ఇదేంటప్పా....! ఇక్కడ ఇద్దరికీ కష్టమేనా?

Update: 2018-01-15 18:29 GMT

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకుంటున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఆ...అనుభవంతో కర్ణాటక ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధపడుతున్నాయి. వచ్చే ఏప్రిల్, మే నెలలో జరగనున్న ఈ దక్షిణాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప, జాతీయ స్థాయిలో ప్రధాని మోడీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలకు అగ్నిపరీక్ష కానున్నాయి. ఎన్నికల ఫలితాల ప్రభావం రాష్ట్ర స్థాయిలో కన్నా జాతీయ స్థాయిలోనే ఎక్కువ ప్రభావం చూపుతాయి. హిమాచల్ ప్రదేశ్ లో ఓడిపోయినప్పటికీ గుజరాత్ లో గౌరవప్రదమైన స్థానాలు గెలుచుకోవడం ద్వారా రాహుల్ గాంధీ నాయకత్వానికి ఇబ్బంది ఎదురుకాలేదు. అదేవిధంగా అధికారాన్ని కాపాడుకున్నప్పటికీ, అత్తెసరు మెజారిటీ కారణంగా మోడీ ప్రభకు బ్రేకులు పడ్డాయన్న వాదన వినపడింది. ఈ నేపథ్యంలో ఎలాంటి లోటు పాట్లకు తావివ్వకుండా, పకడ్బందీగా వ్యూహరచన చేస్తున్నాయి పార్టీలు.

మైనస్ లు... ప్లస్ లు కూడా....

రెండు జాతీయ పార్టీలకు కొన్ని ప్లస్, మైనస్ పాయింట్లు స్పష్టంగా కనపడుతున్నాయి. అటు కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇటు బీజేపీలో యడ్యూరప్ప తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపగల ఒక్క నేత రెండు పార్టీల్లో లేరు. పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వరన్ ప్రభావం పరిమితమే. లోక్ సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లిఖార్జున ఖర్గే, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ, బీకే హరిప్రసాద్ వంటి నాయకులు పేరుకు జాతీయ నాయకులు అయినప్పటికీ వారి ప్రభావం నియోజకవర్గాలకే పరిమితం. అనంతకుమార్, హెగ్డే వంటి కేంద్రమంత్రుల ప్రభావం కూడా అంతే సిద్ధరామయ్య, యడ్యూరప్పలు రాష్ట్ర వ్యాప్త యాత్రలతో సుడిగాలి పర్యటన చేపట్టారు. పరివర్తన్ యాత్ర పేరుతో యడ్యూరప్ప 75 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. ముగింపు కార్యక్రమానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరయ్యారు. ఇందుకు పోటీగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నవ కర్ణాటక నిర్మాణ యాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమం గత నెల 27న ముగిసింది. గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన ప్రాంతాల్లో పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వరన్ పర్యటించారు. మరో పక్క కేరళకు చెందిన లోక్ సభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి శశిధరూర్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. వృత్తిపరమైన మేదావులు, విద్యార్థులు, న్యాయవాదులు, వైద్యులతో సమావేశమై వారిని పార్టీకి చేరువ అయ్యేందుకు కృషి చేయనున్నారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫిబ్రవరి 10 నుంచి 12 వరకూ మూడు రోజుల పాటు సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఏఐసీసీ సమాచార విభాగం ఇన్ ఛార్జ్ ప్రియాంక చతుర్వేది రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 50 వేలకు పైగా బూత్ లెవెల్ కమిటీలను సమన్వయ పరిచే బాధ్యతలను చేపట్టారు. పంజాబ్ లో అమరేందర్ సింగ్ మాదిరిగా రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పార్టీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. మళ్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి సిద్ధరామయ్యేనని పరోక్షంగా ప్రకటించింది. జనతాదళ్ (ఎస్) నుంచి కాంగ్రెస్ లకి వలస వచ్చిన సిద్ధరామయ్య పెద్దగా ప్రజాకర్షక నాయకుడు కాడు. కురుబ సామాజిక వర్గానికి చెందని ఆయన దళితులు, ముస్లింలు, ఓబీసీ వర్గాలను సమన్వయం చేసుకుని అధికారంలోకి వచ్చారు. రాష్ట్ర జనాభాలో ఓబీసీలు 35 శాతం, మైనార్టీలు 16 శాతం. వీరంతా మళ్లీ కాంగ్రెస్ కే మద్దతిస్తారని సిద్ధరామయ్య ధీమాగా ఉన్నారరు. మసీదులు, చర్చిలు, ఆలయాల మరమ్మతులకు నిధుల కేటాయింపు, దారిద్ర్య దిగువ రేఖన గల ప్రజలకు కులమతాలతో సంబంధం లేకుండా ఉచిత బియ్యం, ఇందిరా క్యాంటిన్ల పథకం, పెద్దగా ప్రభుత్వ వ్యతిరేకత లేకపోవడం తమకు కలిసి వచ్చే అంశాలని సిద్ధరామయ్య విశ్వసిస్తున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి వేణుగోపాల్ ప్రతి చిన్న విషయాన్ని శ్రద్ధగా పరిశీలిస్తున్నారు. ఏ విషయంలోనూ ధీమా, అలక్ష్యం పనికిరాదని పార్టీ నేతలను హెచ్చరిస్తున్నారు.

