ఆదిలోనే అనుమానాలు

Update: 2018-03-09 00:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యామ్నాయ ఫ్రంట్ నిర్ణయం తీవ్రనిరాశానిస్పృహల్లో ఉన్న కొన్ని పార్టీలకు ఊరట కల్గించింది. అదే సమయంలో అనేక అనుమానాలకూ తావిచ్చింది. బీజేపీ, కాంగ్రెసుల పట్ల సమదూరం పాటించే పక్షాలకు ఒక అండ దొరికినట్లయింది. ఇదే సందర్భంలో కేసీఆర్ చిత్తశుద్ధిపై సందేహాలూ తలెత్తాయి. తాము కేంద్రంలో అధికారంలోకి రావడం కల్ల అన్న విషయం చిన్నాచితకా పార్టీలకు తెలుసు. కానీ పెద్ద జాతీయ పార్టీలు ప్రలోభాలు, బెదిరింపులు, కేసుల రూపంలో తమను కబళించి వేస్తుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి. దీనికి ప్రత్యామ్నాయంగా కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ తృతీయ ప్రత్యామ్నాయంగా ఐక్య పోరాటానికి వేదికగా ఉపయోగపడుతుందనే ఆనందం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో ఎందరు కలిసి వస్తారు? ఎన్నిసీట్లలో ప్రభావం చూపగలుగుతారు? మఖలో పుట్టి పుబ్బలో కలిసిపోయే తాత్కాలిక కూటమిగా మిగిలిపోతుందా? అనే అనుమానాలు, సవాలక్ష సందేహాలూ నెలకొంటున్నాయి.

ఆంధ్రాలో సంబరాలు....

కేసీఆర్ ఫ్రంట్ పట్ల అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం నుంచి విపరీతమైన మద్దతు లభిస్తోంది. ఇక్కడి రాజకీయ పక్షాల్లో ఇంతవరకూ కేవలం జనసేన మాత్రమే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటును స్వాగతించింది. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు స్పందించలేదు. రాష్ట్రంలో 90 శాతం ఓటర్లు ఈ రెండు పార్టీలకు చెందినవారే. అయినప్పటికీ ఈ పార్టీల నిర్ణయాలతో సంబంధం లేకుండా ప్రజాశ్రేణుల్లో విస్తృతమైన చర్చతో పాటు సానుకూలత వ్యక్తమవుతోంది. దీనికి అనేక కారణాలు కలిసి వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతంగా నడిపిన కేసీఆర్ పై ఏపీ ప్రజలకు ఒక విశ్వాసం ఉంది. దేన్నైనా సాధించగలడనే నమ్మకమూ ఏర్పడింది. ఆయన యాస,భాష ను అభిమానించేవారు కూడా లక్షల్లో ఉన్నారు. నిజానికి తెలంగాణలోని హైదరాబాదు, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ,నిజామాబాద్ పూర్వ జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి స్థిరపడిన వారి సంఖ్య లక్షల్లో ఉంది. తెలంగాణ జనాభాలో మొత్తంగా 15 శాతం వరకూ ఆంధ్రామూలాలు ఉన్నవారు నివసిస్తున్నట్లుగా అంచనా. టీఆర్ఎస్ ఒక ప్రాంతీయ పార్టీగా తెలంగాణ సెంటిమెంటుతోనే రాజకీయాలు చేయడం వల్ల వీరంతా ఇంతవరకూ కొంత అభద్రతాభావంలో ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు కేసీఆర్ జాతీయ నాయకునిగా తనను తాను ఆవిష్కరించుకుంటే సహజంగానే ఈ ప్రాంతీయ వాద భావజాలం నుంచి టీఆర్ఎస్ దూరం కాకతప్పదు. దీంతో రెండు రాష్ట్రాల సంబంధబాంధవ్యాలు మెరుగుపడతాయి. ఇక్కడ స్థిరపడిన ఆంధ్రవాసులూ ఇబ్బందికరమైన భావోద్వేగానికి గురి కావాల్సిన అవసరం ఉండదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రజలు కేసీఆర్ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీయార్ అంతటి నాయకునిగా కేసీఆర్ రూపుదాలుస్తారని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

దీదీ దీవించినట్టేనా..?

