ఇక్కడ మోడీ పార్టీ గెలుపు సులువేనంట?

Update: 2017-10-06 16:30 GMT

అధికార పార్టీని సాగనంపడం, విపక్షాన్ని స్వాగతించడం ఇదీ హిమాచల్ ప్రదేశ్ ఓటర్ల వ్వవహారశైలి. గత మూడున్నర దశాబ్దాలుగా వారీ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ఈసారి అలా జరగరాదని అధికార కాంగ్రెస్ కోరుకుంటుండగా, ఆ ఆనవాయితీ కొనసాగాలని విపక్షమైన భారతీయజనతాపార్టీ కోరుకుంటోంది. ఇందులో పెద్దగా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. కాని ఓటర్లు పాత సంప్రదాయానికి కట్టుబడి ఉన్నట్లు కన్పిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణాన్ని గమనిస్తే ఈ విష‍యం స్పష్టమవుతోంది. వచ్చే నెలలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ వ్యూహరచనలో తలమునకలయ్యాయి. దేశంలోని చిన్న రాష్ట్రాల్లో ఒకటైన హిమాచల్ ప్రదేశ్ దేశ రాజధాని ఢిల్లీకి దగ్గరలోనే ఉంటుంది. గత ఎన్నికల్లో మొత్తం 68 స్థానాలకు గాను 36 స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఐదేళ్లుగా అధికారంలో కొనసాగుతోంది. ఐదేళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వీరభద్రసింగ్ రాష్ట్రంలో పార్టీకి పెద్దదిక్కు. గతంలో కేంద్రమంత్రిగా, ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు రాజకీయం కొట్టిన పిండి. గతంలో అనేక ఎన్నికలను ఒంటిచేత్తో ఎదుర్కొని విజయపరంపర సాగించిన వీరభద్రసింగ్ ప్రస్తుతం కష్టాల కడలిలో ఉన్నారు. ఇంటాబయటా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక అవినీతి ఆరోపణలు ఆయనను చుట్టుముట్టాయి. సీబీఐ ఆయన ఇళ్లలో సోదాలు నిర్వహించింది. విపక్షమైన బీజేపీ ఆయనపై పోరాటాన్ని ఉధృతం చేస్తోంది.

అవినీతి ఆరోపణలతో.....

అంతర్గత కలహాలు, ప్రభుత్వ వ్యతిరేకత ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడు సుఖ్వీందర్ సింగ్ తో పొసగడం లేదు. ఆయనను తొలగించాలన్న వీరభద్రసింగ్ డిమాండ్ ను రాష్ట్ర వ్యవహారాల పరిశీలకులు సుశీల్ కుమార్ షిండే తోసిపుచ్చుతున్నారు. తన ఆధ్వర్యంలోనే ఎన్నికలకు పార్టీ వెళుతుందని వీరభద్రసింగ్ చెబుతుండగా సమిష్టిగా ఎన్నికలను ఎదుర్కొంటామని పీసీసీ అధ్యక్షుడు స్పష్టం చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడిని తొలగించక పోతే ఎన్నికలకు దూరంగా ఉంటానని సింగ్ చేసిన హెచ్చరికలను పార్టీ పట్టించుకోలేదు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆశీస్సులు పీసీసీ అధ్యక్షుడికి పుష్కలంగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితి చూస్తుంటే కాపురం చేసే కళ... వేలు తొక్కిననాడే తెలుస్తుందన్న పాత సామెత గుర్తుకు రాక మానదు. మరో పక్క 60 స్థానాలను సాధించడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఆ పార్టీకి నిజంగా 60 స్థానాలు లభిస్తే రాష్ట్రాన్ని వీడి వెళతానని వీరభద్రసింగ్ ప్రతిజ్ఞ చేయడం విశేషం.

బీజేపీ ఆశలు ఇవే.....