వీర శైవులు.... ఎటు వైపు?

ప్రభుత్వ వ్యతిరేకత తప్ప బీజేపీ వద్ద నిర్దిష్ట అజెండా లేదు. పూర్తిగా యడ్యూరప్ప పైనే అది ఆధారపడుతోంది. సీఎం అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించింది. పది శాతం లింగాయత్ లు, 21 శాతం బ్రాహ్మణ వర్గ ఓటర్లపైనే పూర్తిగా ఆధారపడుతోంది. 2008 నుంచి 2013 వరకూ అయిదేళ్ల పాలనలో యడ్యూరప్ప, సదానందగౌడ, జగదీశ్ షెట్టర్లను ముఖ్యమంత్రులను చేసి కొంత అప్రదిష్ట పాలైంది. పటిష్టమైన సంస్థాగత యంత్రాంగం, కేంద్ర నాయకత్వం అండదండలు, హిందూత్వ నినాదంతో ఎన్నికలను ఎదుర్కొనవచ్చని అంచనా వేస్తోంది. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వీరశైవుల్లో చీలిక ప్రభావం ఎలా ఉంటుందోనని అది ఆందోళన చెందుతోంది. కర్ణాటక రాజకీయాలను శాసించే శక్తి వీరశైవ మహాసభకు ఉంది. వీరశైవాన్ని ప్రత్యేక మతంగా గుర్తించాలని లింగాయత్ లకు ఆందోళన సాగిస్తున్నారు. ఈ నెల 23న బెంగలూరులో విశ్వ లింగాయత్ పరిషత్ ను ప్రారంభించనున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి జామదొర ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా ఉన్నారు. మాజీ ప్రధాని దేవగౌడ సారథ్యంలోని జనతాదళ్ (ఎస్) పాత్ర కొన్ని ప్రాంతాలకే పరిమితం. ఇది ఉప ప్రాంతీయ పార్టీగా మిగిలిపోయింది. ఒక్కలింగ సామాజికవర్గం అండ ఈ పార్టీకి ఉంది. గౌడ, ఆయన కుమారుడు కుమారస్వామిలకు పెద్దగా ప్రజాదరణ లేదు. గత ఎన్నికల్లో దాదాపు 40 స్థానాలను గెలుచుకున్నప్పటికీ కొంతమంది పార్టీని వీడారు. హంగ్ ఏర్పడితే తాము కీలకం అవుతామన్న ఆశాభావం పార్టీలో వ్యక్త మవుతోంది. రాష్ట్ర చరిత్రలో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన సందర్భాలు చాలా అరుదని, అయినప్పటికీ దేవెగౌడ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాని కర్ణాటక వ్యవహారాల కాంగ్రెస్ ఇన్ ఛార్జి కే.సీ వేణుగోపాల్ ధ్వజమెత్తుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ అంతర్గత సర్వేల్లో 85 నుంచి 95 స్థానాలు రావచ్చని వెల్లడయినట్లు సమాచారం. ఈ ఎన్నికల ప్రభావం నవంబరు, డిసెంబర్లో జరిగే మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ ఎన్నికలపై పడటం ఖాయం. దీంతో కన్నడ ఎన్నికల్లో సర్వశక్తులను ఒడ్డేందుకు పార్టీలు సిద్ధపడుతున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News