ఇక్కడ కమలానికి కషాయమే....!

Update: 2018-06-18 17:30 GMT

ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించనున్నాయి. వీటి అనంతరం 2019 లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లోక్ సభ ఎన్నికలపై ఎంతో కొంత ప్రభావం చూపించడం ఖాయం. అందువల్ల జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. రెండు రాష్ట్రాల్లో కమలనాధులే అధికారాన్ని నెరపుతున్నాయి. అధికారాన్ని కాపాడుకునేందుకు కమలం, అధికారాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ వ్యూహప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. కేవలం రాష్ట్ర స్థాయి నాయకత్వమే కాకుండా జాతీయ నాయకత్వం సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికలు ఆసక్తి కరంగా మారాయి. రెండూ పెద్ద రాష్ట్రాలే కావడం మధ్యప్రదేశ్ లో వరుసగా మూడుసార్లు కమలం పార్టీ అధికారంలో ఉండటం ఆసక్తికరం.

మూడు దఫాల నుంచి.....

230 స్థానాలుగల మధ్య ప్రదేశ్ అందరి దృష్టీ ఆకర్షిస్తోంది. వరుసగా మూడు దఫాలుగా ఇక్కడ కమలం పార్టీ అధికారంలో ఉండటం విశేషం. గత ఎన్నికలలో 165 స్థానాలతో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. కాంగ్రెస్ కేవలం 65 స్థానాలకే పరిమితమైంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 29 స్థానాలకు గాను 27 స్థానాల్లో బీజేపీ విజయదుందుభి మోగించిగా, కాంగ్రెస్ కేవలం రెండుస్థానాల్లోనే గెలుపొందింది. గత 12 ఏళ్లుగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏకఛ్ఛత్రాధిపత్యంగా ఎదురులేని పాలన సాగిస్తున్నారు. ఇంత సుదీర్ఘకాలం అధికారంలో ఉండటం సాధారణ విషయం కాదు. చౌహాన్ పార్టీలో సీనియర్ నాయకుడు. ప్రధాని నరేంద్ర మోదీకి సమకాలీకుడు కావడం విశేషం. గత కొంతకాలంగా చౌహాన్ సర్కార్ చిక్కులను ఎదుర్కొంటోంది. నాలుగు ఉప ఎన్నికలలో ఓటమి, వరుస కుంభకోణాలతో అది సతమతమవుతోంది. సామాజికవర్గాల పరంగా సౌతం చిక్కులు ఎదుర్కొంటోంది. 2013 అసెంబ్లీ, 2014 లోక్ సభ ఎన్నికల్లో దళితులు, ముస్లింలు, గిరిజనులు గంపగుత్తగా కమలానికి అండగా నిలిచారు. కాని ఈసారి ఆ పరిస్థితి కానరావడం లేదు.

చౌహాన్ పై అసంతృప్తి.....

బీజేపీ మద్దతుదారుల్లో అసంతృప్తి కనపడుతోంది. అంతర్గతంగా పార్టీలోనూ చౌహాన్ వ్యతిరేకులు తమ స్వరాన్ని బలంగా విన్పిస్తున్నారు. ఇటీవల జరిగిన మంగోలి, కొలరస్ ఉప ఎన్నికల్లో ఓటమి పార్టీది కాదని, ముఖ్యమంత్రి వ్యక్తిగత ఓటమి అని బీజేపీ మాజీ ఎంపీ రఘునందన్ శర్మ ఘాటుగా వ్యాఖ్యానించడం గమనార్హం. వ్యాపం కుంభకోణం సర్కార్ ను కుదిపేసింది. ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి మాయని మచ్చగా మిగిలి పోయింది. ప్రభుత్వ కాంట్రాక్టులు, టెండర్లు, పథకాలు అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకే దక్కుతున్నాయన్న ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి. దేశవ్యాప్తంగా తగ్గుతున్న మోడీ ప్రభ, డీజిల్ ధరల పెంపు, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాలు ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయి. ఇక సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతను తక్కువగా అంచనా వేయలేం. రహదారుల నిర్మాణం, మెరుగైన విద్యుత్తు సరఫరాతో ప్రజలను ఆకట్టుకుంటామని కమలనాధులు చెబుతున్నారు. ఇవి తమ ప్రభుత్వ విజయంగా పేర్కొంటున్నారు.

హస్తం పార్టీలో ఉత్సాహం.....

