ఇక్కడ సంక్షోభానికి రీజన్ ఇదేనా?

Update: 2018-02-12 18:29 GMT

మాల్దీవులు.... హిందూ మహాసముద్రంలోని ఈ అతి చిన్న ద్వీపదేశం గత వారం పది రోజులుగా అంతర్జాతీయంగా, మరీ ముఖ్యంగా దక్షిణాసియాలో చర్చనీయాంశంగా మారింది. పట్టుమని 300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కూడా లేని ఈ దేశ పరిణామాలు ప్రజాస్వామ్య వాదులను ఆవేదనకు, ఆందోలనకు గురి చేస్తున్నాయి. భారత్ - చైనా మధ్య ప్రచ్ఛన్న యుద్ధ అంశంగా మారిపోయింది. సంక్షోభం ఇప్పటి కిప్పుడు కొలిక్కి వచ్చే అవకాశం కనుచూపు మేరలో కనపడకపోవడం ఆందోళన కల్గిస్తోంది.

ప్రభుత్వం మైనారిటీలో పడుతుందని....

హిందూ మహాసముద్రంలో భారత్, శ్రీలంక లకు వాయువ్య దిశలో సుమారు 1200 అతి చిన్న దీవుల్లో విస్తరించిన దేశమే మాల్దీవులు. వీటిల్లో చాలా దీవుల్లో జననివాసమే లేదు. ముస్లింల ప్రాబల్యం గల ఈ దేశ జనాభా నాలుగున్నర లక్షల లోపే. రాజధాని మావే తప్ప మరో పెద్దనగరం లేదు. అన్ని దేశాల్లో మాదిరిగానే రాజకీయ అధికారం కోసం కొనసాగుతున్న పోరాటమే ప్రస్తుత సంక్షోభానికి మూలకారణమని చెప్పకతప్పదు. పేరుకు ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ పరోక్షంగా అక్కడ నియంతృత్వమే నడుస్తుందన్నది చేదునిజం. సంక్షోభంలో దేశ సర్వోన్నత న్యాయ స్థానం పాత్ర కూడాలేక పోలేదు. 9 మంది రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, అధ్యక్షుడు యమీన్ పార్టీ నుంచి ఫిరాయించినందుకు వేటుపడ్డ 12 మంది ఎంపీల సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో సంక్షోభానికి బీజం పడింది. ఈ ఆదేశాలను అమలు చేసేందుకు ప్రభుత్వం ససేమిరా అనడంతో సంక్షోభం ముదిరింది. ఈ ఉత్తర్వులు అమలయితే పార్లమెంటులో ప్రభుత్వం మైనార్టీలో పడుతుంది. విపక్షానికి మెజారిటీ లభిస్తుంది. కోర్టు ఉత్తర్వులు అమలుకు అంతర్జాతీయంగా వత్తిడి వచ్చినా యమన్ ప్రభుత్వం లెక్కచేయలేదు. చివరికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అరెస్ట్ చేసేందుకు కూడా ప్రభుత్వం వెనుకాడలేదు. కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని, భారత్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని ప్రస్తుతం శ్రీలంకలో ప్రవాసం ఉన్న మాజీ అధ్యక్షుడు, మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ అధినేత మహ్మద్ నషీద్ భారత్ కు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. 1988లో అప్పటి అధ్యక్షుడు అబ్దుల్ గయామ్ ప్రభుత్వంపై తిరుగుబాటును భారత్ అణిచివేసింది. అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం గయామ్ విజ్ఞప్తిపై తక్షణం స్పందించి శ్రీలంక మీదుగా సైన్యాన్ని తరలించి ఆయన ప్రభుత్వాన్ని కాపాడింది. ఇప్పుడు అదే గయామ్ కూడా ప్రభుత్వ నిర్భంధంలో ఉన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు యమీన్, గయామ్ ఇద్దరూ సన్నిహిత బంధువులే కావడం విశేషం.

చైనా జోక్యంతోనే....

భౌగోళికంగా భారత్ కు అత్యంత సమీప దేశం కావడంతో మొదటి నుంచి మాల్దీవుల వ్యవహారాల్లో భారత్ క్రియాశీలకంగా వ్యవహరించేది. మొదట్లో భారత్, శ్రీలంకలకు మాత్రమే ఇక్కడ రాయబార కార్యాలయాలు ఉండేవి. అంతర్జాతీయ వ్యవహారాలన్నీ వీటి ద్వారానే నడిచేవి. 2012లో చైనా కూడా ఇక్కడ దౌత్య కార్యాలయాన్ని ప్రారంభించడంతో పరిస్థితిలో ఒక్కసారి మార్పు వచ్చింది. క్రమంగా మాల్దీవుల వ్యవహారాల్లో చైనా పాత్ర పెరుగుతోంది. అదే సమయంలో భారత్ వ్యతిరేకతను పెంచి పోషిస్తూ వచ్చింది. మాల్దీవులకు ఇబ్బడిముబ్బడిగా ఆర్థిక సాయం చేస్తూ ఆదేశాన్ని ప్రభుత్వం చేస్తూ వచ్చింది. ముఖ్యంగా 2013లో యమీన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చైనా పాత్ర మరింత పెరిగిపోయింది. భారత్ వ్యతిరేక అయిన యమీన్ చైనాకు మరింత చేరువయ్యారు. ఈ దన్ను చూసుకునే గతంలో మాదిరిగా మాల్దీవుల వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని చైనా భారత్ ను హెచ్చరిస్తోంది. అది ఆ దేశ ఆంతరింగక వ్వవహారమని, మూడో దేశం జోక్యం మరింత సంక్షోభాన్ని రాజేస్తుందని సుద్దులు చెబుతోంది. పరోక్షంగా తన పెత్తనమే నడవాలన్నది బీజింగ్ భావన.

భారత్ క్రియాశీలకంగా వ్యవహరించడానికి....

ఏదేశ ఆంతరింగిక వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకోవాలన్నది భారత్ విధానం కానే కాదు. ప్రాంతీయంగా పెద్దన్న పాత్ర పోషించాలన్న ఆసక్తి న్యూఢిల్లీకి లేదు. అయితే ఆదేశ ప్రజలు, పరిస్థితులతతో ఉన్న అవినాభావ సంబంధం దృష్ట్యా 70వ దశకలంలో బంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి మద్దతు ఇచ్చి ఆ దేశ ఆవిర్భావానికి కారణమైంది. అదే విధంగా తమిళ ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నందున గతంలో శ్రీలంక వ్యవహారాల్లో భారత్ ఒకింత క్రియాశీలకంగా ఉండేది. అంతే తప్ప మరో ఉద్దేశం లేదు. ఇప్పుడు మాల్దీవుల విషయంలో కూడా జోక్యం చేసుకోవాలన్న ఆలోచన లేనేలేదు. న్యాయస్థాన ఉత్తర్వులను అమలు చేయాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాత్రమే భారత్ కోరుతోంది. మాల్దీవుల ప్రభుత్వం సంయమనంతో వ్యవహరిస్తే ఎవరూ అటువైపు చూడాల్సిన అవసరమే ఉండదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News