ఇందిరకు....మోడీకి పెద్ద తేడా లేదే?

Update: 2017-10-10 17:30 GMT

భారత ప్రధానుల వ్యవహార శైలి ఒక్కొక్కరిదీ ఒక్కొక్క తీరు. ప్రధమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పరిపూర్ణ ప్రజాస్వామ్య వాది. ద్వితీయ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి ఉదారవాది. తృతీయ ప్రధాని ఇందిరాగాంధీ ప్రజాస్వామ్య నియంతగా పేరొందారు. తొలి కాంగ్రెసేతర ప్రధాని మురార్జీ దేశాయ్ మొండిఘటం. ఇందిర తనయుడు రాజీవ్ గాంధీ అపరిపక్వ ప్రధాని. అపర చాణుక్యుడిగా పేరుగాంచిన పీవీ నరసింహారావు లౌక్యుడు. బీజేపీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి భోళాశంకరుడు. యూపీఏ ప్రధాని మన్మోహన్ సింగ్, చంద్రశేఖర్, దేవేగౌడ, చరణ్ సింగ్, ఐకే గుజ్రాల్ ల గురించి చెప్పుకునేందుకు ఏమీలేదు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ వీరందరికీ భిన్నం.

చాలా పోలికలు.....

ఇందిరాగాంధీ, మోడీల మద్య చాలా పోలికలున్నాయి. ఇద్దరూ ప్రజాస్వామ్య నియంతలని పేర్కొనవచ్చు. పార్టీలోని అంతర్గత శత్రువులను అణిచి వేయడంలో, విపక్షాలను ఎదుర్కోవడంలో ఇద్దరిదీ అందెవేసిన చేయి. ఇద్దరూ అహంకారులు. అయితే ఉభయులూ మంచి వక్తలు. ప్రజలను ఆకట్టుకోవడంలో దిట్టలు. పార్టీని ఒంటిచేత్తో నడిపించగల సమర్థులు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ సుదీర్ఘకాలం ప్రధాని పదవి నిర్వహించిన నేతగా ఇందిరాగాంధీ చరిత్ర సృష్టించారు. మోడీ కూడా ఇందిర మాదిరిగానే అప్రతిహతంగా ముందుకు సాగగలరా అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పగలదు.

సిండికేట్ ను బయటకు పంపేదాకా.....

లాల్ బహుదూర్ శాస్త్రి మరణానంతరం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇందిరాగాంధీపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. ఆమె అప్పటికి కనీసం లోక్ సభ సభ్యురాలు కూడా కాదు. రాజ్యసభ సభ్యురాలిగా శాస్త్రి మంత్రివర్గంలో అంతగా ప్రాధాన్యం లేని సమాచార శాఖకు సారధిగా ఉన్నారు. ఆమెను ముందుకు పెట్టి తెరవెనుక తాము మంత్రాంగం చేయవచ్చని ‘సిండికేట్’గా పేర్కొనే కాంగ్రెస్ పెద్దలు భావించారు. నిజలింగప్ప, ఎస్.కే.పాటిల్, కామరాజ్ నాడార్, అతూల్ ఘోష్ సిండికేట్ లో సభ్యులు. అడుగడుగునా ఆమెను అడ్డుకునే వారు. పాలన వ్యవహారాల్లో జోక్యం చేసుకునేవారు. ఈ నేపథ్యంలో 1967లో జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో మెజారిటీ లభించినప్పటికీ వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. దీనిని అవకాశంగా తీసుకున్న సిండికేట్ సభ్యులు ఇందిరపై వత్తిడి పెంచసాగారు. ప్రజల్లో పట్టుపెంచుకోవడం ద్వారా మాత్రమే సిండికేట్ ను నియంత్రించగలనని భావించిన ఇందిర ఆ దిశగా పావులు కదిపారు. బ్యాంకుల జాతీయకరణ ద్వారా పేదలకు చేరువయ్యారు. మాజీ సంస్థానాధీశులకు కల్పించిన రాజభరణాల రద్దు ద్వారా తాను బడుగు బలహీన వర్గాల మనిషినని చాటుకున్నారు. అదే సమయంలో పార్టీపై కూడా పట్టు పెంచుకున్నారు. 1969లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్ధిగా నీలం సంజీవరెడ్డిని ప్రతిపాదించింది. పార్టీ నిర్ణయాన్ని థిక్కరించి అనధికార అభ్యర్థిగా వీవీగిరిని ఇందిర బరిలోకి దించారు. అంతరాత్మ ప్రభోదం పేరుతో ఆయనను గెలిపించుకుంది. గరీబీ హఠావో నినాదంతో 1971లో ఎన్నికలకు వెళ్లి ఘనవిజయం సాధించారు. దీంతో అధికార మత్తు ఆవహించిన ఇందిర అప్రజాస్వామికంగా వ్యవహరించసాగారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టారు. ముఖ్యమంత్రులను నామినేట్ చేశారు. కామరాజ్ ప్రణాళిక పేరుతో మంత్రివర్గంలో తనకు ఇష్టం లేని వారిని సాగనంపి పార్టీ పనులు అప్పగించారు. ఆఖరుకు అత్యవసర పరిస్థితిని విధించి తన పతనాన్ని కొని తెచ్చుకున్నారు. ప్రజాస్వామ్య నియంతగా చరిత్రలో మిగిలిపోయారు.

నేతలందరినీ పక్కన పెట్టి......

