ఆర్కేనగర్ వ్యూహాన్ని చంద్రబాబు..కేసీఆర్...!

Update: 2018-01-06 15:30 GMT

ఎన్నికల సందడి షురూ అవుతోంది. రాజకీయపార్టీలు అవసరమైన సన్నాహక సర్వేల్లో నిమగ్నమవుతున్నాయి. కచ్చితంగా గెలిచే స్థానాలు, కాసింత కష్టపడితే పట్టు చిక్కే సీట్లు, ప్రత్యర్థికి భారీ ఆధిక్యం దక్కే నియోజకవర్గాలు ..ఇలా మూడు రకాలుగా వర్గీకరించుకుంటూ రాజకీయ పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి. ఇందులో ప్రత్యేకించి అధికారపక్షాల హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ ల్లో తిరిగి అధికారం తమకే దక్కుతుందని ప్రభుత్వంలోని తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్రసమితి భావిస్తున్నాయి. అయితే లోలోపల రెండు పక్షాలకు కొంత బెరుకైతే మొదలైంది. అటు వైసీపీకి, ఇటు కాంగ్రెసుకు రిజర్వుడు నియోజకవర్గాల్లో కొన్ని అడ్వాంటేజీలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. దీనిని ఎదుర్కోవడానికి మనీ మంత్రం ప్రయోగించేందుకు సర్కారీ నేతలు సర్వం సిద్దం చేస్తున్నారు. రిజర్వుడు నియోజకవర్గాల్లో పోటీకి తలపడే నేతలకు ఆర్థికంగా అండదండలందించే విషయమై ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ కఠినంగానే వ్యవహరించవచ్చని రాజకీయ పక్షాలు అంచనా వేస్తున్నాయి. ఎన్నికల సమయంలో నిధుల మళ్లింపు, అప్పటికప్పుడు తరలింపు కష్టసాధ్యం కావొచ్చు. అన్ రిజర్వుడ్ స్థానాల్లో ఆర్థికంగా బలమున్న నేతలే తలపడుతుంటారు. వారంతా చాలావరకూ సొంతంగా వనరులు సమకూర్చుకుని ఖర్చు పెడుతుంటారు. ఈ నిధులన్నీ ఒకే చోట నుంచి వచ్చినట్లుగా కనిపించకుండా వివిధ మార్గాలు అనుసరిస్తుంటారు. ఒకవేళ దాడులు చేస్తే డబ్బులు పట్టుపడినా అవి సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సొంత వనరులుగా చూపిస్తారు. గతంలో ఎన్నికల కమిషన్ స్వాధీనం చేసుకున్న నిధుల్లో 90 శాతం కేసులు ఈరకంగానే వీగిపోయాయి. శ్రేయోభిలాషులు, సన్నిహితుల రూపంలోని వృత్తినిపుణులు, వ్యాపార వేత్తల ద్వారా డబ్బుల బదలాయింపు, నిధుల సమీకరణ ప్రత్యేక పద్దుల కింద ఖర్చు చూపించేస్తుంటారు. దీనివల్ల చాలావరకు అభ్యర్థికి సంబంధం లేకుండానే నిదుల పంపిణీ సాగుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లోని పరిస్థితులు భిన్నం. ఇక్కడ నిధుల పంపిణీ చాలా కష్టతరం. అందుకే ప్రత్యేక పద్ధతి ద్వారా ముందస్తుగానే ఆర్థిక వనరులు సిద్దం చేసేందుకు వ్యూహరచన చేస్తున్నాయి పాలకపక్షాలు.

వైసీపీ ఓట్లకు వల.....

