ఆసియాన్ లో భారత్ దే పైచేయి...!

Update: 2017-11-15 18:29 GMT

ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో రెండు రోజుల పాటు జరిగిన ఆసియాన్ (ఆగ్నేయాసియా దేశాల సంఘం) సదస్సుకు అనన్య ప్రాధాన్యం ఉంది. ఇది స్వర్ణోత్సవ సదస్సు కావడమే ఇందుకు కారణం. 1967 ఆగస్టు 8న ఆసియాన్ (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియాస్ నేషన్స్) ఆవిర్భవించింది. ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్ లాండ్ లు పరస్పర సహకారం, ప్రాంతీయ సమగ్రత కోసం కూటమిగా ఏర్పడాలని నిర్ణయించాయి. థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో ఉమ్మడి తీర్మానంపై 1967 ఆగస్టు 8న సంతకాలు చేశాయి. దానినే బ్యాంకాంక్ తీర్మానంగా పేర్కొంటారు. అప్పటి నుంచ ఏటాక్రమం తప్పకుండా ఆసియాన్ సమావేశాలు నిర్వహించడం ఒక గొప్ప విజయం. ఎన్నో ప్రాంతీయ కూటములు, పరస్పర అవగాహన, విశ్వాసం లేక నీరుగారుతున్న తరుణంలో ఆసియాన్ అయిదు దశాబ్దాల ప్రస్థానం అంతర్జాతీయ సమాజానికి స్ఫూర్తి దాయకం.

సర్ణోత్సవం సందర్భంగా....

కాలక్రమంలో ఆసియాన్ తన పరిధిని విస్తరించుకుంటూ శక్తిమంతమైన కూటమిగా కొనసాగడం విశేషం. 1984లో బ్రూనై, 1995లో వియత్నాం, 1997లో లావోస్, మమన్మార్, 1999లో కంబోడియా ‘ఆసియాన్’లో చేరడంతో దాని పరిధి విస్తరించింది. 2005 నుంచి తూర్పు ఆసియా సదస్సులు నిర్వహించడం ద్వారా భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ లను భాగస్వామ్యులుగా పరిగణిస్తూ పురోగమిస్తుంది. ఇవాళ అంతర్జాతీయంగా ఆసియాన్ శక్తిమంతమైన కూటమి. ఐరోపా యూనియన్ తర్వాత ఇదే కీలకమైన సంస్థ. గణాంకాలను విశ్లేషిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఆసియాన్ జనాభా సుమారు 62.8 కోట్లు. ప్రపంచ జనాభాలో 10 శాతానికి ఇది సమానం. దీని జీడీపీ 2.5 లక్షల కోట్ల డాలర్లు. ఆసియాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. జీడీపీ వృద్ధిరేటు ప్రపంచ జనాభా కన్నా ఎక్కువ.

చైనాతో గొడవలు....

ప్రస్తుత ఆసియాన్ సమావేశాలకు సంబంధించి రెండు ప్రధానాంశాలు. ఒక సంస్థగా ఆసియాన్ ఎదుర్కొంటున్న సవాల్లు, భవిష్యత్తు మనుగడ, భారత్-ఆసియాన్ సంబంధాలు కీలకమైనవి. సైనికంగా చైనా దూకుడు, ఉత్తర కొరియా అణుపరీక్షలు, ఉగ్రవాద వ్యాప్తి నేపథ్యంలో ఈ సమావేశాలు జరిగాయి. ఒక సంస్థగా ఆసియాన్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య దక్షిన చైనా సముద్ర వివాదం. ఈ సముద్రంలో చైనా దూకుడు ఆసియాన్ ను చికాకు పెడుతోంది. యావత్ దక్షిణ చైనా సముద్రం తనదేనని బీజింగ్ ప్రకటిస్తో్ంది. ఈ విషయమై అంతర్జాతీయ ట్రైబ్యునల్ తీర్పును కూడా అది బేఖాతరు చేసింది. ఈ సముద్రంపై తమకూ హక్కులు ఉన్నాయని (బ్రూనై, వియత్నాం, ఫిలిప్పీన్స్) వాదిస్తున్నాయి. ఫిలిప్పీన్స్ ఏకంగా అంతర్జాతీయ ట్రైబ్యునల్ ను ఆశ్రయించి తనకు అనుకూలంగా తీర్పును పొందింది. ఈ వివాదంలో అమెరికా ప్రత్యక్ష్యంగా, భారత్ పరోక్షంగా ఆసియాన్ కు అండగా నిలబడటంతో చైనా కొంత వరకూ మెత్తబడింది. ఈ విషయాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు చైనా అధినేత జిన్ పింగ్ అంగీకరించి ఒక మెట్టు దిగాడు. భారత్, అమెరికా ప్రభావమే ఇందుకు కారణమని చెప్పక తప్పదు. ఆగ్నేయాసియాలో చైనా దూకుడును అడ్డుకునేందుకు భారత్ లాంటి బలమైన, నమ్మకమైన నేస్తం ఆసియాన్ కు అవసరం. భారత్ కూ తన ప్రాబల్యాన్ని, ప్రాధాన్యాన్ని విస్తరించుకునేందుకు ఇది సరైన అవకాశం.

