ఆయన...వస్తానంటే వద్దంటారా?

Update: 2018-02-18 15:30 GMT

శాంతింపచేసే ప్రయత్నాలని చెప్పలేం. కానీ తన మాటల గారడితో మళ్లీ మోళీ చేయాలనే కసరత్తు మొదలు పెట్టారు మోడీ. ఒక పక్కన తెలంగాణ ప్రభుత్వం వివిధ ప్రాజెక్టుల నిమిత్తం రండి సారూ అని పిలుస్తుంటే వాయిదా వేసుకుంటూ వస్తున్న ప్రధాని కి హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ పుట్టుకొచ్చింది. ఏపీలో పీఎం స్థాయికి తగిన కొత్త ప్రాజెక్టులు ఏమైనా ఉంటే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు సమయం కేటాయించదలచుకున్నట్లు ప్రధాని కార్యాలయం రాష్ట్రప్రభుత్వానికి సమాచారం అందించింది. నిజానికి సంబంధాలు సవ్యంగా ఉన్న సమయంలో అయితే చంద్రబాబు నాయుడు ఎగిరి గంతేసేవారు. ఒక శాలువా, వెంకటేశ్వరుని జ్ణాపిక, తిరుమల ప్రసాదం సిద్దం చేసేవారు. కొన్ని కోట్ల రూపాయల వ్యయంతో ఆర్భాటం చేసేవారు. కానీ పరిస్థితులు ఇప్పుడు బాగాలేదు. వలచి తానై వచ్చినా వద్దు వద్దంటూ దూరం జరుగుతున్నారు. కనీసం నిధుల విడుదలకు సంబంధించి స్పష్టత రాకుండా కరచాలనం చేస్తే కథ అంతటితో ముగిసినట్లే అని చంద్రబాబుకు తెలుసు. ప్రధాని పర్యటనపై ప్రతిస్పందించకుండా విమర్శల దాడి పెంచారు.

‘షా’ స్థానంలో మోడీ.....

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఫిబ్రవరి నెలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటించాల్సి ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్ రోజురోజుకీ బలపడుతున్న స్థితిలో దీనికి చెక్ చెప్పాలంటే మోడీతో బహిరంగ సభ ఏర్పాటు చేయించాలని పార్టీ రాష్ట్రశాఖ ప్రయత్నించింది. అందులోనూ తెలంగాణ వరకూ టీడీపీతో తెగతెంపులు స్పష్టమైన నేపథ్యంలో పార్టీకి హుషారు తేవాలంటే మోడీ రావాల్సిందేనని కొందరు నేతలు సూచించారు. అందులోనూ రాష్ట్రంలో పర్యటించిన కేంద్రమంత్రులు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశంసించి వెళ్లిపోతున్నారు. మోడీ సభతో దీనికి చెక్ పెట్టాలని చూశారు. అమిత్ షా ఈవిషయంలో చాలా తెలివిగా వ్యవహరించారు. మోడీ వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వంపై దాడి చేయడం ఇప్పుడు సరికాదంటూ ఆయన ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒత్తిడి ఉన్న దృష్ట్యా తాను ఫిభ్రవరిలో రెండు రాష్ట్రాల్లో పర్యటిస్తానని డిసెంబరులో హామీ ఇచ్చారు. ఇది ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు. కానీ మోడీ మాత్రం ఏపీ పర్యటనకు నిర్ణయం తీసుకున్నారు. షా స్థానంలో పీఎం పర్యటించాలనుకోవడం లో రాజకీయ కోణాలు తొంగిచూస్తున్నాయి. గత సంవత్సరం మేనెలలో అమిత్ షా రెండు రాష్ట్రాల్లోనూ పర్యటించారు. తెలంగాణకు లక్షకోట్లకు పైగా నిధులిచ్చానని ప్రకటించడంతో కేసీఆర్ విలేఖరుల సమావేశం పెట్టి మరీ చీవాట్లు పెట్టారు. షా ఏపీలో పర్యటిస్తూ రెండు లక్షల కోట్ల రూపాయలను కేంద్రం ఇచ్చిందని ప్రకటించారు. టీడీపీ మిత్రపక్షంగా ఉండటంతో పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. రాజకీయంగా బీజేపీ బలపడాలంటే షా తిరగాల్సిందే. కానీ ప్రతికూల పరిస్థితుల్లో ఆయన పర్యటిస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని గ్రహించిన మోడీ రెండు రాష్ట్రాలలో తన పర్యటనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దక్షిణాదిన ఏమంత పరిస్థితులు బాగా లేవు. కేసీఆర్ ను కాకా పట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో చంద్రబాబుతో సంబంధాలు తెగిపోకుండా చూసుకోవాలి. ఇదే వ్యూహంతో రాష్ట్రపర్యటనపై ప్రధాని ఆసక్తిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి పీఎంఓ తెలియచేసింది.

