ఇక్కడ కూడా ముందస్తు ఎన్నికలేనా?

Update: 2017-09-27 18:29 GMT

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామెత. పరిస్థితులు సానుకూలంగా ఉండగానే వ్యవహారాలను పూర్తి చేసుకోవాలన్నది దీని సారాంశం. సామాన్య ప్రజల నుంచి అమాత్యుల వరకూ ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే రాజకీయ నాయకులకు తెలిసినంతగా మరొకరికి తెలియదు.న ముఖ్యంగా అధికారంలో ఉన్న వారికి బాగా తెలుసు. అందువ్ల ఏమాత్రం పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భావించినా అధికారాన్ని నిలుపుకునేందుకు ముందస్తుకు సిద్ధపడతారు. ఇప్పడు జపాన్ లో జరుగుతుంది ఇదే. ఉరుము మెరుపు లేకుండా ఆకస్మికంగా ముందస్తు ఎన్నికలను ప్రకటించి జపాన్ ప్రధాని షింజో అబే అందరినీ ఆశ్చర్యపరిచారు.

వచ్చే నెల 22న ఎన్నికలు....?

అక్టోబర్ 22న ఎన్నికలకు వెళ్లవచ్చని అంచనా. లిబరల్ డెమొక్రటిక్ పార్టీ నాయకుడైన షింజో అబే ముందుచూపుతూనే ముందస్తుకు తెరదీశారు. పలు సానుకూల అంశాల నేపథ్యంలో మళ్లీ ప్రజల వద్దకు వెళ్లాలనుకున్నారు. విపక్షాల చీలిక, సానుకూల సర్వేలు, ఉత్తర కొరియా క్షిపణి పరీక్షల నేపథ్యంలో అబే ముందస్తు ఎన్నికల పట్ల ఆసక్తిగా ఉన్నారు. ఇటీవల ఉత్తరకొరియా వరుస క్షిపణుల ప్రయోగ నేపథ్యంలో జపాన్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జపాన్ మీదుగానే క్షిపణి ప్రయోగాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాతో సమర్ధంగా వ్యవహరించాలంటే బలమైన ప్రభుత్వం అవసరమన్నది అబే భావన. ఈ విషయాన్నే ఆయన బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. ఇతర విషయాలను పక్కన పెడితే ఉత్తరకొరియా విషయంలో అబేకు అండగా ఉండాలని ప్రజలు అనుకుంటున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. జపాన్ శత్రువైన చైనా ఉత్తర కొరియాకు అండగా ఉంది. ఇద్దరు శత్రువులను ఎదుర్కొనేందుకు బలమైన ప్రభుత్వం ఉండాలన్న భావన ప్రజల్లో ఉంది. అబే ఈ విషయాన్ని పసిగట్టి ముందస్తు పావులు కదిపారు. ఇటీవల సర్వేలు కూడా షింజోకు సానుకూలంగానే వస్తున్నాయి. ఇటీవల వాణిజ్య దినపత్రిక నిర్వహించిన సర్వేలో అబేకు చెందిన లిబరల్ డెమొక్రటిక్ పార్టీకి 44 శాతం మంది ప్రజలు మద్దతు పలికారు. కేవలం 8 శాతం మందే ప్రధాన ప్రతిపక్షమైన డెమొక్రటిక్ పార్టీకి అనుకూలంగా ఓటేస్తామని వెల్లడించారు. విపక్షాలన్నీ చీలిపోయి ఉన్నాయి. ఐక్యంగా ఎన్నికలను ఎదుర్కొనే పరిస్థితులు లేవు. ఇదే అవకాశంగా అబే ముందస్తుకు సిద్ధపడ్డారు. టోక్యో గవర్నర్ యురికో కొకే రాజకీయ పార్టీ ప్రారంభించనున్నట్లు ప్రకటించిన నేపథ్యం కూడా ఇందుకు కారణమని చెబుతున్నారు. జాతీయ రాజీకీయాల్లో ప్రవేశానికిదే సరైన సమయమని ఆమె భావిస్తున్నారు. ప్రజాదరణ కలిగిన నాయకురాలిగా కొకే కు పేరుంది. ఆమె బలపడక ముందే ఎన్నికలకు సిద్ధమవ్వాలన్నది అబే ఆలోచన. ఏ సమయంలోనైనా ఎన్నికలకు వెళ్లే హక్కు ప్రధానికి ఉంది. వాస్తవానికి వచ్చే ఏడాది డిసెంబర్ వరకూ సభకు గడువు ఉంది. ఇప్పటికే మూడు స్థానాలకు నవంబర్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నవంబర్ లో జపాన్ లో పర్యటించాల్సి ఉంది.