పీవీ హయాం నుంచే....

ఇక భారత్ -ఆసియాన్ బంధం మరింత బలపడటానికి ఈ సర్ణోత్సవ వేదిక ఒక అవకాశంగా నిలిచింది. ఆసియాలో ఆగ్నేయాసియా ప్రాధాన్యాన్ని గుర్తించిన భారత్ పీవీ హయాంలోనే ‘లుక్ ఈస్ట్’ విధానాన్ని ప్రారంభించింది. నరేంద్ర మోడీ దానిని ‘యాక్ట్ ఈస్ట్’ విధానంగా మార్చి మరింత ముందుకు తీసుకువెళుతున్నారు. అందులోభాగంగానే ఆసియాన్ దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పేందుకు నిరంతరం శ్రమిస్తోంది. ఇందులో భాగంగానే 2018 గణతంత్ర దినోత్సవాలకు ఆసియాన్ నేతలు అందరినీ అతిథులుగా ఆహ్వానించడం ఇందుకు నిదర్శనం. గణతంత్ర ఉత్సవాలకు ఇంతమంది నేతలను ఆహ్వానించడం ఇదే తొలిసారి. హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల భద్రత, ఆర్థికాభివృద్ధికి భారత్ పూర్తిస్థాయిలో సహకరించేందుకు సిద్థంగా ఉందని ఆసియాన్ వేదిక సాక్షిగా ప్రధాని నరేంద్రమోడీ భరోసా ఇచ్చారు. ఈ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి కళ్లెం వేసేలా వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్ సిద్ధంగా ఉందని కూడా మోడీ స్పష్టం చేయడం విశేషం.

30 టీమ్స్ ... నిరంతర చర్చలు...

భారత్ -ఆసియాన్ మధ్య చర్చల కోసం 30 రకాల బృందాలు ఏర్పాటయ్యాయి. వాణిజ్య, పర్యాటక, పర్యావరణ, వ్యవసాయ, పునరుత్పాదన, టెలికమ్యునికేషన్లపై పరస్పర సహకారానికి తరచూ అధికారులు, మంత్రుల స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. 2016-17 లో 7,169 కోట్ల డాలర్లతో ఆసియాన్ భారత్ ను నాలుగో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఆవిర్భవించడం విశేషం. అంతర్జాతీయంగా భారత్ చేస్తోన్న వాణిజ్యంలో ఇది 11 శాతానికి సమానం. భారత్ ఇంధన అవసరాలు తీర్చడంలో ఆసియాన్ లోని వియత్నాం తదితర దేశాలు కీలకపాత్రను పోషిస్తాయి. భారత్-మయన్మార్, థాయ్ లాండ్ లనున కలిపే 1700 కిలోమీటర్ల భూమార్గం పూర్తయితే ఆసియాన్ తో బంధం మరింత బలోపేతం అవుతుంది. సర్ణోత్సవ వేదిక... ఆసియాన్ ఉజ్వల భవితవ్యానికి, భారత్ - ఆసియాన్ బంధం బలపడటానికి అవకాశం కల్పించింది.

 

- ఎడిటోరియల్ డెస్క్

Similar News