మోడీ, ఇందిర నేపథ్యాలు వేరైనప్పటికీ ఇద్దరి వ్యవహార శైలిలో పెద్దగా తేడా లేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 1984లో రాజీవ్ గాంధీ తర్వాత సంపూర్ణ మెజారిటీ తో సర్కార్ ను ఏర్పాటు చేసింది మోడీ ఒక్కరే కావడం గమనార్హం. ఆ ప్రభావం మోడీపై స్పష్టంగా కనపడుతోంది. ఆయన వ్యవహారశైలిలో అడుగడుగునా అతిశయం, అహంకారం, ధీమా, దర్పం కనపడుతుంది. గత మూడున్నరేళ్ల పనితీరు గమనిస్తే ఈ విషయం ఇట్టే అర్ధమవుతుంది. ఎన్నికల్లో విజయం అనంతరం అద్వానీ, మురళీ మనోహర్ జోషి, జస్వంత్ సింగ్, యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, శతృఘ్నసిన్హా వంటి పాతకాపులను పూర్తిగా పక్కన పెట్టారు. పార్టీ ఎదుగుదలకు అన్ని తానై వ్యవహరించిన అద్వానీకి రాష్ట్రపతి పదవి దక్కకుండా ఉండేందుకు రామజన్మభూమి వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ఆ కేసులో అద్వానీ ఇప్పుడు బెయిల్ పై ఉండటం గమనార్హం. మురళీ మనోహర్ జోషి వంటి సీనియర్ నేతకు కనీసం ఉప రాష్ట్రపతి దక్కకుండా చేశారు. ఊరూపేరూలేని రామ్ నాధ్ కోవింద్ కు రాష్ట్రపతి, లాబీయింగ్ లో దిట్ట అయిన వెంకయ్య నాయుడును ఉప రాష్ట్రపతిగా ఎంపిక చేసి తన వైఖరిని తెలియజేశారు. పాలన వ్యవహారాల్లో పారదర్శకతకు పాతర వేశారు. నోట్ల రద్దు వంటి కీలక నిర్ణయం మంత్రివర్గంలోని ముఖ్యులకు కూడా తెలియదు. సహచరులకు ఆయన ఇచ్చే విలువ ఏపాటిదో చెప్పకనే చెబుతోంది. జీఎస్టీ వంటి కీలక నిర్ణయం మంత్రివర్గంలోని ముఖ్యులకు కూడా తెలియదు. సహచరులకు ఆయన ఇచ్చే విలువ ఏపాటిదో చెప్పకనే చెబుతోంది. జీఎస్టీ వంటి కీలక అంశాలపై అందరినీ విశ్వాసంలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించారన్న అపఖ్యాతిని మూటకట్టుకున్నారు. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ను పూర్తిగా తెరమరుగు చేశారు. విదేశాంగ మంత్రి కన్నా ప్రధానమంత్రే ఎక్కువగా విదేశీ పర్యటనలు చేస్తున్నారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. గుజరాత్ లో కూడా పెద్దగా ప్రాముఖ్యత లేని అమిత్ షాను ఏకంగా జాతీయ అధ్యక్షుడిని చేశారు. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి అయోగ్ ను ఏర్పాటు చేయడం, రైల్వే బడ్జెట్ ను రద్దు చేసి సాధారణ బడ్జెట్ లో కలపడం, ఆర్థిక సంవత్సరాన్ని మార్చడం వంటి నిర్ణయాల వల్ల ప్రజలకు కలిగిన ప్రయోజనం ఏంటో ఎవరికీ అర్థం కాదు. జన్ థన్, ముద్ర పథకాల వల్ల సామాన్యులకు ఒరిగింది సున్నా అని చెప్పక తప్పదు.

నయా నియంతగా మారారా?

మోడీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసే విధంగా ఉన్నాయి. 2015లో సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించి రాజ్యాంగానికి తూట్లు పొడిచారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26నే అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. ఉత్తరాఖండ్ లో కూడా రాజకీయ నాటకాలు ఆడి హైకోర్టు చేత అక్షింతలు వేయించుకున్నారు. గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరించినా మాయోపాయాలు పన్ని దానికి అధికారం దక్కనీయకుండా చేశారు. తనను ఓడించి బీహార్ పగ్గాలు చేపట్టిన నితీష్ కుమార్ ను ప్రలోభ పర్చి లాలూ కూటమి నుంచి విడగొట్టారు. ఈ ఏడాది జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినప్పటికీ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి పదవులకు శాసనసభ్యులను ఎంపిక చేయలేకపోయారు. లోక్సభ సభ్యులైన యోగి ఆదిత్యానాధ్, దినేశ్ శర్మ, మౌర్య ప్రసాద్ లను ఈ పదవుల్లో కూర్చోబెట్టి ప్రజాస్వామ్య నిబంధనలను, ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కేశారు. గతంలో ఇందిరాగాంధీ కూడా ఇలానే ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రులను నామినేట్ చేసేవారు. ఇందిరాగాంధీ కామరాజ్ ప్రణాళిక మాదిరిగా ఇటీవల కొందరిని మంత్రి వర్గం నుంచి మోడీ తప్పించారు. తెలంగాణకు చెందిన బండారు దత్తాత్రేయను తొలగించడం పెద్ద తప్పు అన్న భావన అన్ని వర్గాల్లోనూ ఉంది. ఇందిరాగాంధీ చివరి రోజుల్లో నియంతగా మారారు. కాని మోడీ మొదట మూడేళ్లలోనే తాను నయా నియంతనని స్పష్టంగా చాటుకోవడం గమనార్హం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News