ఆఫ్ఘాన్ పై భారత్ నిర్ణయం సరైనదేనా?

Update: 2017-10-07 17:30 GMT

అంతర్యుద్ధంతో సతమతమవుతున్న ఆప్ఘనిస్తాన్ కు సైన్యాన్ని పంపబోం.. అన్న రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటన సంపూర్ణంగా స్వాగతించదగ్గది. ఇది సమయోచిత...సముచిత... సమోన్నత నిర్ణయం కూడా. ఇటీవల (సెప్బంబరు ఆఖరులో) అమెరికా రక్షణ మంత్రి మ్యాటిస్ భారత పర్యటన సందర్భంగా ఈ విషయాన్ని తేల్చి చెప్పింది. ఒక్క సైన్యాన్ని మాత్రమే పంపమని, ఇతరత్రా అన్ని విధాలుగా సాయానికి భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇటీవల రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తీసుకున్న అత్యంత కీలక నిర్ణయాల్లో ఇదీ ఒకటి.

అమెరికా ఉచిత సలహాలు పట్టించుకోకుండా.....

ఆఫ్ఘన్ కు సైనిక పరమైన సాయం కూడా చేయాలని గత కొంతకాలంగా అమెరికా అదేపనిగా ఉచిత సలహాలిస్తోంది. ఇటీవల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన దక్షిణాసియా విధానంలో కూడా భారత్ కే కీలక ప్రాధాన్యం ఇచ్చారు. ఆప్ఘాన్ లో భారత్ మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని, ఆర్థిక పరమైన అండదండలే కాకుండా సైనిక పరమైన సాయానికి కూడా ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. దీనికి ఆచితూచి స్పందిస్తున్న భారత్ ఇప్పుడు స్పష్టమైన ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక ప్రజాస్వామ్య దేశంగా ఇతర దేశాల అంతర్గత విషయాల్లో వేలుపెట్టడం భారత్ కు ఆదినుంచి అలవాటు లేదు. అక్కడి సమస్యలను ఆయా దేశాల ప్రభుత్వాలే పరిష్కరించుకోవాలి తప్ప ప్రత్యక్ష జోక్యం చేసుకోవడం సరైంది కాదని భారత్ భావన. ఒకదేశం నిలదొక్కుకోవడానికి అవసరమైన నైతిక మద్దతు కొనసాగించడం, ఆర్థిక సాయాన్ని అందించడం తప్ప ప్రత్యక్ష ప్రమేయం వల్ల లాభం కన్నా నష్టమెక్కువ. ఈ విష‍యం గతంలో అనుభవపూర్వకంగా రుజువైంది. రాజీవ్ గాంధీ హయాంలో 80వ దశకం ద్వితీయార్ధంలో శ్రీలంలో ఎల్టీటీఈని అంతమొందించడానికి సైన్యాన్ని పంపి చేతులు కాల్చుకున్నారు. తమిళ టైగర్ల అధినేత వేలుపెళ్లై ప్రభాకరన్ ఆటకట్టించడానికి భారత శాంతి పరిరక్షక దళం ను పంపి భారత్ పీకల్లోతుల్లోకి కూరుకుపోయింది. ఈ నిర్ణయాన్ని తమిళ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దీంతో కక్ష పెంచుకున్న తమిళ టైగర్లు 1991 మేలో రాజీవ్ ను హతమార్చడం అందరికీ తెలిసిందే. 1989లో అధికారంలోకి వచ్చిన వీపీసింగ్ ప్రభుత్వం శ్రీలంక నుంచి సైన్యాన్ని వెనక్కు రప్పించింది. లంకకు సైన్యాన్ని పంపడం సరైన నిర్ణయం కాదన్న అభిప్రాయం అప్పట్లో అన్ని వర్గాల్లో వ్యక్తమయింది. ఈ చేదు అనుభవం నేపథ్యంలో ఆప్ఘాన్ విషయంలో అలాంటి పొరపాట్లు చేయకూడదన్న భారత్ నిర్ణయం ప్రాప్త కాలజ్ఞతతతో కూడినది. గతంలో సోవియట్ యూనియన్, ఇటీవల కాలంలో అమెరికా ఆప్ఘాన్ కు సైన్యాన్ని పంపి చేతులు కాల్చుకున్న సంగతి ఇక్కడ గమనార్హం.

ఎన్ని విధాలుగా ఆర్థికసాయం.....