ఆంధ్రప్రదేశ్ లో 29 షెడ్యూల్డు కులాలు, 7 షెడ్యూల్డు తెగలకు కేటాయించిన రిజర్వుడు నియోజకవర్గాలున్నాయి. దళిత సామాజిక వర్గంలో ఇప్పటికీ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకే మొగ్గు కనిపిస్తోంది. ప్రభుత్వ పథకాలు, సబ్ ప్లాన్ నిధుల కేటాయింపు వంటి అంశాల్లో ప్రభుత్వం చురుకుగానే వ్యవహరిస్తున్నప్పటికీ మతపరమైన అంశాలు, కాంగ్రెసు నుంచి బదిలీ అయిన సాంప్రదాయక ఓటు బ్యాంకు కారణంగా వైసీపీ ఆధిక్యం కనబడుతోంది. అయితే ఈ నియోజకవర్గాల్లో అధికార పక్షానికి ఒక అడ్వాంటేజ్ కూడా కనిపిస్తోంది. పేదవర్గాలు, కాయకష్టం చేసే శ్రమ జీవులు, మద్యపాన వ్యసనపరుల సంఖ్య కూడా ఆయా నియోజకవర్గాల్లో ఎక్కువగానే ఉంది. నిరక్షరాస్యత కూడా ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే ఇక్కడే అధికం. వీటన్నిటినీ మదింపు చేసుకుంటూ ఓటు బ్యాంకును రాబట్టాలనేది తెలుగుదేశం యోచన. పాదయాత్రలో జగన్ సైతం రిజర్వుడు నియోజకవర్గాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇవి కచ్చితంగా తమ పార్టీకి లాభించే నియోజకవర్గాలన్నదే వైసిపీ భావన. దీనికి ప్రతివ్యూహం రచిస్తోంది టీడీపీ. 25 నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకుంటూ ఇప్పటికే ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు టీడీపీ అగ్రనాయకత్వం ఇప్పటికే ఒక పథకం సిద్దం చేసింది. ఎమ్మెల్యేలుగా తమ పార్టీకి చెందిన వారు ఉన్న ప్రాంతాల్లో పర్సంటేజీలు ఇతరరూపాల్లో కొంత నిధులను సమకూర్చుకుని ఉండేందుకు అవకాశం ఉంది. ఇన్ చార్జులుగా ఉన్నవారికే టిక్కెట్లు కేటాయించాలా? లేక కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపాలా? అనే విషయంలో రానున్న రెండు నెలల్లో ఒక క్లారిటీకి రావాలని చంద్రబాబు నాయుడు జిల్లాల మంత్రులకు , పొలిటి్ బ్యూరో సభ్యులకు సూచన చేశారు. ఇప్పట్నుంచే ఎన్నికల నిధులు, ఓటర్లను వర్గాల వారీగా టీడీపీకి అనుకూలం చేసేందుకు అనుసరించాల్సిన ఎత్తుగడలపై ఒక అంచనాకు రావాలని భావిస్తున్నారు. కనీసం ఎన్నికలకు తొమ్మిదినెలల ముందుగానే రిజర్వుడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తే కలిసి వస్తుందనుకుంటున్నారు. సాధారణ నియోజకవర్గాల మాదిరిగా టిక్కెట్ల కోసం పార్టీలో అంతర్గత పోరు కూడా రిజర్వుడు నియోజకవర్గాల్లో పెద్దగా లేదు. పైపెచ్చు ముందస్తుగానే అభ్యర్థులు ఖరారైతే అసంతృప్తులు, అలకలు ఎన్నికల నాటికి సద్దుమణిగిపోతాయనుకుంటున్నారు. ఎవరెవరి ద్వారా ఆయా నియోజకవర్గాల్లో నిధుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలనే విషయమై కూడా ముందస్తుగానే ఏర్పాట్లు సాగుతున్నాయి.

కాంగ్రెసు కట్టడికి...

