ఇక్కడ ఎవరిది గెలుపు....?

Update: 2018-01-29 17:30 GMT

రాజస్థాన్ లోని అజ్మీర్, అల్వార్ లోక్ సభ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరిగింది. ఈ ఉపఎన్నికలు అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీలకు అగ్నిపరీక్షగా నిలవనున్నాయి,. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీలకు ఎంత ప్రతిష్టాత్మకమో, రాష్ట్రంలో ముఖ్యమంత్రి వసుంధర రాజే, పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ లకు కూడా అంత ప్రతిష్టాత్మకమే. ఇవి వారి రాజకీయ భవితవ్యాన్ని నిర్దేశించనున్నాయి. ఈ ఏడాది నవంబరు, డిసెంబర్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నికలు రెండు పార్టీలకు సెమీ ఫైనల్ గా మారాయి. మొత్తం రాష్ట్ర అసెంబ్లీలో 200 స్థానాలు ఉండగా, ఈ రెండు లోక్ సభ స్థానాల పరిధిలో 16 అసెంబ్లీ స్థానాలు ఉండటం గమనార్హం. వీటిలో 14 స్థానాలు అధికార బీజేపీ చేతిలో ఉండగా, మిగిలిన రెండూ హస్తం పార్టీ అధీనంలో ఉన్నాయి. ఉప ఎన్నికలు జరిగిన రెండు స్థానాలూ బీజేపీవే కావడం గమనార్హం. సిట్టింగ్ ఎంపీల ఆకస్మిక మరణంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఎవరు గెలిచినా అధికారంలో ఉండేది ఏడాదిన్నర లోపే. అయినప్పటికీ గెలుపు కోసం రెండు పార్టీలు సర్వశక్తులూ ఒడ్దాయి.

సెంటిమెంట్ తో....

అజ్మీర్... పేరు చెప్పగానే అజ్మీర్ దర్గా గుర్తుకు వస్తుంది. ఇది ముస్లింల పవిత్ర పుణ్యక్షేత్రం. ఎంతోమంది రాజకీయ ప్రముఖులు ఇక్కడ చదర్ సమర్పించడం తెలిసిన విషయమే. పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూచదర్ సమర్పిస్తుంటారు. విదేశీ ప్రముఖులూ చదర్ సమర్పించడం సర్వసాధారణం. దాదాపు 18 లక్షల మంది ఓటర్లుగల అజ్మీర్ లోక్ సభ స్థానం పరిధిలో 8 అసెంబ్లీ స్థానాలున్నాయి. బీజేపీ అభ్యర్థిగా రామాస్వరూప్ లంబా, కాంగ్రెస్ అభ్యర్థిగా రఘు శర్మ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎంపీ సన్వర్ లాల్ మృతితో సానుభూతి లభిస్తుందన్న ఉద్దేశ్యంతో కమలం పార్టీ ఆయన కుమారుడు రామా స్వరూప్ లంబాకు టిక్కెట్ ఇచ్చింది. లంబా జాట్ సామాజిక వర్గానికి చెందిన వారు. 2009లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ తరుపున ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ విజయం సాధించారు. దివంగత రాజేష్ పైలట్ కుమారుడు సచిన్ పైలట్. వీరిది వాస్తవానికి దౌసాని నియోజకవర్గం. 2014 సార్వత్రిక ఎన్నికల్లో సచిన్ పైలట్ ఓడిపోపయారు. ఈసారి తను రంగంలోకి దిగకుండా రఘుశర్మను బరిలోకి దించారు. ఇతర అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ వీరిమధ్యనే ఉంది.

అన్ని వర్గాలతో నిండి....

అజ్మీర్ వివిధ సామాజిక వర్గాల సమ్మేళనం. జాట్ లు, గుజ్జర్లు, ముస్లింలు, దళితులున్నారు. 2 లక్షల మంది జాట్ ఓటర్లు ఉండటంతో బీజేపీ ఆ సామాజిక వర్గానికి టిక్కెట్ ఇచ్చింది. తండ్రి మరణం సానుభూతి కూడా కలిసి వస్తుందని కమలం పార్టీ అంచనా వేస్తోంది. 3 లక్షల మంది దళితులు, 1.7 లక్షల మంది బ్రాహ్మణులు, 2 లక్షల మంది ముస్లిం ఓటర్ల మద్దతుతో తమ విజయం ఖాయమని హస్తం పార్టీ అనుకుంటోంది. ముఖ్యమంత్రి రాజే, సీసీసీ చీఫ్ సచిన్ పైలట్ దాదాపు 15 రోజుల పాటు నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేశారు. ప్రభుత్వ వ్యతిరేకత, జీఎస్టీ, నోట్ల రద్దుపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకోగా, అధికార బీజేపీ మాత్రం మోడీ పాలన, రాజే పనితీరుపై విశ్వాసంతో ఉంది. సుమారు 18 లక్షలకు పైగా ఓటర్లు గల ఆల్వార్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ జశ్వంత్ సింగ్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థిగా కరణ్ సింగ్ యాదవ్ పోటీ పడుతున్నారు. సుమారు 3.6 లక్షల యాదవ ఓటర్లుండటంతో రెండు పార్టీలూ ఆ సామాజిక వర్గం నుంచే అభ్యర్థులను బరిలోకి దించాయి. బీజేపీ అభ్యర్థి జస్వంత్ ప్రస్తుత రాజే మంత్రి వర్గంలో సభ్యుడు. లోక్ సభ స్థానంలోని బెహరర్ నియోజకవర్గ ఎమ్మెల్యే. 2004, 2009 లో కాంగ్రెస్ గెలిచినప్పటికీ 2014లో బీజేపీ విజయఢంకా మోగించింది. కాంగ్రెస్ అభ్యర్థి కరణ్ సింగ్ ప్రముఖ సర్జన్. గతంలో బెహరర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ఆయన అశోక్ గెహ్లట్ మంత్రివర్గంలో పనిచేశారు. 20 సూత్రాల ఆర్థిక పథకం అమలు కమిటీ ఛైర్మన్ గా పనిచేశారు. ఈ లోక్ సభ స్థానం పరిధిలో 8 అసెంబ్లీ స్థానాలున్నాయి.

బీజేపీపై అసంతృప్తి....

నియోజకవర్గంలో 4.50 లక్షలు ఓట్లగల దళితులు అత్యంత కీలకం. 1.15 లక్షల మంది బ్రాహ్మణులు, 2.80 లక్షల మంది వైశ్యుల ఓట్లే కీలకం. పద్మావత్ సినిమా తదితర అంశాల కారణంగా రాజపుత్ర ఓటర్లు బీజేపీపై అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కన్నా ముఖ్యమంత్రి వసుంధర రాజే పై ఆగ్రహంతో ఉన్నారు. పరిస్థితిని గమనించిన పార్టీ నాయకత్వం ప్రతి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేను నియమించి గెలుపు బాధ్యతలను అప్పగించింది. గత ఏడాది జరిగిన జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ భంగపడింది. ఈ నేపథ్యంలో పకడ్బందీగా ఎన్నికల ప్రచారాన్ని ముగించింది. 2014లో మాదిరిగా భారీ మెజారిటీతో కాకపోయినా ఎంతో కొంత ఆధిక్యతతతో గెలుస్తామన్నది కమలనాధుల అంచనా. మరి ఓటర్లు తీర్పు చెప్పేశారు. ఎవరిది గెలుపో చూడాలి మరి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News