ఇందిరకు ఇంత అవమానమా?

Update: 2017-11-21 16:30 GMT

ఆమె ఆది పరాశక్తి. దుర్గామాత... 1971లో పాకిస్థాన్ కబంధ హస్తాల నుంచి తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) కు విముక్తి కల్పించి, బంగ్లాదేశ్ ఆవిర్భావానిిక కృషి చేసిన అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీపై వెల్లువెత్తిన ప్రశంస ఇదీ. ఈ అభినందనలు కాంగ్రెస్ భజన బృందానివి కావు. పార్టీ అభిమానులవి కానే కావు. పార్టీ మద్దతుదారులవికూడా కావు. కాంగ్రెస్ వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకున్న అప్పటి జన్ సంఘ్ నాయకుడు, భారతీయ జనతా పార్టీల తొలి ప్రధాని, ఆ పార్టీకి ఆరాధ్యుడైన అటల్ బిహారీ వాజ్ పేయి చేసిన వ్యాఖ్యలివి. ఇది ఒక్క వాజపేయి మాట కాదు. అప్పట్లో యావత్ దేశం పార్టీలకు అతీతంగా బంగ్లాదేశ్ ఆవిర్భవానికి సాహసోపేతంగా పోరాడిన ఇందిరను మనస్ఫూర్తిగా అభినందించారు. 1966లో లాల్ బహుదూర్ శాస్త్రి మరణానంతరం చిన్న వయసులోనే ప్రధాని పదవి చేపట్టిన ఇందిరాగాంధీ 1977 మార్చి వరికు ఏకధాటిగా పాలించి దేశంపై తనదైన చెరగని ముద్ర వేశారు. మళ్లీ 1980 నుంచి 1984 అక్టోబర్ 31న సిక్కు గార్డుల చేతిలో హత్యకు గురయ్యారు. అంతవరకూ రెండో దఫా ప్రధానిగా వ్యవహరించారు. బ్యాంకుల జాతీయ కరణ, హరిత విప్లవం, రాజభరణాల రద్దు, పేదరిక నిర్మాలన చర్యల ద్వారా సామాన్య ప్రజలకు చేరువయ్యారు. పేద, మధ్య తరగతి ప్రజానీకం ఆమెను ‘అమ్మ’ గానే భావించి అక్కున చేర్చుకుంది. బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్, ప్రపంచంలోనే తొలి మహిళా ప్రధానిగా పేరొందిన శ్రీలంక ప్రధాని సిరిమావో బండారు నాయకే మాదిరిగా ఉక్కు మహిళగా పేరొందారు. అంతర్జాతీయ నేతగా ఎదిగారు. ఎంత రాజకీయ వారసత్వం ఉన్నప్పటికీ పురుషాధిక్య ప్రపంచంలో ఒక మహిళ రాజకీయంగా నిలదొక్కుకోవడం, రాణించడం చిన్న విషయం ఏమీ కాదు.

దేశంపై చెరగని ముద్ర....

అలాంటి మహిళా నేత శత జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం విముఖత చూపడం ప్రజాస్వామ్య వాదులకు ఆందోళన కల్గించే అంశం. పార్టీలకు అతీతంగా గౌరవించాల్సిన మహిళా నాయకురాలును, సుదీర్ఘ కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తి శత జయంతికి నర్కార్ దూరంగా ఉండటం సంకుచిత రాజకీయానికి నిదర్శనం. ఎవరు అవునన్నా...కాదన్నా దేశంపై ఆమె చెరగని ముద్ర వేసింది. అవినీతి ఆమె దరిదాపుల చేరలేదు. అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను ఇనుమడింప చేశారు. తన చాకచక్యంతో, దౌత్యపరమైన లౌక్యంతో ఎంతటి వారిని అయినా తన వైపునకు తిప్పుకోగల దిట్టగా అప్పటి అమెరికా రాయబారి హెన్రా కసింజర్ కు పేరుండేది. కానీ ఇందిర మొండి ఘటమని, ఆమెతో దౌత్యం అంత తేలిక కాదని స్వయంగా కిసింజర్ వ్యాఖ్యానించారంటే ఇందిర శక్తి సామర్థ్యాలు మనకు తెలిసిపోతాయి.

ఇందిరలో లోపాలు లేకపోలేదు...

అంతటి శక్తి మంతమైన నేత శత జయంతిని అధికారికంగా నిర్వహించనప్పటికీ, కనీసం ఆమె సేవలను స్మరించుకోవడానికి, నివాళులర్పించడానికి కూడా అధికార పార్టీ పెద్దలకు మనసొప్పలేదు. పార్టీలకు అతీతంగా పెద్ద మనసుతో వ్యవహరించేంత విశాల థృక్పధం కొరవడటం విచారకరం. వారు విమర్శిస్తున్నట్లు ఇందిరలో కొన్ని లోపాలు లేకపోలేదు. ఆమె నియంత అని, అత్యవసర పరిస్థితి ద్వారా ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారన్నది వారి అభిప్రాయం. వీటిని ఇందిర అభిమానులు కూడా తోసిపెచ్చలేరు. కాని ఆ ఒక్కటి రెండు కారణాలు చూపి దేశాన్ని సుదీర్ఘకాలం పరిపాలించిన రెండో నేతగా చరిత్ర సృష్టించిన నాయకురాలిని విస్మరించడం హుందాతనం అనిపించుకోదు. మంచి చెడులను వేరు చేసి చూడాల్సిన వివేచన అవసరం.

తమ వారికి మాత్రం....

ఈ విషయాన్ని పక్కన పెడితే సర్దార్ వల్లభాయ్ పటేల్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వంటి వారిని ఆకాశానికి ఎత్తడం ఎన్డీఏ చేస్తున్న ప్రస్తుత కార్యక్రమం. ఉక్కు మనిషి వల్లభాయ్ పటేల్ బీజేపీ మనిషిగా ప్రచారం చేస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉంది. కాంగ్రెస్ లో పుట్టి పెరిగిన పటేల్ ను దేశంలో తొలి హోం మంత్రిగా, తొలి ఉప ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ గౌరవించింది. ఆయన పేరుతో అనేక కార్యక్రమాలను ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టడం ఆహ్వానించదగ్గదే. అదే సమయంలో ఇతరులను విస్మరించడం తగదు. పటేల్ స్వరాష్ట్రమైన గుజరాత్ లోని నర్మదా సరోవర్ ప్రాజెక్టుక వద్ద 182 మీటర్ల అత్యంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 522 అడుగుల ఎత్తుగల ఈ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్దది. దీనికోసం 2,989 కోట్లు కేటాయించారు. 2019 నాటికి పూర్తయ్యేలా లక్ష్యం పెట్టుకున్నారు. ప్రస్తుతం 30 శాతం పనులు పూర్తయ్యాయి. మరోపక్క పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వంటి జన్ సంఘ్ నేతల ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం, వారి పేరిట వివిధ పథకాలను ప్రారంభించడం తెలిసిందే. ఇందులో అభ్యంతరం పెట్టాల్సింది ఏమీలేదు. వారు జాతి హితం కోసం పరితపించిన నేతలు. కచ్చితంగా వారిని గౌరవించాల్సిందే. అలా అని తమ పార్టీ కాని నేతలను విస్మరించడం ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు తగని పని. జాతీయ భావాలకు, దేశభక్తికి తమను తాము ప్రతీకంగా చెప్పుకునే బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వం తీరును తప్పుపట్టకుండా ఉండలేం...!

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News