తెలంగాణలో 14 ఎస్సీ నియోజకవర్గాలు, 9 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. హైదరాబాదు మినహాయించి జిల్లాల్లో ఎనిమిది ముస్లిం ప్రాబల్య నియోజక వర్గాలున్నాయి. వీటిపై ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు, మాజీ మంత్రి షబ్బీర్ అలి నేతృత్వంలోని కమిటీలు దృష్టి పెడుతున్నాయి. వీటిలో 23 నుంచి 25 నియోజకవర్గాలు కాంగ్రెసు కిట్టీలో పడేలా చూసుకోవాలనేది ఆలోచన. పంజాబ్ లో ఈ తరహా ప్రయోగమే చేసి కాంగ్రెసు పైచేయి సాధించగలిగింది. అవసరమైతే గులాం నబీ అజాద్ సహకారంతో కూడా మహబూబ్ నగర్, నిజమాబాద్, మెదక్, కరీంనగర్, రంగారెడ్డి లోని ముస్లిం నివాసిత నియోజకవర్గ పెద్దలతో సంప్రతింపులకూ యత్నిస్తున్నారు. దళిత్ , మైనారిటీ కాంబినేషన్ ను కాంగ్రెసు పరం చేయాలనేది యోచన. రెడ్డి సామాజిక వర్గం ఎలాగూ తమదేననే ధీమాలో ఉంది కాంగ్రెసు పార్టీ. దీనికి ప్రతి వ్యూహాన్ని కేసీఆర్ సిద్దం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో బలమైన భావోద్వేగాల కారణంగా రిజర్వుడు నియోజకవర్గాల్లో సైతం టీఆర్ఎస్ జెండా ఎగరేయగలిగింది. ఈ సారి పరిస్థితులు అంత సానుకూలంగా కనిపించడం లేదు. దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి పంపిణీ హామీ నెరవేర్చడం దాదాపు అసాధ్యంగా తేలిపోయింది. దీనిని కాంగ్రెసు పార్టీ విస్తృతంగానే ప్రచారం చేస్తోంది. కొప్పుల రాజు నియోజకవర్గ స్థాయి దళిత నేతలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తమ్మీద అధికార పక్షంతో కాంగ్రెసుకు పోటాపోటీ వాతావరణం రిజర్వుడు నియోజకవర్గాల్లో కనిపిస్తోంది. ఈ ప్రతిఘటనను రివర్సు చేసి టీఆర్ఎస్ కు ఆధిక్యం సాధించి పెట్టాలనే దిశలో కేసీఆర్ యోచిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికను బడ్జెట్ సెషన్ నాటికి పూర్తి చేసి నియోజకవర్గాల్లో పూర్తిగా వారికి ప్రచార బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. ఒకవేళ ఆ స్థానంలో ఎమ్మెల్యేలుండి మార్చాల్సి వచ్చినా నిర్ణయం తీసేసుకోవాలనుకుంటున్నారు. ముందుగా అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తే మాత్రమే ప్రజల్లోకి కొత్త క్యాండిడేట్లు వెళ్లగలుగుతారు. ఇటీవల జరిగిన శాసనసభ్యుల సమావేశంలోనే కేసీఆర్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించినట్లు పార్టీ వర్గాల సమాచారం. డబ్బు విషయంలో రిజర్వుడ్ నియోజకవర్గాల అభ్యర్థులు వెనుకంజ వేయకుండా మొత్తం పార్టీనే వ్యయం చేసేలా కూడా వ్యూహరచన చేస్తున్నారు. ఈవిషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని రెండు అధికారపార్టీలు కూడా తమిళనాడులోని ఆర్కే నగర్ నే ఆదర్శంగా తీసుకొనేలా కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ఓటర్లకు వ్యక్తిగత తాయిలాలు అందబోతున్నాయి. అన్ని నియోజకవర్గాలతోపాటు రిజర్వుడు నియోజకవర్గాల్లో ఈ ప్రయోజనం మరింత అధికంగా ఉండబోతోంది. దళిత నియోజకవర్గాలపై దందాలో అధికార పార్టీలే అగ్రతాంబూలం అందుకుంటాయా? లేదా? అన్నది కాలమే తేల్చాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News