విపక్ష కాంగ్రెస్ శిబిరంలో ఒకింత ఉత్సాహం కన్పిస్తోంది. వరుసగా మూడు సార్లు ఓటమి పాలయినప్పటికీ ఈసారి తమ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని వారు ధీమాగా ఉన్నారు. గ్వాలియర్ రాజవంశానికి చెందిన పీసీసీ చీఫ్ జ్యోతిరాదిత్య సింధియా వరుస పర్యటనలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తున్నారు. ఆయన మంచి వక్త. ప్రజల్లో కాస్తో కూస్తో పట్టున్న కాంగ్రెస్ నాయకుడు. ఆయనను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే విజయావకాశాలు మెరుగవుతాయని అంచనాలున్నాయి. అదే సమయంలో కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి లబ్దిపొందే అవకాశం కనపడటం లేదు. అగ్రనాయకులు దిగ్విజయ్ సింగ్, కమలనాధ్, పీసీసీ చీఫ్ జ్యోతిరాదిత్య సింథియా, అనుణ్ యాదవ్ మధ్య అభిప్రాయ బేధాలు పార్టీకి గుదిబండగా మారాయి. పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చక్రం తిప్పిన డిగ్గీరాజా మళ్లీ సీఎం పదవిపై కన్నేసినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ‘‘నర్మదాయాత్ర’’ ను ఆయన నిర్వహించారు. నర్మదా తీర ప్రాంతంలోని 3,300 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. యువకుడు, విద్యావంతుడు, మంచి వక్త అయిన జ్యోతిరాదిత్య సింధియా కు పూర్తిస్థాయిలో నాయకత్వ బాధ్యతలను అప్పగిస్తే పార్టీకి అవకాశాలుంటాయని అంచనా.

కాంగ్రెస్ కలసి వచ్చే రాష్ట్రం.....

కాంగ్రెస్ బాగా ఆశలు పెట్టుకున్న మరో బీజేపీ పాలిత రాష్ట్రం రాజస్థాన్. హస్తం పార్టీ ఆశలకు కారణం లేకపోలేదు. అక్కడ ప్రతిసారీ అధికార పార్టీని ఓడించడం ఆనవాయితీగా వస్తోంది. ఎవరు అధికారంలో ఉన్నా జరుగుతున్న తంతుఇది. ఇటీవల జరిగిన అజ్మీర్, ఆల్వార్ లోక్ సభ, మండోఘర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఇవన్నీ బీజేపీ సిట్టింగ్ సీట్లే కావడం గమనార్హం. ఈ నియోజకవర్గాల్లో మెజారిటీలు కూగా భారీగా రావడం హస్తం పార్టీలో ఆశలు నింపుతున్నాయి. అయిదేళ్ల క్రితం 2013 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు కనుమరుగైంది. 200స్థానాలకు గాను ఆ పార్టీ కేవలం చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు 21 స్థానాలకే పరిమితమైంది. 2014 లో జరిగిన లోక్ సభ ఎన్నికలయితే మరీ ఘోరం. కనీసం ఒక్కటంటేఒక్క స్థానంలోనూ కాంగ్రెస్ గెలవలేకపోయింది. మొత్తం స్థానాలు కమలనాధుల ఖాతాలోకి వెళ్లిపోయాయి. మాజీ ముఖ్యమంత్రి, వెనకబడిన వర్గాల నాయకుడైన అశోక్ గెహ్లాట్ , పీసీసీ చీఫ్ సచిన్ పైలెట్ వంటి నాయకులు పార్టీని నడిపిస్తున్నారు. అధిష్టానం పైలెట్ కే ప్రధాన్యం ఇస్తున్నట్లు కనపడుతోంది. అశోక్ గెహ్లెట్ కు కేంద్ర రాజకీయాల్లో పాత్ర కల్పించిన అధిష్టానం పైలెట్ కు రాష్ట్ర రాజకీయాల్లో పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. ఇక ముఖ్యమంత్రి వసుందరరాజే ప్రభుత్వ పనితీరు, వ్యక్తిగతంగా రాజే వ్యవహారశైలి పట్ల కమలం పార్టీకి కష్టాలు తప్పవన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రాజవంశం నుంచి వచ్చిన ఆమె ప్రజలకు అందుబాటులో ఉండరన్న పేరుంది. సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత, ప్రధాని మోదీ ప్రభ మసకబారుతున్న నేపథ్యంలో రాజస్థాన్ పై హస్తం పార్టీ నేతలు ఆశలు పెంచుకున్నారు. అధికారం చేపట్టడమే తరువాయి అన్న భావనలో ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News