ఇక్కడ మోడీ గ్రాఫ్ తగ్గిందా? రాహుల్ బలం పెరిగిందా?

Update: 2017-09-21 18:00 GMT

ఈ ఏడాది చివర్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ పై ఎవరికి పెద్దగా ఎలాంటి ఆసక్తి లేదు. పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ పై ఇటీవల సీబీఐ దాడులు జరిగాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం లోక్ సభ సీట్లతో పాటు ఇటీవల జరిగిన సిమ్లా నగర పాలకసంస్థ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం నేపథ్యంలో రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై బీజేపీ పూర్తి ధీమాతో ఉంది.

మోడీ, షాలకు సవాల్ గా మారిన ఎన్నికలు....

ఇప్పుడు అందరి ఆసక్తి, చూపు గుజరాత్ పైనే ఉంది. జాతీయంగా, అంతర్జాతీయంగా గుజరాత్ ఓటరు నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ఇది కేవలం ఒక అసెంబ్లీ ఎన్నిక కాదు. రెండు జాతీయ పార్టీలకు అగ్నిపరీక్ష వంటివి. వరుస ఓటములతో కుదేలయిన కాంగ్రెస్ గెలుపు కోసం తాపత్రయపడుతోంది. ఒకవేళ అది సాధ్యపడకపోయినా కనీసం గౌరవప్రదమైన సీట్లు అయినా సాధించి పరువు కాపాడు కోవాలని ప్రయత్నిస్తోంది. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొని కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్ గెలుపొందడం పార్టీకి ధైర్యం కల్గించింది. అధికార బీజేపీది ప్రత్యేక పరిస్థితి. 1995 నుంచి వరుస విజయాలతో అప్రతహితంగా సాగుతున్న కమలనాధులు ఈ దఫా కూడా కాషాయ జెండా రెపరెపలాడాలన్న పట్టుదలతో ఉన్నారు. ఒకరకంగా వచ్చే ఎన్నికలకు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దిక్సూచి వంటివి. ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే మేనెలలో కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం మరో ఏడాదిలో కురుక్షేత్ర సంగ్రామంగా పరిగణించే 2019 లోక్ సభ ఎన్నికలకు సిద్ధం కావల్సి ఉంది. అందువల్ల అధికార బీజేపీకి గుజరాత్ లో గెలుపు ప్రాణావసరం లాంటిది. ఇక్కడ విజయం ద్వారా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ను కోలుకోలేని దెబ్బతీయాలన్నది కమలనాధుల వ్యూహం. పార్టీని పక్కన పెడితే... బీజేపీ రధసారధులు నరేంద్రమోడీ, అమిత్ షా ద్వయానికి ఇక్కడ విజయం సాధించడం అత్యవసరం. గుజరాత్ బ్రదర్స్ గా పేరుగాంచిన వీరిద్దరే ప్రస్తుతం పార్టీని నడిపిస్తున్నారు. అటు అధికార యంత్రాంగం ఇటు పార్టీ యంత్రాంగం వీరి కనుసన్నుల్లోనే నడుస్తున్నాయి. ఎన్నికల్లో పరిస్థితి ఏమాత్రం తారుమారైనా దాని ప్రభావం అందరికన్నా... వీరిపైనే ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకూ పార్టీలో నిద్రాణంగా ఉన్న వ్యతిరేక వర్గాలు ఒక్కసారిగా గళం విప్పుతాయి. అద్వాని, మురళిమనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా, జస్వంత్ సింగ్ వంటి పాతకాపులు అసమ్మతి స్వరాన్ని విన్పిస్తారు. అన్నింటికీ మించి 2018 లో జరిగే కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్ ఎన్నికలను ఎదుర్కొనే నైతిక ధైర్యం కొరవడుతుంది. జాతీయస్థాయిలో విపక్షాలు కాంగ్రెస్ తో కలిసి పోరాటానికి సిద్ధమవుతాయి. అన్నింటికీ మించి అంతర్జాతీయంగా మోడీ ప్రతిష్ట మసకబారుతుంది. ఆయన బలంపై అపనమ్మకం ఏర్పడుతుంది.

అంత ఈజీ కాదని తేలిందా?

ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కమలనాధులకు గెలుపు నల్లేరు మీద నడక కాదన్న సామెత గుర్తుకు రాక తప్పదు. కాని సర్వేలు కమలం వైపే మొగ్గు చూపగా, తాజాగా సంఘ్ పరివార్ నిర్వహించిన సర్వేలో వ్యతిరేక ఫలితాలు వచ్చినట్లు చెబుతున్నారు. సర్వేల నిష్షక్ష పాక్షికతపై సందేహాలున్నప్పటికీ 2015లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పరాజయం తేలిగ్గా తీసుకోలేం. నాటి ఎన్నికల్లో మొత్తం 31 జిల్లా పంచాయతీల్లో 23, తాలూకా పంచాయతీల్లో 119కి గాను 113 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుని బీజేపీకి గట్టి సవాల్ విసిరింది. ఈ ప్రాతిపదికగా చూస్తే కాంగ్రెస్ ఖాతాలో వందకు పైగా అసెంబ్లీ సీట్లు జమకావాలి. గత ఎన్నికల్లో 20కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఐదు వేల లోపు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ పరిస్థితులు కాంగ్రెస్ శ్రేణుల్లో ఆశలు రేపుతున్నాయి. సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత, మాజీ ముఖ్యమంత్రి ఆనందిబిన్ పటేల్, ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ రూపానీ హయాంలో వెలుగు చూసిన వివిధ కుంభకోణాలు కలిసివస్తాయని కాంగ్రెస్ చెబుతోంది. దళితులపై దేశవ్యాప్తంగా దాడులు, ముస్లింలలో వ్యతిరేకత, హార్థిక్ పటేల్ సారధ్యంలో జరిగిన రిజర్వేషన్ ఉద్యమం, జీఎస్టీ తమకు మేలు చేస్తాయన్నది హస్తం పార్టీ విశ్వాసం.

లెక్కలు చూస్తే పరవాలేదా?

ఈపరిస్తితులను గమనించిన మోడీ, షా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆనందిబిన్ హయాంలో వెలుగు చూసిన కుంభకోణాల కారణంగా ఆమెను తప్పించి విజయ్ రూపానీని తెరపైకి తీసుకొచ్చారు. గుజరాత్ కు ప్రధాని మేలు చేస్తున్నారన్న అభిప్రాయం కలిగించడానికి అహ్మదాబాద్ -ముంబయి బుల్లెట్ ట్రియన్ పథకానికి శంకుస్థాపన చేశారు. ఇందుకు గాను మోడీ ప్రత్యేకంగా జపాన్ ప్రధాని షింజో అబే ని గుజరాత్ కు రప్పించారు. ఇటీవలే నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ జలాశయాన్ని మోడీ ప్రారంభించారు. ఆరు దశాబ్దాల క్రితం పురుడుపోసుకున్న ఈ ఆలోచన తమ హయాంలో కార్యరూపం దాల్చిందని బీజేపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. దీనివల్ల గుజరాత్ తో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రలకు కూడా మేలు కలుగుతుంది. శంకర్ సింగ్ వాఘేలా ఇటీవల కాంగ్రెస్ నుంచి వైదొలగడం, తృతీయ శక్తిగా ఆప్ రంగప్రవేశం వల్ల ఓట్లు చీలకి ఏర్పడి లబ్ది కలుగుతుందని అంచనా వేస్తుంది. కేశూభాయ్ పటేల్ సారథ్యంలో బరిలోకి దిగి 1995లో మొత్తం 182 స్థానాలకు 42.51 శాతం ఓట్లు, 161 స్థానాలను సాధించిన బీజేపీ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. మళ్లీ 1998లో కేశూభాయ్ ఆధ్వర్యంలో 44.81 శాత ఓట్లు, 117 సీట్లు సాధించి సత్తా చాటింది. 2002లో నరేంద్ర మోడీ నేతృత్వంలో 49.85 శాతం ఓట్లు, 127 సీట్లు సాధించి విజయఢంకా మోగించింది. 2007లో మళ్లీ మోడీ నాయకత్వంలో 49.12 శాతం ఓట్లు, 117 సీట్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 2012లో 48.30 శాతం ఓట్లు, 115 సీట్లు సాధించి మోడీ తనకు తిరుగులేదని చాటారు. 1995లో 32. 09 శాతం ఓట్లు 45 సీట్లు, 1998లో 35.28 శాతం ఓట్లు, 53 సీట్లు, 2002లో 39.59శాతం ఓట్లు, 51 సీట్లు, 2007లో 39.63 శాతం ఓట్లు, 59సీట్లు, 2012లో 40.59 శాతం ఓట్లు, 61 సీట్లు సాధించిన కాంగ్రెస్ ఈసారి గట్టిపోటీ ఇవ్వడానికి సన్నద్ధమవుతోంది. ఏ ఒక్క చిన్న అవకాశాన్ని జార విడవకుండా పోరాడాలని భావిస్తోంది. ఇక బీజేపీ కూడా ఇంతకు మించిన అస్త్రశస్త్రాలు, వ్యూహాలు, ఎత్తులు పైఎత్తులతో రంగంలోకి దిగుతోంది. అమిత్ షా వ్యూహరచన, మోడీ ప్రచారమే పెట్టుబడిగా బరిలోకి దిగుతోంది. ఇక్కడి గెలుపోటములు పార్టీ కన్నా మోడీ, షాల పైనే ఎక్కువ ప్రభావం చూపుతాయన్నది అక్షర సత్యం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News