తృతీయ ఫ్రంట్ లో పెద్ద భాగస్వామిగా మమతా బెనర్జీని చెప్పుకోవాలి. ఈ ప్రకటనను స్వాగతిస్తున్న పెద్ద రాష్ట్రం పశ్చిమబెంగాల్ మాత్రమే. అయితే మమతా బెనర్జీ రాజకీయ అంటరానితనం కుదరదని అనేక సందర్భాల్లో ప్రకటనలు చేశారు. గతంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏలోనూ, కాంగ్రెసు నేతృత్వంలోని యూపీఏలోనూ ఆమె మంత్రిగా పనిచేశారు. చంచల స్వభావానికి పెట్టింది పేరు. కేసీఆర్ ను ముందుకు నడవమని ఆమె చేసిన ప్రోత్సాహం కేవలం నైతికమద్దతు మాత్రమేననేది రాజకీయ పరిశీలకుల భావన. ఒకవేళ పశ్చిమబంగ లో బీజేపీ బలం పుంజుకుంటే కాంగ్రెసుతో కలిసి పోటీ చేసేందుకు కూడా మమత సిద్ధం. ఈ పరిస్థితుల్లో తృతీయ ప్రత్యామ్నాయం డిమాండు అటెకెక్కడం ఖాయం. అందువల్ల మమతా బెనర్జీ మద్దతునే ప్రామాణికంగా తీసుకుని థర్డ్ ఫ్రంట్ ఆలోచన ముందుకు తీసుకెళ్లడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదంటున్నారు. సమాజ్ వాదీ, బహుజనసమాజ్, బిజూ జనతాదళ్ , టీడీపీ, వామపక్షాల వంటి పెద్ద పార్టీలు కలిసి వస్తే మాత్రమే థర్డ్ ఫ్రంట్ యోచన ఒక బలమైన కార్యాచరణగా రూపుదాల్చడం సాధ్యమవుతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఇంటి గుట్టు ..గట్టు దాటుతుందా?

కేసీఆర్ జాతీయ నాయక పాత్రలోకి మారితే తెలంగాణ పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. కేటీఆర్, హరీశ్, కవిత లు ముగ్గురూ సమర్థులైన వారసులే. ముగ్గురూ ఏదో సాధించాలని, అత్యున్నత స్థానాలను అధిరోహించాలని ఆశిస్తున్న నాయకులే. కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం వారెవరికీ ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ సీఎం పీఠం ఎవరో ఒకరు చేపట్టాల్సి వస్తే మాత్రం మిగిలిన వారు నిరాశచెందే అవకాశాలెక్కువ. ఈ ముగ్గురిలోనూ రాజకీయంగా సీనియర్ హరీశ్ రావు, సొంత అనుచరవర్గం, క్యాడర్ తో విస్తృత సంబంధాలు కలిగిన నాయకుడు. కానీ కేటీఆర్ ను ఈ పీఠంపై కూర్చోబెట్టాలనేది కేసీఆర్ యోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇది హరీశ్ వర్గాన్ని అసంతృప్తికి గురి చేయవచ్చు. 2009లో టీఆర్ఎస్ కేవలం పది సీట్లకే పరిమితమైన స్థితిలో హరీశ్ అప్పటి సీఎం రాజశేఖరరెడ్డితో చర్చలు జరిపి కాంగ్రెసు తీర్థం పుచ్చుకునేందుకు కూడా సిద్దమయ్యారని అప్పట్లో ప్రచారం సాగింది. ఒకవేళ కాంగ్రెసు 2019 నాటికి పుంజుకునే పరిస్థితులు ఏర్పడితే బలమైన క్యాడర్ ఉన్న హరీశ్ తన పార్టీలో తనకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకొంటారా? అనేది ప్రశ్న. అందుకే కేసీఆర్ నేషనల్ రోల్ లోకి మారేముందే తన ఇంటి ముచ్చట చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది.

-ఎడిటోరియల్ డెస్క్

Similar News