ఎంత ఖర్చు....? ఎంత దుబారా?

ముందస్తు ఎన్నికల ప్రకటనపై విమర్శలు, అభ్యంతరాలు కొన్ని వర్గాల నుంచి వ్యక్త మవుతున్నాయి. ఇది ఖజానాపై అదనపు భారం పడుతుందని వారు వాదిస్తున్నారు. 60 నుంచి 70 బిలియన్ యువాన్లు ఖర్చవుతుందని అంచనా. ఇది రమారమి భూటాన్ బడ్జెట్ తో సమానం. గతంలో 2000 నుంచి 2014 వరకూ జరిగిన ఆరు దఫాల ఎన్నికలకు ప్రతిసారీ 61.7 నుంచి 74.6 బిలియన్ యువాన్లు ఖర్చయిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంచనా. జపాన్ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే అక్కడ ముందస్తు ఎన్నికలు సర్వ సాధారణం. 1972 డిసెంబర్ నుంచి 1976 డిసెంబర్ వరకూ ఒక్కసారి మాత్రమే సభ పూర్తి కాలం పనిచేసింది. 1952 అక్టోబర్ నుంచి 1953 మార్చి వరకూ కేవలం 165 రోజులు మాత్రమే సభ పనిచేసింది. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంతో ఓటమి ఫలితంగా అప్పటి ప్రధాని సభను రద్దు చేయాల్సి వచ్చింది. ప్రధాని అబేకి, ఆయన పార్టీకి ఘనమైన చరిత్ర ఉంది. దేశ తలి ప్రధాని నొబుసుకే కిషి మనుమడైన అబే ప్రధానిగా రెండో దఫా పదవిలో కొనసాగుతున్నారు. ఆయన పార్టీ అయిన లిబరల్ డెమొక్రటిక్ పార్టీ యాభై ఏళ్లకు పైగా దేశాన్ని పాలించింది. అమెరికా అనుకూల పార్టీ అని దానికి పేరుంది. భానుడి తొలి కిరణం ప్రసరించే తొలి దేశమైన జపాన్ అంతర్గతంగా ప్రస్తుతం బాగానే ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా కొన్ని చికాకులను ఎదుర్కొంటోంది. నిన్నా మొన్నటి వకూ అమెరికా తర్వాత ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. నాలుగేళ్ల క్రితం చైనా ఆ స్థానాన్ని దక్కించుకుంది. ఆ హోదాను కోల్పోవడం కన్నా తన శత్రుదేశమైన చైనాకు దక్కడం జీర్ణించుకోవడం దీనికి కష్టంగా ఉంది. ఇక రెండు దేశాల మధ్య తూర్పు చైనా సముద్రంలోని సెంకాకు దీవుల విషయమై తీవ్ర ఘర్షణ నడుస్తోంది. ఆసియాలో చైనా ప్రభావం పెరగడం కంటికి ఇంపుగా మారింది. తన ఆధ్వర్యంలోని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) కు పోటీగా చైనా ఆసియా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్టిమెంట్ (ఏఐఐబీ) బ్యాంకు ప్రారంభించడం వంటి పరిణామాలు జీర్ణించుకోలేక పోతోంది. చైనా ప్రభావాన్ని నిలువరించేందుకు భారత్ తో కలిసి పనిచేసేందుకు చొరవచూపుతోంది.

ముందస్తుతో బోర్లా పడితే....

ఇక సర్వేలు, సానుకూలాంశాలు ఎలా ఉన్నప్పటికీ ముందస్తుకు వెళ్లిన నాయకులకు మేలు జరుగుతుందని గట్టిగా చెప్పలేం. 2015 జనవరిలో శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ముందస్తు ఎన్నికలకు వెళ్లి భంగపడ్డారు. తాజాగా ఈ ఏడాది మే నెలలో బ్రిటన్ ప్రధాని థెరెసా మే ముందస్తు ఎన్నికలకు వెళ్లి బోర్లా పడ్డారు. చివరకు మిత్రుల సాయంతో సర్కార్ ను ఏర్పాటు చేశారు. ఈ విషయాలు తెలిసి అబే సాహసం చేయడం విశేషమే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News