హస్తినలో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ సిమ్లా పీఠాన్ని కైవసం చేసుకునేందుకు గట్టిగా కృషి చేస్తోంది. 2014 నాటి సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో నాలుగు లోక్ సభ స్థానాల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. మండి, కంగ్రా, సిమ్లా, షమీర్ పూర్ స్థానాలుపార్టీ పరమయ్యాయి. ఇటీవల జరిగిన సిమ్లా నగర పాలకసంస్థ ఎన్నికల్లో కాషాయ కూటమి జెండా ఎగరవేయడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. మొత్తం 34 స్థానాల్లో బీజేపీ 17, కాంగ్రెస్ 13, సీపీఎం ఒకటి, ముగ్గురు స్వతంత్రులు గెలుపొందారు. గంత 32 సంవత్సరాలుగా సిమ్లా కాంగ్రెస్ కంచుకోటగా ఉంది. ఈ విజయం అసెంబ్లీ ఎన్నికలకు పునాది అని పార్టీ భావిస్తోంది. ఈ నెల మొదటి వారంలోనే ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటించి ఎన్నికల నగారా మోగించారు. వివిధ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల ద్వారా ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. బిలాస్ పూర్ జిల్లాలోని కొతిపురలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ‌ మెడికల్ సైన్సెస్ కు శంకుస్థాపన చేశారు. అదే విధంగా హరోలీ నియోజకవర్గంలో ట్రిపుల్ ఐటీకి కూడా శంకుస్థాపన చేశారు. కాంగ్రా జిల్లాలో ఉక్కు శుద్ధి కర్మాగారాన్ని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా జరిగిన వివిధ కార్యక్రమాల్లో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయిందని ధ్వజమెత్తారు. మరోపక్క పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవలే రాష్ట్రంలో పర్యటించి పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేశారు. గత ఎన్నికల్లో 26 స్థానాలను సాధించిన బీజేపీ అధికారానికి కొద్ది దూరంలోనే ఆగిపోయింది. సానుకూల పరిస్థితులు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి కోసం పలువురు నాయకులు పోటీ పడుతున్నారు. అయితే ప్రస్తుతానికి ఎవరినీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ ప్రకటించలేదు. అయితే రాజ్యసభ సభ్యుడైన కేంద్రమంత్రి జయప్రకాశ్ సడ్డా పేరు వెలుగులోకి వచ్చింది. ఆయనకు హైకమాండ్ అండదండలున్నాయి. మోడీ ప్రధాని అయ్యాక పార్టీ అధ్యక్ష పదవికి సడ్డా పేరు కూడా విన్పించింది. మాజీ ముఖ్యమంత్రి ప్రేమకుమార్ ధుమాల్ పేరు కూడా ప్రచారంలో ఉంది. అయితే వృద్ధాప్యం దృష్ట్యా ఆయన కుమారుడైన షమీర్ పూర్ ఎంపీ అనురాగ్ ఠాకూర్ అభ్యర్థిత్వాన్ని పరిశీలించవచ్చని అంచనా. సడ్డా, ప్రేమ్ కుమార్ ధుమాల్ మధ్య ఎంతమాత్రం పొసగదు. అవినీతి, క్షీణించిన శాంతిభద్రతలు, దుష్పరిపాలన కారణాలతో ప్రజలు తమవైపు మొగ్గు చూపడం ఖాయమన్న భావనలో బీజేపీ ఉంది. అందుకే సీఎం పదవికి పోటీ నెలకొని ఉంది. రాజపుత్రులు, బ్రాహ్మణులు, ఓబీసీలు, దళితులు రాష్ట్రంలో ప్రధాన ఓటు బ్యాంకు. రాజపుత్రులు, బ్రాహ్మణులు తమకు మద్దతుగా నిలుస్తారని బీజేపీ అంచనా వేస్తోంది. ఓబీసీలు, దళితుల ఓట్లపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. అంతిమంగా ఓటర్లు ఎవరివైపు మొగ్గుతారో చూడాలి మరి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News