మధ్య ఆసియా దేశమైన ఆప్ఘాన్ కు భారత్ మొదటి నుంచి ఇబ్బడిముబ్బడిగా సాయం అందిస్తోంది. ఏకంగా ఆదేశానికి పార్లమెంటు భవనాన్నే కట్టించి ఇచ్చింది. 2005లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ శంకుస్థాపన చేయగా, 2015 డిసెంబర్ లో ప్రధాని నరేంద్ర మోడీ దాన్ని ప్రారంభించారు. రమారమి వెయ్యి కోట్ల వ్యయంతో నిర్మించి కానుకగా అందజేసింది. ఏపీలోని ప్రముఖ నిర్మాణ సంస్థ బొల్లినేని శీనయ్య కంపెనీ ఈ నిర్మాణాన్ని పూర్తి చేసింది. పొరుగున ఉన్న పాకిస్థాన్ వాదనలు, ఆలోచనలతో సంబంధం లేకుండా సంక్షుబిత ఆప్ఘాన్ కు అన్ని వేళలా భారత్ అండగా నిలుస్తోంది. ఆప్ఘాన్ భద్రతా దళాల శిక్షణ, ఆధునికీకరణకు సాయం అందిస్తోంది. ఆదేశంలో అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులను నిర్మించింది. ఇప్పటికీ వందకు పైగా చిన్నపాటి ప్రాజెక్టులను చేపట్టింది. విమానాలనూ, హెలికాప్టర్ల మరమ్మతుల కోసం ఇంజినీర్లను పంపింది. 2001లో అక్కడి తాలిబన్ల ప్రభుత్వం పతనం అనంతరం భారత్ ఇప్పటి వరకూ మూడు బిలియన్ డాలర్ల భారీ సాయాన్ని అందజేసింది. 2500 మైళ్ల రహదారులను నిర్మించింది. విద్యుత్తు ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులను నిర్మించింది. ప్రాంతీయంగా ఆఫ్ఘన్ కు అతిపెద్ద మొత్తంలో విరాళం అందజేస్తున్నా దేశం భారత్ మాత్రమే కావడం విశేషం. చరికార్ నగర్ తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఇరాన్ సరిహద్దులు జరంజ్-డెలారు మధ్య 218 కిలోమీటర్ల రహదారిని నిర్మించింది. చింటాల ప్రాంతంలో పలు విద్యుత్తు సబ్ స్టేషన్లను నిర్మించింది. 11 ప్రావిన్స్ లలో టెలిఫోన్ ఎక్సేంజ్ ల స్థాయి పెంపునకు, జాతీయ స్థాయిలో టీవీ నెట్ వర్క్ విస్తరణకు కృషి చేస్తోంది. విద్య, వైద్య రంగాల్లో ఇతోధిక సాయం అందజేస్తోంది. మజారే-ఇ-షరీఫ్ లో పాలిక్లినిక్ ల నిర్మాణానికి సాయం అందిస్తోంది. అమెరికా రక్షణ మంత్రి మ్యాటిన్ పర్యటనకు ముందు ఆఫ్ఘాన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అబ్దుల్లా భారత్ లో పర్యటించి కీలక ఒప్పందాలు చేసుకున్నారు. సీఈవో పదవి అధ్యక్ష హోదాతో సమానమైనది. పోలీస్ శిక్షణలో సాంకేతిక సహకారానికి సంబంధించి కుదిరిన అవగాహన ఒప్పందం అన్నింటికన్నా ముఖ్యమైంది. ప్రత్యక్ష సైనిక సాయం బదులు ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు.

చేతులు కాల్చుకున్న దేశాలు.....

70. 80వ దశకంలో ఆప్ఘాన్ పై పట్టుకోసం అప్పటి సోవియట్ యూనియన్ సైన్యాన్ని పంపి చేతులు కాల్చుకుంది. తాజాగా ఉగ్రవాదాన్ని అంతమొందించే పేరుతో 2000 దశకంలో ప్రారంభంలో అమెరికా సైన్యం అక్కడ అడుగుపెట్టింది. పదిహేడేళ్లవుతున్నా అక్కడి పరిస్థితి ఏమాత్రం మెరుగుపడకపోగా మరింత క్షీణించడం మనం చూస్తున్నదే. ఇప్పటికీ కొద్దిపాటి అమెరికన్ బలగాలు అక్కడ తిష్టవేసి ఉన్నాయి. సైన్యాన్ని పంపడం ద్వారా తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న భావన అక్కడి ప్రజల్లో ఏర్పడింది. రేపు భారత్ పరస్థితీ అంతే అవుతుంది. ఈ నేపథ్యంలో సైన్యాన్ని పంపరాదన్న భారత్ నిర్ణయం భేషయినది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆప్ఘాన్ లో శాంతి స్థాపన, ప్రజాస్వామ్యాన్ని పాదుకొల్పడం, ఆర్థికంగా నిలదొక్కుకోవడమే భారత్ కు ముఖ్యం తప్ప బలగాలు పంపడం కాదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News