వడ్డింపులా? విదిలింపులా?

ఆంధ్రప్రదేశ్ లో తలెత్తుతున్న తీవ్రస్థాయి అసంతృప్తిని గమనించిన ప్రధాని తన కార్యాలయంలో వివిధ మంత్రిత్వశాఖల అధికారులతో ఈనెల 21వ తేదీన ఏపీ అధికారులతో సమావేశానికి ఆదేశించారు. రెవిన్యూలోటు, ప్రత్యేక సాయం, విదేశీ రుణ సాయంతో జరిగే ప్రాజెక్టుల వంటివాటిపై అప్పటికప్పుడు అవగాహనకు వచ్చి సంయుక్త ప్రకటన చేయాలని సూచించారు. అయితే విధివిధానాలను మాత్రం ప్రకటించలేదు. అధికారుల స్థాయిలో ఇప్పటికే చాలా సమావేశాలు జరిగాయి. ఎవరి వాదనకు వారే కట్టుబడి ఉండటంతో ఏపీకి పెద్దగా సాయం ఒనగూరలేదు. రైల్వేజోన్, పోలవరానికి పునరావాస ప్యాకేజీ వంటి విషయాల్లో రాజకీయ నిర్ణయం తీసుకోవాలి. అధికారుల స్థాయి సరిపోదు. ఏదో ఇచ్చాము, ఇస్తున్నామన్నట్టుగా మొక్కుబడి ప్రకటనలకే పరిమితమైతే మళ్లీ కథ మొదటికే వస్తుంది. విదేశీ రుణ పథకాల కింద ఎనిమిదివేల కోట్ల రూపాయలు, రెవిన్యూ లోటు లో తక్షణం నాలుగువేల కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండు చేస్తోంది. పోలవరం పునరావాస ప్యాకేజీపై హామీ ఇస్తే చాలని భావిస్తోంది. అంటే కనీసం పన్నెండువేల కోట్ల విడుదలకు చర్యలు తీసుకుంటే రాష్ట్రప్రభుత్వం శాంతించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే జరిగితే కేంద్రం ఉదారంగా వ్యవహరించినట్లే చెప్పాల్సి ఉంటుంది. లేకపోతే వెయ్యి , రెండు వేల కోట్ల సాయానికే పరిమితమైతే విదిలింపు కిందే లెక్క. మిత్ర బంధం తెగిపోయే తరుణం ఆసన్నమైనట్లే.

‘అయిదు’ ఆఖరు గడువు...

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఏప్రిల్ ఆరోతేదీన తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారంటూ వైసీపీ ఇప్పటికే ప్రకటించింది. ఈలోపుగానే ఒక నిర్ణయం తీసుకుని తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని తెలుగుదేశం భావిస్తోంది. ఈ విషయమై చంద్రబాబు నేతృత్వంలో సమావేశమైన కీలకనేతలు ఒక వ్యూహాన్ని సిద్దం చేశారు. మార్చి అయిదో తేదీలోపు కేంద్రం నిధుల విడుదల, ప్రాజెక్టులు, రైల్వే జోన్ పై నిర్దిష్టమైన ప్రకటన చేయకపోతే కేంద్రప్రభుత్వంలోని మంత్రులు ముందుగా రాజీనామా చేయాలని చంద్రబాబు ఆదేశించారు. అంటే ప్రతిపక్ష ఎంపీలకంటే ఒక నెలముందుగానే యాక్షన్ కు దిగబోతున్నారన్నమాట. అంతటితో బీజేపీతో పొత్తుకు కటీఫ్ పలికినట్లవుతుంది. ఆ తర్వాత వైసీపీతో పోటీ పడి ఆందోళన చేసేందుకు ఎంపీలకు వీలు చిక్కుతుంది. వైసీపీ రాజీనామా ప్రకటనకు కూడా విలువ లేకుండా పోతుంది. ఇదే వ్యూహంతో తెలుగుదేశం ముందుకు కదలాలని చంద్రబాబు నిర్దేశించారు. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అత్యంత క్రిటికల్ దశలో నడుస్తున్నాయి. వచ్చే నెల మొదలు కానున్న పార్లమెంటు మలి విడత బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ అంశాలే హాట్ టాపిక్ కాబోతున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News