బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. ఆయా కుటుంబాలను కార్యకర్తలు ఫాలో అప్ చేసి ఓటింగు జరిగేలా చూసుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే వాహన సదుపాయం, ఇతర సరంజామా అందించడమూ ఆ కార్యకర్త బాధ్యతే. కాంగ్రెసు కంటే ఈ విషయంలో బీజేపీనే ముందంజలో ఉంది. గుజరాత్ లో పనితీరును బట్టి కాలానుగుణంగా నిర్ణయం తీసుకునే తటస్థ ఓటర్లు పది నుంచి 12 శాతం వరకూ ఉంటారని చెబుతున్నారు. ఓటర్ల ఆలోచనలో గణనీయమైన మార్పు కనిపిస్తున్న ప్రస్తుత ఎన్నికల ఫలితాన్ని నిర్దేశించడంలో ఈ తటస్థ ఓటర్ల తీర్పు చాలా కీలకం కాబోతోంది.

 

గుజరాత్ నుంచి ‘తెలుగు పోస్ట్’ ప్రత్యేక ప్రతినిధి

Similar News